జాతీయ వార్తలు

జాతీయ ఆశయం.. ప్రాంతీయ ఆకాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రీతిలో సరి కొత్త శక్తితో తన ప్రభుత్వం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోందని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న ఆయన ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల ఎంపీల సమావేశంలో శనివారం దాదాపు 75 నిమిషాలు మాట్లాడారు. మత విశ్వాసం, కులం సహా ఎలాంటి వివక్షా లేని రీతిలో కొత్త ఎంపీలందరూ త్రికరణ శుద్ధిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సారథిగా ఎన్నికైన అనంతరం మాట్లాడిన మోదీ నవ భారత నిర్మాణ దిశగాప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ఆశయాల సాధన కోసం ఎన్‌డీఏ కృషి చేస్తుందని ప్రకటించారు. ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలను పూర్తి చేయవలసి ఉన్నది.. జాతీయ ఆశయాల సాధనలో ఎలాంటి రాజీ ఉండదని మోదీ స్పష్టం చేశారు. ‘అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం మన లక్ష్యం’ అంటూ ఆయన కొత్త నినాదం ఇచ్చారు. ‘సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అని మోదీ ప్రకటించారు. నరేంద్ర మోదీ శనివారం రాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన అనంతరం మాట్లాడారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ఆశయల సాధన అనే రెండు పట్టాలపై ఎన్‌డీఏ ముందుకు సాగుతుందని తెలిపారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీకి చెందిన 303 మంది సభ్యులతోపాటు ఎన్‌డీఏకు చెందిన మొత్తం 351 మంది సభ్యులు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో నరేంద్ర మోదీని ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవం ఎన్నుకున్నారు. 351 మంది సభ్యులు బల్లలు చరుస్తూ ‘మోదీ.. మోదీ’ అనే నినాదాలతో నరేంద్ర మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. నరేంద్ర మోదీ పేరును శిరోమణి అకాలీదళ్ అధినాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రతిపాదించగా బిహార్ ముఖ్యమంత్రి, జేడీ-యూ అధినాయకుడు నితీష్‌కుమార్, శివసేన అధినాయకుడు ఉద్ధవ్ థాక్రే, లోక్‌జనశక్తి అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్, అన్నాడీఎంకే నాయకుడు ఈకే పళణిస్వామి బలపరిచారు. అంతకుముందు బీజేపీకి చెందిన 303 మంది సభ్యులు నరేంద్ర మోదీని బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. నరేంద్ర మోదీని బీజేపీ, ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోగానే 351 మంది సభ్యులు బల్లలు చరుస్తూ ‘మోదీ.. మోదీ’ అంటూ ఇచ్చిన నినాదాలతో పార్లమెంటు సెంట్రల్ హాల్ మారుమోగిపోయింది.
భుజం, భుజం కలిసి పని చేయాలి
నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ఆశయాలను పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తామని ప్రకటించారు. జాతీయ ఆశయాల విషయంలో ఎటువంటి పరిస్థితిలో ఎవరితో కూడా రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి మనమంతా భుజం, భుజం కలిసి పని చేయాలని పిలుపు ఇచ్చారు. ‘తాను మీ అందరిలో ఒకడిని.. మీతో కలిసి పని చేస్తా’ అని ప్రకటించారు. పదిహేడవ లోక్‌సభ ఎన్నికలు చారిత్రాత్మకమైనవని.. ఈ ఎన్నికల్లో అన్ని గోడలు కూలిపోయాయి.. కొత్తయుగం ప్రారంభమైందని మోదీ ప్రకటించారు. దేశంలోని సగటు మనిషి ఆశయాలను పూర్తి చేసేందుకు మనమంతా కలిసి పని చేయవలసి ఉన్నదని ఆయన చెప్పారు. ప్రజలు దేశాభివృద్ధిలో భాగస్వాము లవుతున్నారు.. వారు మన ముందుండి నడిపిస్తున్నారని మోదీ చెప్పారు. ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూలత నెలకొన్నది.. ప్రజలు మనల్ని విశ్వసించారు.. దీనిని మనం నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. మనకు ప్రజల నుండి అనుకూల ఓటు పడింది.. అందుకే మనకు ఇంత భారీ మెజారిటీ లభించిందని మోదీ చెప్పారు. దేశ ప్రజల మనోభావాలను అంచనా వేయటంలో రాజకీయ పండితులు కూడా విఫలమయ్యారని ఆయన చెప్పారు. 2014లో దేశ ప్రజలు తనలాంటి కొత్త నాయకుడిని విశ్వసించారు.. 2019 ఎన్నికల్లో వారు ముందుండి మనల్ని గెలిపించారని మోదీ అభిప్రాయపడ్డారు. భారత ఓటర్లు వివేకంతో పని చేశారు.. పని చేసేవారికి ఓటు వేశారు.. నిజాయితీపరులకు ఓటు వేశారని ఆయన తెలిపారు. ఈ దేశం కష్టపడే వారిని, నిజాయితీపరులను నెత్తికెక్కించుకుంటుందని మోదీ చెప్పారు. దేశ ప్రజలు మనకు భారీ మెజారిటీ ఇచ్చారు.. మన ఛాతీ మరింత వెడల్పు కావటం సహజమే.. అయితే మనం మనకు ఓటు వేసినవారు.. వేయనివారు.. అందరికోసం పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ‘సబ్‌కా సాథ్.. సబ్ కా వికాస్’ మన సిద్ధాంతం.. దీనికోసం అహర్నిశలు కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. మనకిప్పుడు పరాయివారెవ్వరు లేరు.. అందరు మనవారేనని ఆయన అన్నారు. 17 రాష్ట్రాల్లో బీజేపీకి యాభై అంతకంటే ఎక్కువ శాతం ఓట్లు లభించాయని ఆయన చెప్పారు. దేశ ప్రజలు తన తరపున ఎన్నికల్లో పోరాడారని మోదీ చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 25 శాతం ఓట్లు అధికంగా లభించాయని ఆయన తెలిపారు. ‘అందరి వెంట.. అందరి అభివృద్ధి’ నినాదాన్ని ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల నాయకులు అడిగి తెలుసుకుంటున్నారని మోదీ చెప్పారు.