మీకు మీరే డాక్టర్

ఆహార ఔషధాలు -7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొట్ల ఆకు పులుసుకూర, పప్పు, చారు
పొట్లకాయల్ని ఇష్టంగా తినేవారు చాలామంది ఉన్నారు. మహిషాసురుడు నాగుపామును ఎత్తి పట్టుకున్నట్లు మార్కెట్ నుండి పొడవైన పొట్లకాయని విరగకుండా ఇంటికి పట్టుకువెళ్లేవారు జనం, మొన్న మొన్నటిదాకా! పందిరికి పొట్ల తీగని పాకించి, కాయ పొడవుగా వచ్చేందుకు దాని కొసకు రాయి కట్టి పండించేవారు. విరిచి, ముక్కలు తీసుకెళ్లటానికి ఇష్టపడకపోవటాన్ని తెలుగు ప్రజలు పొట్లకాయకు ఇచ్చే గౌరవంగా భావించాలి.
పొట్లకాయతో సమానంగా పొట్ల ఆకులు కూడా చలవనిచ్చేవే! పొట్లాకు కఫ దోషాలను పోగొడుతుంది. పొట్లకాయ నీళ్ల కూర కాబట్టి జలుబు చేస్తుందనుకోవటం భ్రమ. పొట్లకాయ, ఆకులు కూడా జలుబు భారాన్ని తగ్గించేవిగా ఉంటాయి. బలకరం. జీర్ణకోశ వ్యాధులు, అమీబియాసిస్ లాంటి వ్యాధుల్లో బాగా పని చేస్తుంది. ఆకుల్ని తినటానికి ఇబ్బంది అనిపిస్తే, మిక్సీ పట్టి రసం తీసి, ఆ రసంలో చారుపొడి వేసి రసం కాచుకుని త్రాగితే అద్భుతంగా పని చేస్తుంది. పొట్ల ఆకుల్ని సన్నగా తరిగి పెసరపప్పుతో కూటు తయారుచేస్తారు. కీళ్లనొప్పుల వ్యాధితో బాధపడే వారికి పొట్ల ఆకుతో వంటకాలు తరచూ వండిపెట్టండి. చాలా మార్పు కనిపిస్తుంది. సుఖవిరేచనం అయ్యేలా చేస్తుంది. కఫాన్నీ, వేడినీ, వాతాన్నీ తగ్గించి శరీరానికి సమస్థితి తెస్తుంది. విష దోషాలను హరిస్తుంది. గుండె జబ్బులున్న వారికి మేలు చేస్తుంది.
ఇప్పుడు బీరకాయంత సైజులో పొట్టి పొట్లకాయలు వస్తున్నాయి. ఇవి కొత్త విత్తనాలు. ఈ పొట్టి రకం పొట్ల వైద్య ప్రయోజనాల గురించి మనకు తెలీదు. అవే పండిస్తున్నారు. అవే అమ్ముతున్నారు. అవే కొంటున్నాం. అంతే!
నేతిబీర ఆకులతో పప్పు,
పచ్చడి, చారు
నేతి బీర, తీపి బీర రెండింటికీ తేడా చూపించటానికి దీన్ని నేతిబీర అన్నారు. కమ్మనైనదని దాని భావార్థం. సంస్కృతంలో ఘృతకోశాతకి అంటారు. అడవి బీర, చేదు బీర ఇలా బీరలో అనేక రకాలున్నాయి. వాటిలో ఉత్తమమైనది నేతి బీర. కూరగానూ, పప్పుగానూ, పచ్చడిగానూ పనికివచ్చేవి నేతిబీర ఆకులే. నేతి బీర కాయలాగానే, వాటి ఆకులు కూడా రుచికరంగా ఉంటాయి. శరీర తత్త్వాన్ని సౌమ్యపరుస్తుంది. తేలికదనాన్నిస్తుంది.
నేతి బీరకాయకున్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ నేతిబీర ఆకులకూ ఉన్నాయి. ఉబ్బస రోగులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. విష దోషాలను పోగొడుతుంది. జ్వరాల్లో నేతిబీర పెట్టదగిన ఆహార ద్రవ్యం. వెంటనే జ్వర తీవ్రత తగ్గుతుంది. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ లాంటి వ్యాధుల్లో ఇది పేగులను సంరక్షిస్తుంది. పెరుగుతో జతచేసి తీసుకుంటే ఎక్కువ మేలు చేస్తుంది. పప్పు, పచ్చడి లేదా రసం తీసి అందులో రసం పొడి వేసి కాచిన చారు ఉపయోగకరంగా ఉంటాయి.
మునగాకు కూర, పప్పు, పులుసు, చారు
లేత మునగాకులతో పొడికూర, పప్పుకూర, పచ్చడి, సాంబారు తయారు చేసుకుంటారు. వాత వ్యాధులున్న వారికి తప్పనిసరిగా వండిపెట్టవలసిన ఆహార ద్రవ్యం ఇది.
వీర్య కణాలను పెంచుతుంది. లైంగిక సమర్థతని కూడా పెంచుతుంది. శరీరంలో నీటిని లాగేస్తుంది. తేలికదనాన్నిస్తుంది. రక్తవృద్ధి నిస్తుంది. కీళ్లనొప్పులు, కీళ్ల వాతం ఉన్నవారు తరచూ లేత మునగాకులతో ఏదో ఒక వంటకం తింటూ ఉండటం అవసరం. నొప్పినీ, వాపునూ తగ్గించి, ఎముక పుష్టినిస్తుంది. చారులోనూ, సాంబారులోనూ కరివేపాకు వేసినట్టే ములగాకులు కూడా వేసి కాచుకుంటే ములక్కాడలు వేసినంత కమ్మగా, సుగంధభరితంగా ఉంటుంది. వేడిచేసే స్వభావం ఉంటుంది. వేడి శరీర తత్త్వం ఉన్నవారు దీన్ని చూసుకుని తినటం మంచిది.
మెంతి ఆకు పప్పు, కూర, పచ్చడి
మనం తినే ఆకుకూరల్లో చిరుచేదుగా ఉండేది మెంతి ఆకు మాత్రమే! భోజనంలో వగరూ, చేదు ఆహార పదార్థాలకు ప్రాధాన్యత పెంచవలసిన అవసరం గురించి మనం పదేపదే చర్చించుకున్నాం. మెంతి ఆకు చేదు అవసరాన్ని తీరుస్తుంది. పప్పుగా వండిన తరువాత దాని చేదు ఇబ్బంది పెట్టకుండా రుచిగా ఉంటుంది. మేథీ చమన్ అనే వంటకం హోటళ్లలో చాలా ప్రసిద్ధి.
మెంతాకుని చేదు కోసం తరచూ తింటూ ఉండటం మంచిది. వేడిని, వాతాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది. కడుపులో ఎసిడిటీని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. విష దోషాలను, ఎలర్జీలనూ పోగొట్టే గొప్ప ఔషధ ద్రవ్యం ఇది. స్థూలకాయం పెరగకుండా సహకరిస్తుంది. అమీబియాసిస్, ఇరిటబుల్ సిండ్రోమ్ లాంటి వ్యాధుల్లో చాలా గొప్పగా పని చేస్తుంది. విరేచనాలవ వ్యాధిలో దీన్ని తప్పకుండా వండిపెట్టండి. గర్భాశయ దోషాలను పోగొట్టి నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. మూత్రవ్యాధులన్నింటిలో దీనికి ఔషధ ప్రయోజనాలున్నాయి. డయాలసిస్ మీద ఉన్నవారికి తప్పనిసరిగా వండి పెట్టవలసిన ఔషధం. అన్ని వ్యాధుల్లోనూ పథ్యంగా తినదగినదే! కానీ, మితిమీరి తినకూడదు.
సరస్వతీ ఆకు పచ్చడి,
పులుసుకూర, చాయ్
దీనే్న బ్రాహ్మీ అనీ, మండూకపర్ణి అనీ పిలుస్తుంటారు. శాస్త్రంలో చెప్పిన బ్రాహ్మీ, ఇదీ ఒకటి కాదని టారు గానీ, తెలుగు ప్రాంతాల్లో ఈ సరస్వతీ ఆకు విస్తృతంగా దొరుకుతోంది. రూపాయ బిళ్లంత పరిమాణంలో అడ్డాకు మాదిరి గుండ్రంగా ఉండి మధ్యలో చీలి ఉంటుంది. రుచికి ఇది కాకరకాయకన్నా కటిక చేదు. అందుకని ఈ ఆకుల్ని సన్నగా తరిగి నీళ్లలో వేసి వార్చేసి ఆ కూరతో పులుసుకూర లేదా పచ్చడి చేసుకుంటారు. వండి వార్చిన ఆకుల్ని ఎండించి ఒక సీసాలో భద్రపరచుకుని టీ కాచుకుని త్రాగవచ్చు కూడా!
నరాల పటుత్వాన్ని పెంచే అద్భుత ఔషధం ఇది. పరీక్షల సమయంలో పిల్లలకు ఈ ‘టీ’ని గ్రీన్ టీలాగా కాచి ఇవ్వండి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. రక్తవృద్ధి నిస్తుంది. కామెర్ల వ్యాధిలో ఔషధం ఇది. కామెర్ల వ్యాధిలో కొందరు పసరు మందు పేరుతో ఇచ్చేది ఈ మొక్కనీ, నేల ఉసిరికనీ, గలిజేరునీ కలిపి తీసిన రసానే్న! శరీరానికి నీరు పట్టినప్పుడు సరస్వతీ ఆకుని తీసుకుంటూ ఉంటే నీరు లాగేస్తుంది. మూత్రవ్యాధుల్లో మేలు చేస్తుంది. ఎంతకీ తగ్గని చర్మవ్యాధు లున్నవారికి దీన్ని తరచూ ఇస్తుంటే త్వరగా తగ్గుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. గర్భాశయం బలసంపన్నం అవుతుంది.
(వచ్చేవారం రకరకాల పూలతో కూర, పప్పు, పచ్చళ్లు)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com