మీకు మీరే డాక్టర్

గోధుమ మొలకలతో మహిళలకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోధుమ రవ్వతో చేసే రకరకాల వంటకాలకు, సేమ్యా తయారీకి, గోధుమపిండి అట్లు, జంతికలు, మిఠాయి వగైరా తయారీకి రవ్వ గోధుమల పిండినీ లేదా రవ్వను వాడుకుంటే యోగ్యంగా ఉంటుంది. రవ్వ గోధుమల పిండితో రాగి పిండి గానీ, జొన్నపిండి గానీ చెరిసగంగా కలుపుకొని చపాతీలు, పుల్కాలూ రుచిగా ఉంటాయి. తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. అన్నం మానేసి పుల్కాలను తిన్న ఫలితం ఉంటుంది.
రవ్వ గోధుమలు త్వరగా మొలకెత్తుతాయి. అందుకని మొలకెత్తిన విత్తనాలు తినేవారు శనగలు, పెసలు, బొబ్బర్ల కన్నా గోధుమ మొలకలు తినే అలవాటు చేసుకోవటం మంచిది. మొలకెత్తిన రవ్వ గోధుమల్లో డయాస్టేజ్ ఎంజైము మామూలు గోధుమకన్నా ఎక్కువ శక్తిమంతంగా పని చేస్తుంది. ఇది ఆహారంలోని పోషక విలువల్ని తేలికగా వొంటబట్టేలా చేస్తుంది. శరీరంలో నిర్మాణాత్మక క్రియలు అంటే మెటబాలిజంను పెంపొందింపజేస్తాయి.
బజార్లో దొరికే గోధుమపిండిలో తవుడు తీసేస్తారు. అందుకని, ‘విటమిన్-ఇ’ అందులో చాలా తక్కువగా ఉంటుంది. మొలకెత్తిన గోధుమల్ని వాడుకుంటే గోధుమ తవుడు కూడా అందులోనే ఉండిపోతుంది. కాబట్టి, ‘విటమిన్-ఇ’ని మనం పూర్తిగా పొందేందుకు వీలౌతుంది. ముఖ్యంగా నలభైలు దాటిన మహిళలకు, మెనోపాజ్ బాధలున్న వారికి ‘విటమిన్-ఇ’ అవసరం ఎంతో ఉంది. గర్భాశయ పోషణ, చర్మానికి మృదుత్వం, జుత్తు రాలకుండా దృఢంగా ఉండటం, కండరాలు శక్తిమంతంగా ఉండటం లాంటి ప్రయోజనాలు ‘విటమిన్-ఇ’ వలన సమకూరుతాయి.
ఆరో రోజు, ఏడో రోజు వచ్చేసరికి గోధుమ మొలకలు గడ్డిగా మారిపోతాయి. ఈ గడ్డిని శుభ్రం చేసుకొని కూరల్లోనూ, పచ్చళ్లలోనూ, పులుసుల్లోనూ కలుపుకొని తినవచ్చు. కొత్తిమీర వేసినట్టు, తరిగి ముక్కలు చేసి కలుపుకోవచ్చు కూడా. గోధుమగడ్డిని వాడదలిచిన వారు, మట్టిలో గోధుమల్ని చల్లి ఏడోరోజున పెకలించి కడిగి శుభ్రం చేసి పచ్చిగా వాడుకోవచ్చు. లేదా, ఎండించి మెత్తగా మరపట్టుకొని టీ లాగా తాగవచ్చు కూడా!
మూత్రం అతిగా అవుతున్న వారికి రవ్వ గోధుమనూక లేదా రవ్వతో చేసిన వంటకాలు పెడితే, అతిమూత్రం ఆగుతుంది. కృశించి పోతున్న వారికి, టీబీ, ఎయిడ్స్, లివర్ వ్యాధులున్న వారికీ, ఇది మంచి ఔషధం. ఆపరేషన్లయిన వారికి, గాయాలైన వారికి, వ్రణాలతో బాధపడేవారికి రవ్వ గోధుమలే మేలు చేస్తాయి. గోధుమ రవ్వను కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి చిక్కని జావ కాచి ఉప్పూ మిరియాలపొడి కలిపిన సూపు సురక్షితమైన ఆహార పదార్థం. ఇందులో గట్టి పెరుగు కలిపి చిలికితే చిక్కని మజ్జిగ రసం అవుతుంది. అది గ్యాస్ ట్రబుల్, పేగులలో వచ్చే వ్యాధులన్నింటికీ మంచిది.
గోధుమ రవ్వతో అన్నం, ఉప్మా, కొద్దిగా మినప్పిండి కలిపి ఇడ్లీ, రొట్టె లాంటి వంటకాలను తినవచ్చు. డైటింగ్ చేయటం అంటే చపాతీలూ, పుల్కాలూ తినడం అని ఒక గిరిగీసుకోవటం కూడా మంచిది కాదు. వరి బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను వాడుకోవటానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించండి. పిండి గోధుమలకన్నా మొలకెత్తిన రవ్వ గోధుమలకు ప్రాధాన్యత నివ్వటం ఈనాటి ఒక అవసరం.
కల్తీలకు కాదేదీ అనర్హం కాబట్టి, గోధుమల విషయంలోనూ జాగ్రత్త అవసరం. బ్రాండ్ పేర్ల మీద మోజుకన్నా, గోధుమలను దగ్గరుండి మరాడించుకోవటం కన్నా నమ్మకమైన దారి ఇంకొకటి లేదు.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com