మీ వ్యూస్

నిజంగానే పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతి కెరీర్‌లో ఓ మైల్‌స్టోనీ మూవీ -ప్రతిరోజూ పండగే. రఘురామయ్యగా సత్యరాజ్ తన అనుభవంతో కూడిన నటన ప్రదర్శించి సినిమాకు వెన్నుముకగా నిలిచారు. బిజీ జీవితాల్లో కొట్టుకుపోతూ -జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తున్నామో భావోద్వేగాలతో చూపిస్తూనే, గుండె బరువెక్కకుండా హాస్యాన్ని మిళితం చేసి వినోదం చేయడం చిన్న విషయమేమీ కాదనిపిస్తుంది. కథ కొంతవరకూ రెండేళ్ల క్రితం వచ్చిన ‘శతమానం భవతి’లాగేవున్నా, ఇందులో చావుకు దగ్గరలోవున్న తాత చుట్టూ కథ తిప్పుతూ, కొడుకులు, కూతుళ్లు, మనవల వ్యక్తిత్వాలను ఎలివేట్ చేయడం బావుంది. సీరియస్‌గా కథ చెబితే ఇప్పటి కాలంలో వర్కౌట్ కాదు కనుక, దర్శకుడు తెలివిగా హాస్యాన్ని మిళితం చేసి విజయం సాధించాడు. నిజంగానే తెలుగులో వచ్చిన ఓ మంచి కుటుంబ కథా చిత్రం -ప్రతిరోజూ పండగే.
-జి అశోక్, గోదూర్
మంచి మాట
సాధారణంగా ఏ విషయానికీ స్పందించని నయనతార ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ని ‘మానవత్వంతో కూడిన సరైన చర్య. న్యాయమన్నది వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలి’ అంటూ తెలంగాణ పోలీసులకు సలాం చేసింది. ఆమె వ్యాఖ్యలు విన్నపుడు ఆమె నటించిన వాసుకి చిత్రం గుర్తుకొచ్చింది. ఆ చిత్రంలో ముగ్గురు రోగ్స్ ఆమెపై అత్యాచారానికి పాల్పడతారు. బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న ఆమెకు ఒక మహిళా ఇన్స్‌పెక్టర్ కర్తవ్యం బోధిస్తుంది. చట్టానికి చిక్కకుండా రేపిస్టులను ఎలా చంపాలో ఆమె భర్త క్రిమినల్ లాయర్ సూచనలు ఇస్తాడు. ఆమె వేడిగా న్యాయాన్ని అందిస్తుంది. రేపిస్టులు సత్వరం శిక్షించబడాలన్న న్యాయం బోధిస్తుందా చిత్రం.
-శాంతిసమీర, వాకలపూడి
చెబితే బావుండేది
ఫ్లాష్‌బ్యాక్‌లో రచయిత్రి ‘చంద్రహారం’ గురించి చక్కగా విశే్లషించారు. మరికొన్ని విషయాలు -కమలాకర కామేశ్వరరావు ఫిల్మ్ జర్నలిస్టుగా సినిమాలపై చక్కని విమర్శలు రాస్తుండేవారు. విమర్శకుడికే దర్శకత్వం అప్పగిస్తే విమర్శకు ఆస్కారంలేని మంచి చిత్రం వస్తుందని భావించారు అప్పటి నిర్మాతలు. కాని, మంచి విమర్శకుడు మంచి దర్శకుడు కానక్కరలేదని నిరూపణైంది. ఎన్టీఆర్, సావిత్రిల ఇమేజ్ పెరుగుతూ ఉండటం, శ్రీరంజని ఎప్పుడూ ఏడుపుగొట్టు పాత్రలే ధరిస్తూ ఇమేజ్ కోల్పోవడం, ప్రేక్షకులు టైప్ కాస్టింగ్‌కి అలవాటుపడటంతో ఎన్టీఆర్ సాధారణ యువరాజుగా, సావిత్రి విలన్‌గా కనిపించడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతారని గ్రహించలేకపోవటం కమలాకరుని లోపమే.
-చంద్రిక, రాజేంద్రనగర్
విలక్షణ నటుడు
తాను వచ్చిన పనైపోయిందని గొల్లపూడి మారుతీరావు పూర్ణాయుర్దాయం పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన గురించి వెంటనే వ్యాసపరంపరలు వార్తాపత్రికలు తమ పరం చేసుకున్నాయి. ఆయన చొరబడని కళ ఏదీలేదు. నాటిక, నాటక, సినీరంగ రచనలు, రేడియో ప్రసంగాలు ఇలా ఎన్నో. ముఖ్యంగా సినిమాలలో కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ముద్రపడిన ఆయనను సినిమాలు అంతగా చూడని ఒకాయన ‘మీరేం చేస్తూంటారు మారుతీరావు’ అని అడిగారట. సినిమాలలో వేషాలేస్తుంటాను అన్నారట గొల్లపూడి. ‘ఏం వేషాలూ’ అని సాగదీశాడట ఆయన. ‘వెధవ్వేషాలు’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారట గొల్లపూడి. గొల్లపూడి రచనా చమత్కారాల్లో ఇదొకటి.
-ఎన్ రామలక్ష్మి,
సికిందరాబాద్
మంచి ప్రయత్నం
వెనె్నల ఆదివారం 22 డిసెంబర్ 2019 సంచికలో ‘అలా అన్న మాట’ శీర్షికన పుట్టిల్లు, నాచెల్లెలు, తేనెమనసులు, చదువుకున్న అమ్మాయిలు.. పాత చిత్రాలైన ప్రేక్షకాదరణా చిత్రాలను పాఠకులకు గుర్తు చేయడం బావుంది. రచయిత పూజారి నారాయణ అభినందనీయులు. జివిజి సంపాదక వర్గంలో వచ్చిన సినిమారంగం పత్రికలోను, గోటేటి రామారావు సంపాదక వర్గంలో వెలువడిన రూపవాణి పత్రిక ద్వారా పూజారి నారాయణ సినిమా పరిశ్రమకు పరిచయస్తులే. వెనె్నలకు పాత చిత్రాలు పేర్లు, ఏ ఏడాదిలో విడుదలైనవో తెలియజేస్తున్నందుకు అభినందనలు. ఈవారం అవంతికా మిశ్రా ఫొటోగ్రాఫ్ పనితనం బావుంది. కృష్ణవేణి జీవితచరిత్ర ఆమె నటించిన చిత్రాలు పొందిన అవార్డులు గురించి తెలుసుకొన్నాము. పాతతరాన్ని, వాళ్ల గొప్పతనాన్ని కళ్లముందుకు తెస్తున్న రచయిత సరయు శేఖర్ అభినందనీయులు
-పి సూర్యనారాయణ, రాజమండ్రి
భలే మారుతి
బూతులు తీస్తాడన్న అపవాదు చెరుపుకుని, నీతి చెప్పిన మారుతి కృషి -నిజంగానే పండగ. వెనె్నల్లో త్రీస్టార్స్ ఇచ్చి సరైన సమీక్ష అనిపించారు. సాయితేజ్ నటన పరిపూర్ణం అనిపించింది. ఏంజిల్ ఆర్మీగా ఆకట్టుకొని అధరాల అంచున సన్నని సొట్టతో రాశిఖన్నా మంచి హావభావాలు పలికించింది. సత్యరాజ్, రావురమేష్, మురళీశర్మ తమ అనుభవాన్ని రంగరించి సినిమాకు బలమయ్యారు. పాత్రలు ఎక్కువైనా బ్యాలెన్స్ తప్పకుండా, చివరిదాకా చిత్రాన్ని పట్టుగా లాక్కొచ్చి మంచి సందేశాన్ని ఇచ్చిన మారుతి అభినందనీయుడు. నాన్న సమాధులు, పాడె సన్నివేశాలను తొలగించి మరోలా రాసుకుని వుంటే -సినిమా మరింత ఉన్నతత్వాన్ని ఆపాదించుకునేదేమో. ముగిసిన ఏడాదిలో మెలకువ తెచ్చిన చిత్రం -ప్రతిరోజూ పండగే అనొచ్చు.
-పి లక్ష్మీసుజాత, అద్దంకి