మీ వ్యూస్

అలా వెళ్లిపోయాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామి రారా లాంటి కమర్షియల్ విజయాన్ని అందించిన సుధీర్ వర్మతో యువహీరో నిఖిల్ చేసిన రెండో ప్రయోగం బెడిసికొట్టింది. పగ ప్రతీకారం కానె్సప్ట్‌తో తెరకెక్కిన కేశవలో నిఖిల్ కొత్తదనాన్ని చూపించలేకపోయాడు. పోలీసులను వరుసగా చంపుకుంటూ పోతుంటే, డిపార్ట్‌మెంట్ చేతులు కట్టుకుని కూర్చున్నట్టు చూపించటం సహజంగా అనిపించదు. ఎంత హీరో అయనా, అతనికి అన్యాయం జరిగినపుడు సహజ సిద్ధమైన ప్రవర్తనతోనే ఉండాలేగానీ, అతనేం చేసినా చెల్లిపోతుందిలే అనే ధోరణిని చూపించటం ఆకట్టుకోలేదు. ఇక హీరోయిన్ పాత్ర ఎందుకో అర్థంకాదు. పెళ్లిచూపులు చిత్రంతో ఆమెకొక ఇమేజ్ వచ్చింది కనుక సినిమాకు వర్కవుట్ అవుతుందని పెట్టుకున్న భావనే కలిగింది. ఎదురు దెబ్బల కథలతో నిఖిల్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయందనిపిస్తుంది.
-రాజారాం, కమలాపురం
అంత దారుణమా?
సీనియర్ నటుడు చలపతి రావు చేసిన వ్యాఖ్యలకు సినిమా ప్రపంచమే కాదు, సభ్యసమాజం తలదించుకోవాలి. సినిమా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే అయినా మహిళల పట్ల ఆయన వైఖరి ఏమిటన్నది ఆ మాటల్లోనే తేటతెల్లమైంది. స్టార్ హీరోయిన్ల దగ్గర్నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు, రోజువారీ ఎక్స్‌ట్రాలు అంతా.. పరిశ్రమలో పని చేసేది బతుకుదెరువు కోసమే. ఆ ఇంగితం లేకుండా, పదిమందికి చెప్పాల్సిన వయసులో బాధ్యతారహితంగా మాట్లాడటం ఎంతవరకు సబబు? పోనీలే సీనియర్ నటుడు, తప్పొప్పుకున్నాడంటూ క్షమిస్తే, రేపు మరొకరు ఇంతకంటే దారుణంగా మాట్లాడే ప్రమాదం ఉంటుంది. కక్కాల్సిన పైత్యాన్ని కక్కేసి, క్షమించేయండని వాళ్లూ అనేస్తే సరిపోతుందా? సరిపెట్టేసుకుంటారా? హీరోలు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పబ్లిక్ వేదికలమీద పైత్యపు ప్రేలాపనలు పేలుతున్నా? ఎవ్వరూ నోరుమెదపరేం? ఎందుకు వౌనం వహిస్తున్నారు? వాళ్లూ చలపతి రావు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? అదే వికారాన్ని మనసులో మోస్తున్నారా? వేదికలమీద కబుర్లలో ప్రదర్శించే విజ్ఞత, ఇలాంటి సమయాల్లో ఎందుకు మర్చిపోతున్నారు?
-పివి లలితాంబ, కాకినాడ
చస్తున్నాంరా బాబూ!
సినిమా మొదలు పెట్టిన దగ్గర్నుంచీ విడుదలకు ముందు రోజు వరకూ అందరూ చెప్పే ‘వైవిధ్యం’ తెరమీద కనిపించక ప్రేక్షకుడు అల్లాడిపోతున్నాడు. ఈసారి విభిన్నమైన కధను చేస్తున్నానంటూ హీరోలు, వైవిధ్యమైన కథనంతో వస్తున్నామని దర్శకులు, కథేంటో పూర్తిగా తెలీకున్నా, ముద్దు ముద్దు కబుర్లు చెబుతూ హీరోయన్లు ఆడియన్స్‌ని చీట్ చేస్తున్నారు. చెప్పినవన్నీ వినేసో, చదివేసో, అంతర్జాలంలోనో, బుల్లితెరమీదో టీజర్లు చూసేసో.. ‘ఔను నిజమే’ అనుకుంటూ థియేటర్‌కు పరిగెడుతున్న ప్రతిసారీ మాడు పగులుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు వైవిధ్యమోనని లెక్కలుతీస్తే, సింగిల్ డిజిట్‌ను కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. లేనిపోని కబుర్లు చెప్పి ఎంతకాలం మనగలుగుతారు. ఎందుకు పరిశ్రమ పరువు తీస్తున్నారు. సినిమావాళ్లే ఆత్మపరిశీలన చేసుకోవాలి.
-జి మల్లేశం, పెదకాకాని
అదే బాధ
ఆ తరంలో ఆణిముత్యాలుగా చెప్పుకోడానికి పాతాళభైరవి, మాయాబజార్, లవ కుశ, నర్తనశాల లాంటి చిత్రాలెన్నో. ఎలాంటి గ్రాఫిక్స్ పోకడలు లేకుండానే దర్శకులు అద్భుతాలు సృష్టించారు. సినీ కళామతల్లిపై అభిమానం, మమకారంతో ఇప్పుడొచ్చే సినిమాలను విమర్శించలేకున్నా.. ఆ నాటి చిత్రాలకు సరితూగే సినిమా ఒక్కటీ రావడం లేదన్నది నిజం. ఇక నటీనటులను చూస్తే.. భాష రాదు. ఉచ్చారణలో స్పషతుండదు. చేస్తున్న పాత్రకు ఆహార్యం సరిపోదు. పాత్రలో నిండుదనం అస్సలు కనిపించదు. ఇవన్నీ ప్రస్తావిస్తే -తెలుగువాడై ఉండి తెలుగు సినిమాను విమర్శిస్తున్నాడన్న వాదన. ఎవరు తీసినా గొప్ప సినిమా రావాలనే ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ, బాగాలేని చిత్రాన్ని బాగాలేదంటే ఎందుకంత ఉలుకు.
-మంగం ఆనందరావు, వేగిపాలెం
భారీ ప్రశ్నలు
రెండు పెద్ద ప్రశ్నలను ప్రేక్షకుల మీదకు వదిలింది బాహుబలి. ఒకటి బాహుబలిని ఎవరు చంపారు? రెండోది బాహుబలి ఎన్ని కోట్లు ఆర్జించాడు? ఒకటి తెరమీద రెండు గంటల సినిమాగా చూశాం. రెండో ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా చూస్తూనే ఉన్నాం. వసూళ్లను అంతకంతకూ పెంచేస్తుంటే -కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఇంత కలెక్ట్ చేసింది కనుక, ఆదాయ పన్ను శాఖకు ఎంత చెల్లించారన్న లెక్కలపైనా ఆసక్తి కలుగుతోంది. వసూళ్ల లెక్కల మాదిరి ఈ విషయాన్నీ ప్రకటిస్తే ఎంత బావుంటుంది. ఇక, వసూళ్లు బావున్నాయి కనుక థర్డ్ పార్ట్ తీద్దామన్న ఆలోచన వస్తుందేమోనన్న అనుమానమూ కలుగుతోంది. బాహుబలి మనుమడో, మనుమరాలో.. రెండు మూడు తరాల తరువాతివారితోనో కథ వస్తే -ఏం చేయాలి? చేయడానికేమీ ఉండదు. అప్పుడు మరో విధంగా బాహుబలిని కీర్తించుకుంటూ సినిమా చూడటమే. ఏమంటారు?
వల్లభ, కమలాపురం

అలనాటి సంగతి

అదీ మాతృ ప్రేమ
ఆర్ నాగేశ్వర రావు (రాజనాల నాగేశ్వర రావు) కొద్ది చిత్రాల్లో నటించినా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పాత్రలు చేశాడు. మంచి నటన ప్రదర్శిస్తున్న ఆర్ నాగేశ్వర రావును సీనియర్ నటి జి వరలక్ష్మి కొడుకులా భావించేది. ఇల్లరికం చిత్రం శతదినోత్సవ వేడుకకు ఆర్ నాగేశ్వర రావు అనారోగ్యంతో హాజరయ్యాడు. అతన్ని చూసి వరలక్ష్మి తల్లడిల్లిపోయింది. శెభాష్ రాముడు చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న ఆర్ నాగేశ్వర రావు మరింత అనారోగ్యానికి గురయ్యాడు. తరువాత పరోపకారం చిత్రంలో అద్భుతమైన పాత్రను చేసిన ఆర్ నాగేశ్వరరావు వెంటనే కన్నుమూశాడు. కళ్లముందే క్రమంగా అనారోగ్యం బారినపడి కన్నుమూసిన ఆర్ నాగేశ్వర రావు అంతిమయాత్రలో అవే విషయాలను గుర్తు చేసుకుంటూ జి వరలక్ష్మి సొమ్మసిల్లిపోయింది. అందుకే -కంటేనే అమ్మ అని అంటే ఎలా? అంటాడో సినిమా కవి.