మెయిన్ ఫీచర్
చిన్న చిత్రాలదే పెద్ద విజయం! (రౌండప్-2017 )
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు చిత్రసీమలో గత రెండు, మూడేళ్లుగా కొత్తనీరు ఎక్కువగా వస్తోంది. అలా వచ్చిన వారు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. దానికితోడు చిన్న సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. తక్కువ బడ్జెట్.. ఎక్కువ ప్రచారం.. అధిక లాభాలు..ఇదీ దీని ఒరవడి. మారుతున్న డిజిటల్ ప్రపంచంలో అందివస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని కొత్తతరం సాంకేతిక బృందం తెరపైకి వస్తుండటంతో పరిశ్రమలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తదనం, టేకింగ్‌లో వైవిధ్యం ఉంటే తప్ప, ఇలాంటి తరహా కథలు ప్రేక్షకులకు నచ్చవు. స్టార్స్ బలం లేని ఇలాంటి చిత్రాలు జనాలకు చేరువ కావాలంటే అందులో దమ్ముండాలి. చిత్రీకరణలో పస కనిపించాలి. అందుకు తగ్గ ప్రచారం కూడా అదే స్థాయిలో ఉండాలి. తెరకెక్కించే ప్రతి ఫ్రేమ్‌లో దర్శకుడి ప్రతిభ కనిపించాలి. డ్రామాను తగ్గించి సహజత్వానికి పెద్ద పీట వేస్తూ విభిన్నమైన ఆలోచనలను తెరపైకి తేవాలి. ఇలా..అన్ని విధాలా సరైన పద్ధతిలో చిత్రాలను రూపొందిస్తేనే అవి జనాలను మెప్పించడమేగాక, బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు తాజా ఉదాహరణగా 2017ను తీసుకోవచ్చు. ఈ ఏడు చిత్రసీమ కొత్త కొత్త ఆలోచనలతో, ఎంతో ఉత్సాహంగా, కథపై నమ్మకంతో సినిమాలను రూపొందించి విజయాలబావుటాను చవిచూసింది. అయితే ఈ ఏడాది చిన్న చిత్రాలదే పెద్ద విజయం కావడం అందరిలో నూతనోత్తేజాన్ని కలిగించింది. ముఖ్యంగా ఎన్నో ఆశలతో.. మరెన్నో కోరికలతో పరిశ్రమలోకి అడుగులుపెట్టే కొత్తతరానికి ఎనలేని ధైర్యాన్ని, కెరీర్‌కు భరోసాని కలిగించి ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసేలా బాటలు చూపింది.
ఎ ప్పటిలాగే 2017లో చిన్న సినిమాల విజృంభణ కనిపించింది. పరిశ్రమలో ఈ ఏడాది తక్కువ పెట్టుబడిపెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించిన చిత్రాలు కొత్త నిర్మాతల్లో సరికొత్త ఆశల్ని రేకెత్తించాయి. సినిమా అనేదే ఓ విచిత్రమైన వ్యాపారం. పెట్టిన పెట్టుబడికి రెండింతలు నష్టాలు చవిచూసే విచిత్రమైన వ్యాపారం ఇది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో ఆశలతో చిత్రాన్ని విడుదల చేస్తే భారీ నష్టాలను చవిచూసిన నిర్మాతలను కదిలిస్తే మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. ఫ్లాప్ సినిమా నిర్మాతలను కదిలించినా, ఈ విషయాలన్నీ వివరంగా మనకు అర్థమయ్యే రీతిలో చెబుతారు. వాళ్లు చెప్పే లెక్కలు చూస్తే మనకు మతిపోవడం ఖాయం. భారీ సినిమాలు భారీ పెట్టుబడులు ఆశించడం సహజం. స్టార్ హీరోలు.. స్టార్ సినిమాలు.. వాటి వ్యయాలు ఇలా.. చూసుకుంటే ఎంత చెట్టుకు అంతగాలి అనిపిస్తుంది. అదే చిన్న సినిమా రూపాయి ఖర్జుపెడితే రెండు రూపాయలు వచ్చిందంటే లాభం కిందే లెక్క. పెద్ద సినిమా పది రూపాయలు ఖర్చుపెడితే వంద రూపాయలు రావడం మామూలే. ఈ పద్ధతిని చూస్తే చిన్న సినిమా కూడా పెద్ద విజయంగానే భావించాలి. కొంత మంది నిర్మాతలు పెట్టుబడులు పెట్టే సమయంలో రూపాయికి రూపాయిని మాత్రమే ఆశిస్తున్నారు. ఎందుకంటే అలా వచ్చిన ఒక్క రూపాయి లాభంతో మరో సినిమా తీసేందుకు ముందుకు వస్తారు. అలా రావాలని వారు సన్నాహాలు కూడా చేసుకుంటుంటారు.
2017 సంవత్సరాన్ని తీసుకుం టే సంక్రాంతి సినిమాలపై పరిశ్రమలోనే కాదు, ప్రేక్షకుల్లోనూ, వారి వారి అభిమానుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ నటించిన ‘ఖైదీ నెం.150’ చిత్రం ఈ సంక్రాంతికి సందడి చేసింది. ఈ చిత్రంతో పాటు బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కూడా థియేటర్లలో సంచలనానికి తెరతీసింది. ఈ రెండు చిత్రాలతో పాటు యువతరం నటుడు, ఫ్యామిలీ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘శతమానం భవతి’కూడా పోటీ పడంది. విడుదలకు ముందు రెండు భారీ చిత్రాల మధ్య శర్వానంద్ చిత్రం ఎలా నెట్టుకొస్తుందోనని అందరూ విశేషంగా చర్చించుకున్నారు. మరి కొందరైతే ‘శతమానం భవతి’ పెద్దహీరోల భారీ చిత్రాల మధ్య వాసనలేకుండా కొట్టుకుపోతోందని కూడా వాపోయారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాల మధ్య శర్వానంద్ ‘శతమానం భవతి’ ఎంత? అని కూడా చెప్పుకున్నారు. కానీ వారి అంచనాలు, వారి ఆలోచనలు.. వారి విసుర్లు.. లెక్కలు అన్నింటినీ తుంగలో తొక్కి శర్వానంద్ ‘శతమానం భవతి’ పెద్ద సినిమాల మధ్య తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. సంక్రాంతి విజేతగా నిలిచి తన సత్తా దశదిశలా చాటింది. కథానాయకుడిగా నటించిన శర్వానంద్‌కు ఈ చిత్రం భలే క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. అందరి నోళ్లలో నానేలా చేసింది. ముఖ్యంగా ఈ విజయానికి కారణం కుటుంబ ప్రేక్షకులే కావడం గమనార్హం. చక్కటి కథతో ఆద్యంతం ఆసక్తి కలిగించేలా కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన ఈ చిత్రంలో శర్వానంద్ నటనకు కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళామణులు నీరాజనాలు పట్టారు. ప్రేక్షకాదరణతో పాటు పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు ఆర్జించి చిత్రసీమలో అందరి నోళ్లలో నానేలా చేసింది. ఊహించిన దానికంటే భారీగా లాభాలు తెచ్చిపెట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల పంటని పండించింది. నిర్మాతల జేబులు నింపి, వారిలో నూతనోత్తేజాన్ని కలిగించింది. వారిలో మరిన్ని చిత్రాల నిర్మాణానికి ఆశలు నెలకొల్పింది.. అడుగులు ముందుకు వేసేలా చేసింది. బడ్జెట్ పరంగా ‘శతమానం భవతి’ రూ.10 కోట్లు కూడా దాటని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.50 కోట్లకు పైనే వసూళ్లు రాబట్ట గలిగిందని ట్రేడ్ విశే్లషకులు చెప్పారు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజ్ నిర్మించిన ‘్ఫదా’చిత్రంతో పాటు నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘నేను లోకల్’ సినిమాలు మంచి విజయాల్ని చవిచూసి చిత్రసీమలో విశేష పేరును తెచ్చుకున్నాయి. మంచి లాభాలు ఆర్జించి పరిశ్రమకు ఊపిరిపోశాయి.
ఊహించని లాభాల బాట పట్టి నిర్మాతల్లో వెలుగుల్ని నింపాయి. ‘నేను లోకల్’తో నాని మరోసారి కొత్త ఉత్సాహంతో విజయాన్ని చవిచూసి తన అల్లరితో, చలాకీ నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు.
‘నేను లోకల్’ చిత్రాన్ని దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో సహా దాదాపు రూ.43కోట్ల వరకూ లాభాలు తెచ్చిపెట్టిందని తెలిసింది. ఇక శేఖర్ కమ్ముల ‘్ఫదా’లో వరుణ్‌తేజ్, సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. వీరి నటనకు తోడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెరుపులు మెరవడంతో ప్రేక్షకులు ఊహించని విధంగా ‘్ఫదా’ అయిపోయారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరూ తమ చలాకీ నటనతో పాత్రల్లో జీవించి ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టారు. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా సాయిపల్లవికి టాలీవుడ్‌లో ఎనలేని క్రేజ్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూపాయికి నాలుగు రూపాయల లాభం తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద బాక్సాఫీస్ కళ కళలాడింది. ‘్ఫదా’ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద కుటుంబ ప్రేక్షకులతో సందడిగా మారింది. అచ్చ తెలంగాణ యాసలో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకుల ముంగిళ్లలో చోటు సంపాదించుకుంది. దాదాపు ఈ చిత్రం రూ. 50 కోట్లకు పైగానే లాభాలు ఆర్జించింది. రొమాంటిక్ కామెడీతో థియేటర్లలో అల్లరి సృష్టించిన ‘అస్త్రం’, ‘అమీతుమీ’ చిత్రాలు సైతం మంచి విజయాల్ని చవిచూసి, బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. లాభాలను ఆర్జించి నిర్మాతల జేబులు నింపి వారిలో మరిన్ని ఆశల్ని రేకెత్తించాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు రూ. 3కోట్లతో తెరకెక్కిస్తే, దాదాపు రూ. 10 కోట్లకు పైనే లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక ఈ ఏడాది ముఖ్యంగా చెప్పుకోవలసింది బాక్సాఫీస్‌ని షేక్ చేసి సంచలనం సృష్టించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం గురించి. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఎలాంటి హడావిడి లేకుండానే థియేటర్లలో అడుగుపెట్టి బాక్సాఫీస్‌ను భారీగా షేక్ చేసేసింది. అందరూ ఆశ్చపడేలా చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. రూ. 5 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం దాదాపు దానికి ఆరు రెట్లు వసూళ్లు రాబట్టిందట. అంతేకాదు, తమిళ, హిందీ రైట్స్ కూడా భారీగానే పలికింది.
ఈ ఏడాది శర్వానంద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందుకు కారణం లేకపోలేదు.. 2017లో సంక్రాంతి బరిలోకి ‘శతమానం భవతి’తో ఎంతో ధైర్యంగా, చిత్రంపై ఉన్న నమ్మకంతో థియేటర్లలో సందడి చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్ ‘మహానుభావుడు’గా మరో విజయాన్ని కొట్టేసి అందరి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి శభాష్..శర్వా! అనిపించుకున్నాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులు.. విమర్శకుల మనసుల్ని సైతం గెలుచుకుంది. ఈ చిత్రంలో అడుగడుగునా దర్శకుడు మారుతి మాయాజాలం కనిపించి, ఆ మాయాజాలంతోనే బాక్సాఫీస్‌ని షేక్‌చేసి మంచి వసూళ్లు రాబట్టుకుంది. దాదాపు రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 40 కోట్ల వరకు ఆర్జించినట్లు తెలిసింది.
గతంలో చిన్న చిత్రాలకు థియేటరికల్ రైట్స్ మాత్రమే వచ్చేవి. శాటిలైట్ ఆశించినంతంగా వచ్చేదికాదు. ఇప్పుడు శాటిలైట్ రేట్లు బాగానే పలుకుతోంది. దాంతో చిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతల్లో ఆశలు కలుగుతున్నాయి. చిన్న చిత్రాల్లో చెప్పుకునే మరో సినిమా ‘ఘాజీ’. తెలుగు, తమిళ హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు లాభాలూ ఆర్జించింది. ‘బాహుబలి’ తర్వాత రానా మార్కెట్ పెరగడానికి ఈ చిత్రం బాగా దోహదపడింది. దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలకు పైనే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం సాధించిన బాక్సాఫీస్ సందడి చూసి నిర్మాతలు ఆనందానికి లోనయ్యారు. చిన్న సినిమా విజయం సాధిస్తే కనీసం ఐదారుకోట్ల వరకూ శాటిలైట్ అమ్ముడుపోయేది. డిజిటల్ రైట్స్ ఇప్పుడు చిన్న నిర్మాతలకు వరంగా మారాయి. అనువాదాల పేరిట కొద్దో, గొప్పో డబ్బుల్ని వెనకేసుకోగలుగుతున్నాయి. ఏదైనా ఓ సినిమా ఫ్లాప్ అయితే ఆ చిత్రాన్ని రూ. 2 కోట్లతో నిర్మిస్తే డబ్బింగ్ రైట్స్ రూపంలో దాదాపు రూ. 3 కోట్ల వరకూ వస్తున్నాయి. దాంతో ఆ చిత్రం ఆడకపోయినా లాభం సమకూరుతోంది. ఆ విధంగా కూడా చిన్న నిర్మాత సేఫ్ జోన్‌లోకి వెళుతున్నాడు. అలా ఇప్పుడు చాలా మంది చిన్న నిర్మాతలు ఈ జోన్‌లోనే కొనసాగుతున్నారు. ఇలాంటి బాటలోనే నడిచిన మరికొన్ని చిత్రాలు కూడా ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అవి ఆనందోబ్రహ్మా, మెంటల్‌మదిలో, కేశవ, అప్పట్లో ఒకడుండేవాడు, వైశాఖం లాంటి చిత్రాలు కూడా అనూహ్య లాభాలతో నిర్మాతల జేబులు నింపాయి. ఇలా మొత్తానికి 2017 సంవత్సరం చిన్న చిత్రాల పెద్ద విజయం లా నిలిచి పరిశ్రమలో ఆశలను సజీవం చేశాయి. ఇదే ఊపుతో రాబోయే 2018లో వీరి నుంచి మరిన్ని మంచి చిత్రాలు వెలుగు చూస్తాయనడంలో ఎలాం టి సందేహం లేదు.