మీ వ్యూస్

జనంతో చలగాటమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు ఎందుకు తీస్తారు.. మనం ఎందుకు చూస్తాం? ఏకకాలంలో వందలాది థియేటర్లలో విడుదల చేసేస్తే అందులో ఏముందీ అన్నది తెలుసుకోకుండా మొదటి మూడు రోజుల్లో చూసేస్తారన్న ధీమా ఇటు నిర్మాతలకు, అటు దర్శకులకు, నటులకూ ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. కానీ అన్ని వేళలా ఈ లాజిక్కు.. టెక్నిక్కు... పని చేయదు. కొన్నింటికి పబ్లిసిటీ కాసలు తెస్తుందేమో కానీ ఎంత పెద్ద హీరో అయినా జీరో కథతో రాణించలేడన్నది మన ‘బాబు బంగారా’న్ని చూస్తే తెలిసిపోతుంది. అసలు ఈ సినిమా ఎందుకు తీశారో.. అందులో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన వెంకటేష్ ఎందుకు నటించాడో అర్థం కాని విషయం. కథలేదు.. లేక పోయినా ఏదో ఉందని చెప్పేందుకు దర్శకుడు మారుతి తాపత్రయపడ్డాడు. గత వైభవం వర్తమానానికి పనికిరాదు. ఏ సినిమా తీసినా ఇమేజ్‌ను బట్టి ఆడేస్తాయనుకుంటే పొరపాటే? ఈ సినిమాలో సంగీతం ఏమిటో.. పాటలేమిటో.. నటించిన వెంకటేష్‌కు, దర్శకత్వం వహించిన మారుతికే తెలియాలి. పాత కథల్లోంచి కొత్తదనాన్ని ఎంచుకోవడం తప్పుకాదు. కానీ సందర్భం లేకుండా.. ఏది తోస్తే అది.. ఎలా పడితే అలా తీసేస్తే జనం చూసేస్తారనుకోవడం పొరపాటు.. అయ్యో.. అయ్యయ్యో..!
-రవి, సికింద్రాబాద్

ఆమెకు ఆమే సాటి
భంగిమకే భంగిమ నేర్పింది నృత్యతార జ్యోతిలక్ష్మి. చాలాకాలం పాటు తమిళ, తెలుగు చిత్రాల విజయానికి ఆమె నృత్యాలే కారణమనే స్థాయికి ఎదిగిన జ్యోతిలక్ష్మి, తన భంగిమలతోనే నిర్మాతలు, దర్శకులకు కాసులు కురిపించింది. ఈ తరానికి ఆమె ఎవరో తెలీకపోయినా, స్వర్ణయుగపు కాలం నుంచీ కలర్ యుగం కాలం వరకూ 300 చిత్రాలకు పైగా చేసిన జ్యోతిలక్ష్మి -మరణం ఆమె అభిమానలకు ఆవేదన మిగిల్చేదే. శృంగార నృత్యాలలో ఎంత చెలరేగిపోయినా -సాధారణ జీవితంలో ఎంతో సాత్వికంగా బతికి స్ర్తిగా నూరు మార్కులు సాధించుకున్న జ్యోతిలక్ష్మి ఆత్మ శాంతించాలని కోరుకుందాం.
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం

ఎన్ని పాటలో కదా!
దేశభక్తిని ప్రబోధించే పాటలు తెలుగులో వచ్చినన్ని మరే భాషలోనూ వచ్చి ఉండవేమో. ఏ పాటకు ఆ పాట -నరనరాన దేశభక్తిని ఉప్పొంగించేవే. నేను నా దేశంలో -నేనూ నా దేశం పవిత్ర భారతదేశం; సిపాయి చిన్నయ్యలో -నా జన్మభూమి ఎంతోఅందమైన దేశము; బడిపంతులు చిత్రంలో -్భరతమాతకు జేజేలు; గాంధీపుట్టిన దేశం చిత్రంలో -గాంధీ పుట్టిన దేశమా ఇది; కోడలుదిద్దిన కాపురంలో -నీ సంఘం నీ దేశం; దొంగరాముడులో భలే తాత మన బాపూజీ; మానవుడు దానవుడులో అణువు అణువున వెలసిన దేవా; అల్లూరి సీతారామరాజులో తెలుగువీర లేవరా; పాడి పంటలు చిత్రంలో మన జన్మభూమి బంగారుభూమి; ఖడ్గం చిత్రంలో దేశం మనదే; మహాత్ముడు చిత్రంలో బాపూజీ; మేజర్ చంద్రకాంత్ చిత్రంలో పుణ్యభూమి నా దేశం; తమ్ముడు చిత్రంలో మేడిన్ ఇండియా అంటే అర్ధం వివరిస్తా; బలిపీఠం చిత్రంలో కలిసిపాడుదాం తెలుగు పాట; సుబ్బు చిత్రంలో ఐ లవ్ మై ఇండియా.. వంటివి దేశభక్తిని ప్రబోధించేవే. ఇవి మచ్చుకు మాత్రమే.
-ఎఆర్‌ఆర్ రావు, ఖమ్మం

టర్నింగ్ పాయింట్
ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుచే మొదటి రెండు సినిమాలలో గొప్ప నగిషీతో చెక్కబడిన బుర్రిపాలెం కుర్రాడు, కొత్తతరహాలో జేమ్స్‌బాండ్‌గా తీర్చిదిద్దిన గూఢచారి-116 దర్శకుడు మల్లికార్జునరావు ఇచ్చిన సూపర్‌హిట్‌తో జీవితం తారా పధంలోకి తీసికెళ్ళిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు దాదాపు పోటీగా నిలబడి, నిలదొక్కుకుని చిత్రాలు సొంత బ్యానర్‌లోనూ నిర్మించి టాప్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. గూఢచారి చిత్రంలోని చక్కని పాటలు, ఇంకా చక్కని బాణీలు కూర్చిన చలపతిరావు, అంతకన్నా చక్కగా పాటలు పాడిన ఘంటసాల, సుశీలలు చిత్ర విజయానికి సంపూర్ణంగా సహకరించారు. తెలుగులో జేమ్స్‌బాండ్ టైపు సినిమాలకు హీరో కృష్ణ ఓ రోల్‌మోడల్.
-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్

అమరజ్యోతికి నివాళి
తెలుగు, తమిళ నటి, ప్రముఖ నాట్య తార, శృంగార నాయికి జ్యోతిలక్ష్మి పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి మరణించటం సినీ ప్రేక్షకులను, చిత్రసీమకు బాధాకరమైనా వ్యాధిగ్రస్తురాలైన ఆమెకు మరణం ఉపశమనమే! నాట్య తారగా ఆమె జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. నటిగా కూడా జ్యోతిలక్ష్మి మంచి పాత్రలు చేసి ప్రతిభవంతురాలినని అనేక చిత్రాల్లో నిరూపించుకుంది. ప్రేననగర్‌లోని ‘లే లే లే లేలేలే నా రాజా’ పాటలో శృంగార భంగిమతో ఆనాటి యువతరాన్ని ఉర్రూతలూగించింది. కథానాయికగా కొరడారాణి, జ్యోతిలక్ష్మి, పిల్లాపిడుగా, హీరో కృష్ణతో కథానాయికగా మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, హంతకులు దేవాంతకులు, మోసగాళ్ళకు మోసగాడు, కాంతారావు పక్కన హీరోయిన్‌గా గుండెలు తీసిన మొనగాడు చిత్రాల్లో తన సత్తా చూపించింది. అమ్మమాట చిత్రంలో గుడిలో నా స్వామీ కొలువై ఉన్నాడూ పాటలో ఈ బిట్ స్లోగా సాగితే ‘గుడి ఎనక నా స్వామి గుర్రమెక్కి కూకున్నాడు’ బిట్ వేగం సాకి రెండూ వేరు వేరు సన్నివేశాల్లో సాగే ఈ పాట ఆనాటి జనాన్ని వెర్రెక్కించింది. అలనాటి క్రైమ్ చిత్రాల్లో ప్రతి చిత్రంలోనూ క్లబ్ సాంగ్స్‌లా జ్యోతిలక్ష్మి డాన్స్ ఉండేది. నటిగా మత్తెక్కించే పాటలెన్నింటికో ఆమె నృత్యాలు చేసింది. సర్దార్ పాపారాయుడు చిత్రంలో సుభాషిణి, చెల్లెలు జయమాలినితో కలసి చేసిన మసాల సాంగ్ ‘ఓ సుబ్బారావు ఓ అప్పారావో’ పాట హిట్ సాంగ్‌గా ప్రేక్షక లోకానికి పిచ్చెక్కించింది. ఆమెకు ఎల్‌ఆర్ ఈశ్వరి గాత్రం మత్తెక్కించి కిక్‌తో బాగా సూటయ్యేది. ఆమెతరంలో ఎంతమంది శృంగార తారలు వచ్చినా ఆమె ముద్ర ఆమెదే. తన నాట్యంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన ఆమెకు నీరాజనం, సంతాపం.
-పివి శివప్రసాదరావు, అద్దంకి