మీకు మీరే డాక్టర్

పోషకాల గింజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు ఇలాంటివి షుగరు వ్యాధి వచ్చిన వారు తినవచ్చునా? వాతం చేస్తాయంటారు. నిజమేనా? వీటి వలన కలిగే ప్రయోజనాలను వివరించగలరు.
-జి.లక్ష్మీప్రసన్న (వరంగల్)
జ: జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు వగైరా నట్స్ అని మనం పిలుచుకునే గింజలు పోషకాలు కలిగిన ద్రవ్యాలుగా మాత్రమే ఇన్నాళ్లు ప్రధానంగా ప్రచారం జరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని వ్యాధుల్లో వీటి ఔషధ ప్రయోజనాల గురించి కూడా పరిశీలన జరుగుతోంది.
2019 ఫిబ్రవరి మాసాంతంలో షుగరు వ్యాధి వచ్చిన వారికి కలిగించే ప్రయోజనం గురించి ఒక పరిశోధన నివేదిక వెలువడింది. జీడిపప్పు వగైరా నట్స్ అనేవి గుండె రక్తనాళాల సమస్యలను నివారిస్తాయని ఈ నివేదిక రుజువు చేస్తోంది. ముఖ్యంగా షుగరు వ్యాధి వచ్చిన వారికి ఇది శుభవార్తే! ఇన్సులిన్ లేకుండా మందుల మీద ఉన్న షుగరు రోగులకు గుండె జబ్బుల ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయని ఈ నివేదిక చెప్తోంది.
వీటిలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఆహార పీచు పదార్థాలు, ఇ-విటమిన్, ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటి కొన్ని ఖనిజాలు, మినరల్స్ దండిగా ఉంటాయి. షుగరు వ్యాధి లేనివారిక్కూడా ఇవి మంచివే! జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా సంచికలో వీటి గురించిన నివేదిక ప్రచురితం అయ్యింది. షుగరు వ్యాధి ఉపద్రవాల నివారణకు ఇవి బాగా తోడ్పడుతున్నట్టు గమనించారు. ఇవి శరీరం అకారణంగా బరువు పెరగటాన్ని కూడా తగ్గిస్తున్నట్లు గుర్తించారు.
2015లో జరిపిన ఒక సర్వేలో మరణానికి కారణం అయ్యే వ్యాధుల్లో షుగరు వ్యాధి 7వ స్థానంలో ఉన్నదని అమెరికన్ శాస్తవ్రేత్తలు ప్రకటించారు. అమెరికాలో ప్రతీ ఏడాదీ 15 లక్షల మంది షుగరు రోగుల్ని కొత్తగా నిర్ధారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గింజలు (నట్స్) రక్తప్రసారాన్ని సరిచేయటానికి తోడ్పడుతున్నట్టు కనుగొన్నారు. 16వేల మంది పైన చేసిన పరిశోధనలో షుగరు వ్యాధి ఉపద్రవాలు, గుండే రక్తనాళాల సమస్యల నివారణలో ఈ గింజల (నట్స్) పాత్ర బాగా ఉన్నదని తేలింది.
గింజల్లో రెండు రకాలున్నాయి. భూమికి పైన చెట్టుకు కాసే కాయల గింజలు ఒక రకం అయితే, భూమికి లోపల చెట్టు వేళ్లకు కాసే కాయల లోపలి గింజలు ఇంకో రకం. బాదాం (ఆల్మండ్స్), ఆక్రోట్ (వాల్నట్స్) లాంటివి చెట్టుకు కాస్తాయి. వేరుశనగ పప్పుల్లాంటి చెట్టు వేళ్లకు కాస్తాయి. మనం ఆశించే షుగరు వ్యాధి ఉపద్రవాల నివారణ, గుండె రక్తనాళాల బాగు లాంటి ప్రయోజనాల కోసం మనం చెట్టుకు కాసే గింజల మీద ఎక్కువ ఆధారపడటం మంచిదని ఈ నివేదిక వివరిస్తోంది. వేరుశనగ గుళ్లు కూడా చెట్టు గింజలంత కాకపోయినా మేలు చేసేవే!
వారంలో 5సార్లు కాసినన్ని జీడిపప్పులు, ఆక్రోట్ పప్పులు లేదా బాదం పప్పులు తినేవారిలో 17% గుండె జబ్బు ప్రమాదం, 34% మరణ ప్రమాదం తగ్గాయని కూడా ఈ నివేదిక తెలియజెప్తోంది. కనీసంలో కనీసంగా 5 జీడిగుళ్లు రోజూ తినటం షుగరు వ్యాధిలోనూ, గుండె జబ్బుల్లోనూ అవసరం అని డా.గ్యాంగ్ లూ అనే శాస్తవ్రేత్త ఈ నివేదికలో గట్టిగా సూచిస్తున్నారు. ఇంకా తక్కువగా తీసుకున్నా ఆ కాసింత దానికే గణనీయమైన మార్పు కనిపిస్తుందని అంటున్నారాయన.
జీడిపప్పు, బాదంపప్పు లాంటివి గుండె రక్తనాళాలను ఏ విధంగా సరిచేస్తాయనే విషయం మీద ఇంకా ఒక స్పష్టత రానప్పటికీ, ఇవి రక్తపోటును నియంత్రించి, రక్తంలో కొవ్వు, షుగరు తగ్గేలా చేస్తాయని భావిస్తున్నారు. గుండె రక్తనాళాలు ఆరోగ్యవంతంగానూ, శక్తిమంతంగానూ పనిచేసేలా చేయటంలో గింజల పాత్ర చాలా ఉన్నదనేది ఈ నివేదిక సారాంశం.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డా.ప్రకాష్ దీద్వానియా అనే భారతీయ శాస్తవ్రేత్త ‘గింజలకు, షుగరు వ్యాధికీ, గుండె రక్తనాళాలకూ గల సంబంధం గురించి’ అధ్యయనాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రజలకు వీటిని ఆహారంలో ఒక భాగంగా తీసుకోవటం అలవాటు చేసుకోవాలని తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యదాయకమైన లైఫ్ స్టయిల్ కోరుకునేవారు తప్పనిసరిగా తమ ఆహార ప్రణాళికలో ఈ నట్స్‌ని కూడా చేర్చాలని సూచించారు.
ఇంటికొచ్చిన అతిథికి కాఫీ టీలు ఇచ్చి పంపటం మర్యాద. కానీ, కాసిని నట్స్ పెట్టి పంపటం ఆ అతిథి ఆరోగ్యం పట్ల మనకు శ్రద్ధ ఉన్నదని గౌరవంగా ప్రకటించటం అవుతుంది. షుగరు వ్యాధితోనో, గుండె రక్తనాళాల వ్యాధితోనో మంచం ఎక్కిన రోగిని పరామర్శించడానికి వెళ్లేటప్పుడు కాసిని నట్స్ పట్టుకెళ్లి ఇవ్వటం నిజమైన పరామర్శ.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వారు షుగరు రోగులు తినవలసిన ఆహార పదార్థాల పట్టికలో వివిధ నట్స్‌ని కూడా చేర్చటం గమనార్హం.
బాదంపప్పు: ప్రొటీన్లు ఇంకా ఇతర పోషకాలూ దండిగా వున్న బాదంపప్పులు వివిధ కణాల పెరుగుదలకు తోడ్పాటు నిస్తాయి. వీటిని నూనెలో వేయించి ఉప్పు కారం మసాలాలు దట్టించి తినటం వల్ల ప్రయోజనం తక్కువగానూ హాని ఎక్కువగానూ జరుగుతాయి. రోజూ 5-10 బాదంపప్పుల్ని 3-6 నెలల పాటు తింటే షుగరు స్థాయి తగ్గటమే కాకుండా గుండె రక్తనాళాలు మెరుగుపడతాయని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. వీటిని మఠం వేసుకుని కూర్చుని తినటంగా కాకుండా ఆహారంలో ఒక భాగంగా తినటం మంచిదని వీరి సూచన. ఇది ‘లో-డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్‌డిఎల్) కొలెస్ట్రాల్ (చెడ్డకొవ్వు)’ని తగ్గిస్తుందని, తద్వారా గుండె రక్తనాళాలను బాగుపరుస్తుందనీ పరిశోధనలు చెప్తున్నాయి.
ఆక్రోట్ గింజలు (వాల్‌నట్స్): మనిషి మెదడు ఆకారంలో ఉండే ఈ గింజలు మనోల్లాసాన్ని కలిగించి నాడీ వ్యవస్థను బలసంపన్నం చేయటానికి తోడ్పడతాయి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ‘బిఎంజె ఓపెన్ డయాబెటిస్ రీసెర్చ్ అండ్ కేర్ పరిశోధనా సంస్థ వారు ఆక్రోట్ గింజలు శరీరం బరువు పెంచవని, చెడ్డకొవ్వును అదుపు చేయటంలో ఇవి బాగా తోడ్పడతాయని గట్టిగా చెప్తున్నారు. ఆక్రోట్ గింజలు తిన్న షుగరు రోగికీ, తినని షుగరు రోగికీ 24 గంటల్లోనే అనుకూలమైన మార్పులను గమనించటం జరిగిందంటున్నారు. ఇంత తక్షణం ప్రభావం చూపించే శక్తిదాయకమైన ఆక్రోట్‌ని మనం రోజూ కొద్దిగానైనా తినటం అలవాటు చేసుకోవటం మంచిది. ఆరోగ్యవంతులు కూడా వీటిని తీసుకోవటం అవసరమే!
జీడిపప్పు: షుగరు రోగుల ఆహారంలో కూరల్లో గానీ, పచ్చళ్లలో గానీ జీడిపప్పుని తగినంత కలిపి వండి పెడితే షుగరు, బీపీ త్వరగా తగ్గటమే కాకుండా, చెడ్డకొవ్వు, మంచికొవ్వుల నిష్పత్తి మీద ఎక్కువ ప్రభావం కలుగుతోందనీ, అంటే చెడ్డకొవ్వు తగ్గి, మంచి కొవ్వు పెరుగుతోందని శాస్తవ్రేత్తలు గమనించారు. జీడిపప్పు తింటే చిక్కిపోతున్న వారు బరువు పెరుగుతారు కానీ, ఆరోగ్యవంతులు స్థూలకాయులు కారని కూడా శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు.
పిస్తా పప్పు: ఇవి శక్తినందించే యంత్రంలా పని చేస్తాయి. ఇందులో ఆహార పీచు (డయటరీ ఫైబర్), మంచి కొవ్వు అధికంగా ఉన్నాయి. షుగరు రోగులు ఒక నెలరోజులపాటు వీటిని తింటే చాలా గణనీయమైన మెరుగుదలను గమనించినట్టు శాస్తవ్రేత్తలు చెప్తున్నారు.
ఆహారంలో ప్రొటీన్, మంచి కొవ్వు కలిగిన ద్రవ్యాలను చేర్చటం వలన ఆహారం ద్వారా శరీరానికి అందే షుగరు, చెడ్డ కొలెస్ట్రాల్ లాంటివి కొంతవరకూ తగ్గుతాయి. కాబట్టి ఖరీదైనా సరే, నట్స్ (గింజలు) మీద దృష్టి పెట్టడం అవసరం.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com