మీకు మీరే డాక్టర్

అరికాళ్ల పగుళ్లకు సులభ చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: మడమ పగుళ్లకు అసలు కారణం ఏమిటి? ఆరోగ్యవంతమైన పాదాల కోసం తీసుకోదగిన జాగ్రత్తలను సూచించగలరు.
-సరికొండ కోకిలాంబ (జంగారెడ్డిగూడెం)

జ: అరికాళ్లంటే మనవే! శత్రువులవి కాదు. అరి అంటే శత్రువని వాటిని అశ్రద్ధ చేస్తున్నాం. పాదాల అడుగున ఉండే చర్మం మీద వత్తిడి ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, ధూళీ ఎక్కువగా తగుల్తుంటాయి. కాబట్టి ముఖానికన్నా పాదాన్ని ఎక్కువ కడగాలి నిజానికి! మనలో చాలామంది సరిగా పాదపోషణ చేయటం లేదు. పాదాలంటే మనకు నిర్లక్ష్యం ఎక్కువ. అవి మన శరీరంలో అంటరానివనే భావన మనలో బలంగా ఉంది. రోజుకు నాలుగుసార్లు సబ్బుతో ముఖం కడుక్కుంటాం. ఒక్కసారి కూడా పాదాలను అలా కడగం. ముఖ్యంగా పాదాల అడుగు భాగాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తుంటాం.
అరికాళ్లలో పగుళ్లకు ఇంకా కారణాలనేకం ఉన్నాయి. నీరు తగినంతగా తీసుకునే అలవాటు లేని వారికి అరికాళ్లు పగలవచ్చు. పాద చర్మంలో, ముఖ్యంగా మడమల దగ్గర చర్మంలో తడి తగ్గే కొద్దీ పగుళ్లు పెరుగుతాయి. చలి వాతావరణం కూడా ఇందుకు కారణం కావచ్చు.
వేడివేడి నీళ్లు, సబ్బు నీళ్లు, బట్టలుతికే డిటర్జెంట్ పౌడర్లు కలిసిన నీళ్లలో పాదాలు ఎక్కువగా నానటం వలన కూడా పాదాలు పగలవచ్చు.
షుగరు వ్యాధి కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.
మడమల అడుగు భాగాన ఉండే చర్మంలో తడి తగ్గిపోవటం వలన చర్మం గట్టిగా మారిపోతుంది. ఎండిపోయి, పగుళ్లు బారి (్ద్ఘజూ, జూక ఘశజూ చ్ఘిరీక) అనేక రకాల ఇబ్బందులు పెట్టవచ్చు. చర్మం బెరళ్లు కడుతుంది. సాంకేతికంగా ఈ పగుళ్లని ఫిషర్స్ అంటారు. ఈ పగుళ్లలో మట్టి చేరి, ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. నడవటానికి నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి రక్తం కారవచ్చు కూడా! ఎక్కువగా నిలబడవలసిన వృత్తుల్లో ఉన్నవారికి కూడా మడమ పగుల్లు త్వరగా ఏర్పడే అవకాశం ఉంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి, పోలీసులకు, సెక్యూరిటీ గార్డులకు, మడమ పగుళ్లు ఎక్కువగా ఉంటాయి. మడమ మీద తీవ్రమైన బరువు, వత్తిడి కలిగినప్పుడు అక్కడ చర్మం పగుళ్లుబారవచ్చు.
పగుళ్లు లోతుగా ఉన్నప్పుడు నరాలు, రక్తనాళాలు కూడా దెబ్బతిని నెత్తురు కారటం, నొప్పి పుట్టటం జరుగుతాయి. పగుళ్ల దగ్గర నొప్పి ఉన్నదంటే పగుళ్లు లోతుగా ఉన్నాయని అర్థం. ఒక్కోసారి తీవ్రమైన దురద కూడా కలగవచ్చు. అరికాళ్లలో చర్మం గరుకుగా ఉండి సున్నితత్వాన్ని కోల్పోవటం కూడా జరగవచ్చు.
ఈ పాదాల పగుళ్లు షుగర్ వ్యాధి ఉన్నవారిలో వస్తే అది ప్రమాదకర పరిస్థితిని తెస్తుంది. రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండటం వలన కూడా చర్మంలో తడి తగ్గటం జరగవచ్చు. నరాలు కూడా దెబ్బ తింటాయి. మట్టి చేరుకుని ఇన్‌ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. చివరికి పాదం తీసేయాలన్నంతవరకూ వెడుతుంది. పాదాల పగుళ్లు ఉన్నవాళ్లంతా షుగర్ వ్యాధి ఉన్నవారు కాకపోవచ్చు. కానీ, షుగరు వ్యాధి ఉన్నవారికి మడమ పగుళ్లు ఏర్పడితే అది ప్రమాదకరం కావచ్చు.
పాదాల్లో తడి నిలబడాలంటే అక్కడ నూనె రాస్తూ ఉండటం ఒక మంచి ఉపాయం. షుగర్ వ్యాధి ఉన్నవారు ఇలా తప్పనిసరిగా చెయ్యాలి. నూనెని కలిగిన గ్రంథులు మడమల దగ్గర చర్మంలో లేకపోవటం వలన మడమ చర్మం ఎండి పగుళ్లకు అవకాశాలెక్కువగా ఉంటాయి. విటమిన్ల లోపం, ఒమేగా 3 కొవ్వు పదార్థాల లోపం వలన కూడా ఇలా జరగవచ్చు.
ప్రతీరోజూ ఒక కప్పు కేరెట్ ముక్కలు, ఒక కప్పు ముల్లంగి ముక్కలు, ఒక కప్పు కీరదోస ముక్కలు, ఒక కప్పు ఏదైనా పండు ముక్కలు వీటిని జ్యూస్ తీసుకుని త్రాగటం అలవాటు చేసుకోండి. చర్మం గరుకుబారటం తగ్గి మృదువు అవుతుంది. కాంతిమంతం అవుతుంది. పాదాలు త్వరగా సాధారణ స్థితికి వస్తాయి.
మిగలముగ్గిన అరటిపండు గుజ్జుని వెన్న గానీ, పేరునెయ్యి గానీ కలిపి మడమలకు పట్టించి కొద్దిసేపు ఉంచటం వలన మడమ దగ్గర చర్మం మెత్తమడుతుంది. బెరళ్లు మెత్తబడి రాలిపోవటానికి వీలౌతుంది.
మంచి ఆలివ్ ఆయిల్ దొరికితే, దాన్ని కూడా మడమలకు మర్దన చేస్తే మడమలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. బాదం నూనె కూడా ఉపయోగపడుతుంది. ఇవి దొరక్కపోతే నెయ్యి లేదా వెన్న కూడా మర్దనకు ఉపయోగించవచ్చు.
మాయిశ్చరైజర్లు మనకు బజారులో దొరుకుతాయి. కొద్దిగా ఇవతలకు తీసుకుని అందులో నిమ్మరసం కలిపి పట్టిస్తే మడమ చర్మం మెత్తబడి, తడిబారుతుంది. పగుళ్లు రాకుండా ఉంటాయి. తీవ్రమైన పగుళ్లు ఉంటే మాత్రం నిమ్మరసం రాయకండి. మంట పుడుతుంది.
తేనె మంచిది దొరికితే దాన్ని కూడా మడమల మీద పట్టించవచ్చు. పాదాలు పట్టేంత చిన్న బేసిన్ తీసుకుని అందులో పాదాలు మునిగేంత వరకూ గోరువెచ్చని నీళ్లు పోసి, అందులో కొద్దిగా తేనె బాగా కలిపి పాదాలను ఆ నీళ్లలో కనీసం 20 నిమిషాల సేపు ఉంచండి. పాదాలు శుభ్రపడతాయి.
చర్మ వ్యాధుల్లో ఇ-విటమిన్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. మడమ పగుళ్లను కూడా తగ్గించటానికి ఇవి అవసరం కావచ్చు. వైద్యుడి సలహా మీద వాడుకోవచ్చు. సి-విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లను తినటం కూడా అవసరం.
ఓట్స్ అటుకులు మనకు దొరుకుతాయి. మషాలాలు కలవని ఓట్స్ అటుకుల్ని అన్నంలాగా ఉడికిస్తే దాన్ని ఓట్ మీల్ అంటారు. ఉడికించిన ఓట్స్ గుజ్జులో కొద్దిగా వెన్న లేదా నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్ కలిపి మడమలకు బాగా పట్టించి గోరువెచ్చగా ఉండగా మృదువుగా మర్దిస్తే బెరళ్లు మెత్తబడతాయి.
సంపెంగ పువ్వుల్ని మెత్తగా గుజ్జులా చేసి అందులో వెన్న గానీ, నెయ్యి గానీ కలిపి అరికాళ్లకు బాగా పట్టించి మర్దన చేస్తుంటే అరికాళ్లు భద్రంగా ఉంటాయి. పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
మర్రిచెట్టు పాలు చాలా తేలికగా దొరుకుతాయి. ఆకు తుంచినా పాలొస్తాయి. ఈ పాలను పాదాలకు పట్టిస్తే అరికాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
కొందరికి అరిచేతుల్లో కూడా పగుళ్లొస్తాయి. ఎక్కడ చర్మం ఎండి పగులుబారినా పైన చికిత్సలన్నీ ఉపయోగపడతాయి.
స్నానాల గదిలో ఒక ఇటిక రాయిని ఉంచుకుని, పాదాలను రోజూ ఆ రాత్రి మీద మృదువుగా రుద్దుతూ ఉంటే పాదాల పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి. మడమ శిలలు దొరుకుతాయి. కూర్చుని తేలిగ్గా మడమల మీద దానితో రుద్దితే కూడా మంచిదే! ఉప్పు వేసి, గోరువెచ్చని నీటిలో పాదాలను పావుగంట సేపు నాననిచ్చి, వాడేసిన టూత్ బ్రష్‌తో రుద్దితే చర్మం మీద మృతకణాలు, బెరళ్లు తొలగుతాయి. పాదాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.
పాదాలు కూడా మన శరీరంలో ఒక భాగమే అనుకునే వారి పాదాలు అందంగా, మృదువుగా ఎలాంటి పగుళ్లూ లేకుండా సున్నితంగా, నున్నగా ఉంటాయి. వాటిని అశ్రద్ధగా వదిలేస్తే అవి ఎండి పగుళ్లు బారిన మట్టి నేలలా ఉండి సున్నితత్వాన్ని కోల్పోతాయి. మట్టి చేరి పుళ్లు పడిన తరువాత పుండు మానడం కష్టం అవుతుంది. చిలికిచిలికి గాలివానలాగా మారి చివరికి పాదాన్ని తీసేసేవరకూ పరిస్థితి వెళ్లకుండా జాగ్రత్త పడటం మంచిది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com