మీ వ్యూస్

వర్మకు అటూ ఇటూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన కెరియర్‌లో అత్యుత్తమ చిత్రంగా ‘వంగవీటి’ని చెప్పుకున్నాడు వర్మ. చిత్రం ఆదినుంచీ వివాదాస్పదమే. ‘దర్వకత్వం ఓ సృజనాత్మక కళ. ఫలానాదాన్ని కట్ చేయండి’ అనే అధికారం సెన్సార్‌కి కూడా లేదంటూ ట్వీట్లతో ఆసక్తిని రేకెత్తించాడు. వంగవీటి కుటుంబీకులు కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం చెప్పినపుడూ -వర్మ ఆ విధంగానే స్పందించాడు. వాళ్లు కోర్టుకెళ్లారు. ఈలోగా రెండు వర్గాల వాళ్లకు సినిమా చూపించినపుడు కులాలమధ్య చిచ్చురేపే పాటను తొలగించమని సూచించారు. అయినా డోన్ట్ కేర్ అన్నాడు. పాటను తొలగించాలంటూ కోర్టు ఆదేశాలివ్వటంతో దారికొచ్చాడు. మరి సృజనాత్మకత గురించి కోర్టు విషయంలో రాము ఎందుకు వౌనం వహించాడో ఆయనకే తెలియాలి.
-శాండోప్రచండ్, శ్రీనగర్

అంత ఎత్తేయాలా?
రామ్‌చరణ్ సినిమా ధృవను అభిమానులు అంతలా ఎత్తేయడం చూస్తుంటే నవ్వొచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలో కామెడీయే లేదు. పోనీ సీరియస్ సబ్జెక్టు అని సరిపెట్టుకుంటే -అరవింద్‌స్వామి విలనిజాన్ని అంతగా చూపించి సింపుల్‌గా చంపేశారు. హీరో రామ్‌చరణ్ టిక్కుటిక్కు మంటూ బాల్ పెన్నును చేతివేళ్ల మధ్య తిప్పడంచూసి యాక్షన్ సినిమాలో ఏదో ఎపిసోడ్ స్టార్టవుతుందని అనుకుంటాం. తీరాచూస్తే మేనరిజంలా మిగిలిపోతుంది. పాటలు, సంగీతం గందరగోళం. డైలాగులు వస్తున్నపుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డామినేషన్. నిజాయితీగా విశే్లషించుకుంటే -సినిమాలో ఏముందోనని బుర్రలు పట్టుకోవాలి. గుర్తుంచుకునే సన్నివేశం ఒక్కటీ లేదన్నది నిజం.
-ఎన్ కోటగిరి, అల్లవరం

ఎందుకీ పటాటోపం?
పెద్ద హీరో సినిమాకు కొబ్బరికాయ కొట్టడం నుంచి గుమ్మడికాయ దించడం వరకూ సాగుతోన్న పటాటోపం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. శోధించి, చేధించి కథ వెతుక్కున్నామంటారు. షూటింగ్ మొదలైన దగ్గర్నుంచీ మీడియాలో ప్రచారం మొదలైపోతుంది. మేకోవర్ ఫొటోలు, ఫస్ట్‌లుక్ టీట్లు, టీజర్ ప్రెస్‌మీట్లు, ట్రైలర్ రిలీజ్‌లు, భారీగా ఆడియో ఫంక్షన్లు, అరవీర భయంకరమైన సినిమాటిక్ హైప్‌లు.. విడుదలకు ముందు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు.. ఇవన్నీ సినిమాకు సంబంధించినవే. ఇదంతా సినిమాలో భాగమే! కానీ, ఇవన్నీ ప్రేక్షకుడికి ఎందుకు? సినిమా బావుందా? లేదా? అన్నదే ప్రేక్షకుడికి కావాలి. అసలు విషయాన్ని గాలికొదిలేసి.. ఆడియన్స్‌ని ఎందుకు ఇలా ఊరించటం. బిజినెస్ ట్రిక్కుల పటాటోపాలు ఎవరి కోసం?
-పివిఎస్ ప్రసాద్, అద్దంకి

అన్నీ రీ‘మేకు’లేనా?
తెలుగు పరిశ్రమ ఎటు పయనిస్తోందన్న అనుమానాలు ముసురుతున్నాయి. సక్సెస్ క్రియేట్ చేయాల్సిన సోకాల్డ్ హీరోలు, దర్శకులు.. ఎవరో సృష్టించిన సక్సెస్‌ను ఎరువు తెచ్చుకోవడం సబబేనా? ఎక్కడో హిట్టయిన కథలు తెచ్చుకుని సినిమాలు చేసే పరిస్థితికి వచ్చేయడమే మన స్టామినానా? చిన్నా పెద్దా తేడాలేకుండా హీరోలంతా రీ‘మేకు’ల వెంట పరుగులు తీయడం చూస్తుంటే, కొత్త చరిత్ర సృష్టిస్తున్నారా? లేక ‘స్వర్ణా’క్షరాలతో గత తరం లిఖించిన తెలుగు పరిశ్రమ చరిత్రను చెరిపేస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పదిమందికీ తెలియాల్సిన గొప్ప కథలనుకున్నపుడు ఎరువుతెచ్చుకున్నా తప్పులేదు. కానీ, కమర్షియల్ కథలనూ ఏరి తెచ్చుకుని తెలుగు చిత్ర పరిశ్రమ పరువుతీయడం సమంజసమేనా? ఆలోచించండి.
ఎం యూసఫ్, కాజీపేట

అభిమాని పిలిచె!
గతవారం వెనె్నల శరత్కాలంలో ‘అభిమాని పిలెచె’ బావుంది. అభిమానులకు అక్కినేని, రామకృష్ణలు పంపిన సంతకాల చిత్రాలు ముచ్చటగా తోచాయి. రెండున్నర దశాబ్దాల కిందటి మాట. అక్కినేనిపై ఓ మ్యాగజైన్‌లో అచ్చయిన కథనాన్ని పంపుతూ, ఆ లేఖకు నా ఫొటో జత చేశాను. ఫొటో వెనుక.. ‘అభినందనలతో అక్కినేని’ అని సంతకం చేసి తిరిగి పంపించారు. శరత్కాలం చదివినపుడు ఆ సంఘటన గుర్తుకొచ్చి ఆనందం వేసింది.
ఎన్‌ఆర్‌ఎల్, సికింద్రాబాద్

దటీజ్ అమీర్
తారేజమీన్‌పర్, గజని, త్రీ ఇడియట్స్, ధూమ్-3, మంగళ్‌పాండే, పీకే.. ఇప్పుడు దంగల్. ఈ సినిమాలు గుర్తుకొచ్చినపుడు అమీర్‌కు అమీరే సాటి అనిపిస్తుంది. కథను ఎంచుకోవడం నుంచి ఆ పాత్రను మలుచుకోవడంగాని లేదా పాత్రకు తగినట్టు తాను మారిపోవడం చూస్తే అమీర్‌ను ముద్దుగా అమీబా అనాలేమో. ఐదు పదులు దాటిన వయసులోనూ కళాత్మక సినిమా కోసం అతను పడుతున్న కష్టం యువతరానికి ఆదర్శప్రాయమే. మహోన్నత వ్యక్తి మహావీర్‌సింగ్ ఫొగట్ జీవితాన్ని యువతరానికి అందించే ఆలోచన, ఫొగట్ కుమార్తెలు సాధించిన ఆదర్శనీయ విజయాన్ని పదిమందికీ దృశ్యరూపంలో చూపించాలనే తపన ఆసాంతం సినిమాలో కనిపించింది. నూటికో కోటికో ఇలాంటి సినిమాలు వచ్చినా -జీవితాంతం మనల్ని వెంటాడయానడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
-పి శ్రీకాంత్, మామిడికుదురు

అలనాటి సంగతి

ఆమే పాడాలి!
పద్మశ్రీ ప్రొడక్షన్స్‌వారి ‘సిరిసంపదలు’ (1960) చిత్రంలో ఓ అద్భుతమైన, భావగర్భితమైన పాటొకటి ఉంది. అది ‘ఈ పగలు రేయిగా’ అన్న గీతం. చిత్ర నిర్మాణంలో భాగంగా ఈ పాటను ఘంటసాల, జానకి ఆలపించారు. అయితే చిత్ర హీరోయిన్ సావిత్రి -సుశీల గొంతులో పాట పాడిస్తే బావుంటుందని దర్శకుడు పి పుల్లయ్యను కోరారు. అందుకు పుల్లయ్య ‘ఒకరిచేత ఒకసారి పాడించిన పాట తొలగిస్తే, ఆ కళాకారిణిని అవమానించినట్టే కదా’ అని అన్నారట. అప్పటికి టాప్ హీరోయిన్‌గా ఉన్నా సావిత్రి ఎదురు చెప్పలేదు, మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించలేదట. అదీ అప్పటివాళ్ల సంస్కారం. అదీ సినిమా నిర్మాణంపై దర్శకులకు ఉండే పట్టు.
కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు