మిర్చిమసాలా

గౌరవం లేదిక్కడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో ప్రధానికి, శాసనసభల్లో ముఖ్యమంత్రులకు గౌరవం దక్కడం లేదని అధికార పార్టీలు వాపోతుంటే, మా మాటకు విలువే లేదని విపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. స్వయంగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తనకూ శాసనసభా నాయకుడు సీఎంకూ గౌరవం లేకుండా పోయిందని , విపక్షాలు తీరు మార్చుకోవాలని చెబుతుండగా, మీకు నచ్చినట్టు చేసుకోవడానికి కాదు అసెంబ్లీ ఉన్నది అంటూ విపక్షం వైకాపా నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బయట ఉన్నంత సేపూ సభ నిర్వహించమని విపక్షం కోరుతోంది, తీరా సభ నిర్వహించాక సభలో కూర్చోకుండా సభను బహిష్కరిస్తోంది అంటూ అధికార పక్షం చెబుతుండగా, సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని, విపక్షం ఏమీ కాదన్నట్టు అధికారపక్షం వ్యవహరిస్తోందని వైకాపా నేతలు చెబుతున్నారు. ఎవరిమాట వింటే వారిదే కరెక్టు అన్నట్టున్నా, అసెంబ్లీ సంభాషణలు అంటే మాత్రం భయపడే పరిస్థితి వచ్చిందనేది జనం మాట.
-బి. వి. ప్రసాద్

పోలికలు
టిడిపి, బిజెపిలకు రెండు రాష్ట్రాల మధ్య పోలికలు తలనొప్పిగా మారాయి. గతంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య పెద్దగా పోలికలు ఉండేవి కావు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలే కావడంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పోలికలు అనివార్యంగా మారాయి. ఆంధ్రలో అంగన్‌వాడిలు ఆందోళన చేస్తే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నోటీసులు ఇచ్చారు. మరి పారిశుద్ధ్య కార్మికుల తొలగింపుపై ఆంత హంగామా చేసిన బిజెపి వాళ్లు ఆంధ్రలో తమ మిత్రపక్షం చేసిన దానికి ఇంత వౌనంగా ఉంటున్నారేమిటని టిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బిజెపి, టిడిపిలకు ఆంధ్రకో సిద్ధాంతం, తెలంగాణకో సిద్ధాంతమా? అని ప్రశ్నిస్తున్నారు. ఎంతైనా ఇలాంటి పరిస్థితిలో కష్టమే నంటున్నారు ఆ రెండు పార్టీల నాయకులు.
- మురళి

ధర్నా ఎందుకో..?
ఒక విద్యార్థి తండ్రి తన కుమారుడు హైదరాబాద్‌లో ఎలా చదువుతున్నాడోనని తెలుసుకుందామన్న ఆదుర్దాతో ఓ మారు మూల గ్రామం నుంచి కుమారుడు చదువుతున్న కళాశాలకు చేరుకున్నాడు. ఆ సమయంలో కళాశాల ముందు విద్యార్థులు యజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన ధర్నా చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఇదేమిటో తెలియక ఆ విద్యార్థి తండ్రి ఒక విద్యార్థిని ఎందుకు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించగా, ‘ఇప్పుడైతే ధర్నా చేస్తున్నాం, సాయంత్రం జరిగే జనరల్‌బాడీ మీటింగ్ అజెండాలో ఎందుకు ధర్నా చేశామో తెలుస్తుంది..’ అని సమాధానమిచ్చాడట సదరు విద్యార్థి. ఈ విషయాన్ని (కట్టు కథను) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పి సభికులను కడుపుబ్బ నవ్వించారు. కాంగ్రెస్ వారి ధర్నాలూ ఇలాగే ఉంటాయని వెంకయ్య నాయుడు చెప్పడంతో సభికులు మరోసారి నవ్వారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

యాగానికి కాంగ్రెస్ దూరం!
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తలపెట్టిన యాగానికి భారత రాష్టప్రతితో సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, స్పీకర్లు, బడా పారిశ్రామికవేత్తలు తరలిరాగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ చాయలకే వెళ్లడం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే చండీయాగాన్ని నిర్వహిస్తానని నాలుగేళ్ల కిందటనే మొక్కుకున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. రాష్ట్రం సిద్ధించినందుకు యాగం చేస్తున్నారు సరే, మరి రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎందుకు ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సోనియాగాంధీ క్రిస్టియన్ కావడంతో ఆహ్వానించి ఉండకపోవచ్చు అని టిఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. అలా అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ ముస్లిం అయినప్పటికీ ఆహ్వానించగా లేనిదీ సోనియాను ఆహ్వానించి ఉంటే తప్పేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. యాగానికి కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండటానికి సోనియాను ఆహ్వానించకపోవడమే ప్రధాన కారణమై ఉంటుందని అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డికె అరుణ తదితరులు యాగంపై చేసిన విమర్శలు పరోక్షంగా అదే విషయాన్ని బయటపెట్టారు. సీఎం పదవి రావడం వల్లనే కెసిఆర్ యాగం చేస్తున్నారు తప్ప రాష్ట్ర వచ్చినందుకు కాదని డికె అరుణ విమర్శలు గుప్పించారు. అది సరే రాష్ట్రం రావడం వల్లనే కెసిఆర్‌కు సిఎం అయ్యే అవకాశం వచ్చింది. ఎలగైతేనేం.. కెసిఆర్ చేస్తున్న యాగం రెండింటితోనూ ముడిపడి ఉంది.
- వెల్జాల చంద్రశేఖర్

రైళ్ల టిక్కెట్లంటే ..?
నిన్న మొన్నటి వరకు రైళ్ల రిజర్వేషన్ల టిక్కెట్లను మూడు, నాలుగు నెలల ముందే ప్రణాళికబద్ధంగా సెలవును ప్లాన్ చేసుకుని బుక్ చేసుకునే వారు. ఇప్పుడు రైళ్ల టిక్కెట్లను ముందుగా బుక్ చేయాలంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్లీపర్ క్లాస్ టిక్కెట్ రద్దు చేసుకుంటే 100 రూపాయలు, ఏసి టిక్కెట్ అంతకు రెట్టింపు రద్దు చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో రైళ్ల టిక్కెట్లను ముందుగా గతంలో మాదిరిగా బుక్ చేసుకునేందుకు జనం జంకుతున్నారు. పనిలో పనిగా తత్కాల్ చార్జీలను కూడా పెంచేశారు. దీంతో అన్ని ఖరారైతే తప్ప టిక్కెట్ బుక్ చేసుకుంటే కష్టమే. పెరిగిన రద్దు చార్జీలతో గతంలో మాదిరిగా ఎడాపెడా ముందుగా బుక్ చేసుకునే వాళ్లు తగ్గారంట. మంచిదే కదా.
- శైలేంద్ర