మెయిన్ ఫీచర్

అసలు హీరో.. విలనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాక్షసుడు ఎంత బలవంతుడైతే -శిక్షించే దేవుడు అంత గొప్పగా కనిపిస్తాడు. విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే -హీరో అంతగా ఎలివేట్ అవుతాడు. అందుకే తెలుగు సినిమా -ఇప్పుడు విలనే్న హీరోగా భావిస్తోంది. హీరోలనే విలన్లు చేస్తూ స్క్రీన్‌మీద చూపిస్తోంది. స్కీం వర్కవుటవ్వడంతో -కుర్ర హీరోలు సైతం విలనిజం పండించడానికి ఎగబడుతున్నారు. తాజాగా బాలకృష్ణ 101వ సినిమాలో కుర్ర హీరో సుధీర్‌బాబు విలనిజాన్ని పండించేందుకు రంగం సిద్ధమవుతుందన్నది ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. మొన్నటికి మొన్న సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి ఒకతరహా విలనిజాన్ని పండిస్తే -ఒకప్పటి హీరో జగపతిబాబు తన మార్క్ స్టయిల్‌తో విలనిజానికి కొత్త ఊపిరి పోస్తూనే ఉన్నాడు. మణిరత్నం సినిమా బొంబాయిలో చాక్లెట్ హీరోలా కనిపించిన అరవింద్ స్వామి -రామ్‌చరణ్ సినిమా ధ్రువలో అద్భుతమైన విలనిజాన్ని పండించి మెప్పించాడు. తెలుగు సినిమాలో విలన్ పరిణామక్రమాన్ని చూస్తే..

చింపిరి జుట్టు. మాసిన గడ్డం. ముఖంపై పులిపిరి. నోట్లో రగులుతున్న బీడీ. గళ్ల లుంగీ. మాసిపోయి పాతబడిన లాల్చీ. బొడ్లో కత్తి. చేతిలో బాణాకర్ర -వెరసి విలన్ ఆహార్యానికి పరాకాష్ఠ. చేయని దుర్మార్గం లేదు. వీధిలో వెళ్లే ఆడవాళ్లని ఏడిపించటం, కాలం కలిసొస్తే అత్యాచారానికి పాల్పడటం. అడ్డొచ్చిన వాళ్లని చితకబాదడం. పోలీసులు పట్టుకెళ్లి జైల్లో వేస్తే, విడుదలైన తర్వాత కూడా రొటీన్ లైఫ్. ‘వీడెప్పుడు ఛస్తాడా?’ -వీడి దినం జెయ్య.. పోగాలం దాపురించి.. వీడికి నూకలు ఎప్పుడు చెల్లుతాయో?’ అన్న ఆడాళ్ల శాపనార్థాలను దీవెనలుగా భావించి వెటకారంగా నవ్వుకోవడం అతగాడి ప్రవృత్తి. కొద్ది రీళ్లు నడిచిన తర్వాత -పొగరుబోతు కథానాయిక కళ్ల ముందు తారట్లాడుతుంటూంది. వెంటబడతాడు. ఏడిపిస్తాడు. వేధిస్తాడు. ప్రేమిస్తున్నానంటాడు. పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూంటాడు. దాంతో వాడిలోని ‘విలన్’ బయటికొస్తాడు. ఇదంతా చూస్తూ- వీడికి కర్మకాండ జరిపించటానికి హీరో తెర మీదికొస్తాడు. దాంతో ‘విలన్’ ఇన్ని రీళ్లూ ప్రయాస పడిన ‘క్రెడిట్’ అంతా హీరో కొట్టేస్తాడు. క్లైమాక్స్‌లో కథానాయకుడి చేతిలో చావుదెబ్బలు తిని.. ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అన్న ఇన్‌స్పెక్టర్ డైలాగ్‌తో తూలుకుంటూ జైల్లో పడతాడు. ఇదీ తెలుగు సినిమా ప్రేక్షకుడు దశాబ్దాలుగా అలవాటుపడిన ‘విలన్’ తాలూకు రొటీన్ చేష్ఠలు.
* * *
సాంఘిక సినిమాల్లోంచి.. జానపదంలోకి వెళ్దాం. ఇక్కడ ఇంకో టైప్ విలన్. ప్రచండసేనుడో, మార్తాండుడో నామధేయం కలిగిన విలన్లు తారట్లాడుతూంటారు. బేసిక్‌గా వీళ్లంతా రాణిగారికి తమ్ములుంగారిగానో.. దుష్టబుద్ధిగల చుట్టంగానో ఉంటూంటారు. రాజుగారిని గుడ్డివాణ్ణి చేసి.. రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించేస్తూంటారు. ఖర్మవశాత్తూ రాణిగారు గర్భందాల్చి బిడ్డని ప్రసవిస్తే -మాయలు పన్ని శిశువుని తుదముట్టించటం.. తానే రాజై పాలించటం జరుగుతుంది. కప్పం కట్టని రాజ్య ప్రజలను చిత్రహింసలు పెట్టడం, ఎవరైనా ఎదురుతిరిగితే మట్టుపెట్టడం చేస్తూ -పనిలో పనిగా రాజ్యానే్న కొల్లగొడుతూంటాడు. ‘ఎవడో ఒకడు వస్తాడు? నీ అంతం చూస్తాడు?’ అని ప్రజలు శపిస్తే.. వాడెవడో వస్తాడట. నా అంతు చూస్తాడట అని హూంకరించటం ఈ జానపద విలన్ లక్షణం. ఇతగాడితో చెడుగుడు ఆడుకోవటం.. చిత్రాతి చిత్ర వేషధారణతో విలన్‌ని బురిడీ కొట్టించి, ఓ చేత్తో రాజ్యాన్నీ, మరో చేత్తో రాకుమారినో.. తోటమాలి కూతురినో చేపట్టడం జానపద హీరో క్లైమాక్స్.
* * *
మళ్లీ..
సాంఘికంలోని సెంటిమెంట్ సీన్లలోకి వస్తే.. ఇక్కడ ఇదోరకం విలనిజం. బావనో.. బామర్దో -‘విభజించి పాలించు’ టైప్‌లో ఉన్నవాళ్లందరి మనస్సుల్లోనూ కలతలు రేపి ఏడిపించి -కొట్లాడుకొని విడిపోయేంత వరకూ చోద్యం చూస్తూంటారు. కుటుంబ వ్యవస్థలో వీళ్లంతా సాఫ్ట్ విలన్లు. క్రూరత్వం ఏ కోశానా కనిపించదు. అంతా కపటమే. ఎంత శోధించినా బయటికి కానరాదు. అసలు ఇలాంటి సాఫ్ట్ విలన్లతోనే తంటా అంతా. హీరోకి ఏం చేయాలో తోచదు. మీదపడి కొడదామా? అంటే -చుట్టరికం అడ్డొస్తుంది. ఏ తల్లో తండ్రో అడ్డుపడతారు. వాళ్లంతా సెంటిమెంటల్ ఫూల్స్ కనుక -ఎటో వైపునుంచి నరుక్కు రావాలని ప్రయత్నిస్తాడు హీరో. ప్రేక్షకుడు కూడా ‘ఇంత కర్కోటకుణ్ణి ఏం చేయాలా?’ అని తెగ ఆలోచిస్తూంటాడు. క్లైమాక్స్ వరకూ -ఈ విలన్ ‘దొంగాట’ ఆడటంతో, విలనిజంలో సైతం బోలెడంత సెంటిమెంట్‌ని రంగరించి రీళ్లకి ‘శుభం’ కార్డు వేసేయ్యొచ్చు.
కొన్నాళ్లపాటు ఈ ‘విలనిజం’ ఇలా కొనసాగి... ఫణిభూషణ్ రావుగానో, భూపతిగానో, భుజంగరావుగానో రూపాంతరం చెందింది. ఈ కేటగిరి ‘విలనిజం’లోకి మోతుబరి భూస్వాములూ.. ధనవంతులు చేరారు. వీరి లక్షణాలూ అచ్చుగుద్దినట్టు పాతతరం ‘విలన్’ మాదిరిగానే ఉంటాయి. అరాచకాలూ, అకృత్యాలూ వీరి నరనరాల్లో జీర్ణించుకొని ప్రజలను పీడిస్తూంటారు. ఈ బానిస బతుకుల నుంచి విముక్తి కలిగించటానికి మళ్లీ ఏ ‘సత్యం’లాంటి వాడో వస్తాడని ఎదురు చూస్తూంటారు. కొన్ని రీళ్ల తర్వాత రానే వస్తాడు. భూపతి దాష్టీకాన్ని ప్రశ్నిస్తాడు. ఎదురు తిరుగుతాడు. జనాన్ని కూడగట్టి బానిసత్వపు సంకెళ్లను తెంచేస్తాడు. దాంతో పంచెకట్టు ‘విలనీ’ తెర మరుగున పడింది.
* * *
‘విలనిజం’ సీన్‌లోకి -బోడిగుండు -చేతిలో పిల్లి పిల్లతో ప్రవేశించాడు విలన్. సాంకేతికత అభివృద్ధి చెందటంతో.. ఊళ్లో ఉండటం మానేసి ‘డెన్’లోకి మారాడు. చుట్టూ తుపాకుల పహారా. హై సెక్యూరిటీ. ‘కుయ్‌కుయ్’మంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు. ఛోటా మోటా రౌడీ షీటర్లకూ ఇతగాడితో ‘ముఖ’పరిచయం కూడా ఉండదు. నీడల్లో కనిపిస్తూంటాడు. అంతా సిగ్నల్స్ వ్యవహారం. ‘సరుకు’ ఎక్కడికి చేర్చాలో చెబుతాడు. ‘మాఫియా’ అన్న మాటకి పునాది వేస్తాడు. స్మగ్లింగ్ అంటే ఇష్టం. ‘క్లబ్’ వ్యవహారాలూ.. దొంగనోట్ల బిజినెస్ -ఒకటేమిటి? అసాంఘిక కార్యకలాపాలన్నీ ఇతడి ‘అండర్ కవర్’లో జరుగుతూంటాయి. హీరో ఏ పోలీస్ ఆఫీసరో అయితే గానీ.. ఇతగాణ్ణి మట్టుపెట్టడం కుదరదు. ఎన్నో సినిమాల క్లైమాక్స్‌లో ఆ ‘మాఫియా’ కాస్తా హీరోకి తండ్రై కూర్చుంటాడు. లేదా మామగారి పోస్ట్‌కి అప్లై చేసుకొని ఉంటాడు. ఏది ఏమైనా -ఎంత పిల్లనిచ్చే మావగారైనా, కన్నతండ్రైనా చట్టం ముందు దోషి కాబట్టి -హీరో తన తల్లి ‘కన్నీళ్లు’ తుడిచి విలన్‌కి జైలుకి పంపిస్తాడు.
* * *
దశాబ్దాలు మారినట్టుగానే -విలనిజంలోనూ బోలెడన్ని మార్పులొచ్చాయి. ఇక్కడ ఏ ఒక్క సినిమానో ఉదాహరణగా చూపెట్టలేం. సూటు బూటు వేసుకొని, పిస్తోలు చేతిలో పట్టుకొని, సిగార్ నోట్లో పెట్టుకొని, ఎంచక్కని ఇంగ్లీష్ మాట్లాడేస్తూ ఎక్కడో దుబాయ్‌లోనో సింగపూర్‌లోనో ఉండి.. అక్కడ్నుంచే ‘సిటీ’లో చక్రం తిప్పేస్తూంటాడు. పోలీసులు ముద్దుగా పిలుచుకొనే పేరు ‘్భయ్’ కావొచ్చు. వాళ్ల దగ్గర ఇన్‌ఫర్మేషన్ ఫైళ్ల కొద్దీ ఉంటుంది. సిటీకొస్తే ఏసేద్దాం అని ఎదురుచూస్తూంటారు. కానీ -ఎప్పుడు వస్తాడో? అసలు వస్తాడో? రాడో తెలీదు. ‘ననే్నం చేయలేవురా?’ అన్న జేజెమ్మ డైలాగ్‌ని బట్టీ పట్టేసి.. పోలీసు యంత్రాంగాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. వరుస హత్యలూ.. కిడ్నాప్‌లూ చేయిస్తూంటాడు. ప్రజల్లో భయభ్రాంతులు కలిగిస్తూంటాడు. ‘డాన్’కి అడ్డొస్తే ఏం జరుగుతుందో పేజీల కొద్దీ డైలాగ్స్ చెబుతాడు. ఇక్కడ్నుంచీ -అతగాడి ట్రెండ్ మరికాస్త మారింది. కథానాయకుణ్నే తన ‘వర్క్’ కోసం వాడేస్తూంటాడు. ఎక్కడో ఆవారాగా తిరిగే హీరోని పట్టుకొచ్చి.. ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ని చేస్తాడు. లేదా- సిబిఐలో స్పెషల్ ఆఫీసర్‌గా తయారుచేస్తాడు. ఇంత ‘ఇంటెలిజెంట్’గా బిహేవ్ చేసే ‘విలన్’ సైతం ఎక్కడో ఒకచోట బోల్తా పడాలి కాబట్టి.. హీరో విపరీత చేష్టలకి బొక్కబోర్లా పడి ఆపైన ఏ బుల్లెట్‌కో బలైపోతాడు.
* * *
పురాణేతిహాసాల్లోకి వెళ్దాం. రాక్షసులు విలన్లు. దేవతలను పీడించే వీళ్లను విష్ణుమూర్తో.. పరమేశ్వరుడో శిక్షిస్తాడు. రాక్షసులు -లౌక్యం తెలీని వాళ్లు. కష్టపడి ‘పాల’ సంద్రాన్ని చిలికితే వచ్చిన ‘అమృతం’ దగ్గరా మోసపోయారు. ఇలా అడుగడుగునా మోసపోతూనే ఉన్నారు. అక్కడ్నుంచీ కాస్త రూపాంతరం చెంది.. తపస్సులూ గట్రా చేసి అనేక వరాలు పొంది.. దేవతల మీదికి దండెత్తడం ప్రారంభించారు. ఈ ‘విలనిజం’ ఆనాటిదే. కాకపోతే -కాలక్రమేణా.. మారుతూ - ‘మైండ్‌గేమ్’ దగ్గరికొచ్చి ఆగింది.
* * *
రావణాసురుడు, కంసుడు.. ఇత్యాదులంతా ‘విలనిజాన్ని’ పెంచి పోషించినవారే. విలన్ ఎంత బలశాలై ఉంటే.. హీరోకి అంత వెయిట్ పెరుగుతుంది. హీరోకేం అద్భుత శక్తుల్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. విలన్‌కి ఆయా శక్తులన్నీ అంటగట్టేస్తే.. ఆ శక్తుల్ని ఎలా నిర్వీర్యం చేయాలన్నది తెలిస్తే చాలు. ‘మైండ్‌గేమ్’ ఆడేస్తాడు.
* * *
విలనిజం ఇప్పుడు హీరోయిజంతో సమానస్థాయికి ఎదిగింది. విలన్ అనేవాడు ఆ పాత ‘ఆలోచనలకు’ చెల్లు చీటీ ఇచ్చేసి తానే కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాడు. బ్యాంక్ దొంగతనాలు కూడా ‘సిస్టమ్’తోనే ఆపరేట్ చేస్తున్నాడు. బిజినెస్‌లో ఎదగాలంటే -ఎదుటివాణ్ణి ఏవిధంగా కొట్టాలో ‘యాప్’ కనిపెట్టేశాడు. సూటు బూటుతోపాటు.. ఆలోచనా విధానాన్నీ మార్చుకొన్నాడు. అల్లరిచిల్లరి వ్యవహారాలకు చరమగీతం పాడేశాడు. కథానాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆపాదించుకొన్నాడు. ఎత్తుకు పైఎత్తులు వేయటం.. హీరో ఆలోచనల్ని పసిగట్టడం.. -ఇలా తనని సూత్రీకరించిన ఆలోచల్లోంచి బయటికొచ్చి -డెన్‌ని వదిలిపెట్టి ఏ/సి గదుల్లోకి షిఫ్ట్ అయ్యాడు. సిగార్ పీలుస్తూ.. ఎక్కడో విదేశాల్లో ఉండటం లేదు. హీరోకి ఢీ అంటే ఢీ అంటున్నాడు. అతగాడి వ్యాపారాలన్నీ చేజిక్కించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. సరికొత్త ‘విలనిజానికి’ ఆజ్యం పోస్తున్నాడు. ‘మాఫియా’ అనే శిలాక్షరాల్లోంచి బయటపడి -బిజినెస్ ఐకాన్‌గా ఎదుగుతున్నాడు.
* * *
చెడుని ఎలివేట్ చేస్తే ‘మంచి’ అనేది బయటపడుతుంది. విలనిజం కూడా అంతే. కథకి సూత్రధారి హీరో అనుకుంటాం గానీ.. కానేకాదు. కథలో విలన్ లేకపోతే.. ఎంతసేపు హీరోయిన్‌తో చెట్టపట్టాలేసుకొని తిరుగుతాడు? అతడి జీవితానికి ఓ అర్థం అంటూ ఉండొద్దా? ఓ టార్గెట్ అంటూ ఉండాలి కదా? క్లైమాక్స్‌లో ఓ ఫైట్ ఉండాలంటే మరి విలన్ ఉండాలి. ప్రేక్షకుల్లో అతడిపట్ల ఏవగింపు కలగాలి. తన్నులు తినాలి. చీవాట్లు తినాలి. పేజీల డైలాగ్స్‌ని భరించాలి. అంతా అసహ్యించుకోవాలి. ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా.. ఎంతగా దూసుకెళ్లినా -ఆఖరికి అతడు ‘డమీ’ అయితేనే ప్రేక్షకులు ఒప్పుకుంటారు. కాబట్టి ‘విలనిజం’కి జై.
దీన్నిబట్టి నీతి ఏమిటంటే -విలన్‌ని ఆరాదిద్దాం. విలనిజాన్ని ప్రేమిద్దాం.

-బిఎన్‌కె