మెయిన్ ఫీచర్

నవరసాల తోట.. నరసరావుపేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవిభక్త మద్రాసు రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉన్న ఉన్నత పాఠశాలలు మరి ఏ ఇతర భాషా ప్రాంతాలలోనూ లేవని చెప్పుకునేవారు విద్యారంగ ప్రముఖులు. ‘అది గొప్ప తెలుంగునాడునన్’. అఖిల భారతదేశంలోనే మహా వైభవోపేతంగా శివరాత్రి ఉత్సవం జరుపుకునే పది దివ్య క్షేత్రాలు పేర్కొనవలసి వస్తే మా త్రికూటేశ్వరగిరి అందులో తప్పక ఉంటుంది. జనప్రియంగా కోటప్పకొండ తిరునాళ్లు అని మా పరగణా అంతా చెప్పుకొని మురిసిపోతుంటారు మా జిల్లావారు. కోటప్పకొండ తిరునాళ్లకు తల్లి మా నరసరావుపేట. తండ్రి కోటీశ్వరుడు. పల్నాటి నుంచి ప్రభలతో వచ్చే మా రైతులు, మా ఎద్దులు, ఆ భక్తిప్రపత్తులు, ఆ కోలాహలం, ఆ సంబరం ఆంధ్రదేశంలో మరి ఎక్కడా కానరావు.
‘అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ’ అన్నాడు కదా అలనాటి అల్లసాని పెద్దన. మా ఊరిని తలచుకొని మేము కూడా అట్లానే మురిసిపోతుంటాము. ‘పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా’ అన్నాడు కదా గురజాడ అప్పారావు. నిజానికి విజయనగరానికి సాహిత్య సాంస్కృతిక నాటక కళా రంగస్థలిగా మా నరసరావుపేట ఏమీ తీసిపోదు. కాకపోతే ఆనంద గజపతి అంత గొప్ప సంస్థానాధిపతి కాకపోవచ్చు మా మర్రాజు గుండారాయని మహారాజు. నిజానికి ఆనంద గజపతి గొప్ప కావ్యం దేనినైనా అంకితం పొందిన దాఖలాలు లేవు. మా మర్రాజువారు రంగరాట్యంత్రమనే గొప్ప కావ్యం కృతి పొందారు.
నవ్య కవిత్వం విజయనగరంలో పుట్టిందేమో కాని నరసరావుపేటలో పెరిగింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘నయాగరా’ను ప్రభవింపచేశారు మా ఊరి కవులు. మా ఊరి హైస్కూలుకు దివ్యోజ్జ్వలమైన చరిత్ర ఉంది. స్వాభిమాన పారవశ్యమని తప్పు పట్టకపోతే చూడండీ... మా నాయని సుబ్బారావుగారి వంటి మహాకవి తెలుగునాట మరి ఏ ఇతర ఉన్నత పాఠశాలకైనా ప్రధానోపాధ్యాయత్వం నిర్వహించాడా! ఆయన రాసిన జన్మభూమి కావ్యం ఇరవయ్యో శతాబ్ది పది గొప్ప కావ్యాలలో ఒకటి కదా! విశ్వనాథ సత్యనారాయణగారే ఆయనను పూర్వకాలపు మహా కవులైన తిక్కనతో, సూరనతో పోల్చారు. మా నాయని వారిని వేయి పడగలు నవలలో అజరామరం చేశారు. మరి తెలుగునాట, ఆ మాటకు వస్తే అఖిల భారతదేశంలో ఇటువంటి ఘనత ఎవరికైనా దక్కిందా?
అపర శంకరులని కీర్తి మూర్తి అయిన బెల్లంకొండ రామరాయ కవీశ్వరుడు, తత్త్వ చింతకుడు, మహాకవి మా ఊరి శివారు గ్రామమైన పమిడిపాడువారు. ఆయనవల్ల ఆ ఊరు నిజంగా పమిడిపోడిమి సంపాదించుకుంది. ‘శంకరా శంకర భాష్యమ’ని ఆదిశంకర, అటు తరువాత వచ్చిన ప్రస్థానాచార్యుల వివిధ తత్త్వదర్శనాలను రామరాయ కవి సమన్వయం చేసి మళ్లీ అద్వైత స్థాపనాచార్యులైనారు.
గిడుగు రామమూర్తి పంతులుగారు మా ఊరు ఎందుకు వచ్చారో కాని మా ఊళ్లో ఒక జట్కాబండి మాట్లాడుకుని పమిడిపాడు వెళ్లారు. ఆ అశ్వచోదకుడిని ఏదో మాటలలో దింపారు రామమూర్తి పంతులుగారు. మా ప్రాంతపు వ్యవహారిక రూపాలను (వాడుక మాటలను విని) ఎంతో మురిసిపోయినట్లు, నమోదు చేసుకున్నట్లు ఆయనే చెప్పారు. అన్నిటికన్నా గొప్పగా చెప్పుకోవలసింది ఆసేతు హిమాచలం హిందువుల ఆరాధ్యులైన నేటి శృంగేరిపీఠాధిపతి భారతీతీర్థ స్వామి మా ఊళ్లో చిన్న తరగతులు చదివారు. సంస్కృతం చదివారు.
‘ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో!’ అన్నాడే రాయప్రోలు. అట్లా మా హైస్కూల్లో చదువుకోవటం కూడా ఒక గొప్ప అదృష్టం. బహుశా నవ్య సాహిత్య ప్రముఖులైన ఎందరో రచయితలు, కవులు, కథా రచయితలు, నాటక రచయితలు మా హైస్కూలులో చదివి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నవారు, మరి ఏ ఇతర హైస్కూలు నుంచి చదివి తమ జీవిత కార్యక్షేత్రంలో జీవిక సాగించిన వారు కనపడరనుకుంటాను.
అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు మా హైస్కూలు విద్యార్థులే. ఏల్చూరి వీరరాఘవరావు మురళీ మోహనుడై భారతదేశానే్న కాదు, ప్రపంచంలోని మూడు ఖండాలను వేణునాద ముఖరితం చేసినవాడు. ఈయన కథను నేను స్వీయచరిత్రలో చెప్పాను. ఉస్తాద్ అల్లారఖా తబలా వాద్య సహకారంతో ఈయన వేణునాదం ప్రసిద్ధ సంగీత రికార్డులుగా (్ధ్వనిముద్రిత సాధనాలు) అమెరికాలో విరివిగా లభ్యమవుతాయి. సితారు వాయిద్య మేరు శిఖరమైన రవి శంకర్‌కు విజయరాఘవరావు అత్యంత ప్రేమభాజనుడు. పూర్వాశ్రమంలో దండెంరాజు కేశవరావు అనిపించుకున్న కేశవతీర్థ స్వామి మా ఊరి హైస్కూల్లో చదువుకున్నారు. అప్పట్లో స్వామి వివేకానంద భారతదేశమంతటా నివాళులందుకుంటూ ఉండగానే కేశవ తీర్థస్వామి, ‘రామదర్శనం’ అనే మాసపత్రికను స్థాపించి తెలుగు వారికి గోస్వామి రామతీర్థ వేదాంత తత్త్వదార్శనికతను సరళంగా బోధపరిచారు తెలుగువారికి. సుమారు 20 సంవత్సరాలు ఈ పత్రిక వెలువడింది. భగవాన్ శ్రీరమణ మహర్షి మన కేశవతీర్థస్వామి వారి పట్ల ఎంతో మన్నన కనపరచారు. తమ చేతికర్రను కేశవతీర్థ స్వామికి బహూకరించారు.
కోలవెన్ను రామకోటీశ్వరరావుగారు హైస్కూలు తరగతులు చదువుకునే కాలానికి మా ఊళ్లో హైస్కూలు రాలేదు కాని మా ఊరికి కోలవెన్నువారి వల్ల గొప్ప పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. ఆయనకు అడవి బాపిరాజు తన నవల నొకదానిని అంకితమిచ్చారు. కాటూరి వెంకటేశ్వరరావు, అడవి బాపిరాజు, కోలవెన్నువారి ప్రియాతిథులుగా ఉండేవారు. కోలవెన్ను వారు నడిపిన త్రివేణి’ పత్రిక అఖిల భారత స్థాయి ప్రశంస పొందింది. ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించిన ఎం.చలపతిరావు, కోలవెన్ను వారిని చూడటానికి నరసరావుపేట వచ్చామని ఢిల్లీలో జరిగిన అఖిల భారత రచయితల సదస్సులో నాకు చెప్పారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధులు వేంకట పార్వతీశ్వర కవులకు కవికులాలంకార, కవి రాజహంస బిరుదులు నరసరావుపేటలో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్ వార్షిక సమావేశాలలోనే పురస్కృతమైనాయి. ఇటువంటి బిరుదులు తెలుగు కవులలో మరెవరికున్నాయి?
కందుకూరి వీరేశలింగం పంతులుగారికీ మా నరసరావుపేటకూ కూడా ఆత్మీయ సంబంధం ఉంది. అంటే ఆయన మా ఊరు వచ్చారో లేదో తెలియదు కాని, ఆయన పెంచి పెద్ద చేసి వాత్సల్యం చూపిన అదే పేరిటి వీరేశలింగం మా ఊళ్లో సబ్ రిజిస్ట్రార్ పదవి నిర్వహించటమే కాదు (1912) మా ఊరి మహా మహిమాన్విత ఆర్యామూర్తి అయిన అట్లూరి వీరాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో ఈ సబ్ రిజిస్ట్రార్‌గారు కందుకూరి వీరేశలింగం పంతులు పేరిట ఒక ప్రాథమిక పాఠశాల స్థాపించారు. ఇది ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నది. తెలుగునాట మొట్టమొదటి వితంతు వివాహం చేసుకున్న గోగులపాటి శ్రీరాములుగారి ప్రథమ కళత్రం కన్నబిడ్డ గోగులపాటి వీరేశలింగం. పంతులుగారి ఇల్లాలు రాజ్యలక్ష్మమ్మగారు ఈ పసివాణ్ణి సాకి పెంచి పెద్ద చేసింది.
1908లో రాజద్రోహ నేరానికి గాను అభియోగం పాలైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు న్యాయస్థాన విచారణ సంబంధంగా కొంత మెతకతనం చూపాడని బ్రిటిష్ ప్రభుత్వం కనె్నర్రకు గురి అయిన కెర్షాఫ్ అనే కలెక్టరు నరసరావుపేటకు సబ్ కలెక్టర్‌గా పని చేయవలసి వచ్చింది. ఇవన్నీ అట్లా ఉంచి మాలపల్లి నవలను అచ్చు వేసిన సాహసి బెల్లంకొండ రాఘవరావు మా ఊరికెంతో గర్వకారణం. (చిత్రం) నరసరావుపేట పట్టణం (ఇన్‌సెట్‌లో) కోటప్పకొండ

-అక్కిరాజు రమాపతిరావు 040-27423352, ramapathiakkiraju@gmail.com