మీకు మీరే డాక్టర్

పూల కూరలు-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛింతపూలతో పప్పు, పచ్చడి, కారప్పొడి
చింతచిగురు ఎంత విలువైనదో, చింతపూలూ అంతే విలువైనవి. చింతపూలతో పప్పు చేసుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. ఏదైనా కూరగాయతో కలిపి కలగూరగా వండుకుంటారు. చింతచిగురుకన్నా మెరుగైన గుణాలే దీనికి ఉంటాయి. శరీరానికి కాంతి నిస్తాయి. వాత వ్యాధుల్లో పులుపు తినాలనిపించినపుడు చింత చిగురు, చింతపండుకన్నా చింతపూలు అపకారం చేయకుండా తినదగినవిగా ఉంటాయి. రక్తంతో కూడిన విరేచనాలు అవుతున్నప్పుడు కూడా ఇవి విరేచనాలను తగ్గిస్తాయే కానీ పెంచవు. కఫాన్ని పెంచకుండా ఉంటాయి. కాబట్టి పులుపు పదార్థాలలో చింత పువ్వులు శ్రేష్ఠమైనవిగా భావించాలి. చింతపూలను నేతితో దోరగా వేయించి చేసిన పచ్చడి లేదా పంచదార పాకం పట్టిన జామ్ లాంటివి మంచి చేస్తాయి. చపాతీలు, బ్రెడ్లూ తినేందుకు వాడే జామ్ చింతపూలతో చేసిందైతే ఉపయోగం.
చింతపూలను కూడా వేపపూల మాదిరే ఎండబెట్టి నేతితో వేయించి కారప్పొడి కొట్టుకుని అన్నంలో తింటారు. అందుబాటులో చింతచెట్టు ఉన్నవారు చెట్టు కింద దుప్పట్లు పరిచి చింతపూలను సేకరించుకోవచ్చు. మీకు తెలిసిన వారికి పంచుకోవచ్చు. కామెర్లు, ఇతర లివర్ జబ్బుల్లో చింతపూలను తప్పనిసరిగా తీసుకోవటం అవసరం కూడా. రక్తహీనత ఉన్నవారికి మేలు చేస్తుంది.
చెంగల్వ పూల హల్వా
చెన్ను + కలువ = ఎర్రకలువ పూలతో రకరకాల వంటకాలను చేస్తుంటారు. తినటానికి యోగ్యమైన పూల కూరే ఇది. గులాబీ పూల మాదిరే హల్వా చేసుకోవచ్చు. క్యాబేజీ లాగా తరిగి కూర చేసుకోవచ్చు. కలువ పూలకున్న సహజమైన పరిమళం తినటానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ వండే విధానంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే అమితమైన చలవ చేసే వంటకం ఇది. వొంట్లో వేడిని తగ్గిస్తుంది. అరికాళ్లు అరిచేతుల మంటలతో బాధపడే వారికి ఇది దివ్యౌషధం. ఇలాంటి వాటికి ఏవేవో మందులు వాడేకన్నా చలవనిచ్చే చెంగల్వను కూరగా వండుకుని తీసుకుంటే అప్పటికప్పుడే మార్పు కనిపిస్తుంది. మూత్రంలో మంట తక్షణం తగ్గుతుంది. బీపీ అదుపులోనికి వస్తుంది. మలమూత్రాలు ఫ్రీగా అవుతాయి. ఎసిడిటీని తగ్గిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. శరీరానికి కాంతినిస్తుంది. చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. అన్ని వ్యాధుల్లోనూ తినదగిన పుష్పశాకం ఇది. కలువపూలను ఎండించి దంచిన పొడిలో పెసరపిండి కలిపి సున్నిపిండిగా వాడుకోవచ్చు. తాజా పూల గుజ్జును తలకు పట్టించుకుంటే వెంట్రుకల్లో గరుకుదనం తగ్గుతుంది. కంటి వ్యాధుల్లో ఇది బాగా పని చేస్తుంది. కళ్లు అకారణంగా ఎర్రబడటం, కన్ను మంటలు తగ్గుతాయి. ఎర్ర కలువ, తెల్ల కలువ, నల్ల కలువ, తామర పూలన్నింటికీ ఒకే రకమైన గుణాలున్నాయి.
చేమంతి పూల టీ
జ్వరం ముఖ్యంగా వరుసగా వచ్చే మలేరియా జ్వరంలో ఇది ఔషధం అని చాలామందికి తెలీదు. హోమియో వారు దీనితో కేలెండ్యులా పేరున అనేక ఔషధాలు తయారుచేస్తారు. చర్మవ్యాధు లన్నిటిలో ఇది దివ్యౌషధం. పైపూతగా వాడినా, కడుపులోకి తీసుకున్నా ఒకే గుణాలు కలిగి ఉంటుంది. చేమంతి పూలను ఎండించి దంచిన పొడితో టీ కాచుకుని మూడు పూటలా తాగుతుంటే, పైత్య వ్యాధులు, వేడి వలన కలిగే వ్యాధులు, కఫం వలన కలిగే వ్యాధులన్నింటిలో మేలు చేస్తాయి. ఏలకులు, జాజికాయ జాపత్రి లాంటివి కలుపుకుని టీ తయారుచేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూడా! మలమూత్రాలు ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. నరాల బలహీనతతో బాధపడే వారికి ఇది గొప్ప ఔషధం. పిక్కలు పట్టేయటం కండరాలు బలహీనంగా ఉండే వ్యాధుల్లో ఇది మేలు చేస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. జీర్ణాశయ వ్యాధులన్నింటిలోనూ ఇది ఔషధంగా పని చేస్తుంది. పచ్చ చేమంతి, తెల్ల చేమంతి, ఇతర రంగుల్లో ఉండే చేమంతుల్లో ఒకే గుణాలు కలిగినవి. చేమంతి పూలనీ నీళ్లలో వేసి కాచి చల్లార్చి, ఆ నీళ్లతో పుళ్లను కడిగితే త్వరగా పుళ్లు మానతాయి. దేవతా ప్రీతికరమైన ఈ పుష్పాలను దేవుడికి పూజ చేశాక ఇలా సద్వినియోగం చేసుకోవచ్చు. ఉబ్బసం, దగ్గు, ఆయాసం, మూర్ఛల జబ్బు, బీపీ, గుండె జబ్బులు, జ్వరాలు వీటన్నింటి మీదా చేమంతి పూలకు ప్రభావం ఉంది. టీ కాచుకుని మూడు పూటలా తాగుతుంటే ఫలితం కనిపిస్తుంది.
జనుము పూలతో కూర, పప్పు, పచ్చడి
గ్రామీణ ప్రాంతాల్లో జనుము పైరు పక్కనుంచి రోడ్డు మీద వెడుతుంటే పసుపుపచ్చని పూలతో మనోహర దృశ్యం ఆవిష్కృతవౌతుంది. జనుము పంటని కేవలం నార కోసం మాత్రమే పండిస్తుంటారు. ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. కాబట్టి జనపనారకు డిమాండ్ తగ్గి, ఈ పంటలు వేయటం క్రమేణా మానేస్తున్నారు. జనుము పూలు కంటికి, మనసుకే కాదు పొట్టకి కూడా సంతృప్తినిచ్చే ఔషధ విలువలు కలిగినవి. తాజా జనుము పూలను తరిగి కూరగా వండుకుంటారు. పప్పు, పచ్చడి, నేతితో వేయించి హల్వా లాగా చేసుకుంటారు. ఎండించి టీ కాచుకుని తాగుతుంటారు. దీని ప్రధాన గుణం ఆకలిని కలిగించి, అజీర్తి దోషాలను పోగొట్టటం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పూలు అందుబాటులో ఉన్నవారు ఇలాంటి ప్రయోజనాలు ఉచితంగా పొందవచ్చు కదా. వాత వ్యాధులున్న వారికి జనుము పూలతో వంటకాలు పెడుతుంటే వాపు, నొప్పి నెమ్మదిస్తాయి. వాతాన్ని అదుపు చేసే గుణం దీనికుంది.
జామ పూల టీ
షుగరు వ్యాధి మీద పనిచేసే వాటిలో జామ పూలు కూడా ముఖ్యమైనవే. పెరట్లో జామ చెట్టు ఉన్నవారు జామ పూలు, జామ ఆకులూ కింద రాలి పడుతుంటే విసుక్కోకండి. జాగ్రత్తగా ఏరి, శుభ్రం చేసుకుని ఎండించి మెత్తగా దంచిన పొడిని ఓ సీసాలో భద్రపరచుకోండి. ఈ పొడిని టీ పొడికి బదులుగా నీళ్లలో వేసి టీ కాచుకుని తాగుతుంటే షుగరు వ్యాధి అదుపులోకి వస్తుంది. వాత వ్యాధులు, పైత్య వ్యాధులు, కఫ వ్యాధులు, కంటి జబ్బుల్లో ఇది బాగా పని చేస్తుంది. ఏ జబ్బులూ లేనివారు కూడా దీన్ని తాగుతుంటే దోషాలు అదుపులో ఉంటాయి. ఆహారంలో ఉండే విష దోషాలు పోతాయి. పొట్టకు మేలు కలుగుతుంది. అన్ని వ్యాధుల్లోనూ ఇది పథ్యంగా ఉంటుంది.
తంగేడు పూల పాయసం
బతుకమ్మకు ఇష్టమైన పూలు ఇవి. కేవలం పూజ చేసి ఆనక ఆవల పారేసే పూలు కాదు. తాజా పూలతో కూర, పప్పు, పచ్చడి చేసుకుంటారు. ఎండించి దంచిన పొడితో టీ కాచుకుని తాగుతారు. ఈ పూలను నేతితో వేయించి మిక్సీ పట్టి, పాలు పోసి, జాజికాయ, జాపత్రి వగైరా వేసి కమ్మని పాయసం కాచుకుని తాగుతారు. తంగేడు పూల పేరు చెప్పగానే షుగరు వ్యాధికి మందు అనే విషయం గుర్తుకు రావాలి. అన్ని రకాల మూత్ర సమస్యల్లోనూ ఇది ఔషధంగా పని చేస్తుంది. అమీబియాసిస్ వ్యాధిలో దీన్ని పెరుగుపచ్చడిలా చేసుకుని రోజూ తింటూ ఉంటే జిగురు విరేచనాలు, రక్తంతో కూడిన విరేచనాలు, నీళ్ల విరేచనాలూ తగ్గుతాయి. శరీరంలో అతి వేడి, అతి చల్లదనం రెండూ తగ్గి సమశీతోష్ణస్థితిని ఇస్తాయని తంగేడు పూల గురించి ఆయుర్వేద శాస్త్రం గొప్పగా చెప్పింది. అన్ని వ్యాధుల్లోనూ తీసుకోదగిన ఔషధ ద్రవ్యం ఇది. రోడ్డు పక్కన పెరిగే మొక్క. పూలు ఉచితంగా దొరుకుతాయి. సద్వినియోగం చేసుకోవటంలో మన విజ్ఞత ముఖ్యమైంది. వేడి శరీర తత్వాల వాళ్లకు ఇది బాగా సహకరిస్తుంది. తంగేడు పూలను నేతితో వేయించి పంచదార పాకం పట్టి గుల్కందు మాదిరిగా తయారుచేస్తారు. కాల విరేచనం అయ్యేలా చేస్తుంది.
(మిగతా వచ్చే సంచికలో)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com