మెయిన్ ఫీచర్

సవాళ్లకు ఎదురీది గెలుపు తీరానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ కాలపు యువత స్వేఛ్చను కోరుకుంటోంది.. సవాళ్లను ఎదుర్కొంటూ గెలుపుతీరానికి చేరుకోవడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉంటుంది.. పెద్దల అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుంటే నేటి కుర్రకారుకు అసాధ్యం అంటూ లేదు..’ అని ఆమె చెబుతుంటారు. వ్యాపారరంగంలో కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి వనె్న తెచ్చారు. కేరళకు చెందిన అమృతా నాయర్ (32) హోటల్ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుని కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆమె తాత కెప్టెన్ సిపి కృష్ణన్ నాయర్ ‘ది లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్’ వ్యవస్థాపకుడిగా చరిత్ర సృష్టించగా, ఆయన వారసురాలిగా అమృత సరికొత్త ప్రణాళికలకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆయినా హోటల్స్ అండ్ రిసార్ట్స్’ సంస్థకు జెఎండిగా, సిఇఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె వచ్చే ఏడాది కేరళలో ‘ఆయినా మున్నార్’ పేరిట విల్లా రిసార్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ రిసార్ట్ ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఖతార్‌లోని దోహాలో విలాసవంతమైన హోటల్‌ను తెరిచేందుకు కూడా రంగం సిద్ధమైంది.
నెదర్లాండ్స్‌లోని సిహెచ్‌ఎన్ విశ్వవిద్యాలయంలో ఆతిథ్యరంగంలో పీజీ చేశాక న్యూ యార్క్‌లోని ‘కొమెల్స్ స్కూల్ ఆఫ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్’లోను, సింగపూర్‌లోని నన్‌యాంగ్ బిజినెస్ స్కూల్‌లోను అమృత చదివారు. ఆతిథ్యరంగంలో తన కుటుంబానికి ఉన్న పేరుప్రతిష్ఠలను మరింతగా ఇనుమడింపజేయాలన్న సంకల్పంతో ఆమె కూడా అదే రంగంలో ఉన్నత విద్య పూర్తి చేసి పలుచోట్ల తర్ఫీదు పొందారు. న్యూ యార్క్, సింగపూర్, ఇండోనేషియా, జపాన్, చైనా, థాయ్‌ల్యాండ్‌తో పాటు మన దేశంలో కూడా ఆతిథ్యరంగం విస్తరణ, మార్కెటింగ్, పెట్టుబడుల సేకరణ వంటి విషయాల్లో మెళకువలు తెలుసుకున్నారు. కుటుంబ వారసత్వంతో పాటు అనేక అగ్రశ్రేణి హోటళ్లలో పనిచేసిన అనుభవంతో తాను ఇంతటి స్థాయికి చేరుకోగలిగానని ఆమె చెబుతుంటారు. పలు సంస్థల్లో విశే్లషకురాలిగా పనిచేయడంతో వ్యాపార సూత్రాలను తెలుసుకునే అవకాశం కలిగినట్లు వివరిస్తుంటారు. విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసి స్వదేశానికి చేరుకున్న వెంటనే ఆమె తమ కుటుంబానికి చెందిన ‘లీలా ప్యాలెస్‌ల’ ఆస్తిపాస్తుల విభాగానికి నేతృత్వం వహించారు. ఆమె బాధ్యతలు తీసుకున్న అనంతరం గుర్‌గావ్, ఉదయ్‌పూర్, ఢిల్లీ, చెన్నై నగరాల్లో కొత్తగా హోటళ్లను ప్రారంభించారు. చిన్నతనం నుంచే తనకు వ్యాపార రంగంపై ఆసక్తి కలిగిందని, హోటళ్ల నిర్వహణకు సంబంధించి కుటుంబ పెద్దలు మాట్లాడుకుంటే శ్రద్ధగా వినేదాన్నని ఆమె గుర్తు చేస్తుంటారు. వారసత్వంగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టడం వింతేమీ కాదని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ సవాళ్లకు ఎదురీది గెలుపు సాధించడంలో అసలైన ఆనందం ఉందని అమృత అంటారు. పెద్దలను మార్గదర్శకత్వంగా తీసుకుంటూనే యువత తాము అనుకున్నది సాధించాలని చెబుతుంటారు. విభిన్న దేశాలకు, వివిధ సంస్కృతులకు చెందిన వారికి ఆతిథ్యం ఇవ్వడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె విశే్లషిస్తుంటారు. కొన్ని విదేశీ సంస్థల భాగస్వామ్యంతో తాము ప్రారంభించిన హోటళ్లకు ఆదరణ బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార రంగంలో భాగస్వామిగా చేరినా, ఇతరుల నుంచి పెట్టుబడులు సేకరించినా సరైన వ్యూహరచన ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయంటారు. దేశవిదేశాల్లో తాము ఎక్కడ హోటళ్లు ప్రారంభించినా మన సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెబుతుంటారు. హోటళ్లకు పేర్లు పెట్టడంలోనూ భారతీయ మూలాలు, సంస్కృతి ప్రతిబింబిస్తాయని, తాను నేతృత్వం వహిస్తున్న ‘ఆయినా’ సంస్థ కూడా ఇదే తీరులో ఆవిర్భవించిందంటారు. ‘ఆయినా’ అంటే సంస్కృతంలో ‘శాశ్వత అంకురం’ అని అర్థమని, విదేశీ పేర్లు, లోగోలను వాడేందుకు తాను వ్యతిరేకమంటున్నారు. వ్యాపారం ఎంతగా విస్తరించినా ‘బ్రాండ్ ఇమేజ్’ పదిలంగా ఉండాలన్నదే తన తపన అంటారు. ఎక్కడ హోటల్ ప్రారంభించినా స్థానిక పరిస్థితులు, సామాజిక విలువలకు ప్రాధాన్యం ఇస్తే అతిథుల మెప్పు పొందవచ్చని చెబుతుంటారు. ‘విశ్వవేదికపై భారతీయ హృదయాన్ని ఆవిష్కరించడమే’ తన విజయ రహస్యమంటారు. ఇక, ‘పురుషాధిక్య సమాజం’ అన్న పదం గురించి తాను ఎపుడూ ఆలోచించనని, తమ సంస్థల్లో మహిళలు, పురుషులను సమానంగా చూస్తామని ఆమె చెబుతారు. వ్యాపార రంగంలో ఇలాంటి భావజాలం పనికిరాదని, నైపుణ్యం ఉంటే ఎవరినైనా ప్రోత్సహిస్తామంటారు. భాగస్వామ్య వ్యాపారాలకు ఇపుడు విశ్వవ్యాప్తంగా ఆదరణ కనిపిస్తోందని ఆమె విశే్లషిస్తున్నారు.
వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితం కూడా సంతృప్తికరంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆమె అంటారు. తీరిక వేళల్లో గాలిపటాలు ఎగరేయడం, ఉదయానే్న వ్యాయామం సందర్భంగా పరుగెత్తడం అంటే తనకెంతో ఇష్టమని అమృత చెబుతుంటారు. భారతీయ యువతులు నేడు అన్ని రంగాల్లో అద్భుతాలు సాధించడం తనకు ఆనందం కలిగిస్తోందంటారు. ‘కలల్ని సాకారం చేసుకునేందుకు మీ మనసు చెప్పినట్లు నడవండి.. అధైర్యపరిచే వారి మాటల్ని వినకండి.. విజేతల గురించి ఎవరైనా చెబితే ఓపికగా వినండి..’ అని యువతులకు ఆమె ఎపుడూ సూచిస్తుంటారు. *