మెయిన్ ఫీచర్

ఆ‘నందో’త్సాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఎటు చూసినా, ఎవ్వరినోటా విన్నా నంది అవార్డుల ఆ‘నందో’త్సాహమే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత గత ఐదేళ్లుగా
చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డుల వేడుక లేనేలేదు. దాంతో పరిశ్రమలో కాసింత నిరాశ.. నిస్పృహ... ఈ పండగ ఎప్పుడెప్పుడా? అని చిత్రసీమ
ఆసక్తిగా ఎదురుచూసింది. వారి ఎదురు చూపులకు ఫలితం రానే వచ్చింది.

2012, 2013 సంవత్సరాలకు ఒకే సారి ఏడాది మార్చి మొదటివారంలో ‘నంది’ పురస్కారాలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మలిదశలో 2014, 2015, 2016 సంవత్సరాలకు మరోసారి ముచ్చటగా మూడేళ్ల నందులను ప్రకటించి పరిశ్రమలో ఆనందం వెల్లి విరిసేలా చేసింది. నంది పురస్కారాలతో పాటు ఎన్‌టిఆర్ జాతీయ అవార్డు, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రకటించింది. నంది పురస్కారాలకు ఉత్తమ నటులుగా బాలకృష్ణ (లెజెండ్-2014), మహేష్‌బాబు (శ్రీమంతుడు-2015), ఎన్‌టిఆర్ (జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో-2016) లను ఎంపిక చేశారు.
ఎన్‌టిఆర్ జాతీయ పురస్కారాలను లోక నాయకుడుగా ప్రేక్షకుల మన్ననలు అందుకొంటున్న సీనియర్ నటుడు కమల్‌హాసన్ (2014)కు, శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (2015), సూప ర్‌స్టార్ రజనీకాంత్ (2016)కు ప్రకటించిన జ్యూరీ, బీఎన్‌రెడ్డి అవార్డులకు ఎస్.ఎస్. రాజవౌళి (2014), త్రివిక్రమ్ (2015), బోయపాటి శ్రీను (2016), నాగిరెడ్డి-చక్రపాణి అవార్డులకు గాను ఆర్.నారాయణమూర్తి (2014), కీరవాణి (2015), కె.ఎస్.రామారావు (2016)లను ఎంపిక చేశారు. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డులకు సీనియర్ నటులు కృష్ణంరాజు (2014), ఈశ్వర్ (పబ్లిసిటీ డిజైనర్-2015), చిరంజీవి (2016)లను ఎంపిక చేసి సత్తా చాటుకుంది జ్యూరీ. ఇక కథానాయికల విషయానికొస్తే.. ఉత్తమ నటీమణులుగా ‘గీతాంజలి’ చిత్రంలో నటించిన అంజలి (2014), ‘సైజ్ జీరో’లో చక్కటి పెర్‌ఫార్మెన్స్‌ని ప్రదర్శించిన అనుష్క (2015), ‘పెళ్లి చూపులు’లో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న నీతూ వర్మ (2016) నిలిచారు. ఉత్తమ చిత్రాలుగా లెజెండ్ (2014), బాహుబలి: ది బిగినింగ్ (2015), పెళ్లిచూపులు (2016) బంగారు నందిని అందుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత జరుగుతున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఎంతో ఘనంగా కన్నుల పండువగా నిర్వహించబోతుండటం విశేషం. జనవరి 25-31 మధ్య పవిత్ర సంగమం దగ్గర ఈ నంది పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుంది. నంది పురస్కారాలను ఏర్పాటు చేసి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ వేడుక మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకోబోతోంది.
అవార్డులు గెలుచుకున్న ఉత్తమ చిత్రాల విషయానికొస్తే... బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 2014 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు మొదలుకొని మొత్తం ఏకంగా తొమ్మిది నందులను దక్కించుకుంది. ‘అయిన వాళ్లకు కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో.. అదే ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే అరక్షణం కూడా ఆగను’ అంటూ ‘లెజెండ్’లో బాలయ్య చెప్పిన డైలాగుకు థియేటర్లలో అభిమానుల కోలాహలమే కాదు, ప్రేక్షకుల నుంచి దద్దేరిల్లేలా చప్పట్ల హోరు మారుమోగింది. పక్కా వాణిజ్య అంశాలతో కూడిన ఈ చిత్రంలో ఓ మంచి సందేశంపాటు, సమకాలీన పరిస్థితుల్ని ప్రతిబింబించింది. ఇందులో బాలయ్య నటన, సినిమాలోని భావోద్వేగాలు, బోయపాటి శ్రీను దర్శకత్వం.. వెరసి బాక్సాఫీస్‌ని కొల్లగొట్టాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు మొదలుకొని మొత్తం తొమ్మిది నందులు గెలుచుకుంది. ఉత్తమ ప్రతినాయకుడు: జగపతిబాబు, ఉత్తమ గాయకుడు: విజయ్ ఏసుదాసు (నీ కంటి చూపుల్లోకి..), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్: రఘునాథ్, ఉత్తమ ఫైట్ మాస్టర్: రామ్-లక్ష్మణ్, ఉత్తమ సంభాషణల రచయిత: ఎం. రత్నం, ఉత్తమ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావులు నందులు గెల్చుకుని ‘లెజెండ్’ విజేతలుగా నిలిచారు.
అలాగే ‘బాహుబలి: ది బిగినింగ్’ ఈ పురస్కారాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని నిలుపుకుంది. తెలుగు చిత్రసీమ ఖ్యాతి ఖండంతరాలకు వ్యాపింపజేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లను తిరగరాసి టాలీవుడ్ స్టామినాను ఎల్లలు దాటేలా చేసింది. ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపునకు చూసేలా చేసి సంచలనం సృష్టించింది. ప్రభాస్ కథానాయకుడుగా ఎస్.ఎస్. రాజవౌళి దర్శకత్వంలో వెండితెరకెక్కిన ఈ చిత్రం 2015 నంది పురస్కారాల్లో తన సత్తాను చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మొదలుకొని వివిధ విభాగాల్లో మొత్తం 14 నందులను గెలుచుకుని ‘వాహ్..బాహుబలి’ అనిపించుకుంది. ఉత్తమ ప్రతినాయకుడు: రానా, ఉత్తమ సహాయనటి: రమ్యకృష్ణ, ఉత్తమ సంగీత దర్శకుడు: కీరవాణి, ఉత్తమ ఛాయాగ్రహకుడు: సెంథిల్, ఉత్తమ గాయకుడు: కీరవాణి (జటా జటాహ..), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: వి. శ్రీనివాస్ మోహన్, ఉత్తమ కళాదర్శకుడు: సాబు సిరిల్, ఉత్తమ నృత్య దర్శకుడు: ప్రేమ్క్ష్రిత్ (ఇరుక్కపో), ఉత్తమ శబ్ధ గ్రాహకుడు: పి.ఎమ్.సతీష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్: రమా-ప్రశాంతి, ఉత్తమ ఫైట్ మాస్టర్: పీటర్ హెయిన్స్, ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు: పి.రవిశంకర్‌లు ‘బాహుబలి’గెలుచుకున్న నందుల్లో పాలు పంచుకున్నారు.
2016 సంవత్సరానికి సంబంధించి ‘పెళ్లి చూపులు’ ఉత్తమ చిత్రంగా ఎంపికకాగా, ఈ చిత్రంలో కథానాయికగా నటించిన రీతూ వర్మ ఉత్తమ నటిగా నందిని గెల్చుకుంది. ఇక ఇదే సంవత్సరానికి సంబంధించి ‘శతమానం భవతి’, ‘జనతా గ్యారేజ్’ బహుళ ప్రజాదరణ పొందిన కుటుంబ కథా చిత్రంగా అవార్డులను కైవసం చేసుకున్నాయి. ‘శతమానం భవతి’కి 5 నందులు లభించాయి. బహుళ ప్రజాదరణ పొందిన కుటుంబ కథా చిత్రంతో పాటుగా, ఉత్తమ దర్శకుడు: సతీష్ వేగ్నేశ, ఉత్తమ సహాయనటి: జయసుధ, ఉత్తమ క్యారెక్టర్ నటుడు: నరేష్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు: సమీర్‌రెడ్డి నందులను కైవసం చేసుకున్నారు. ఇక ఎన్‌టిఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’కు సతీష్ వెగ్నేశ దర్శకత్వం వహించగా, దిల్‌రాజు నిర్మించారు. దీనికి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు, 7 నందులు లభించాయి. ఇది వరకే ఈ చిత్రానికి రెండు జాతీయ పురస్కారాలు కూడా లభించాయి. నందుల విషయానికొస్తే.. ఉత్తమ నటుడు: ఎన్‌టిఆర్, ఉత్తమ సహాయ నటుడు: మోహన్‌లాల్, ఉత్తమ కథారచయిత: కొరటాల శివ, ఉత్తమ కళాదర్శకుడు: ఏ.ఎస్ ప్రకాష్, ఉత్తమ నృత్య దర్శకుడు: రాజు సుందరం (ప్రణామం.. ప్రణామం), ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్ర్తీ నందులను గెలుచుకున్నారు. ముఖ్యంగా రేపటి తరం వారసులు కూడా ఈ నంది అవార్డుల్లో భాగస్వాములయ్యారు. వారసులకు కూడా అవార్డులు ప్రకటించి జ్యూరీ మరింత అభిమానాన్ని చాటుకుంది. ఉత్తమ బాల నటుల విభాగంలో నందమూరి, ఘట్టమనేని కుటుంబాలకు పురస్కారాలు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రిన్స్ మహేష్‌బాబు కుమారుడు గౌతం కృష్ణ ‘1. నేనొక్కడినే’ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గౌతమ్‌నటన అందర్నీ అలరించిన విషయం తెలిసిందే. 2014లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో గౌతమ్‌ను చూసేందుకు మహేష్‌బాబు అభిమానులు ఎగబడ్డారు. తండ్రీ కొడుకులు ఈ సారి ఒకే వేదికపై నందులను అందుకుంటుండటం అందరికీ కన్నుల పండుగే కానుంది. 2015 సంవత్సరానికి గాను నందమూరి హరికృష్ణ మనవడు మాస్టర్ ఎన్‌టిఆర్ (నందమూరి జానకిరామ్ తనయుడు) ఉత్తమ నటుడుగా నందిని గెలుచుకున్నారు ‘దాన వీర శూరకర్ణ’లో మాస్టర్ ఎన్‌టిఆర్ నటించారు. వీటితో పాటు రఘుపతి వెంకయ్య పురస్కారంలో సైతం వైవిధ్యం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు పబ్లిసిటీ డిజైనర్స్‌కి నంది పురస్కారాల్లో అవకాశం రాలేదు. ఇందులో ఎంతో అనుభవం వున్న ఈశ్వర్‌కు 2015కు రఘుపతి వెంకయ్య పురస్కారానికి ఎంపిక చేశారు. 2104కు గాను సీనియర్ నటుడు కృష్ణంరాజు, 2016కు మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించి జ్యూరీ మరో అడుగు ముందుకేసింది.
అలాగే విప్లవ చిత్రాల దర్శకనిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి నాగిరెడ్డి- చక్రపాణి 2014 అవార్డుకు ఎంపికకాగా, 2015కు సంగీత దర్శకుడు కీరవాణి, 2016కు ప్రఖ్యాత నిర్మాత కె.ఎస్.రామారావులను ప్రకటించారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎన్‌టిఆర్ జాతీయ అవార్డు మరోఎత్తు. 2014కు నటుడు కమల్‌హాసన్‌కు, 2015కు గాను దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు, 2016కు ప్రఖ్యాత నటుడు రజనీకాంత్‌కు ప్రకటించి అవార్డులకే కళని తెచ్చారు. పాత్రలో ఇట్టే ఇమిడిపోయే నటుడు కమల్‌హాసన్. తెరపై పాత్ర తప్ప నటుడు గుర్తుకురాడు. స్వాతిముత్యం, సాగర సంగమం, శుభ సంకల్పం లాంటి ఎన్నో చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. ఆయన నటించిన అనేక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఎన్‌టిఆర్ జాతీయ అవార్డు రావడం పట్ల కమల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శతాధిక చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్రరావుది విభిన్న శైలి. ఆయన చిత్రాలు చూస్తున్నప్పుడు కలిగే అనుభూతే వేరు. అన్ని రకాల కథల్ని స్పృశిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్‌టిఆర్ సినిమాతోనే రాఘవేంద్రరావు కెరీర్ మలుపుతిరిగింది. ఆయన పేరుమీద ఇచ్చే పురస్కారం లభించడం పట్ల ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టయిల్‌కి మారుపేరుగా చెప్పుకునే రజనీకాంత్‌కు 2016కు గాను ఎన్‌టిఆర్ అవార్డు ప్రకటించారు. తమిళ, తెలుగు ప్రేక్షకులే కాదు, దేశ, విదేశాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ వుంది, అభిమానులూ వున్నారు. హీరోగానే కాక, వ్యక్తిగా కూడా రజనీకాంత్‌కి ఎంతో పేరుంది. ఈ అవార్డు పట్ల రజనీకాంత్ ఎంతో ఆనందాన్ని పంచుకున్నారు. ప్రకటించిన జ్యూరీకి, ఏపీ ప్రభుత్వాని కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ నంది అవార్డులపై విమర్శలూ లేకపోలేదు. ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు అవార్డుల ఎంపిక న్యాయంగా జరగలేదని విమర్శిస్తుండగా, దర్శకుడు గుణశేఖర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రుద్రమదేవి’కి ఆశించిన స్థాయిలో అవార్డులు రాకపోవడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. కావాలనే అల్లు అర్జున్‌ను అవమానించారన్న గుణశేఖర్, స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవార్డు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు, ఆమెను కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో గుత్త్ధాపత్యం నడుస్తోందని విమర్శించారు. ఈ విషయంపై స్పందించిన నల్లమలుపు బుజ్జి కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగిందన్నారు. ఉత్తమ నటుడు అవార్డు ప్రభాస్‌కి ఎందుకు ఇవ్వలేదు? రుద్రమదేవి చిత్రానికి ఎందుకు అన్యాయం చేశారు? అని ప్రశ్నించారు. మహిళా సాధికారితను చాటుతూ తీసిన రుద్రమదేవి మూడు ఉత్తమ చిత్రాల కేటగిరిలో నిలవలేకపోయిందని, కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సినిమా విడుదల సమయంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు ఇచ్చిన సబ్సిడీని రుద్రమదేవి సినిమాకు కావాలని ప్రశ్నించడం తప్పా? మరచిపోయిన తెలుగు జాతి చరిత్రను గుర్తుకు తేవడం కరెక్ట్ కాదా? అని ఆయన ఆవేదన చెందారు. జనం మెచ్చిన సినిమాను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఇవన్నీ దొంగ అవార్డులేనని పేర్కొన్నారు. ఈ నంది అవార్డులపై బండ్ల గణేష్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి సైకిల్ అవార్డులంటూ విమర్శలు గుప్పించారు. నంది అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రామ్‌చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడే’కు అవార్డు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది అన్యాయం అన్నారు.
అలాగే 2014 సంవత్సరానికి గాను తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకానికి సంబంధించి కూడా చర్చకు తావిచ్చింది. ఉత్తమ పుస్తకంగా ‘తెరవెనుక తెలుగు సినిమా’కు, ‘నా సినిమా సెన్సార్ అయిందోచ్’ అనే రెండు పుస్తకాలకు ఒకే సంవత్సరం నందులను ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకే సంవత్సరానికి ఇలా చేయడం ఎందుకు? ఈ విషయంలో మిగతా రెండేళ్లకు కూడా ఇద్దరిని ఎంపిక చేసి ఈ విధానాన్ని కొనసాగించొచ్చు కదా? అంటున్నారు.
ఇలా ఎవరి అభిప్రాయం ఎలా వున్నా, ఇన్నాళ్లకు ఐదేళ్ల నందులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు మోక్షం కలిగించడం పట్ల చిత్రసీమ అంతటా ఆ‘నందో’త్సాహమే కనిపిస్తోంది. ఈ పురస్కారాలకు ఎంపికైన వారి ముఖాల్లో సంతోషం తొంగిచూస్తుండగా, తప్పక వస్తుందని ఆశించి భంగపడ్డ వారిలో నిరాశ చోటుచేసుకోవడం సహజమే.
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడున్నర ఏళ్లు కావొస్తుంది. సినీ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వం నుంచి పలు ప్రకటనలు వెలువడ్డాయి. సంతోషించతగ్గ విషయమే. తెలంగాణ ఏర్పడిన జూన్ 2, 2014 నుంచి 31 డిసెంబర్-2015 వరకు, 2016 జనవరి నుంచి డిసెంబర్ 31వరకు సినిమా అవార్డుల కోసం రెండు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీలు ఆహ్యానించింది. ఈ తతంగం మొత్తం ముగిసింది. వీటికి సంబంధించి పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కమిటీలు వేయలేదు. సరికదా.. అవార్డుల పేరేమిటో కూడా స్పష్టంగా ప్రకటించనూ లేదు. ఎంట్రీలపై మాత్రం సింహ అవార్డులంటూ పేర్కొన్నారు. ఇది అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఈ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిసింది. ఏది ఏమైనా మరి తెలంగాణ సినిమా సందడి ఎప్పుడోనని కూడా సినీ జీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు త్వరలోనే వస్తుందని, ఆ తీపికబురు చెవిన పడటానికి ఎంతో కాలం లేదని ఆశిద్దాం.

-ఎం.డి అబ్దుల్