మీ వ్యూస్

నేలను నాకేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల క్రితమే కథ తయారైనా ఆ కథను విన్న హీరోలకు అది నచ్చక చివరకు ఒక ఎన్నారై బకరా సినిమా తీస్తానని ముందుకు రాగా రవితేజని కలిసి అతని స్థాయికి మించి 12కోట్లు ఇస్తామనగానే కథ విన్నాడో లేదో గాని మాస్ మహారాజా వెంటనే ఒప్పుకున్నాడు. అలా ‘నేల టికెట్’ తయారైంది. ఇది నేల టికెట్ ఆడియన్స్‌నేకాక బాల్కనీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చుతుందని రవితేజా బాకా వాయించినా ఏ ప్రేక్షకులనూ అలరించలేక పోయింది. అందుకు పసలేని కథ ఒక కారణం కాగా, 25 కోట్లు లోపు బడ్జెట్‌తో తీయవలసిన సినిమాని 50కోట్ల ఖర్చుతో తీయడం మరో కారణం. నేల టిక్కెట్ నేలను నాకేసింది!
- సత్య, కరప

చాలా విశేషాలు తెలిశాయి...
వెనె్నలలో వాణిశ్రీగారి వ్యాసం ‘సినిమాలలో రిజర్వేషన్లు’ ద్వారా చాలా విశేషాలు తెలిశాయి. అంజలి, సావిత్రి, వాణిశ్రీ వగైరా పెద్ద నటీమణులు ప్రారంభంలో చిన్న వేషాలు వేసినా ఎలాపైకి వచ్చారు తెలిపారు. తెలుగు సినిమాల్లో తెలుగు వారు హీరోయిన్ వేషాలకు 75% రిజర్వేషన్ యివ్వాలని 25% మిగిలిన భాషలవారికి అనే డిమాండ్ పై వ్యాసంలో విశే్లషణ బాగుంది. తెలుగు, తమిళ నటీమణులు ఎందరు హిందీ ఫీల్డుకు వెళ్లి రాణించిన వారి గురించి కూడా వాణిశ్రీగారు బాగా తెలిపారు. నాకు నచ్చిన సినిమా ‘బంగారు పంజరం’పై వ్యాసం బాగుంది.
- ఎ.వి.సోమయాజులు, కాకినాడ
ఊహల్నే నిజాలుగా..!

నిజాన్ని నిర్ధారణ చేసుకోకుండానే సినీ ఛానల్స్ తమ ఊహల్నే నిజాలుగా ప్రసారం చేసేస్తున్నాయి. అత్యధిక కలక్షన్ల భారతీయ చిత్రంగా దంగల్ 1800 కోట్లతో ప్రథమస్థానంలో బాహుబలి-2 1650 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉండగా బాహుబలి-2 చైనాలో విడుదల అయింది. ఇంకేముంది ఈ చిత్రం దంగల్‌ని మించిపోయి 2000 కోట్లు సాధిస్తుందని ఒక ఛానల్ వార్తను రువ్వింది. బాహుబలి-2 మొదటిరోజు కలక్షన్లు అదిరిపోయాయని కూడా చెప్పింది. ఆ తర్వాత నెల రోజులు గడిచినా బాహుబలి-2 ఊసే లేదు. అంటే బాహుబలి-2 దంగల్ని మించలేదనే అర్థం కదా! చైనా బాహుబలి లాంటి ఎన్నో చిత్రాలు నిర్మించింది కనుక బాహుబలి రెండు భాగాలూ అక్కడ ఫ్లాప్ అవడం సహజమే. ఎవరైనా కొత్తదనం కోరుకుంటారు కదా.
- హితీక్ష, రమణయ్యపేట

మూస ధోరణితో ముప్పే..
‘మూస ధోరణితో ముప్పే’ వ్యాసంలో నిక్కము వక్కాణించారు! ఒక సినిమా హిట్ అయితే చాలు అదే ధోరణిలో దర్శక నిర్మాతలు, హీరోలు పోతున్నారు. హిట్ ఫార్ములా దొరికింది అనుకుంటున్నారు. ఈ భ్రమలో విశ్వనాథ్, బాపు, రాఘవేంద్రరావు లాంటివారే పడిపోయి ముప్పుల పాలయ్యారు. ఇంక సామాన్యుల సంగతి చెప్పనక్కరలేదు. తాజాగా మాఫియా సిద్ధహస్తుడు వర్మకూడా ఆ భ్రమలోకి నాగార్జునని లాగేశాడు. వారి తాజాచిత్రం ఆఫీసర్ ఒక్కవారం కూడా ఆడలేదు. డిజాస్టర్‌గా మిగిలింది. ఆఫీసర్‌తోబాటు వచ్చిన విశాల్ చిత్రం ‘అభిమన్యుడు’ కథలో కొత్తదనంవల్ల బాగానే నిలదొక్కుకొని నిర్మాతకు లాభం తెచ్చిపెట్టింది.
-మైథిలి, సర్పవరం

నెటిజన్లకు ఒరిగేదేమిటి?
ఏ రంగంలోనైనా స్ర్తిలు ప్రతిభ కనబరిచి ముందడుగువేస్తేచాలు వారి గతాన్ని తవ్వి తీసి సామాజిక మాధ్యమాల్లో ఎద్దేవా చేసే పురుషపుంగవులు తయారయ్యారు. జయాబచ్చన్ కొత్తగా ఎంపీ అయినప్పుడు ‘సినిమాల్లో డాన్స్‌చేసే ఆ ఆడది పార్లమెంట్‌లో ఏం చేస్తుంది?’ అన్నారు. స్మృతి ఇరానీ సినిమాల్లో నటించకపోయినా టీవీ సీరియల్స్‌లో మంచి పేరుతెచ్చుకుంది. ఆమె ఎన్నికలో గెలిచి మంత్రి అయినప్పుడూ నెటిజన్లు చెలరేగిపోయారు. ఇప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య ఒకప్పుడు కన్నడ చిత్రాల్లో నటించిన నటి రాధిక. సినిమాల్లో పాల్గొన్న లవ్‌సీన్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలాచేయడంవల్ల నెటిజన్లకు ఒరిగేదేమిటి?
- శాండీ, కాకినాడ

వాస్తవానికి దర్పణం
వెనె్నలలో ‘హీరోలు కావలెను’ వ్యాసం వాస్తవానికి దర్పణం పట్టింది. నిజానికి తెలుగు హీరోలు ఒక చట్రంలో బిగుసుకుపోయారు. అందంగా ఉండాలి, ఆరడుగులు ఎత్తుండాలి. డాన్సులు అదరగొట్టాలి. ఫైట్స్ బెదరగొట్టాలి, రొమాన్స్ ఊపెయ్యాలి- ఇదీ చట్రం! ప్రేక్షకులు కూడా ఆ చట్రానికి అలవాటుపడిపోయారు. కాని ఇప్పుడిప్పుడే ఆ చట్రం బీటలువారింది. హృదయాల్ని కదిలించే సెంటిమెంట్స్ ఉన్న కథలు హీరో ఇమేజ్‌ని చెదరగొట్టాయి. ముఖ్యంగా కోలీవుడ్, మాలీవుడ్ కొత్తతరహా చిత్రాలకు తెర తీశాయి. మనం కూడా అంత అందంగా ఉండని ధనుష్, విజయ్ ఆంటోని లాంటి వారిని అభిమానిస్తున్నాం. ఇప్పుడు కథ, కథనాలు డామినేట్ చేస్తున్నాయి. హీరోలు కాదు.
-సత్య, కరప

ఇంకొందరు మిగిలిపోయారు..
‘బయోపిక్’లపై వ్యాసం (20.5.18 వెనె్నల) దాదాపుగా నటీనటులందరినీ కవర్ చేసింది. ఇంకా కొందరు మిగిలిపోయారు. కనుక రచయిత ఇంకో భాగం వ్రాస్తే వారూ చూడబడుతారు. కాకపోతే ఇంకే బయోపిక్ అయినా ‘మహానటి’లా విజయం సాధించడం అసాధ్యం! సావిత్రి వేరు ఈ వ్యాసంలోని మిగతావారు వేరు. ఏ నిర్మాతా బయోపిక్‌ల జోలికి వెళ్ళి నష్టపోకూడదని నా కోరిక.
- మృత్యుంజయుడు, వక్కలంక