ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కశ్మీర్ సమస్య రావణ కాష్టమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ఆరో మధ్యవర్తిని ఏర్పాటు చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇప్పటికి ఐదుగురు మధ్యవర్తులు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా మధ్యవర్తిగా నియమితుడైన ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ డైరక్టర్ దినేశ్వర్ శర్మ ప్రస్తుతం కశ్మీర్‌లో వివిధ గ్రూపులు, సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ మధ్యవర్తుల విధానాన్ని ప్రారంభించినా అంతకు ముందు పి.వి.నరసింహారావు కూడా తాను ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అనధికార మధ్యవర్తి ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ ఆరో మధ్యవర్తిగా దినేశ్వర శర్మను నియమించి కశ్మీర్‌కు పంపించారు. ఇంత వరకు నియమితులైన ఆరుగురు మధ్యవర్తుల్లో ఐదుగురిని బి.జె.పి ప్రభుత్వాలు నియమిస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టు దిలీప్ పడ్‌గాంవ్‌కర్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు బి.జె.పి ప్రభుత్వాల హయాంలో జరిగినంత కృషి కాంగ్రెస్ హయాంలో జరగలేదు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు పెంచుకునేందుకు వాజ్‌పేయి చేసిన కృషి అందరికి తెలిసిందే.
ఇంతవరకు నియమితులైన ఐదుగురు మధ్యవర్తులు కశ్మీర్ సమస్యకు పలు పరిష్కారమార్గాలు సూచించినా అవేవి కూడా అమలుకు నోచుకోలేదు. మధ్యవర్తులు సూచించిన పలు పరిష్కార మార్గాలను ఆప్పటి కేంద్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి లేదా వాటిని అమలు చేయకుండా వదిలివేశాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వెంటనే కశ్మీర్ సమస్యను పరిష్కరించే అంశంపై దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కె.సి.పంత్ నాయకత్వంలో 2001లో మొదటి మధ్యవర్తిని నియమించారు. 2001లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ సూచించిన విస్తృత స్వయం ప్రతిపత్తి ప్రతపాదనకు పంత్ ఆమోదముద్ర వేశారు. కశ్మీర్‌కు విస్తృత స్వయంప్రతిపత్తి కల్పించటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చునన్నది పంత్ ప్రధాన సిఫారసు. పంత్ నివేదికతో సంతృప్తి చెందని వాజ్‌పేయి ఒక సంవత్సరం తరువాత అప్పటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీని నియమించి ఏ మేరకు స్వయంప్రతిపత్తిని కల్పించవచ్చుననేది పరిశీలించాలని ఆదేశించారు. ఒక వైపు అరుణ్‌జైట్లి పని కొనసాగుతుండగానే వాజ్‌పేయి ప్రముఖ న్యాయవాది రాంజెత్మలానీని అనధికార మధ్యవర్తిగా నియమించారు. అరుణ్‌జైట్లి, రాంజెత్మలానీ జమ్ముకశ్మీర్‌లో విస్తృతంగా పర్యటించి పలువురి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరు ప్రధానంగా కశ్మీర్ అల్లర్లలో పాకిస్తాన్ పాత్రపై దృష్టి కేంద్రీకరించారు. పాకిస్తాన్ జోక్యం వల్లనే కాశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్నాయని, వీరిద్దరూ తమ నివేదికల్లో స్పష్టం చేశారు. వాజ్‌పేయి 2003లో సీనియర్ బ్యూరోక్రాట్ ఎన్.ఎన్.వోహ్రాను మధ్యవర్తిగా నియమించారు. వోహ్రా చేసిన సిఫారసుల మేరకు అప్పటి హోంశాఖ మంత్రి లాల్‌కృష్ణ అద్వానీ 2004లో దేశ రాజధాని ఢిల్లీలో కొందరు హురియత్ నాయకులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. అద్వానీ హురియత్ నాయకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. కశ్మీర్ వేర్పాటువాద నాయకులు ఏ రోజుకూడా బి.జె.పి నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలను సమర్థించలేదు. 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యు.పి.ఏ, ఆ తరువాత 2005లో ఈ సమస్యపై దృష్టిపెట్టింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హురియత్ నాయకులతో చర్చలు జరిపారు. మిర్వేజ్ ఉమర్ ఫరూఖ్ నాయకత్వంలో హురియత్ నాయకులు మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపి కశ్మీర్ లోయలో నిర్వహిస్తున్న అన్ని రకాల ఉద్యమాలను నిలిపివేశారు. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఒక స్క్రీనింగ్ కమిటీని నియమించి దాని సిఫారసుల మేరకు జైళ్లలో ఉన్న పలువురిని విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ 2006లో పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్ లోన్ నాయకత్వంలో వచ్చిన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం, జె.కె.ఎల్.ఎఫ్ నాయకుడు యాసిన్ మాలిక్ బృందంతో విస్తృత చర్చలు జరిపారు. ఇది జరిగిన అనంతరం మన్మోహన్ సింగ్ కశ్మీర్ సమస్యపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయించారు. జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సాగిర్ అహమద్ నాయకత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ చర్చలు జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలని సిఫారసు చేశాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాల సిఫారసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. కశ్మీర్‌లో 2010లో వేర్పాటు ఉద్యమం ఉధృతమై పోలీసుల కాల్పులు, ఉగ్రవాదుల దాడుల్లో దాదాపు వంద మంది పౌరులు మరణించటంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అక్కడికి అఖిలపక్షాన్ని పంపించింది. ఆ తరువాత ప్రముఖ జర్నలిస్టు దిలీప్ పడ్‌గాంవ్‌కర్ నాయకత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక మధ్యవర్తుల కమిటీని ఏర్పాటు చేసింది. పడ్‌గాంవ్‌కర్ కమిటీ జమ్ముకశ్మీర్‌లో దాదాపు ఏడు వందల బృందాలతో ముఖాముఖి చర్చలు జరిపింది. పలు రౌండ్ టేబుల్ సదస్సులు నిర్వహించిన అనంతరం అప్పటి హోం శాఖ మంత్రి పి.చిదంబరానికి తమ నివేదికను అందజేశారు. అయితే ఈ కమిటీ నివేదిక కూడా హోంశాఖ ఫైళ్ల దొంతర్లో కలిసిపోయింది తప్ప అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు తాజాగా దినేశ్వర శర్మ జమ్ముకశ్మీర్ సమస్యపై చర్చల పరంపర ప్రారంభించారు. గత కమిటీల సిఫారసులు మూలకు పడ్డట్లే శర్మ నివేదిక కూడా మూలకు పడుతుంది తప్ప అమలుకు నోచుకోదనేది పచ్చి నిజం. కీలెరిగి వాత పెట్టాలి తప్ప రోగం ఒకటైతే మందు మరొకటి ఇస్తే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది?
కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోవటానికి మొదటి కారణం పాకిస్తాన్ జోక్యమైతే రెండో కారణం మతం. కశ్మీర్ వేర్పాటువాదులు పరిష్కారం కోరుకోకపోవటం మూడో కారణం. స్వయంప్రతిపత్తి కల్పించినా కశ్మీర్ సమస్య పరిష్కారం కాదనేది నిజం. ఆజాద్ కశ్మీర్ మాదిరిగానే జమ్ముకశ్మీర్‌ను కూడా తమ దేశంలో కలుపుకోవాలన్నది పాకిస్తాన్ పట్టుదల. ఈ లక్ష్య సాధన కోసమే వేర్పాటువాదులు పని చేస్తున్నారు. కాశ్మీర్‌లో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాబట్టే దీనిని పాకిస్తాన్‌లో కలిపివేయాలన్నది వేర్పాటువాదుల వాదన. అందుకే వేర్పాటువాదులకు పాకిస్తాన్ అన్ని రకాల సహాయసహకారాలు అందజేస్తోంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వారికి నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపిస్తూ మారణ హోమం సృష్టిస్తోంది. కశ్మీర్‌లో మారణ హోమం కొనసాగించటం ద్వారా భారతదేశాన్ని అస్తిరత్వానికి గురి చేయాలన్నది పాకిస్తాన్, చైనా పాలకుల వ్యూహం. పాకిస్తాన్, చైనా వైఖరిలో మార్పు రానంత వరకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎంతమంది మధ్యవర్తులను నియమించినా కశ్మీర్ సమస్య పరిష్కారం కాదు. కశ్మీర్ మాదిరిగానే భారత దేశంలోని ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా అలజడి, గందరగోళం సృష్టించాలన్నది పాకిస్తాన్ వ్యూహం. కశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టగలుగుతోంది. అయితే దేశంలోని ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మరుక్షణం పాకిస్తాన్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయగలుగుతుంది.
సామ,దాన,్భద, దండోపాయాలతో పాకిస్తాన్‌ను దారికి తీసుకురావటంతో పాటు జమ్ముకశ్మీర్, ముఖ్యంగా కశ్మీర్ లోయ ప్రాంతం ప్రజలను జాతి జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేయగలిగినప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఈ పనికి ఉపక్రమించి ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఓటు బ్యాంకు రాజకీయం కోసం కాంగ్రెస్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. నరేంద్ర మోదీ కనీసం ఇప్పుడైనా జమ్ముకశ్మీర్‌ను జాతి జన జీవన స్రవంతిలో కలిపేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా చెప్పినట్లు పి.ఓ.కె పాకిస్తాన్‌ది జమ్ముకశ్మీర్ మనది. ఈ సిద్ధాంతం ఆధారంగా జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించాలి, ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కశ్మీర్‌లో నివసించేందుకు వీలు కల్పించాలి. జమ్ముకాశ్మీర్ ప్రజలు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా జీవించవచ్చు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్ముకశ్మీర్‌లో నివసించలేరు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయలేరు. ఇలాంటి నిబంధనలు ఉన్నంత కాలం జమ్ముకశ్మీర్ సమస్య పరిష్కారం కాదు. కశ్మీర్ పండితులు జమ్ము, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో కాందిశీకులుగా బతుకుతున్నారు. వీరు కశ్మీర్‌లో స్వేచ్ఛగా, పూర్తి భద్రతతో జీవించే పరిస్థితులను కేంద్రం కల్పించాలి. దీని కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది జరగనంత కాలం కశ్మీర్ సమస్య రావణ కాష్టంలా కాలుతూనే ఉంటుంది.

కె కైలాష్