మీ వ్యూస్

అందం ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంతలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం అందంగా ఆనందంగా సాగింది. నితిన్ మూస ధోరణినుండి బయటికి వచ్చి సరికొత్తగా నటించాడు. సమంత సినిమా అంతా భుజాలపైనే మోసింది. నరేష్, నదియా, శ్రీనివాసరెడ్డి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా రావురమేష్ నటన ఆ పాత్ర ఇంకాస్త ఉంటే బాగుండుననిపించేలా వుంది. కెమెరా పనితనం పల్లె అందాలకు వనె్నలద్దింది. పాటలు, రీరికార్డింగ్ వీనులవిందుగా సాగాయి. మీనా చిత్రాన్ని మళ్లీ తీశారు అనే అపవాదు ఉంటే ఉండవచ్చుగాక.. అ ఆ మాత్రం అచ్చతెలుగు సినిమాగా వచ్చింది అది చాలు.
-కొవ్వూరి జగాశ్రీనివాసరెడ్డి, కుంకుదురు

చిలకా గోరింకా
ఈ చిత్రంలో కృష్ణంరాజు, కృష్ణకుమారి హీరో హీరోయిన్లుగా చలామణీ అయినా నిజమైన హీరో హీరోయిన్లు ఎస్‌వి రంగారావు, అంజలీదేవి. వారే నిజమైన చిలకా గోరింకలు. భార్యాభర్తల అనుబంధానికి, అనురాగానికి నాతి చరామి అన్న సూక్తికి ప్రతీకగా నిలచి తమ నటనా వైదుష్యాన్ని, ప్రతిభను చక్కగా చూపారు. తొలి చిత్రమైనా కొత్తదనం కనపడకుండా మెప్పించాడు కృష్ణంరాజు. శ్రీశ్రీ కలానికి రాజేశ్వరరావు స్వరం తోడైతే చెప్పక్కర్లేదు. ప్రత్యగాత్మ ప్రతి ఫ్రేములో పాత్రల ఆత్మలు సాక్షాత్కారం చేశాడు.
-ఎన్ పద్మావతి, హైదరాబాద్

చిలకా గోరింకా.. విజ్ఞప్తి
చిలకాగోరింకా సినిమాలో పాటలు గురించి ప్రచురించారు. కానీ ఈ చిత్రంలో హిందీ నటి నూతన్ ఓ పాట పాడిందని గుర్తుంది. మన వెనె్నల్లో ఆ పాట గురించి రాయనే లేదు. అది ఏ పాట? తెలుపగలరు.
- ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు

హాస్యనటులెక్కడ?
బ్రహ్మానందం హవా తగ్గుతోంది కదా? గుండు హన్మంతరావులాంటి కొంతమంది హాస్యనటుల జాడే లేదు. ఏడాదికి 50 సినిమాల్లో నటించిన వేణుమాధవ్ ఏమయ్యాడు? కృష్ణ్భగవాన్ మాయమయ్యాడా? కామెడీ పాత్రలలో వెకిలి హీరోగా మారిన సునీల్ హాస్యానికి దూరమా? వరుస అపజయాల బాటలు పయనిస్తున్న అల్లరి నరేష్ ఇతర సినిమాలకు పనికిరాడా? రాళ్లపల్లి, గొల్లపూడిలాంటి విలక్షణ నటులు కొత్త తరానికి తగినవారు కారా? బాబుమోహన్, కోట శ్రీనివాసరావుల కాంబినేషన్ కనుమరుగైంది. కొత్త కెరటాలు పాతవాటిని పాతరేసినా ఫరవాలేదు కానీ హాస్యం వెకిలిదైపోయింది.
-ఎన్‌ఆర్ లక్ష్మి, సికిందరాబాద్

రేంజిని చెప్పింది
చాలాకాలం ముందునుంచే బ్రహ్మోత్సవానికి సినిమా వాళ్లందరూ ఇచ్చిన ప్రచార హోరు విపరీతంగా చేసినందువల్లే, ఆ అంచనాలను ఆ సినిమా అందుకోలేకపోయింది. ఉత్తి ఫంక్షన్‌లాగా మిగిలిపోయింది. అంతర్జాలంలో మహేష్‌బాబుపై జోకులు, కార్టూన్లు విజృంభించాయి. వీటిలో హాయిగా కూర్చుని తిట్టుకుంటూ ఉచితంగా చూసే టీవీ సీరియల్‌ని డబ్బులు గుంజిమరీ చూపించిన ఘనత దర్శకుడిదే. మొదటివారంలో థియేటర్లు పెరగటానికి బదులు తరిగిపోయిన విధానం బ్రహ్మోత్సవం రేంజిని చెప్పింది. మహేష్ కెరియర్ హిస్టరీలో ఇదొక బ్లాక్ పేజీగా మిగిలిపోయింది.
-పిఎస్ లక్ష్మి, బృందావనం

ఇంపాజిబుల్
మిషన్ పాసిబుల్‌లో చెప్పినట్టు భారతీయుల్ని ఉపయోగించుకుంటూ వారికి నచ్చేవిధంగా సినిమాలు తీస్తూ దేశంలో పాగా వేయడానికి హాలీవుడ్ ప్రయత్నిస్తోంది. నిజానికి మనం కూడా ఎప్పుడో ఆ పద్ధతి మొదలుపెట్టేశాం. మొదట్లో తమిళ చిత్రాలు తెలుగులోకి, తెలుగువి తమిళంలోకి డబ్ చేయడమో, పునర్నిర్మించడమో జరిగేది. తర్వాత వారి నటుల్ని మనం, మన వారిని వారు బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు మలయాళం హిందీలోకి విస్తరిస్తూ హీరోయిన్లు, విలన్లు, క్యారక్టర్ నటులు, దర్శకుల్ని తెచ్చుకుంటున్నాం. మనుషులు ఏ దేశానికి ఏ ప్రాంతానికి చెందినా వౌలికంగా వారి భావాలు, సమస్యలు పరిష్కారాలు ఒకటే కదా?
-కె గునే్నష్, కొవ్వాడ

ఆ సినిమాలేవీ?
వెనె్నలలో ఎట్ ది రేట్ ఆఫ్ 50 సినిమా సమీక్షలు బాగుంటున్నాయి. విపులంగా ఫ్లాష్‌బ్యాక్ రాస్తున్నారు. అయితే చిన్న సలహా. మీరు రాస్తున్న చిత్రాలన్నీ వెలుగు చూసినవే. అవన్నీ గత తరం, ఈ తరం వారు చూసినవే. అయితే ఇవి ఎక్కువగా డీవీడీ రూపాల్లోనూ, ఈటీవీ వారు ప్రసారం చేసేవే ఉంటున్నాయి. అలాకాకుండా చాలామందికి తెలియని తెలుగు సినిమాల గురించి సమీక్షలు రాయమని కోరుతున్నాం. ఉదా: కాంతరావు నటించిన పక్కలోబల్లెం, అగ్గిమీద గుగ్గిలం, మెరుపువీరుడు, నువ్వానేనా లాంటి చిత్రాలు. శోభన్‌బాబు నటించిన సత్యమే జయం, జేబుదొంగ, కాంభోజరాజు కథ, నాగేశ్వరరావు నటించిన మాయాలోకం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. కాబట్టి సినిమా పేర్లు కూడా మరిచిపోయిన, వెలుగుచూడని సినిమాల గురించి తెలియజేయగలరని కోరుతున్నాం.
-కె.రాము, తెనాలి

మనకు లేనిదే అది!
థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లో చిక్కుకున్నాయి. చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదు అంటూ గత ఐదేళ్లనుండి రొద వినిపిస్తూనేవుంది. విడుదలైన చిన్న చిత్రాలు ఎంత గొప్పగా ఉన్నాయి. నూటికి తొంబైతొమ్మిది చెత్త చిత్రాలే. మరాఠీలో సైరత్ అనే చిన్న సినిమా ఐదు కోట్లతో తీశారు. అది ఇప్పటికే వంద కోట్లు సాధించేసింది. బెర్లిన్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఆ సినిమా హీరోయిన్‌కి జాతీయ అవార్డు లభించింది. సైరత్ ఘన విజయానికి దర్శకుని ప్రతిభ ముఖ్య కారణం. మనకు లేనిది అదే. అంటే మన దర్శకులు ఒప్పుకోరు.
- కె.సుధీర్, శ్రీనగరం