మీ వ్యూస్

టైం థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టైం ట్రావెల్’ లేదా ‘టైమ్ ఫ్రీజ్’ అంటూ కాలంతో ముడిపెడుతూ వచ్చిన సినిమాలు లెక్కలేనన్ని. ఈ జీవన చక్రంలో ఒక్క క్షణం వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఈ క్షణం ఇక్కడే ఆగిపోతే ఎంత బావుంటుంది. అడ్వాన్స్ కాలంలో ప్రయాణించడం ఎంత గొప్ప అనుభూతి -లాంటి ఆలోచనలతో వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయ. సూర్య హీరోగా విక్రమ్‌కుమార్ తీసిన సినిమా సైతం తీసిపారేయ తగ్గది మాత్రం కాదు. ఆద్యంతం వినోదం కనికట్టు చేసినట్టే -దర్శకుడు మంత్రుముగ్ధులను చేసేశాడు. ఇక సూర్య యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. మూడు పాత్రల్లోనూ, పాత్రకు తగిన ఎక్స్‌ప్రెషన్స్ పలికించి టాలెంట్ చూపించాడు. క్యూట్ లుక్స్‌తో హీరోయన్ సమంత మంచి మార్కులు వేయంచుకుంది. విక్రమ్‌కుమార్ మస్కిష్కం నుంచి వచ్చిన టైం థ్రిల్లర్ సినిమా అద్భుతం.
-రాము, విజయవాడ

కింగ్‌లియరెక్కడ?
గతవారం వెనె్నలలో షేక్స్‌పియర్ నాటకాలెన్నో బాలీవుడ్ సెల్యూలాయిడ్ మీద ప్రతిఫలించాయని రాసిన వ్యాసం బాగుంది. ఆ ఆంగ్ల మహానాటక రచయిత రాసిన నాటకాలెన్నో ఈనాటికీ బ్రిటన్‌లో స్టేజీల మీద ప్రదర్శితం అవుతున్నాయి. ఆయన్ని మన కాళిదాసుతో చాలామంది పోల్చారు. కాళిదాసే షేక్స్‌పియరై జన్మించాడన్న వారూ ఉన్నారు. కస్తూరి శివరావు సొంత బ్యానర్‌లో నిర్మించిన గుణసుందరి కథ ‘కింగ్‌లియర్’ అనే విషాదాంత నాటకానికి మక్కీకిమక్కీగా మలచబడ్డదే. ఈ ప్రస్థావన కూడా వ్యాస రచయిత చేసివుంటే బావుండేది. పాతతరం నటులైన ముక్కామల, వాసంతిలు షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలు వేసేవారని విన్నట్టు గుర్తు.
-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్

అంత అక్కర్లేదు
భారతీయ సినిమాకు తరగని కథాకలశం అంటూ షేక్స్‌పియర్‌ని అంతగా పొగడాల్సిన పని లేదు. ఆయన తన కాలంలో విన్న, చదివిన కథలకు మెరుగులద్ది సొంతం చేసుకున్న సందర్భాలున్నాయి. దర్శకరత్న దాసరి చెప్పినట్టు -ప్రపంచంలో ఏడే కథలున్నాయి. ఆ ఏడు కథలకు చిలవలుపలవలు తగిలించి కొత్త కథ తయారు చేసే సమర్ధత రచయిత, దర్శకులకు ఉండాలి అని.
నిజానికి సైకాలజిస్టులు, తత్త్వవేత్తలూ చెప్పేదేమంటే ఏ దేశంలోవున్నా వౌలికంగా మనుషులంతా ఒకటే. వారి భావనలు, సమస్యలు, పరిష్కారాలు ఒకేవిధంగా ఉంటాయని. అందువల్ల ఏ కథ చూసినా వ్యాసుడు, వాల్మీకి, షేక్స్‌పియర్, అగాధాక్రిష్టలాంటి మహర్షులు, మహా రచయితల భావనాక్షర నీడలు కనిపించటం సహజం.
-చంపక్, మాధవనగర్

అక్కడ మామూలే
చెత్త సినిమాలకు అవార్డులిచ్చే కానె్సప్ట్ హాలీవుడ్‌లో ప్రారంభమై నాలుగేళ్లక్రితం బాలీవుడ్‌ని చేరుకుంది. అక్కడ ఆస్కార్‌కి పోటీగా ఫంక్షన్ ఘనంగా నిర్వహిస్తారు. అవార్డుల స్వీకారానికి ఎవరూ రాకున్నా అదో వేడుకలా జరుగుతుంది. మొదటిసారి సిల్వస్టర్ స్టాలిన్ వచ్చి తన ‘క్రీడా స్ఫూర్తి’ని ప్రదర్శించి అందరి మన్నన పొందాడు. అయితే బాలీవుడ్‌లో నిర్వహించే గోల్డెన్ కేలా నిజానికి చెత్త అవార్డు కానేకాదు. చాలామంది మెచ్చుకుని హిట్‌కొట్టిన చిత్రాలకూ అక్కడ అవార్డులిస్తున్నారు! చెత్త అవార్డు అనడం ప్రచారం కోసమే. నిజమైన చెత్తని వదిలేసి హిట్ చిత్రాల్ని టార్గెట్ చేయడమే వింతల్లో వింత!
-శాంతి చంద్రిక, సామర్లకోట

నవరస భరితం
నవరాత్రి చిత్రమైన చిత్రం. తండ్రి కుదిర్చిన సంబంధం తను ప్రేమించిన వాడితోనేనన్న నిజం తెలుసుకోలేక ఇల్లువదలి వెళ్తుంది హీరోయిన్. కథలో అనేక మలుపులు, రకరకాల విన్యాసాలు కనిపిస్తాయి. మహానటి సావిత్రి అందచందాలు, హావభావాలతో ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరరావు ఒక్క సినిమాలో నవరసాలు నవ్యరీతుల్లో పోషించి మెప్పించి చిత్ర విజయానికి బాట వేసారు. ఇక ధవళ వస్తధ్రారణలతో పిచ్చాసుపత్రిలో పిచ్చిచేష్టలతో అలనాటి నాయికలంతా తాము పాడిన పాత చిత్రాలలోని పాటలు పాడుతూ రక్తికట్టించిన సన్నివేశం ఎప్పటికీ మరువరానిది. మంచి సినిమాను ఫ్లాష్‌బ్యాక్‌లో అందించారు.
-ఎన్‌ఆర్ లక్ష్మి, సికిందరాబాద్

ఇంకా చెప్పాల్సింది
‘నవరాత్రి’ ఫ్లాష్‌బ్యాక్ బ్యావుంది. రచయిత్రి మరికొన్ని విషయాలు చెప్తే ఇంకా బాగుండేది. ఆ రోజుల్లో అక్కినేని, శివాజీగణేశన్ తమ చిత్రాల గురించి చర్చించుకొని రిమేక్ చేసేటప్పుడు ఒకరి చిత్రంలో మరొకరు నటించేవారు. శివాజీ నటించిన తమిళ నవరాత్రి సూపర్ హిట్ అవడంతో తెలుగులో అక్కినేనితో తీస్తే అది అంతగా హిట్ అవలేదు. నటనపరంగా చూసినా అక్కినేని రౌద్రం, బీభత్సం నటించడంలో విఫలమయ్యారు. అరుపులు వినిపించాయిగాని ముఖంలో కాఠిన్యం కనిపించలేదు. అలాగే అక్కినేని నటించిన ప్రేమనగర్ తమిళంలో వసంతమాళిగై పేరుతో వచ్చింది. అంత గొప్పగా శివాజీ నటించలేదు.
-లక్ష్మీప్రసన్న,
పేర్రాజుపేట

అంత రాక్షసత్వమా?
సినిమా స్టంటుల్లో చెత్త కానె్సప్ట్ చెలరేగిపోతోంది. హీరో విలన్‌ని చావచిదగ్గొట్టి నిస్త్రాణగా పడివున్న విలన్‌ని ఒక్క తన్నుతంతాడు. వాడు వంద గజాలు పైకి ఎగిరిపడతాడు. లేదా హీరో వాడి గుండెమీద కాలు పెట్టి తన వంశం గొప్పదనం గురించి గప్పాలు కొడతాడు. సరైనోడు అయితే విలన్ని ఒంటిచేత్తో పైకెత్తి చెత్తబస్తాలాగ విసిరిపారేస్తాడు. ఇదంతా హీరోయిజమా? రాక్షసత్వమా? అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం యుద్ధంలో ఓడిపోయిన సైనికులిని జైల్లో పెట్టినా మర్యాదగా చూస్తారు. భారతదేశంలోనూ ఆ సంస్కారం వుంది. కానీ సినిమావాళ్లకి అలాంటి సంస్కారాలు పనికిరావు! పైగా చావుదెబ్బలుతిన్న విలన్ని ఎంత అవమానిస్తే హీరోకి అంత గౌరవం!
-సత్య, కరప