జాతీయ వార్తలు

రాంపూర్‌లో రాజకీయ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: నటి, రాజకీయ నాయకురాలు జయప్రదపై సమాజ్‌వాద్ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. యూపీలోని రాంపూర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫున పోటీలో ఉన్న ఆమెపై ఎస్పీ నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేత ఆజాంఖాన్ ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాంపూర్‌లో అఖిలేష్ యాదవ్ సైతం హాజరైన ఆ సభలో ఆయన మాట్లాడుతూ ‘నీవు (జయప్రదని ఉద్దేశించి) ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించావు, నీ నిజస్వరూపం గురించి రాంపూర్, యూపీ, భారత ప్రజలకు తెలియడానికి 17 సంవత్సరాలు పట్టింది, కాని 17 రోజుల్లోనే నీవు ఖాకీ అండర్‌వేర్ వేశావన్న సంగతిని నేను గుర్తించాను’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీతోపాటు మహిళా సంఘాలు, జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జయప్రద మాట్లాడుతూ ఆజంఖాన్ ఇప్పటికే లక్ష్మణరేఖను దాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఒక సోదరుడిగా భావించి ఇన్నాళ్లూ తనను ఏమన్నా సహించానని, అయితే ఆయన హద్దులు మీరారని, ఇక ముందు ఎన్నడూ అతడిని సోదరుడిగా పరిగణించనని, ఆయన చేసే వ్యాఖ్యలను సహిస్తూ ఊరుకోనని హెచ్చరించారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించి ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ‘అసలు ఆ మనిషి చేసిందేమిటి? ఆయనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే హక్కుందా? అని జయప్రద ఆగ్రహంతో ప్రశ్నించారు. దీనిపై ఆమె ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను సైతం నిలదీశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో పోటీకి దించడం సిగ్గు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదహరిస్తూ ఏ కుటుంబం, సమాజంలో అయితే స్ర్తిని గౌరవిస్తారో అక్కడ సుఖ సంతోషాలు, పిల్లాపాపలు, అష్ట ఐశ్వర్యాలు వర్థిల్లుతాయని, ఎక్కడైతే స్ర్తి అవమానానికి గురి అవుతుందో ఇవన్నీ దూరమవుతాయని పేర్కొంది. ఒక మహిళను ఘోరంగా అవమానించిన ఆజంఖాన్‌ను రాంపూర్ నియోజకవర్గం నుంచి తరిమికొట్టాలని ఆమె కోరారు.
జయప్రదను కించపరిచే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ చర్యను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండింది. దీనిపై తగు వివరణ ఇవ్వాలని ఆమె ఆయనకు షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఎన్‌సీడబ్ల్యు ఆయన వ్యాఖ్యలు నీతిబాహ్యం, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై కమిషన్‌కు తగు వివరణ ఇవ్వాలని ఎన్‌సిడబ్ల్యు కార్యదర్శి బార్నాలి షోమ్ పేరిట షోకాజ్ నోటీసును జారీ చేశారు. కాగా, ఆజంఖాన్ వ్యాఖ్యలు పూర్తి దిగజారుడుతనంగా ఉన్నాయని కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఆమె ట్వీట్ చేశారు.
ములాయం సాబ్.. వౌనం వీడండి
రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఆజంఖాన్ ఒక మహిళ పట్ల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. ములాయం సాబ్.. ఈ విషయంలో వౌనం వీడండి అంటూ ఆమె ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌ని ఉద్దేశించి పేర్కొన్నారు. మహాభారతంలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు భీష్మ పితామహుడు వౌనంగా ఉండిపోయారని, తర్వాత కౌరవ వంశమే నాశనమైందని, ములాయం సింగ్ సైతం ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి వౌనంగా ఉండిపోవద్దని ఆమె హితవు పలికారు. ఆ పార్టీలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్, నటి జయాబచ్చన్ లాంటి వారు సైతం ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అఖిలేష్ యాదవ్ మరువరాదని అన్నారు.
రుజువు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా
ఎన్నికల ప్రచార సభలో తాను ఏ మహిళనైనా దూషించినట్టు గాని, వ్యతిరేక వ్యాఖ్యలు గాని చేసినట్టు రుజువు చేస్తే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాంపూర్ ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ పేర్కొన్నారు. తన ప్రసంగంలో తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాంపూర్ నుంచి జయప్రద 2004, 2009 ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. తర్వాత పరిణామాల్లో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. గత నెలలోనే ఆమె బీజేపీలో చేరగా, రాంపూర్ నుంచి ఆమెను పోటీకి దించారు. కాగా, ఇక్కడ మూడో దశ పోలింగ్‌లో ఈ నెల 23న ఎన్నికలు జరుగుతాయి.
చిత్రం... రాంపూర్‌లో సోమవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో వేదికపై
కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి జయప్రద