మెయిన్ ఫీచర్

దసరా బుల్లోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దసరా పోటీకి పలువురు హీరోలు రెడీ అవుతున్నారు. లిస్ట్‌లో ముందు వరుసలో ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఆ చిత్రం -లవకుశ. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్కే అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నట విశ్వరూపం చూపించడం ఖాయమని అటు ఫాన్స్‌లోనూ ఖుషీ కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల్లోనూ సినిమా సంచలనం రేపుతుంది. ఇప్పటికే శాటిలైట్ హక్కుల విషయంలో భారీ రేటుకు ప్రముఖ టీవి ఛానల్ కొనేసిందని టాక్. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని దసరా రేసులో అందరికంటే ముందు తేవాలని నిర్మాతలూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక దసరా సీజన్ లిస్ట్‌లోవున్న మరో స్టార్ హీరో -పవన్ కల్యాణ్. జల్సా, అత్తారింటికిదారేది చిత్రాల హిట్టు రేంజ్ చూసిన తరువాత.. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా అంటే -ట్రేడ్‌వర్గాల్లో ఎలాంటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రాజెక్టు నుంచి కొద్దికొద్దిగా బయటకు వస్తున్న సమాచారంతో ఈ ఆసక్తి మరింత పెరుగుతూ వస్తోంది. పైగా సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్నారన్న కథనం పరిశ్రమ వర్గాల్లో సెనే్సషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. పైగా ఇందులో పలువురు మాజీ తారలూ నటిస్తుండటం మరో విశేషం. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తుంటే, మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, మాజీ హీరోయిన్ ఇంద్రజ ప్రాజెక్టులో చేరారని తెలుస్తోంది. సినిమాపై అంచనాలు పెరిగేలా ఇందులో అదిరిపోయే గ్రాఫిక్స్‌వర్క్ పెడుతున్నామని నిర్మాతల నుంచి లీకులు వస్తున్నాయి. పవన్‌కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం విడుదలైన తేదీ సెప్టెంబర్ 27. ఆ చిత్రం సంచలన విజయం సాధించటంతో, అదే సెంటిమెంట్‌ని ఈ సినిమాకూ కొనసాగించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, టైటిల్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ‘ఇంజనీర్‌బాబు’ టైటిల్ ఉండే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితం వరకూ వినిపించిన మాట. టైటిల్ ప్రకటించే వరకూ సస్పెన్స్ తప్పదు.
దసరా బరిలో ‘పైసావసూల్’ చేసేందుకు సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తికావొచ్చింది. బాలయ్య మాఫియా డాన్‌గా కనిపిస్తాడని టాక్. ఫస్ట్‌లుక్‌లోనే హీరో క్యారెక్టర్ యాటిట్యూడ్‌ని బాలకృష్ణ చెప్పకనే చెప్పాడు. అసలు పూరి, బాలయ్య కాంబినేషన్‌లో సినిమా అన్నపుడే ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడిచింది. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి అటు ఫాన్స్‌లోను, ఇటు ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఈ ఏడాది శాతకర్ణితో మంచి సక్సెస్ అందుకున్న బాలయ్య, 101వ సినిమాగా ‘పైసావసూల్’ వస్తుండటంతో మరింత క్రేజ్ కనిపిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమాను పక్కాగా దసరాకు విడుదలచేస్తారని ముందే డేట్‌ని ప్రకటించారు. అనుకున్నట్టే ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదల కావొచ్చు. ఇక జీరో సైజ్ కోసం ట్రైచేసి దెబ్బతిన్న హీరో రవితేజ కూడా దసరా రేస్‌లోకి వస్తున్నాడు. కిక్-2 చిత్రంలో రవితేజ లుక్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులు, ఓల్డ్ లుక్కే బెటరంటూ సలహాలిచ్చారు. దాంతో కొంత వొళ్లుపెంచి చేసిన బెంగాల్ టైగర్ కూడా అనుకున్నస్థాయి విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు తన పాత లుక్ కోసం తీవ్రంగా కష్టపడిన రవితేజ, ఏకంగా ఏడాదిపాటు సినిమాకు గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ తరువాత చేస్తున్న చిత్రమే ‘టచ్ చేసి చూడు’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నీ దసరా బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాశికన్నాతో జోడీ కడుతున్న రవితేజ, ఈ సినిమాకు పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. ఇక రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సరికొత్త టైటిల్ పెట్టి ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచేశారు. ఎవరూ ఊహించని విధంగా ‘రంగస్థలం 1985’ అనే టైటిల్ ప్రకటించారు. చరణ్- సుకుమార్ కాంబినేషన్ అనగానే పరిశ్రమ వర్గాల్లో కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌లో ఉంది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి దసరా బరిలో దింపాలన్న ఆలోచనలో ఉంది యూనిట్. రామ్‌చరణ్ చేపలు పట్టేవాడిగా.. అందులోను చెవిటివాడిగా కనిపిస్తాడన్న టాక్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. పైగా 1985 కాలంనాటి పరిస్థితులను చూపిస్తూ, అచ్చమైన పల్లెటూరి ప్రేమకథగా తీస్తున్నారని వినిపిస్తోంది. ఈ సినిమాతోపాటు మహేష్- మురుగదాస్‌ల క్రేజీ కలయికలో రూపొందుతున్న స్పైడర్ సినిమా సైతం దసరా సీజన్‌లోనే విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాను జూన్‌లోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పూర్తికాకపోవడంవల్ల విడుదల తేదీ వెనక్కి జరిగింది. ఇప్పుడిక ఏకంగా దసరా బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం స్పైడర్. ఇలా దసరా బరిలో పెద్ద హీరోల సినిమాలన్నీ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నాయి. దసరా బరిలో అసలు హీరో ఎవరవుతారో చూడాలి.

-శ్రీనివాస్‌రావ్