మెయిన్ ఫీచర్

ట్రెండ్ మారుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకుల ఆలోచనావిధానం మారుతోంది. ఒకప్పుడు సినిమా మాత్రమే వారికి వినోద సాధనంగా వున్నప్పుడు ఎలాంటి సినిమాలు వచ్చినా చూసేవారు. ఇక వాళ్లకు నచ్చిన హీరోల సినిమాలైతే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపేలా చూస్తారు.. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తమకు నచ్చిన హీరో సినిమా అయినా.. తన అభిమాన హీరో సినిమా ఆయినా బాగాలేదంటే.. వాళ్లు కూడా చూడ్డానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదన్నది అక్షరసత్యం. దానికి నిదర్శనంగా కొన్ని సినిమాలను తీసుకోవచ్చు. ప్రస్తుతం వినోదం కావలసినంత ఎక్కడపడితే అక్కడ దొరుకుతోంది. చాలామంది తమ మొబైల్స్‌తోనే కాలక్షేపం చేస్తూ సినిమాల విషయంలో లైట్‌గా తీసుకుంటున్నారు. ఇక టెలివిజన్స్.. థీమ్ పార్కులు గట్రా వినోదం అందించేందుకు జనాలు కొత్తదారులు తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా బాగుందంటేనే వస్తున్నాడు తప్ప.. బాగాలేదని ఏ మాత్రం టాక్ వచ్చినా ఆ థియేటర్ దగ్గరికి వెళ్లే ప్రేక్షకుడు ఎక్కడా కనిపించడు.
*
ఈమధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల విషయంలో భారీ హంగామా చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. సినిమా ఫస్ట్‌లుక్, ఫస్ట్ టీజర్ విడుదల సమయంలో ఆ సినిమాపై భారీ అంచనాలు పెంచే స్తూ.. ముఖ్యంగా సోషల్ మీడి యా కొలమానంగా తీసుకుని మా సినిమాకు ఇన్ని లక్షల లైక్స్ వచ్చాయి.. మా టీజర్ అదరగొట్టింది అంటూ ఊదరగొడుతున్నా రు. ఇక క్రేజీ కాంబినేషన్‌లో వచ్చే సినిమా అయితే ఇక చెప్పలేం. క్రేజీ కాంబినేషన్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. కాని ఆ సినిమాలు విడుదల తరువాత పరిస్థితి మరోలా ఉంటోంది. గత ఏడాది మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం 150’ తప్ప అంత భారీగా కాసులు కురిపించిన సినిమా మరొకటి లేకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. కథల ఎంపిక పేరుతో ఏడాదికి ఒక్క సినిమా చేయటమే మహా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న హీరోలు, తీరా రిజల్ట్ విషయం వచ్చేసరికి డిజాస్టర్ రూపంలో తీవ్ర నష్టాలు మిగుల్చుతున్నారు. ఇక కాంబినేషన్ విషయంలో ఓ క్రేజీ దర్శకుడు.. ఓ స్టార్ హీరో కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా విడుదలకు ముందునుంచే నానా హంగామా చేస్తారు.. సదరు కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌తో అటు బిజినెస్ విషయంలో కూడా భారీ రేట్లకు అమ్మేస్తారు. కానీ అసలు ఫలితం మరోలా ఉంటే పరిస్థితి ఎలా వుంటుంది అన్నదానికి నిదర్శనం.. సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘స్పైడర్’ విషయంలో జరిగింది ఇదే. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని వచ్చినా ప్రయోజనం కలుగలేదు. ఇక పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్ ఫలితం కూడా అలాగే వుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రాలు ఏ విషయంలోనూ జనాలను మెప్పించలేకపోయాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ కూడా కొన్నిచోట్ల నష్టాలే చూపించింది. ఎన్టీఆర్ మూడు పాత్రలు అనగానే విపరీతమైన అంచనాలు పెరిగాయి. టాలీవుడ్‌లో చాలారోజులకు ఒక హీరో ఏకంగా మూడు పాత్రల్లోనటిస్తున్నాడు అనగానే జనాల్లో ఆసక్తి పెరిగింది. కానీ విడుదల తరువాత ఫలితం తారుమారైంది. కొన్నిచోట్ల సూపర్‌హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా నిరాశనే మిగిల్చింది ఈ సినిమా. దానికి ముఖ్య కారణం.. ఈ మూడు పాత్రలను దర్శకుడు సరిగా డీల్ చేయలేకపోవడం ఫలితం మీద ప్రభావం చూపించింది. అల్లు అర్జున్ డీజే సినిమా వారంలోపే వంద కోట్లు తెచ్చింది అని చేసుకున్న ప్రచారం పోస్టర్లకే పరిమితమైంది తప్ప వాస్తవంగా జరిగింది వేరు. పవన్‌కళ్యాణ్ కాటమరాయుడి ప్రతాపం వారం రోజులకే తగ్గి.. ఆ తర్వాత నష్టాలు తెచ్చిపెట్టాడు.
నిజానికి వాస్తవ పరిస్థితులు మరోలా వున్నాయి.. ఇప్పుడు సినిమా బాగుంటేనే ప్రేక్షకుడు చూస్తున్నాడు. అందుకే కొత్తదనంతో ఆకట్టుకున్న చిత్రాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ క్రేజీ కాంబినేషన్లు.. స్టార్ హీరోలు అన్న విషయం పక్కన పెట్టి.. కేవలం కథ బాగుందా? లేదా? అన్నది అసలు విషయంగా మారింది. సాధారణంగా ఏ వుడ్ అయినా, సినిమా పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు నటించి భారీ కమర్షియల్ సినిమాలకు ఉన్నంత ఆదరణ, ఓపెనింగ్స్ చిన్న, మీడియం తరహా వాటికి ఉండవు అనేది సహజం. కానీ గత ఏడాదినుంచి పరిగణనలోకి తీసుకుంటే ఒకటి రెండు తప్ప మంచి విజయం సాధించి తమదైన ముద్ర వేసినవన్నీ చిన్నతరహా సినిమాలే కావడం- అందులో వేటిలోనూ భారీ ఫాలోయింగ్ లేని హీరోలు ఉండటం భవిష్యత్‌లో రాబోతున్న కొత్త ట్రెండ్‌ని సూచిస్తోంది. కలెక్షన్ పరంగానే కాదు కంటెంట్ పరంగానూ ఇప్పటి ట్రెండ్ మారిందని పక్కాగా తెలుస్తోంది. సినిమాల విషయంలో మెప్పులు పొందటమే కాదు, బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించింది అర్జున్‌రెడ్డి చిత్రం. విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద రాద్ధాంతమే జరిగింది. సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపడమే కాదు.. కొత్త తరహా ట్రీట్‌మెంట్‌తో ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి సినిమా ఒక్క తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. ఈ సినిమా పలు భాషల్లో రీమేక్‌ల కోసం గట్టి పోటీగా మారింది. ఇక ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాని కథతో.. సరికొత్త ప్రయోగంగా తెరకెక్కిన ఘాజి చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. 1978 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగిన కథతో రానా హీరోగా వచ్చిన ఈ సినిమా ఏకంగా మూడు భాషల్లో సత్తా చాటింది. ఇక మారుతున్న మానవ సంబంధాలు.. అనుబంధాలకు అద్దం పట్టేలా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘శతమానం భవతి’ సంచలన విజయం అందుకుంది. ఇక ప్రేమలో కొత్తకోణాన్ని చూపే.. నాని నటించిన ‘నిన్నుకోరి’, శేఖర్ కమ్ముల ‘్ఫదా’, హర్రర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ‘ఆనందోబ్రహ్మ’ లాంటి సినిమాలన్నీ ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలే. పైగా ఈ సినిమాలన్నీ కూడా చాలా తక్కువ పెట్టుబడితో రూపొంది బయ్యర్లకు అంతకంత లాభాలు తెచ్చిన సినిమాలే. ఇలాంటి వాటివల్ల సేఫ్‌గా బయటపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలా కాదని కేవలం స్టార్‌పవర్ కాంబినేషన్ క్రేజ్‌ని మాత్రమే నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకులు మొహమాటం లేకుండా తిరస్కరిస్తారని మొన్న వచ్చిన ‘అజ్ఞాతవాసి’ కూడా రుజువుచేసింది.
ఇప్పుడు మన హీరోల్లో కూడా మార్పు రావాల్సిన పరిస్థితి ఉంది.. కేవలం తమ హీరోయిజాన్ని నమ్ముకుంటే ఫలితం మరోలా వుంటుంది కాబట్టి.. ఆ హీరోయిజాలను పక్కనపెట్టి.. మంచి కథకోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా చక్కటి ఫలితాలు అందుకుంటారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తమ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడంలో తప్పులేదు కానీ అసలు విషయాల గురించి పట్టించుకోకుండా కేవలం హీరోయిజాన్ని నమ్ముకుంటే కష్టాలు తప్పవు. ఇక దర్శకులలు కూడా హీరోలను దృష్టిలో పెట్టుకుని కాకుండా సరైన కథలను ఎంచుకుని హీరోల కోసం సినిమాలు తీయడం మానేస్తే.. మంచి సినిమాలు వస్తాయి. ఇక డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కూడా మారింది.. కొనుగోలుదారులు కూడా నిర్మాతనో లేక హీరోనో బాగుంటే చాలు అన్ని సినిమాలు కొనడం లేదు. ఇది వ్యాపారం. తనకు అంతకంతా లాభాలు వస్తాయి అంటేనే ఎవరి సినిమానైనా కొంటాడు. ఒకవేళ ఈ సినిమా తప్పకుండా దెబ్బకొట్టేలా ఉందని అనుమానం వచ్చిందా ఎంత పెద్ద హీరో సినిమా అయినా వద్దు అని దండం పెట్టుకుని, దానికి బదులు ఓ పది చిన్న సినిమాలు కొంటే వాటిలో ఐదు సక్సెస్‌లు అయినా తలెత్తుకుని తిరుగవచ్చు అనే ధీమాలో ఉంటాడు. ఇప్పుడున్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే ట్రెండ్ మారుతోంది.. మనం కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది.

-శ్రీ