మీ వ్యూస్

అలాగంటే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అరవింద సమేత...’లో రాయలసీమను అవమానించే సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించి క్షమాపణ చెప్పాలంటూ విద్యార్థి పోరాట సమితి ధ్వజమెత్తింది. రాయలసీమ ఫ్యాక్షనిజంపై అరవింద మొదటి చిత్రం కాదు, చివరి చిత్రం కూడా కాబోదు. అలాగే తెలుగు పలుకుబడిలో యాసలు ప్రాంతాన్నిబట్టి మారుతాయి. వాటిని ఉపయోగించి హాస్య సన్నివేశాలు చిత్రిస్తే, ఆ ప్రాంత ప్రజల్ని అవమానించినట్టు కాదు. గతంలో దక్షిణాదివారిని హిందీ సినిమాల్లో హాస్యానికి వాడుకునేవారు. ఇప్పటికీ సినిమాల్లోనూ, యువతలోనూ సర్దార్జీ జోకులు నవ్విస్తున్నాయి. ఇవన్నీ అవమానించడానికి కాదు. ఇలాంటి అంశాలపై పెట్టిన కేసుల్ని కోర్టులు చాలాసార్లు కొట్టేశాయి.

-ప్రభాస్, గాంధీనగర్

తిప్పలు తప్పవేమో

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తియ్యడేమో అనుకుంటున్న తరుణంలో పరమ నాస్తికుడైన ఆయన తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని చిత్రం నిర్మించి జనవరి 24న విడుదల చేస్తానని ప్రకటించడం బాలకృష్ణకు షాక్! ఎందుకంటే బాలకృష్ణ నిర్మిస్తున్న బయోపిక్‌లో చంద్రబాబుని హైలైట్ చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ఆలోచన లేకపోలేదు. కానీ వర్మ మాత్రం తాను నిర్మిస్తున్నది ఎన్టీఆర్ అవసాన దశలోని సత్యాలను అంటున్నాడు. అదే జరిగితే ఎన్టీఆర్ చివరి దశలో ఎలాంటి కుట్రలు ఎదుర్కొన్నారు, ఆ ఎడిసోడ్‌లో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది హైలైట్ కాకపోదు. అప్పుడు తెదేపాకి నష్టం కలగొచ్చని అంచనా. సో, వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పూరె్తైనా, విడుదలవ్వడానికి అనేక అవాంతరాలు ఎదుర్కోక తప్పదు.

-శాంతిసమీర, కాకినాడ

వెనె్నల బావుంది

అక్టోబర్ 21నాటి వెనె్నల ముచ్చటనిపించింది. మాణిక్యేశ్వరి పాత చిత్రాల పరిచయం చాలా బావుంది. పాత చిత్రాల పరిచయంలో భాగంగా ‘బంగారు పిచిక’ సినిమా కబుర్లు ఆసక్తికరంగా తోచాయి. ఇక వెనుక పేజీలో ఇచ్చిన జగపతిబాబు సినిమా కెరీర్, కవర్ కథనంగా ‘ఓవర్సీస్’ లెక్కలు బావున్నాయి. పాఠకుల పార్టిసిపేషన్‌గా ఇస్తున్న నాకు నచ్చిన సినిమా, నాకు నచ్చిన పాటలో ఎక్కువగా పాత సినిమాలే చోటు చేసుకుంటున్నాయి. అవి ఆణిముత్యాలే అయినా, కొత్త సినిమాల్లోనూ చూడదగ్గ సినిమాలు లేకపోలేదు. వాటిగురించీ ప్రచురిస్తే బావుంటుంది. పరిశీలించండి.

జి లలితామాధురి, తుని

ఎక్కడుంది మీటూ

ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన మీటూ ఉద్యమం ఎందుకో ఒక్కసారిగా చల్లారిపోయినట్టయ్యింది. పరిశ్రమలోని నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుల ‘వేధింపుల’ వ్యవహారాలు ఒక్కసారిగా బయటకు వచ్చినా, తరువాత దాని ఫలితమేమిటి? అన్నది పత్రికల్లో రాకపోవడం విడ్డూరం అనిపిస్తుంది. వేధింపులకు పాల్పడినవాళ్లకు శిక్షలు పడ్డాయా? శిక్షార్హులేనా? లేక వాళ్ల చీకటి కోణాలను బయటపెట్టడానికేనా? అన్నది ఏదీ తేలకపోవడం విచిత్రం అనిపిస్తుంది. తమిళనాడు, ముంబయి, బెంగుళూరులో మహిళా కళాకారులు ఇచ్చిన ప్రకటనలు చూస్తే -తప్పుచేసిన వాడి పనైపోయినట్టేనన్న నమ్మకం కలిగింది. కాని ఫలితమే అయోమయమైంది. సినిమా పరిశ్రమ హైదరాబాద్ రాకముందు మద్రాసువెళ్ళే మహిళలకు, సినిమా ఏజెంట్లు, సాంకేతిక నిపుణుల నుంచి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యేవని చెప్తుండేవారు. తనుశ్రీదత్తా ద్వారా చీకటి వ్యవహారాలు బయటకు వచ్చినట్టే వచ్చి -సైలెంట్ అయిపోవడం దారుణం. ఇంతకంటే ఏం జరుగుతుందిలే అన్న ధైర్యం వేధింపులగాళ్లకు వస్తే -మరీ బరితెగించే ప్రమాదం లేకపోలేదు.

-పీఎస్ నారాయణ, రాజమండ్రి

అప్పుడలా..

యాక్షన్ కింగ్ అర్జున్‌కి ‘మీటూ’ సెగ తగిలింది. ఒక చిత్రం రొమాంటిక్ సీన్ రిహార్సల్‌లో ఆయన తనని గట్టిగా కౌగలించుకొని, వీపు నిమిరి వేధించాడని కన్నడ నటి ఆరోపించింది. అది చదివినపుడు -ఆ తరంలోని ఎన్టీఆర్ కౌగలింతలు జ్ఞాపకమొచ్చాయి. అలనాటి హీరోయిన్లు జయప్రద, శారద, జయంతిలాంటి వారు ఆయనది భల్లూకపట్టు, ఎముకలు విరిగిపోతాయని నవ్వుతూ చెప్పేవారు. పైగా హీరోయిన్లను ఇబ్బంది పెట్టాలని కాదు, సీన్ పండాలని భావోద్వేగంతో ఆయనలా చేసేవారని చెప్పడం పత్రికల్లో వచ్చినదే. మరి నేటి నటీమణులు ముద్దులకు, కౌగలింతలకు ఒప్పుకొని తరువాత అభియోగాలతో ట్విట్టర్‌కి ఎక్కడం హాస్యాస్పదంగా లేదూ!

-సుబ్బక్క, జగన్నాథపురం

ఎవరిది నిజం?

స్టార్ల సినిమాలు, కలక్షన్లు, ర్యాంకులు ప్రేక్షకులకు ఆసక్తికలిగిస్తాయి. అయితే ఇవి తరచూ వివాదాస్పదమవుతూ అనుమానాలు, వివాదాలు రేపుతున్నాయి. ‘ఓవర్సీస్ ఓకే’ వ్యాసంలో ఓవర్సీస్‌లో టాప్ టెన్ చిత్రాల గురించి రాశారు. వాటిలో జూ.ఎన్టీఆర్ చిత్రం ఒక్కటీ లేదు. ఇటీవల ఒక చానల్‌లో ఎన్టీఆర్ ఓవర్సీస్ రికార్డు 2.2 మిలియన్లతో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రముందని, ప్రస్తుతం ‘అరవింద’ 2 మిలియన్లు దాటి త్వరలో ‘నాన్న’ను అధిగమించబోతోందని ప్రసారం చేసింది. ఆ లెక్కన జూ.ఎన్టీఆర్ టాప్ 10లో 9వ స్థానంలో ఉండాలి. ఏది నిజమో ఎవరు చెప్తారు?

-సాహిత్యదీప్తి, రమణయ్యపేట

ఏదీ హామీ

తెలంగాణ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూంలు హామీ ఇచ్చారు. కానీ, నేడు జూనియర్ ఆర్టిస్టులు ఫిల్మ్‌నగర్, నానక్‌రామ్‌గూడ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టువద్ద ఇరుకు గదుల్లో బతుకు సాగిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని, ఎఫ్‌డిసి చైర్మన్ రామ్మోహనరావు సైతం డబుల్ బెడ్‌రూం హామీలిచ్చారు తప్ప ఆచరణలో లేదు. కానీ, అగ్ర నిర్మాతల సినిమాలకు పన్ను రాయితీలు ఇస్తూనే ఉన్నారు. ఇటు చిన్న నిర్మాతలకు రాయితీలు రాక ఫిల్మ్‌లు స్టూడియోల్లో పడి ఉంటున్నాయి. చిన్న చిత్రాల నిర్మాతలకు యాభై పైసల వడ్డీకింద రూ. 25 లక్షల రుణాలు అందించి, పరిశ్రమపై ఆధారపడిన వాళ్లకు ఇళ్లు కేటాయించాలి. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ సారథ్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రం నుంచి మరింతమంది కళాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది. సినిమా పరిశ్రమ నుంచి అత్యంత ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

-కెఎస్, నల్గొండ