మీ వ్యూస్

అదే క్షణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాది చిన్న సినిమాలకు బాగానే కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. చిన్న బడ్జెట్‌తో గత రెండు నెలల కాలంలో వచ్చిన మెజారిటీ సినిమాలు థియేటర్ల వద్ద బాగానే హడావుడి చేశాయి. పట్టున్న కథ, కథనాలతో మంచి మార్కులే సంపాదించుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో -మొన్న వచ్చిన అడవి శేష్ ‘క్షణం’ సినిమాని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. థియేటర్‌లో ఊపిరి బిగబెట్టి కూర్చోబెట్టేంత బిగుతైన కథనాన్ని సాగిస్తూ, కథలో అనూహ్య ట్విస్టులు పెట్టడం ఆసక్తికరం అనిపించింది. చాలాకాలం తరువాత స్క్రీన్‌పైకి వచ్చిన అడవి శేష్ కెరీర్‌కు క్షణం కొత్త ఊపునిస్తుందని అనడం ఎలాంటి సందేహం లేదు. టీవీ యాంకర్ అనసూయ వైవిధ్యమైన పాత్రలో మంచి మార్కులు సంపాదించింది.
-చీమల సురేంద్ర, బొబ్బిలి

పోస్టర్ల సెన్సార్
అతి సర్వత్రే వర్జయేత్ అన్న సామెతను నిజం చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియాపై సెన్సారింగ్ విధానం లోపభూయిష్టంగా ఉన్నందున సినిమాల్లో, టీవీ ఛానల్స్‌లో అసభ్యత విశృంఖలమవుతోంది. గతంలో అశ్లీల పుస్తకాలకు మాత్రమే పరిమితమైన అసభ్య వేషధారణ, అంగాంగ ప్రదర్శనం, స్ర్తిపురుషుల విలాస కామకేళీలు ఇప్పుడు సినిమాల్లో దిగంబరంగా దర్శనమిస్తున్నాయి. హీరో హీరోయిన్లు, దర్శకులు ఎటువంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా అశ్లీలతను చొప్పించడంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ఈ అసభ్యకర సన్నివేశాలు బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లపైనా దర్శనమిస్తున్నాయి. బజార్లో వెళ్లాలంటే సిగ్గుతో చితికిపోతున్నాం. ఒకప్పుడు మలయాళ సినిమాలు డబ్బింగ్ చేసి, మధ్యాహ్నం ఆటలు ప్రదర్శించేవారు. ఇప్పుడు వాటి అవసరం లేకుండా తెలుగు సినిమాలే ఉన్నాయి. వీటిని అదుపుచేయాల్సిన బాధ్యత సెన్సార్ వారికి ఉంది.
-ఎం కనకదుర్గ, తెనాలి

తీరు మారాలి
రామ్‌గోపాల్‌వర్మ సినిమాలను నిర్మించే సమయంలో చేసే హంగామా చూసి ఒక్కోసారి నవ్వొస్తోంది. అతని అమాయకత్వం చూసి బాధ కలుగుతోంది. విజయవాడ నేపథ్యంలో ఆయన తీస్తున్న సినిమాను రాయలసీమ సినిమాలా చేశాడు. అక్కడి పరిస్థితులు సరిగా అర్థం చేసుకోకుండా రంగాపై సినిమా తీస్తానంటున్నాడు. ఆంధ్రలోని కోస్తా, కృష్ణా ఇతర ప్రాంతాల్లో సినిమా ప్రభావం బాగావుందని అతని ఆలోచనై ఉంటుంది. వంగవీటి కుటుంబ సభ్యులు ఛీ.. పో అన్నా కానీ ఇంకా అదే చూరుపట్టుకొని వేలాడుతున్నాడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో జనంలో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా పబ్లిసిటీ కోసం నానా పాట్లు పడుతున్నాడు. వర్మ నోటికి తాళం వేయకుంటే మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఫాక్షన్ తరహా చిత్రాలు తీయడం వేరు, ఇలాంటి చిత్రాలు తీయడం వేరు.
-ఎ రఘురామారావు, ఖమ్మం

నమ్మొచ్చా!
వంగవీటి చిత్రం తర్వాత వర్మ తెలుగు సినిమాని తీయడట. అబ్బా! తెలుగు ప్రజలంటే అతనికెంత దయో! ఈ దయ ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. బాలీవుడ్ బాటపట్టి అక్కడ కొంతకాలం వెలిగి, ఆరిపోయాక మళ్లీ టాలీవుడ్ వచ్చి చకచకా అరడజను చెత్త చిత్రాలు తీసినా అతడిని ఘనస్వాగతం లభించలేదు. తానెంతో ఘనుడనని, ఓ రకంగా దేవుడినని అతని నమ్మకం. అతనిని తగువిధంగా గౌరవించకపోతే కోపం రాదా!? వచ్చింది! మళ్లీ బాలీవుడ్ వెళ్లిపోతున్నాడు. చెరువుమీద అలిగితే చెడేది ఎవరు? వర్మ ప్రతిభావంతుడే కానీ ఆ ప్రతిభ సరైన మార్గంలో ఉపయోగించలేకపోతున్నాడు. అదే అతని సమస్య. వర్మే వర్మకి విలన్.
-పి శాండిల్య, కాకినాడ

అంతేకదా మరి!
హీరో చెబితే సరే వ్యాసం ఆలోచింపచేసింది. ముఖ్యంగా హీరో స్టయిల్, బాడీలాంగ్వేజ్‌ని అనుకరించేవాళ్లు ఎందరో ఉన్నారు. మందుగ్లాసుతో విషాదగీతం పాడే దేవదాసును అనుకరించేవాళ్లు, ఆనాటి కుర్రకారు ఎందరో కనిపించేవారు. ఇద్దరు మిత్రులు చిత్రంలో హీరో షర్ట్ ఒక క్రేజ్. ఒక నాగేశ్వరరావుకు మరో నాగేశ్వరరావు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఓ వింత. ఆనాటి ఫొటో స్టూడియోల్లో అలాంటి ట్రిక్ ఫొటోలు తీసేవారు. కుర్రాళ్లూ తీయించుకునేవారు. హీరోలు ట్రాఫిక్‌రూల్స్ పాటించడం, మందు కొట్టవద్దని చెప్పడం, ర్యాగింగ్ చేయవద్దని నచ్చచెప్పడం వంటి దృశ్యాలు సినిమాల్లో చూపిస్తే అభిమానులు తప్పక పాటిస్తారు. హీరో చెప్తే ఓకె! అంతేకదా మరి!
-బి చంద్రిక, రాజేంద్రనగరం

మార్పు బాగుంది
వెనె్నల శుక్రవారం కాకుండా మంగళవారం వస్తున్నందుకు సంతోషంగా వుంది. సముచితంగానూ ఉంది. ప్రస్తుతం వారం మాత్రమే ఆడే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మంగళవారం వెనె్నల రావడంవలన వారంలోపే విడుదలైన సినిమాల గురించి సమీక్షల ద్వారా తెలుసుకునే వీలు కలిగింది. బహుశా మీరుకూడా ఈ కారణంవల్లే మంగళవారానికి మార్చి ఉంటారనుకుంటున్నా. ధన్యవాదాలు.
-ఊర వెంకట పూర్ణచంద్రరావు, మంగళగిరి

అందని పండు
ఆస్కార్ అవార్డులు ఆంగ్ల చిత్రాలకే పరిమితం. ఇతర భాషా చిత్రాలు పోటీపడేది ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో మాత్రమే. అందువల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. అతి ముఖ్యమైన సామాజిక సమస్యలను హైలెట్ చేసిన చిత్రాలకే అవార్డు లభిస్తుంది. సువర్ణసుందరి మనకి ముద్దు. ఆస్కార్‌కు అర్హత లేదు. ఎందుకంటే అది ఆంగ్ల చిత్రం కాదు. ఒకవేళ ఆంగ్లంలో తీసినా అర్హత ఉండదు. అది ఊహాజనిక జానపద చిత్రం. అది హైలెట్‌చేసే సామాజిక అంశాలేవీ లేవు. గాంధీ, స్లమ్‌డాగ్ లాంటి ఆంగ్ల చిత్రాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన భారతీయులు భాను అతయా, ఎఆర్ రెహమాన్, రోహిణీ హట్టంగడి, రసూల్‌పుకుట్టి లాంటి వాళ్లకే ఆ అవార్డులు లభించాయి. ఇతర భాషల్లో వారు ఆ ప్రతిభ చూపినా ఆ అవార్డులు వచ్చేవి కావు.
-ఎ స్నేహమాధురి, పెద్దాపురం