మీకు మీరే డాక్టర్

గర్భవతుల ఆహార విధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: గర్భం దాల్చింది మొదలూ, బిడ్డ పాలు మానేదాకా ఏయే ఆహార పదార్థాలు తీసుకోవాలో వివరంగా చెప్తారా?
జ: అట్టడుగు ప్రజలే కాదు, మన సమాజంలో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి స్ర్తీలకు పోషకాహార లోపం ఎక్కువగా ఉంటోంది. చదువుకున్న వారు, స్థితిమంతులు కూడా అనాలోచిత వ్యామోహాలతో పోషక విలువలు ఏ మాత్రం లేని జంక్ ఫుడ్స్ మీద యావ వదులుకోలేక పోతున్నారు. హోటళ్లలో దొరికే పిజ్జాలు, రోటీ కర్రీలే కాదు, ఇంట్లో తినే మైసూర్ బజ్జీలు, పునుగులు కూడా ఝంక్ ఫుడ్స్ లాంటివే. గర్భం దాల్చిన సమయంలోనూ, బిడ్డకు పాలిచ్చే సమయంలోనూ ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినే స్థితిమంతుల క్కూడా పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది.
గర్భం దాల్చిన సమయంలో గర్భవతులకు అదనపు ఆహారం అవసరం అవుతుంది. అదనపు ఆహారం అంటే ఇద్దరు మనుషుల తిండి తినాలని అర్థం కాదు. తన కడుపులో బిడ్డ ఎదుగుదలకు కావలసిన పోషకాలు అందించేందుకు, అదనపు పోషక విలువలు కలిగిన ఆహారం అవసరం అవుతుంది. బిడ్డ పుట్టిన తరువాత తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డకు స్వచ్ఛమైన తల్లిపాలను సమృద్ధిగా అందించే ఆహారం కూడా అవసరం అవుతుంది.
గర్భవతుల ఆహారం అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. రోజువారీగా తీసుకునే ఆహారంలోనే కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, పాలు చక్కగా తీసుకోవాలి. అన్నింటికీ మందులే శరణ్యం అనుకోవద్దు. అందువలన కడుపు మెడికల్ షాపు అవుతుంది.
ఆహారాన్ని తేలికగా అరిగే పద్ధతిలో వండుకుంటే కడుపులో గ్యాసు ఏర్పడకుండా ఉంటుంది. అన్నం తక్కువగానూ, కూర - పప్పు ఎక్కువగానూ ఉంటే అరుగుదల తేలికగా ఉంటుంది. మంచి నెయ్యి వాడటం కూడా మంచిదే! మాంసాహారం తేలికగా తీసుకోవాలి. గుడ్డు మంచిది. జీర్ణశక్తిని బట్టి మాంసాహార పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. అతిగా మసాలాలు, కారాలు, అమిత పులుపు తిన్నప్పుడూ కడుపులో పెరిగే బిడ్డ ఎక్కువ కదిలి ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పెడతాడు కూడా!
ఆహార పదార్థాల ద్వారా సహజంగా వచ్చే పోషకాలు వొంటబట్టినట్టు ఔషధ రూపంలో తీసుకునే విటమిన్లు వగైరా వొంటబట్టవని గుర్తించాలి. పొట్టు తీయాల్సిన అవసరం లేని గోధుమ, జొన్న, రాగి, సజ్జ వీటితో తరచూ చేతనైన వంటకాలు చేసుకు తినటం వలన ఎక్కువ విటమిన్లు, పీచు పదార్థాలు, ఖనిజాలు శరీరానికి అందుతాయి.
పాలు, పాల పదార్థాలు, పెరుగు, మజ్జిగ వీటిని ఎక్కువగా తీసుకోవటం వలన కాల్షియం తగినంతగా అందటమే కాకుండా పొట్టలో మృదుత్వం ఏర్పడుతుంది. ఉపయోగపడే బాక్టీరియా పేగులకు తగినంత అందుతుంది. గ్యాసు, ఎసిడిటీ తగ్గుతాయి. భోజనంలో మజ్జిగ లేదా పెరుగు తగినంత తీసుకున్నప్పుడు మొత్తం ఆహారంలోని పోషకాల సమత్వం కలుగుతుంది. మజ్జిగ మీద తేరిన నీటిని తాగటం కూడా మంచిదే! గర్భవతులు ఉప్పు తగినంత తీసుకోవాలనే వైద్యశాస్త్రం చెప్తోంది.
బిడ్డ తక్కువ బరువుతో అరకొర ఎదుగుదలతో పుట్టాడంటే, తల్లి ఆహార లోపం కూడా ఒక కారణం కావచ్చుననేది ముఖ్య కారణం. తల్లి 10 కిలోల బరువు పెరిగితే బిడ్డ 3 కిలోల బరువు వరకూ పెరిగే అవకాశం ఉంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో గర్భవతి బరువు పెరగడం అనేది ఆరోగ్యదాయకంగా జరగాలి. మొదటి మూడు నెలల్లో ఒక అరగ్రాము ప్రొటీను, నాలుగో నెల నుండి ఆరో నెల వరకూ 7 గ్రాముల ప్రొటీను ఆరో నెల నుండీ ప్రసవించేవరకూ 23 గ్రాముల ప్రొటీను అవసరం అవుతాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సూచన.
ఇనుము, కాల్షియం, ఎ విటమిన్, ఇతర ఖనిజ లోహాలు కూడా తగు పాళ్లలో అందే విధంగా గర్భవతులకు ఆహారం ఇవ్వాలి. తగినంత అయోడిన్ కూడా గర్భవతులకు అందాలి. ఇందువలన పుట్టుకతోనే వచ్చే వ్యాధులు, తక్కువ బరువుతో పుట్టటం, అవయవ లోపాలు ఇలాంటి సమస్యల్ని నివారించవచ్చని గర్భవతులు అర్థం చేసుకోవాలి.
కాఫీ, టీలు గర్భవతులకు హాని చేసేవే! ఆంధ్ర ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో అడ్డపొగ తాగే అలవాటు ఉన్న స్ర్తిలున్నారు. గర్భం దాల్చినప్పుడు ఆ అలవాటు మానుకోవటం మంచిది. గుట్కాలు, పాన్ మసాలాలు కూడా కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాంతుల వలన గ్యాస్ పెరగటం వలన, వండుకునే ఓపిక లేక పోవటంవలన, ఏదీ తినబుద్ధి కాకపోవటం వలన ప్రధానంగా పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించాలి.
తరచూ బీపీ చూపించుకోవటం, బిడ్డ ఎదుగుదల బాగా ఉన్నదని నిర్ధారించుకోవటం, బరువు చూసుకోవటం ధనుర్వాతం ఇంజెక్షన్ వగైరా తీసుకోవటం ఇలా వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది. శరీరానికి కొంతలో కొంత వ్యాయామం ఇవ్వటం కూడా అవసరం. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకో దలచుకున్నారో ఆ వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com