మెయిన్ ఫీచర్

భలే.. ఫస్ట్‌లుక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకే ఒక దెబ్బ.
పది పదిహేను మంది రౌడీగ్యాంగ్ గింగిరాలు తిరుగుతూ గాలిలోకెగిరి నేలపై దబ్బున పడాలి. ఏకె -47 నుంచి దూసుకొచ్చే బుల్లెట్లు శరీరాన్ని తూట్లు తూట్లు పొడిచేస్తున్నా -విలన్‌ని వేటాడి వెంటాడి తుదముట్టించాలి. ఆకాశానికి నిచ్చెనలు వేయాలి. అందమైన లొకేషన్లలో డ్యాన్స్‌లు ఇరగదీయాలి. ప్రత్యర్థుల డైలాగుల ప్రవాహానికి -ఒక్క పంచ్ డైలాగ్‌తో బ్రేక్ వేయాలి. అసహజంగా అల్లుకుపోయే హీరోయిన్‌ని చిన్న చిలిపి డైలాగుతోనో, అతిచిలిపి పనితోనో మరింత ఆకట్టుకోవాలి. ఇదొక స్టయిల్.
మెలితిరిగిన కండలు, బాడీ ప్యాక్‌లు లేకుండా -కుర్రాడు చాలా సహజంగా కనిపించాలి. నలుగురిలోవుంటూ అతి సామాన్యమైన క్యారెక్టర్ చేస్తూనే -హీరోయిజాన్ని ఎలివేట్ చేయగలగాలి. పాతికేళ్ల వయసులోనే జీవితాన్ని కాచి వొడపోసిన అనుభవాన్ని రుచిచూపిస్తూ -లోతైన అర్థంతో డైలాగులు చెప్పాలి. వినయం, సంస్కారం, తెగువతో జీవితానికి ఎదురీదగలిగే సత్తాను ప్రదర్శించాలి. అరె -ఈకాలం కుర్రాడంటే ఇలాగే ఉండాల్రా అన్న ఫీలింగ్ ఆడియన్స్‌లో కలిగించగలగాలి. ఇదో స్టయిల్.
ఇలాంటివి ఏం చేసినా.. ఎన్ని చేసినా మాత్రం -సినిమా క్రెడిట్ మొత్తం ఒక్క హీరో ఖాతాలోనే పడాలి. ఇదీ ఇప్పటి హీరోయిజమ్ తీరు. వాస్తవానికి దగ్గరగా యాక్షన్ అంటూనే -వాస్తవ జీవితంలో ఏమాత్రం సాధ్యంకాని ఎడిసోడ్స్ హీరోల నట జీవితంలో అలవాటైపోతుంది. ఈమధ్య ఈ వైవిధ్యంలోనూ తెగ మార్పులొచ్చేసి -మరీ వాస్తవంగా నటించేందుకూ హీరోలు సిద్ధపడుతుండటం లేటెస్ట్ స్టయిల్.
**
ఎవ్వరికీ తలొగ్గని నైజమే హీరోయిజమ్. ఎంత తన్నినా.. ఎలా తన్నినా తన్నులు తినేయడమే విలనిజమ్ అనే కానె్సప్ట్ కొంచెం కొంచెంగా మారుతోంది. ఈ రెండింటిలోనే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల పాత్రల్లోనూ వైవిధ్యం కనిపిస్తోంది. వాళ్ల పాత్రలకూ విలువ పెరుగుతోంది. దీనికనుగుణంగా పోస్టర్లూ మారుతున్నాయి. ఒకప్పటి సినిమా పోస్టర్ అంటే -హీరో బొమ్మ పెద్ద సైజ్ ఉండాలి. హీరో బొమ్మ.. తరువాత హీరోయిన్, ఆ తరువాతే మిగిలిన వాళ్ల చిత్రాలు. ఇప్పటి పరిస్థితి వేరు. హీరో స్టిల్‌తో విడుదలవుతున్న ఫస్ట్‌లుక్కే పోస్టరైపోతుంది. లేదూ.. అసలు హీరోయే లేకుండా సినిమా కానె్సప్ట్‌పై ఆడియన్ అంచనాలకు మరింత పురిపెట్టే డిజైన్‌తో వచ్చే ఫస్ట్ లుక్ పోస్టరవుతుంది. అలాంటి పోస్టర్లే క్లిక్కై ఆశ్చర్యానికీ గురిచేస్తున్నాయి. మోషన్ పోస్టర్లు.. టీజర్లు ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తున్నాయి. ప్రేక్షకుడి ఊహాశక్తికి పదునుపెట్టేలా తయారవుతున్నాయి. బాహుబలి ఫస్ట్‌లుక్ (చేతిలో బాలుడు) సినిమా అంచనాలను పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ లుక్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఇదే సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రభాస్ పాదాన్ని తన నెత్తిపై పెట్టుకుని అమాంతంగా హీరోయిజాన్ని పెంచేసాడు. ఒకప్పుడు సినిమాలో ఇలాంటి సీన్లు తప్పక చేయాల్సి వస్తే -ఒకటికి రెండుసార్లు ఆలోచించి సంకోచంతోనే చేసేవారు. నిజానికి -ఇలాంటి సీన్లు చేయడానికి వెనక్కి తగ్గేవారు కూడా. కానీ ఈరోజు ఇవే సీన్లు బలాన్ని పెంచి సినిమాకు మంచి పేరు తెస్తాయన్న భావన కనిపిస్తోంది. వాళ్ల భావనకు తగ్గట్టుగానే ఫలితాలు అందుతున్నాయి. అందుకే -నెత్తిమీద కాళ్లు పెట్టుకోవడానికి ఎంత సీనియర్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్తూ ఆలోచించటం లేదు. నెత్తిమీదే కాదు, ఎక్కడైనా కాళ్లు పెట్టడానికి హీరోలూ వెనుకడుగు వేయడం లేదు.
ఒకప్పుడు వారసుడు చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణ కాలర్‌ని కొడుకు పాత్రధారి (హీరో) నాగార్జున పట్టుకుంటే అభిమానుల మధ్య బోల్డెంత గందరగోళం చెలరేగింది. కానీ ఈమధ్య ‘లెజెండ్’లోగాని ‘నాన్నకు ప్రేమతో..’లోగాని ‘పిల్లానువ్వులేని జీవితం’లోగాని జగపతిబాబు క్యారెక్టరే సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. అంతేకాదు, హీరోయిజాన్ని ఊహించనంత స్థాయికి ఎలివేట్ చేసింది. అందుకే నేడు హీరోలు.. విలన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు అవసరమైతే కొంతతగ్గి నటించి సినిమాకు కొత్త ఫ్లేవర్‌ని ఇస్తున్నారు. నాలుగు రోజుల క్రితం విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో దీనికి భిన్నమైన సీన్ కనిపిస్తుంది. నిజంగా కొత్త లుక్‌నే ఇచ్చింది. ప్రిన్స్ మహేష్‌బాబు ఎవరి పాదాలకో చెప్పులు తొడుగుతూ ఆశీర్వాదం తీసుకుంటున్న ‘లుక్’ ఆసక్తిని రేపింది. సినిమా విడుదల తరువాత -తండ్రీ కొడుకుల అనుబంధానికి ప్రతీకగా తీసుకున్న సన్నివేశంగా ఆడియన్స్ మైండ్‌పై ఒకింత ముద్ర వేసింది. సో.. హీరోల క్యారెక్టర్లలో కనిపిస్తున్న వైవిధ్యమైన చిత్రణ, క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్రల్లో కనిపిస్తున్న ఒక విధమైన కొత్తదనం, ఆసక్తిని రేకెత్తిస్తోన్న పోస్టర్లూ సినిమా అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. హీరోలు సైతం యిలాంటి లుక్స్ పోస్టర్లుగా వేయడానికి ఒప్పుకోవడం గమనార్హం! సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్లు, శ్రీమంతుడు.. బ్రహ్మోత్సవం’ వంటి సినిమాలతో మహేష్ పోస్టర్స్ లుక్‌లో కొత్త ఫ్లేవర్‌ని తీసుకొచ్చాడనే చెప్పాలి.
ఈమధ్య సినిమాలే కొత్త పంథాలో తయారౌతున్నాయి. ఒకనాటి అగ్ర హీరోలే కాదు.. ఈనాటి కుర్ర హీరోలు సైతం విలనిజమ్ చేయడానికి ‘సై’ అనడంతో ఫస్ట్‌లుక్స్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హీరోయిజమ్ అనేకంటే నటనలో బెస్ట్ అనిపించుకోడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పోటీ పడుతున్నారు. ‘రాజా చెయ్యివేస్తే’ సినిమాలో నారా రోహిత్‌కు నందమూరి తారక్ ప్రత్యర్థి కావడం, ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్‌కు ఆది పినిశెట్టి ప్రత్యర్థికావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తేలా చేశాయి. ఫలితాల మాటెలా వున్నా ప్రాజెక్ట్‌కు కొత్త లుక్ ఇవ్వడమే ప్రధానం అన్న ధోరణి పెరుగుతుంది.
కొత్త పంథాలో సినిమాలు తీసే రవిబాబు పోస్టర్లను సరికొత్తగా డిజైన్ చేస్తాడు. అవును, అవును-2 వంటి సినిమాలకు కేవలం హీరోయిన్‌ని ఏనుగు తన కాళ్ళమధ్య బంధించే పోస్టర్‌తోనే మొత్తం రన్‌ని పూర్తిచేసాడు. పోస్టర్ కథ చెప్పడం.. నటీనటుల వివరాలు చెప్పడం ఒకప్పటి తీరు. ప్రస్తుతం ఆలోచింపజేయడం.. ఆసక్తిని పెంచడం నేటి స్టయిల్. ఈ పంథాలోనే పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్ పోస్టర్ వచ్చింది. ఖాకీ చొక్కావేసుకుని లుంగీలో గుర్రం పట్టుకొస్తూ కనిపించిన పవన్ కల్యాణ్ -సబ్జెక్టుపై ఆసక్తిని పెంచేశాడు. అయితే, పోస్టర్‌పైవున్న కంటెంట్ సినిమాలో లేకపోయేసరికి ఆడియన్స్ తిప్పికొట్టారు. ఇటీవలే సూర్య నటించిన ‘24’ పోస్టర్ టైటిల్‌దీ అదే తరహా. కంటెంట్ ఏమిటో అర్ధంకాని నెంబర్‌గా డిజైన్ చేయడం కూడా వైవిధ్యం ఖాతాలోకి వెళ్లిపోయింది.
ఒకప్పటి పరిస్థితిని పరిశీలిస్తే..
పోస్టర్స్‌పై డైరెక్టర్ బ్రాండ్‌ని దాసరి స్టార్ట్ చేస్తే దాన్ని చాలాకాలం ఎస్వీ కృష్ణారెడ్డి భారీగానే వాడుకున్నాడు. ఏకంగా తన స్టిల్స్ పోస్టర్లపై దింపేసి సినిమాకు కొత్త లుక్ ఇచ్చాడు. ప్రస్తుతం రాజవౌళి తన బ్రాండ్ ‘స్టాంప్’తో హల్‌ఛల్ సృష్టిస్తున్నాడు. పోస్టర్‌లో పేరు వేయలేదని, బొమ్మపడలేదని తగవులాడుకునే రోజులనుండి పోస్టర్ లుక్ బావుండాలి, సినిమా థియేటర్ వరకు ప్రేక్షకుణ్ణి లాక్కురావాలనే స్టేజ్‌కి తెలుగు చిత్ర పరిశ్రమ రావడం మంచి పరిణామమే. అందుకే నేడు రకరకాలుగా అంచనాకు అందని పోస్టర్లని డిజైన్ చేయడంలో గ్రాఫిక్ డిజైనర్లు శ్రమపడుతుంటే, అలాంటి లుక్స్‌కి దర్శకునిపై నమ్మకంతో కథ డిమాండ్‌కి తలొగ్గి హీరోలు సైతం చేస్తున్నారు.

-పోలిశెట్టి