మెయిన్ ఫీచర్

పుస్తక ‘పురుగు’లతో జాగ్రత్త..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడు చూసినా నాలుగు పుస్తకాలు ముందు వేసుకుని ఏదో ఒకటి చదువుతూ వుంటే ‘పుస్తకాల పురుగు’ అనడం చాలామందికి అనుభవంలోకి వచ్చిన విషయమే. నిజంగానే పుస్తకాల్లో పురుగులుంటాయి. మీ బర్త్‌డే సందర్భంగానో, క్లాస్‌లో ఫస్ట్ మార్కులు వచ్చినందుకో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పుస్తకాలను బహుమతిగా ఇస్తారు. మార్కెట్‌లో మనకు నచ్చిన పుస్తకాలను, రెఫరెన్స్ పుస్తకాలను కొనుక్కొని ఇంట్లోనే చిన్న లైబ్రరీ ఏర్పరచుకోవడం చాలామందికి సరదాయే. ఇలా సేకరించిన పుస్తకాలను నాలుగు కాలాలపాటు పదిలపరచుకోవాలి.
‘చిరిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారో మహనీయుడు.. అంతటి విలువైన (వెలకట్టలేని) పుస్తకాలను ఎలా నిర్వహించాలో తెలియాలి. అసలు పుస్తకం తీయడం, పట్టుకోవడంలోనూ మెళకువలవసరం. తడి, తినుబండారాల చేతులతో పుస్తకాలను తగలడంవల్ల కాగితాలు తడిచిపోవడం, నూనె మరకలు పడడం.. కారణాలవల్ల పుస్తకాల్లో ముద్రించిన అక్షరాలు సరిగా కనిపించకుండా పోతాయి. పైగా పలు రకాల కీటకాలకు ఆహ్వానం పలికినట్టవుతుంది. ఒక పద్ధతి ప్రకారం షెల్ఫ్‌లో పుస్తకాలను సర్దడం ద్వారా కావలసిన దానిని ఇట్టే అందుకోవడానికి వీలు చిక్కుతుంది. పైగా ఇంటికే అదనపు ఆకర్షణను జోడించవచ్చు. అల్మారా, బీరువాలలో దాచుకున్న పుస్తకాలలో మనకు తెలియకుండానే చిన్న చిన్న పురుగులు చేరుతాయి. ఎలర్జీ, శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే దుమ్ము, ధూళి కణాల్లో ఉండే కంటికి కనిపించని కీటకాలు.. డస్ట్‌మేట్స్ ఉంటాయి. వాటివల్ల పుస్తకాలు పాడవడమే కాకుండా మన ఆరోగ్యం పాడవుతుంది. సాధారణంగా ఆర్థ్రోపోడా వర్గంలోని కొన్ని తరగతులకు చెందిన పురుగులు పుస్తకాల పుటల్లో చేరి వాటిని పాడుచేస్తాయి.
తెలుపు, లేత గోధుమ రంగుల్లో ఉండే లెపిస్మా అనే పురుగులే పుస్తకాల పురుగులు. పుస్తకాలు భద్రపరచిన షెల్ఫ్‌ల్లో సక్రమంగా గాలి, వెలుతురు సోకకపోవడంతో పుస్తకాల మధ్య తేమ ఏర్పడి ఈ పురుగులు వృద్ధి చెందుతాయి. పుస్తకాలను బైండింగ్ చేసేందుకు ఉపయోగించే జిగురు, స్క్వార్చ్ క్లాత్ (బైండింగ్ క్లాత్)లను పురుగులు తినేస్తుంటాయి. పుస్తకాల్లోని పురుగులు పేజీల చివర్లను కొరికేస్తుంటాయి. వీటిని నివారించే చర్యలు వెంటనే తీసుకోకపోతే మీ లైబ్రరీలో దాచుకున్న ఎంతో విలువైన పుస్తకాలు చిరిగిపోతాయి. పుస్తకాలు భద్రపరచుకునేందుకు చెక్క బీరువాలు, ఇనుప అల్మారాలను వినియోగించిన పక్షంలో తరచూ శుభ్రపరచుకోవడం మంచిది. గోడల్లో ఏర్పాటుచేసుకున్న అల్మరాలకు తరచూ వెల్లవేయడంవల్ల పుస్తకాల్లో పురుగులు చేరవు. చెక్క అల్మారాలు పుచ్చి రంధ్రాలు పడితే వెంటనే వాటిని పూడ్చివేయాలి. వీటికి తరచూ వుడ్ పాలిష్, పెయింట్ వేయాలి. రంగు పోయి తుప్పు పట్టిన ఇనుప బీరువా, ర్యాకుల్లో ఉంచిన పుస్తకాలు త్వరగా చెడిపోతాయి. వాటికి రెడ్ ఆక్సైడ్, పెయింట్ వేయడంవల్ల పుస్తకాలు నాణ్యత కోల్పోకుండానూ, అమరిక అందంగానూ ఉంటుంది.
పుస్తకాల్లోకి పురుగులు, క్రిములు దూరకుండా ఉండాలంటే కనీసం నెలకు ఒక్కసారైనా పుస్తకాలను బాగా దులిపి కాసేపు ఎండలో ఉంచడం మంచిది. పుస్తకాల లైబ్రరీ గాలి, వెలుతురు బాగా సోకే గదిలో ఏర్పాటుచేసుకోవాలి. చిరిగిపోయిన పాత పుస్తకాలు, చిత్తు కాగితాలు, తడిసిన పుస్తకాలు ఏవైనా ఉంటే వెంటనే లైబ్రరీనుంచి వాటిని వేరుచేయాలి. పుస్తకాల అల్మారాల్లో నాఫ్తాలిన్ ఉండల్ని అక్కడక్కడ ఉంచడంవలన ఎలాంటి పురుగులు దరిచేరవు. కొద్దిపాటి నీటిలో కొంత నాఫ్తాలిన్ ఉండల పొడిని కలిపి పుస్తకాల అంచులకు బైండింగ్ క్లాత్‌కు రాయడం తప్పనిసరి. పురుగులు ఆశ్రయించకుండా అల్మారాల్లో లవంగాలను అక్కడక్కడ ఉంచితే సరిపోతుంది. బాగా ఆరిన వేపాకులను కాని, కమలా పండు తొక్కలను కాని కప్‌బోర్డుల్లో ఉంచితే పుస్తకాలకు సిల్వర్ ఫిష్ లాంటి పురుగులు దరిచేరవు.
కంటికి కనిపించని క్రిములతోపాటు పుస్తకాలను ఆశ్రయించే పురుగులలో చెదలు ప్రమాద భరితమైనవి. వీటిని నివారించేందుకు కిరసనాయిలను తగు మోతాదులో అల్మారా, బీరువాలపై స్ప్రే చేయాలి. పుస్తకాల అల్మారా, బీరువాలను శుభ్రంగా ఉంచకపోతే బొద్దింకలు, ఎలుకలు చేరి పుస్తకాలను కొరికేస్తాయి. వీటిని నివారించేందుకు బేగాన్ స్ప్రే, మలాథియాన్ తదితర క్రిమి సంహారక మందులను తగు మోతాదుల్లో పుస్తకాలను భధ్రపరిచే అల్మారాల్లో చల్లాలి. ఎలుకల నివారణకు జింక్ ఫాస్పేట్‌ను ఏదైనా పిండితో కలిపి ప్రయోగించాలి. ఇలాగ విషతుల్యమైన పెస్టిసైడ్స్ వాడవలసివచ్చినపుడు తగు జాగ్రత్తలు తప్పనిసరి. ఎలుకల విషయంలో బోను ప్రయోగించడం సులభం, ప్రయోజనకరం. పుస్తకాల్లో క్రిమికీటకాలను నివారించకపోతే దుర్వాసన వస్తుంది. పైగా ఎలర్జీ, శ్వాసకోశ వ్యాధులకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మీరంతా మీ చిన్ని గ్రంథాలయాల్లో పుస్తకాలను భద్రపరిచేందుకు ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

- మురళీ