మెయిన్ ఫీచర్

మా సినిమా మా ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగటు మనిషికి అందుబాటులో వుండే ఏకైక వినోద సాధ నం సినిమా. కానీ అది రానురాను అందరాని చందమామగా మారుతోంది. సగటు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రేక్షకులు ఒక సినిమా చూడటానికి కుటుంబ సమేతంగా వెళ్లాలంటే వెయ్యి రూపాయల నోటు ఖర్చయపోవాల్సిన పరిస్థితి..
ఒక మామూలు కుటుంబానికి ఇది సాధ్యమా?
ఇంత ఖర్చుపెట్టి సినిమా చూడాల్సిన అవసరం అతనికుంటుందా? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఎవరూ ఇవ్వలేని పరిస్థితి..! ఇప్పటికే ఉన్న ధరలను పెట్టి సినిమాలు చూడడం తగ్గించుకున్న సగటు ప్రేక్షకుల నెత్తిన మరోసారి పిడుగుపాటులాంటి వార్త ఏంటో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి థియేటర్లకు అనుమతిస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సీజన్‌లో విడుదలయన పెద్ద సినిమాలను చాలా ఎక్కువ రేట్లకు కొన్నాం, ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవాలంటే ప్రస్తుతం వున్న టికెట్ల ధరలు సరిపోవు, కాబట్టి టిక్లెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతివ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్ల యాజమాన్యాలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిశీలించి ధరలను పెంచుకోవచ్చని అనుమతినిచ్చింది. ఈ ప్రభుత్వాలు ఈ టిక్కెట్ల ధరల గురించి మార్గదర్శకాలు, ఏవైనా నిర్ణయాలు తీసుకుని అమలుపరిచేంతవరకు ప్రస్తుతం పెంచుతున్న ఈ ధరలను ఇలాగే కొనసాగించుకోవచ్చని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
గతంలో మాదిరిగా విడుదలైన సినిమాలన్నింటినీ చూడలేకపోతున్నాం, కనీసం సంక్రాంతి పండగకైనా కుటుంబ సమేతంగా సినిమా చూద్దాం అని కలలుగన్న సగటు ప్రేక్షకులకు ఇది అశనిపాతంగానే మారింది. గత సంవత్సరకాలంగా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమలోని చిన్న నిర్మాతల అభ్యర్థన మేరకు ప్రభుత్వాలు ఈ పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖ అధికారులు టికెట్ల ధరలను పెంచుతున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ ప్రకటనపై ఆగ్రహం వెలిబుచ్చి సదరు ప్రయత్నాలకు కళ్లెం వేశారు. ఇలా ప్రభుత్వాలు తమ విన్నపాలను వినిపించుకోవడంలేదని థియేటర్ల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు జస్టిస్ ఎస్.వి.్భట్‌గారు పై ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఇక్కడే ఒక ధర్మబద్ధమైన సందేహం.. న్యాయమైన ప్రశ్న ఒకటి ఉద్భవిస్తుంది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించాల్సింది సినిమాను తీసిన నిర్మాతనా? ఆ సినిమాను ప్రదర్శించే ఎగ్జిబిటరా? ప్రభుత్వమా? హైకోర్టా? తప్పనిసరిగా నిర్ణయాధికారం నిర్మాతకేవుండాలి. ఎందుకంటే సదరు సినిమా అనే వస్తువును తయారుచేసింది నిర్మాత కాబట్టి! సమాజంలో గుండుసూది దగ్గరనుంచి టీవీనో, కారునో, మరే ఇతర వస్తువునో ఎవరైతే తయారుచేస్తాడో ఆ తయారీదారుడే ఆ వస్తువు రేటును నిర్ణయించి అమ్ముకుంటాడు? కానీ ఆరుగాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పంటను పండించే రైతుకు, అష్టకష్టాలు పడి తన జీవితానే్న ఫణంగా పెట్టి సినిమాలను నిర్మించే నిర్మాతకు మాత్రం ఆ హక్కు ఉండడం లేదు. ఆ నిర్ణయాధికారం వుండడం లేదు. అందువలననే రైతులు, నిర్మాతలు తీవ్రంగా నష్టపోతూ భవిష్యత్తు లేని జీవితాలను గడుపుతున్నారు. యాభై కోట్లో, వంద కోట్లో, రెండు వందల కోట్లో పెట్టి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో తీసిన సినిమాలను చూడటానికి ఎంత రేటైనా పెట్టడానికి ప్రేక్షకుడు సై అంటాడు. కానీ.. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఒక చిన్న హీరో లేదా కొత్త హీరోల సినిమాలను ఎక్కువ రేటు పెట్టి చూడటానికి ఏ ప్రేక్షకుడు ఇష్టపడతాడు? సగటుప్రేక్షకుడు అసలు ఈ ఆలోచనే చేయలేడు! అటువంటి చిన్న బడ్జెట్ సినిమాను అంతంత పెద్ద
రేట్లు పెట్టి టిక్కెట్లు అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తను పెట్టిన తక్కువ బడ్జెట్‌ను (నిర్మాణవ్యయం) తక్కువ రేట్లతో అమ్మిన సినిమా టిక్కెట్ల ద్వారా కూడా తిరిగి రాబట్టుకోవచ్చు. అలా పెద్ద బడ్జెట్ సినిమాలకు ఒక రేటు, చిన్న బడ్జెట్ సినిమాలకు ఒక రేటు చొప్పున టిక్కెట్ల ధరలు వుంటేగాని చిన్న సినిమాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి నేడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొని వుంది. కానీ ఆ వెసులుబాటును, ఆ అవకాశాన్ని, ఆ హక్కును నిర్మాతలకు లేకుండా చేస్తున్నారు ఎగ్జిబిటర్లు- ఒక సినిమాను ప్రదర్శించుకునేందుకు అద్దె వసూలు చేసుకుంటున్న ఎగ్జిబిటర్లు టికెట్ల రేట్లను కూడా వారే నిర్ణయిస్తున్నారు, వారే నిర్దేశిస్తున్నారు! ప్రదర్శనార్థం అద్దె తీసుకున్నవారికి టికెట్ రేట్ల విషయం ఎందుకు! అందుకే నా సినిమాను ప్రదర్శించుకునేందుకు నేను మీకు వారానికి ఇంత చొప్పున అద్దె చెల్లిస్తున్నాను. అంటే వారం రోజులపాటు మీ థియేటర్‌పై హక్కులు తీసుకుంటున్నాను. ఆ వారం రోజులలో నా వస్తువును నాకు ఇష్టమై నా లేదా నాకు గిట్టుబాటైన ధరకు నేను అమ్ముకుంటాను.
అది నా ఇష్టం. మీరెవ్వ రు నా వస్తువునకు ధర నిర్ణయించడానికి? మీరు అవలంభిస్తున్న ఈ పద్ధతి కారణంగా నేను నష్టపోతున్నాను. నా సినిమా నష్టపోతోంది అని చిన్న నిర్మాతలు నిలదీసేందుకు సిద్ధం అవుతున్నారు. నిర్మాతలు నూటికి తొంభైమంది నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి, ఉరికొయ్యలకు వేలాడటానికి, బికారులై రోడ్లంబడి తిరగడానికి కారణం ఈ థియేటర్ల అసంబద్ధ విధానమే అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. ఒక నిర్మాత సినిమాను తీసేది నటీనటులను, టెక్నీషియన్లను బతికించడానికి, థియేటర్ల యాజమాన్యాన్ని ధనవంతులుగా మార్చడానికి మాత్రమే అనేలా వుంది ప్రస్తుత విధానం.
బయట సమాజంలో ఎవరైనా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏదైనా షాపును అద్దెకు తీసుకుని అందులో అమ్మే వస్తువులను తనకు ఇష్టమైన రేటుకు అమ్ముకొని నష్టం రాకుండా చూసుకుంటాడు! కొంతమంది ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలపై లాభాలు గడిస్తే కొంతమంది మాత్రం నాకు నష్టం రాకుండా ఏదో కొంచెం లాభం వస్తే చాలు అని అనుకొని గిట్టుబాటు అయ్యే ధరకు అమ్ముకుంటాడు. అంతేగాని ఆ షాపు ఓనరే జోక్యం చేసుకొని తను అద్దె తీసుకోవడమే కాకుండా ఆ షాపుల్లోని వస్తువులను ఏ రేటుకు ఎంతకు అమ్మాలో నిర్ణయిస్తే ఎలా వుంటుంది? ప్రస్తుతం థియేటర్ల యాజమాన్యం ఒకవైపు అద్దెలు వసూలు చేసుకుంటూనే టిక్కెట్ల రేట్లను తమకు ఇష్టం వచ్చినట్లు పెంచడం కూడా అలాగే వుంది? ఈ పద్ధతివలన చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు రాని పరిస్థితి దాపురిస్తుంది.
ఇప్పటికే కొంతమంది నిర్మాతలు తమ సినిమాలకు మంచి థియేటర్లు దొరక్కపోవడం, మంచి బిజినెస్ రాకపోవడం, శాటిలైట్ వ్యాపారం జరగకపోవడంతో నేరుగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలకు అమ్మేసి ఆన్‌లైన్‌లో విడుదల చేసుకుంటున్నారు. ఈమధ్య కమల్‌హాసన్ తను రూపొందించిన ‘విశ్వరూపం’ అనే సినిమాను ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి పూనుకుంటే తమిళనాడులోని ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నారు. ఆ పద్ధతిలోనే నిన్నగాక మొన్న హాలీవుడ్ అగ్రనటుడు విల్‌స్మిత్ తను నటించి రూపొందించిన ‘బ్రైట్’ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేసి సంచలనం సృష్టించాడు.
మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలా థియేటర్ రెంట్‌లే కాకుండా టికెట్ల రెంట్లు కూడా ఇలాగే అడ్డగోలుగా పెంచుకుంటూపోతే రానున్న రోజులలో తెలుగు సినిమాలను కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల చేసుకునే రోజులు వస్తాయి. పరిస్థితులు అటే దారితీస్తున్నాయి.
తీయడం, కొనడం, ప్రదర్శించడం అనే మూడంచల వ్యవస్థ సక్రమంగా, సజావుగా, న్యా యబద్ధంగా నడిపిస్తేనే సినిమా అనే మూడక్షరాల అద్భుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్క వ్యవస్థ చెడిపోయినా, నిస్తేజమైపోయినా మొత్తం వ్యవస్థే పేకమేడలా కూలిపోతుంది. ఈ వాస్తవాన్ని విస్మరించి సినీ పరిశ్రమలోని కొంతమంది పెద్దలు తమ స్వార్థం కోసం ఈ మూడంచెల వ్యవస్థను చెడగొడుతున్నారు. తాము ఎక్కిన మహావృక్షం కొమ్మలను వాళ్లే నరుక్కుంటున్నారు. అది వినాశనానికే దారితీస్తుంది.
ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఏ నాలుగైదు తప్ప మిగతావాళ్లు బతకుండా చేస్తున్న సినిమా పరిశ్రమ విధి విధానాలపై కొరడా ఝుళిపించాలి. సినిమాను, సినిమా పరిశ్రమను బతికించుకోవాలి. మన పొరుగు రాష్టమ్రైన కేరళను, చైనా, ఇరాన్ వంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా చౌకగా అందవలసిన సినిమా వినోదం అతి ఖరీదైన వస్తువుగా మారిపోతే ఈ వినోదం దొరకని సగటు మనిషి మరో చోట మరో రకమైన వినోదాన్ని వెదుక్కుంటాడు. అదీ దొరక్కపోతే ఏ తాగుడుకో, ఏ జూదానికో బానిసవుతాడు. దాని వలన సమాజంలో అనేక రకాల నేరాలు పురుడుపోసుకుంటాయి. వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది.

- బాబ్జీ, సినీ దర్శకుడు