మిర్చిమసాలా

అక్కడా అదే లొల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిన దానికీ, కాని దానికీ ప్రతి రోజూ పోటీపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలూ అన్ని విషయాల్లో ‘మేమే బెస్ట్ అంటే మేమే బెస్ట్’ అంటూ రచ్చకెక్కడాన్ని అంతా అలవాటు పడ్డా, మరీ ఇంతగా పోటీ పడతారని రాజ్‌భవన్ వ్యవహారం చూసినంత వరకూ ఎవరూ అనుకోలేదు. ఆ మధ్య ‘డూయింగ్ బిజినెస్’ కిటుకులన్నింటినీ సైబర్ చౌర్యం చేశారని ఆంధ్రా సర్కారుపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలో తోచని కేంద్రం చివరికి రెండు తెలుగు రాష్ట్రాలనూ ‘మొదటిస్థానం’లో ఉంచింది. అయినా ‘మేమే ఫస్టు అంటే మేమే ఫస్టు’ అంటూ రెండు రాష్ట్రాలూ ప్రకటనలు జారీ చేశాయి. అది మరువక ముందే రెండు రాష్ట్రాల సిఎంలు రాజ్‌భవన్ వేదికగా తమ సత్తాచూపే యత్నం చేశారు. ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ 70వ జన్మదినం సందర్భంగా తొలుత వెళ్లి శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం ఎపి సిఎం చంద్రబాబు చేయగా, తెలంగాణ సిఎం కెసిఆర్ 70 మంది బృందంతో వెళ్లి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పారు. ‘ఇక్కడా అదే లొల్లి’ అంటూ ముక్కున వేలేసుకోవడం అందరి వంతైంది.
- బివి ప్రసాద్

పోటాపోటీ..
తెలంగాణలో బిజెపికి కాలం కలసి రావడం లేదు. సొంతంగా ఎదిగేందుకు అవకాశం వచ్చిన ప్రతిసారీ టిడిపితో పొత్తు వల్ల ఆ పార్టీ ఎదుగు బొదుగు లేకుండా పోయింది. రాష్ట్ర విభజన జరిగినా బిజెపికి కష్టాలు తీరలేదు. టిడిపి ఆంధ్రలో అధికారంలో ఉండగా, తెలంగాణలో నామ మాత్రంగా తయారైంది. ఎపిలో టిడిపి, బిజెపిల మధ్య స్నేహం వల్ల తెలంగాణలో అనివార్యంగా పొత్తు కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని బిజెపి ప్రకటిస్తే, అధికారంలోకి వచ్చేది తామేనని టిడిపి కూడా ప్రకటిస్తోంది. ఈ రెండు పార్టీలు పోటీపోటీగా ప్రకటనలు చేస్తున్నా- ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. చాలామంది టిడిపి నాయకులు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. టిడిపి మైనస్ పాయంట్లు మాత్రం బిజెపిని వెంటాడుతున్నాయి.
- మురళి

అయ్యో.. నరసింహన్!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేరులోనే మనకు ఉగ్రరూపం కనిపిస్తుంది. వాస్తవానికి ఆయన ఎంతో సౌమ్యుడు. కనుకనే రెండోదఫా ఆయన తన పదవీ కాలం పొడిగించుకోగలిగారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమేఘాలపై తాత్కాలిక సచివాలయం నిర్మించి ఉద్యోగులను తరలించారు. ఎపిలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగేలా భవనాల నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. చంద్రబాబు అన్ని హంగులతో తన క్యాంప్ కార్యాలయం, నివాస భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే- రాష్ట్ర ప్రథమ పౌరుడు నరసింహన్‌కు మాత్రం కనీసం తాత్కాలిక భవన సదుపాయమైనా సమకూర్చలేదు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ గవర్నర్ ప్రైవేట్ హోటల్‌లోనే బసచేయాల్సి వస్తోంది.
- నిమ్మరాజు చలపతిరావు

మీది ఏ గ్రూపు..?
మొబైల్ ఫోన్లలో వాట్సాప్ గ్రూపులు బోలేడు. పర్సనల్, ఫ్యామిలీ, పార్టీల నేతలు, వివిధ రాజకీయ పార్టీలు... ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేదు. కాగా, బిజెపి తెలంగాణ బీట్ రిపోర్టర్స్.. అని మీడియా ప్రతినిధులు సొంతంగా ఓ గ్రూప్ ప్రారంభించుకున్నారు. జికెఆర్ అని కిషన్‌రెడ్డి పేరిట మరో గ్రూపు ఉంది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పేరిట వాట్సాప్‌లో ఒక గ్రూపు ఉండగా, తాజాగా ‘మన పెద్దాయన’ అని వెంకయ్యను ఉద్దేశిస్తూ మరో గ్రూపు ప్రారంభమైంది. ఇలా ఎవరికి వారే వాట్సాప్ గ్రూపులు ప్రారంభించడంపై నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధుల మధ్య ఇష్టాగోష్టిగా చర్చ జరిగింది. ఇంతలో ఓ విలేఖరి- ‘అమ్మో.. బిజెపిలో ఇన్ని గ్రూపులు ఉన్నాయా? అవన్నీ ఇప్పుడే బయటపడుతున్నాయ్..!’ అనడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వారు.
- వి.ఈశ్వర్ రెడ్డి

మాటకు మాట
సినిమా రచయతలకే కాదు, ప్రాస డైలాగుల్లో తమకూ ప్రతిభ ఉందంటున్నారు రాజకీయ నాయకులు. టిఆర్‌ఎస్‌ది గడీల పాలన.. అని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే, టిఆర్‌ఎస్ ఎంపి బూర నర్సయ్య గౌడ్ కాంగ్రెస్‌ది గడీల పాలన, మాది బడీల పాలన అని సమాధానం ఇచ్చారు. దేశంలో ఎక్కడా ఎప్పుడూ లేనట్టుగా ఒకేసారి వందలాది గురుకుల పాఠశాలల్ని ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ మాది బడీల పాలన.. అని నర్సయ్య చమత్కరించారు. దేశంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో తెలంగాణకు మొదటి స్థానం రావడంపై విపక్షాలు విమర్శించాయి. ఫాంహౌస్‌లో సిఎం కెసిఆర్ పడుకున్నందుకు నెంబర్ వన్ స్థానమా?-అని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శిస్తే, చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసి ఇల్లు వదిలి హోటల్‌లో పడుకునేలా చేసినందుకు అని టిఆర్‌ఎస్ నాయకులు సమాధానం ఇచ్చారు.
- బిఎం