మెయిన్ ఫీచర్

వెండితెరపై స్టోరీడమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

85 ఏళ్ళు..
దాదాపు 7,200 సినిమాలు.. ఇంత విస్తృత ‘సాఫ్ట్‌వేర్’ని సృష్టించిన తెలుగు సినిమా పరిశ్రమకి, మరో 115కు పైగా సినిమాలందించి, దేశంలోనే పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీగా చెక్కుచెదరని స్థానాన్ని సుస్థిరం చేసింది -2016.
తెలుగు సినీ రంగం కథ- కథనాల పరంగా కొత్తగా ఆలోచించిన సంవత్సరమిది! పెద్ద హీరోలు, భారీ చిత్రాలతోపాటు చిన్న సినిమాలకూ అద్భుతమైన ప్రేక్షకాదరణ ఉంటుందని మరోసారి బాక్సాఫీస్ సాక్షిగా నిరూపణ అయిన సంవత్సరం!! ‘స్టార్‌డమ్’కన్నా ‘స్టోరీడమ్’దే పైచేయి అని చెప్పకనే చెప్పిన సంవత్సరం!!!
‘సర్దార్ గబ్బర్‌సింగ్’లు, ‘బాబు బంగారం’లు, ‘డిక్టేటర్’లు ఎంత భారీ ‘బ్రహ్మోత్సవం’ చేసినా ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’లోకి వెళితే ‘పెళ్లిచూపులు’ కూడా ‘కళ్యాణవైభోగమే’ అవుతాయని వెండితెర వేదికపై ‘్ధృవ’పర్చిన సంత్సరమిది.
‘అఆ’ మొదలుకొని ‘జో అచ్యుతానంద’ పాడే వరకూ నిజమైన ‘ఊపిరి’, ‘సాహసం శ్వాసగా సాగిపో’వడంలోనే ఉందని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’లు, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’లో ‘ప్రేమమ్’తో వెళ్లాలని, దారిలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అని అడిగే ‘నాయకి’, ‘అభినేత్రి’ల ప్రశ్నలకి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ని ‘క్షణం’ ఆపకుండా చెప్పేసి ‘దండకారణ్యం’లోని ‘బొమ్మల రామారం’లో ఎదురైన ‘జెంటిల్‌మాన్’ చేత ‘సోగ్గాడే చిన్నినాయన’ అని చప్పట్లు కొట్టించిన సంవత్సరమిది!!

దేశం మొత్తంమీద సినిమా మేకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలలో బాలీవుడ్ తరువాత అగ్రభాగాన నిలుస్తున్న పరిశ్రమ- తెలుగు సినిమా పరిశ్రమే. బడ్జెట్‌లు, స్టార్‌డమ్, వ్యూయర్‌షిప్, బిజినెస్, ఓవర్‌సీస్ మార్కెట్, టెక్నాలజీ, స్టూడియోలు, నటీనట సాంకేతిక నిపుణుల లభ్యత.. ఇలా ‘్ఫలిం మేకింగ్’కు సంబంధించిన అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రతో ముందుకెళ్తున్న టాలీవుడ్, 2016లో ఇంటా బయటా కూడా ఎనె్నన్నో ఆశ్చర్యాలను సినిమాటిక్ ట్విస్ట్‌లతో అందించింది. అంచనాలను కొన్నిసార్లు తల్లక్రిందులు చేసి, మరికొన్నిసార్లు వాటిని నిలబెట్టింది. ఏ అంచనాలేని సినిమాలను సక్సెస్ చేసి, భారీ హైప్‌తో వచ్చిన వాటిని దిక్కులేకుండా చేసింది. మొత్తంమీద 2016 సంవత్సరం టాలీవుడ్‌కు ఎనె్నన్నో ఆశ్చర్యాలను, ఆనందాలను అవాక్కయ్యే వాస్తవాలను అందించింది. మొత్తం దేశానికే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ‘డిమానిటైజేషన్’కు కూడా ‘ట్విస్ట్’ ఇచ్చి ప్రేక్షకుడే సుప్రీమ్ అని నిర్వచించింది.
సీనియర్ హీరోల సంగతేంటి?
టాలీవుడ్‌లాంటి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడైనా హీరోల ఆధిపత్యం కొనసాగడం సహజం. పైగా ‘హీరో వర్షిప్’ విస్తృతంగా వుండే టాలీవుడ్‌లో ఇది మరింత ఎక్కువగా ఉండటం కూడా సాధారణమే. అందుకే ఇప్పటికీ సీనియర్ హీరోల సినిమాలు కూడా ఫ్యాన్ పాలోయింగ్‌తో నడుస్తూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న సీనియర్ హీరోలలో ఈ ఏడాది ఒక్క నాగార్జున మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాడు. పైగా మూడు సినిమాలు చేయడం (సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి, నిర్మలా కానె్వంట్) విశేషం. వీటిలో సోగ్గాడే చిన్నినాయన డ్యూయల్ రోల్‌తో సంక్రాంతి బరిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్ కాగా, ఊపిరి సినిమా పూర్తిగా స్టోరీ డివైన్ సినిమాగా క్లాస్ ప్రేక్షకులను అలరించింది. అంతేగాక ఈ సినిమాలో పూర్తిగా చక్రాలకే అతుక్కుపోయే వికలాంగ బిజినెస్‌మాన్‌గా ఆయన నటన, అసలు అలాంటి పాత్రకు ఆయన అంగీకరించడం ఆయనలోని ప్రయోగాత్మకతను మరోసారి చాటి చెప్పాయి.
ఇక తనదైన శైలిలో బాలకృష్ణ ‘డిక్టేటర్’గా వచ్చాడు. వెంకటేష్ సినిమా ‘బాబు బంగారం’ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చినప్పటికీ, అందరినీ మెప్పించలేకపోయింది. టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో మరొకరైన చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ ప్రారంభమవ్వడం, చాలాకాలపు విరామం తరువాత చిరంజీవి అభిమానులకు ఆనందంగా అనిపించింది.
హీరోల ప్రోగ్రెస్ రిపోర్టు
టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ రేంజ్‌లోవున్న హీరోలలో ఎన్టీఆర్ రెండు సినిమాలతో దూసుకుపోయాడు. ఇంటిలిజెంట్ మైండ్ గేమ్‌తో, డిఫరెంట్ గెటప్‌తో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా రివేంజ్ డ్రామాని కొత్తగా చూపించి విజయాన్ని అందుకోగా, ‘జనతా గ్యారేజ్’ సినిమా పర్యావరణ పరిరక్షణ అనే సామాజిక కథాంశంతో యాక్షన్ డ్రామాగా అలరించింది. అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా మాస్ హిట్‌గా నిలవగా, రామ్‌చరణ్ ‘్ధృవ’ హీరో- విలన్లమధ్య ఇంటిలిజెంట్ గేమ్ ప్లేగా అందరి మన్ననలు పొందింది. బిగ్ లీడ్‌లోవున్న పవన్‌కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ ఎనె్నన్నో అంచనాలు, ఊహలతో వచ్చినప్పటికీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.
నితిన్ హీరోగా వచ్చిన ‘అఆ’ మొదటినుంచీ ఆసక్తిని పెంచి చక్కని ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకాదరణ పొందింది. రామ్ హీరోగా ఈ ఏడాది రెండు సినిమాలు రాగా, వాటిలో ‘నేను.. శైలజ’ మ్యూజికల్ హిట్‌గా నిలవగా, ‘హైపర్’ ఫర్వాలేదనిపించుకుంది. నాగచైతన్య హీరోగా వచ్చిన రెండు సినిమాలూ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సాఫ్ట్ యాక్షన్‌తో వుండగా, ‘ప్రేమమ్’ సినిమా మూడు వయోదశలలో మూడు ప్రేమకథలను కొత్తగా ఆవిష్కరించాయి. ఈ ఏడాది అత్యధిక చిత్రాలలో నటించిన హీరోగా నారా రోహిత్ సంఖ్యాపరంగా తన ఆధిక్యత చాటారు. ఆయన ఆరు సినిమాల్లో (సావిత్రి, రాజాచెయ్యివేస్తే, నాయకి, జ్యో అచ్యుతానంద, తుంటరి, అప్పట్లో ఒకడుండేవాడు) నటించగా, వాటిలో జ్యోఅచ్చుతానంద అతనికి మంచి పేరు తెచ్చింది. తరువాత నాగశౌర్య మూడు సినిమాలతో (కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద) రాగా, ‘కళ్యాణ వైభోగమే’ హిట్‌గా నిలిచింది. అయితే నాని నటించిన మూడు సినిమాలూ ఈ ఏడాది అటు కమర్షియల్‌గా, ఇటు కథ, కథనపరంగా ప్రశంసలు అందుకున్నాయి. కృష్ణగాడి వీరప్రేమగాథ ఈ ఏడాది హిట్లలో ఒకటిగా నిలవగా, మజ్ను, జెంటిలన్‌మాన్ కూడా మంచి ఫలితాలు రాబట్టుకున్నాయి.
మంచి ఊపుమీదున్న సునీల్ ఈ ఏడాది మూడు సినిమాల్లో (కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే) వచ్చినప్పటికీ ఏవీ ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. మంచు మనోజ్ కూడా అటాక్, శౌర్య చిత్రాలతో, సాయిధరమ్ తేజ్ సుప్రీం, తిక్క చిత్రాలతో, ఆది గరమ్, చుట్టాలబ్బాయి చిత్రాలతో థియేటర్లకు వచ్చారు.
అలాగే శర్వానంద్ ఎక్స్‌ప్రెస్‌రాజా, నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, అడవి శేష్ ‘క్షణం’ విజయాన్ని దక్కించుకున్నాయి.
ఇక శ్రీకాంత్ ‘టెర్రర్’, ఆర్ నారాయణమూర్తి ‘దండకారణ్యం’, సందీప్ కిషన్ ‘రన్’, అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’, అల్లరి నరేశ్ ‘సెల్ఫీరాజా’, సుమంత్ ‘నరుడో డోనరుడో’, సుశాంత్ ‘ఆటాడుకుందాం..రా’, కళ్యాణ్‌రామ్ ‘ఇజమ్’, మంచు విష్ణు ‘ఆడో రకం ఈడోరకం’, రాజ్ తరుణ్ ‘నేను నాన్న నా బోయ్‌ఫ్రెండ్స్’, సుమంత్ అశ్విన్ ‘రైట్ రైట్’ సినిమాలతో వచ్చారు. ఈ ఏడాది యువ కమెడియన్లు హీరోలుగా వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభవాన్నిచ్చాయి. శ్రీనివాసరెడ్డి నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’, సప్తగిరి నటించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ప్రేక్షకులతో ఒకే అనిపించుకున్నాయి.
వెండితెరపై కొత్త హీరోయిన్ల తళుకులు
ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించడంలో టాలీవుడ్ తరువాతే ఏ పరిశ్రమ అయినా. టాలెంట్‌ను వెదికిపట్టడంలో, వారికి అవకాశాలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే టాలీవుడ్, ఈ ఏడాదీ దాదాపు 30మంది కొత్త హీరోయిన్లను తెరకు తెచ్చింది. వారిలో ‘నేను శైలజ’లో నటించిన కీర్తి సురేష్ ఈ ఏడాది హాట్ న్యూ స్టార్‌గా అందరి దృష్టినీ ఆకర్షించింది. నేను లైక్ చేస్తున్నాను కానీ లవ్ చెయ్యడంలేదు అనే నావెల్ మాటలతో యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ‘పెళ్లిచూపులు’ సినిమాలో రీతూవర్మ అచ్చమైన హైదరాబాదీగా ఆర్బన్ మెట్రో ఇండిపెండెంట్ అమ్మాయిగా అందరి ప్రశంసలు అందుకుంది. చిరంజీవి ఫ్యామిలీ నుండి బుల్లితెరకు, తరువాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన నీహారిక ‘ఒక మనసు’ సినిమాతో వార్తలలోని వ్యక్తిగా నిలిచింది.
వీరేకాక నివేద (మజ్ను), పూజా ఝవేరి (రైట్ రైట్), మాళవిక నాయర్ (కళ్యాణ వైభోగమే), నందితా రాజ్ (సావిత్రి), సోనారిక (ఆడోరకం ఈడోరకం), మనారా చోప్రా (తిక్క), రూపారెడ్డి (బొమ్మల రామారం), నమితా ప్రమోద్ (చుట్టాలబ్బాయి) సోనమ్ బజ్వా (ఆటాడుకుందాం రా), అనుపమా పరమేశ్వరన్ (ప్రేమమ్), నిత్యా నరేష్ (నందిని నర్సింగ్ హోం), శ్రేయా శర్మ (నిర్మలా కానె్వంఠ్), పల్లవి సుభాష్ (నరుడో డోనరుడో), మంజిమా మోహన్ (సాహం శ్వాసా సాగిపో), నందితా శే్వత (ఎక్కడికి పోతావు చిన్నవాడా), నిక్కీ గల్రాని, డింపుల్ చోపడే (కృష్ణాష్టమి) వంటివారు వెండితెరపై తళుక్కున మెరిశారు.
కొత్త హీరోలు
ఈ ఏడాదీ చాలామంది కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. వీరిలో తనదైన స్టైల్‌తో, నటనతో, భాషతో అందరినీ ఆకట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రహ్మణ్యంతో సెకెండ్ హీరోగా వచ్చి ‘పెళ్లిచూపులు’తో పూర్తిస్థాయి హీరోగా నటించిన విజయ్, ఈ ఏడాది న్యూకమర్స్‌లో టాప్ హీరోగా నిలిచాడు. సీనియర్ హీరో శ్రీకాంత్- ఊహల తనయుడు యంగ్ లవ్‌స్టోరీ ద్వారా ఎంట్రీఇచ్చిన రోషన్ ‘నిర్మలా కానె్వంట్’లో ఆకట్టుకునే లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. టీవీ సీరియల్ మొగలి రేకులతో టాప్ రేంజ్‌కు చేరుకున్న సాగర్ పూర్తిస్థాయి హీరోగా సిద్ధార్థ సినిమాతో రంగప్రవేశం చేశాడు. నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్‌కృష్ణ ‘నందిని నర్సింగ్ హోం’తో, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిఖిల్ గౌడ జాగ్వార్‌తో పరిచయం కాగా, ఇంకా చాలామంది వేర్వేరు సినిమాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు.
కొత్త దర్శకుల ముద్ర
బహుశా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది కొత్త దర్శకులు తమ క్రియేటివ్ వర్క్స్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో షార్ట్ఫిలిం ‘సైన్మా’తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించి, తరువాత పెళ్లిచూపులుతో ట్రెండీ కథను తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పక్కా స్క్రిప్ట్, అర్బన్ యూత్ ఆలోచనలు, సున్నితమైన ప్రేమకథతో ‘పెళ్లిచూపులు’ను తెరకెక్కించి ఈ ఏడాది కంటెంట్ హిట్‌ని, కమర్షియల్ హిట్‌ని అందుకున్నాడు. అలాగే పెద్ద హీరోతో యంగ్ డైరక్టర్లు సినిమా తీయడం పెద్ద బాధ్యత.. ప్రెషర్ కూడా. కానీ వాటన్నింటినీ అధిగమించి తెలుగు సినిమాకు కొత్త ‘జోనర్’ను పరిచయం చేసి ‘సోగ్గాడే చిన్నినాయన’తో నాగార్జునకు ఆల్‌టైం హిట్‌ని అందించిన యువ దర్శకుడు కళ్యాణకృష్ణ కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిపోగా, సత్తా వున్న దర్శకుడిగా గొప్ప అంచనాలను రేకెత్తించాడు. ఒక పాప కిడ్నాప్ కథాంశంతో ‘క్షణం’ సినిమా చిక్కని స్క్రీన్‌ప్లేతో యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించిన రవికాంత్, రియలిస్టిక్ కథాంశంతో తమిళ న్యూవేవ్ స్టైల్లో క్రైం, యాక్షన్ స్టోరీని తెరకెక్కించిన నిషాంత్ ఉదారి (బొమ్మల రామారం) కూడా అందరి దృష్టినీ ఆకర్షించారు. వీరేకాక జగదీష్ తలశిల (లచ్చిందేవికి ఓ లెక్కుంది), గవిరెడ్డి శ్రీనివాసరెడ్డి (సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు), సాగర్ చంద్ర (అప్పట్లో ఒకడుండేవాడు), అనీల్ కనె్నగంటి (రన్), జెబి మురళీకృష్ణ (రైట్ రైట్), టివి గిరి (నందిని నర్సింగ్ హోం), రవి పచ్చిపాల (ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి), శివరాజ్ కనుమూరి (జయమ్ము నిశ్చయమ్మురా), అరుణ్ పవార్ (సప్తగిరి ఎక్స్‌ప్రెస్) ఈ ఏడాది టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకులు.
డిఫరెంట్ ఫిల్మ్స్
టాలీవుడ్ సినిమాలన్నీ సాధారణంగా రొటీన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలే. అయితే ప్రతి ఏడాది వైవిధ్యమైన కథ, కథనాలు, నవ్య స్క్రీన్‌ప్లేతో కూడా కొన్ని సినిమాలు రావడం జరుగుతుంది. సినీ విమర్శకులను, సినీ ప్రేమికులను సైతం అలరించగలిగే ఇలాంటి డిఫరెంట్ ఫిల్మ్‌లు 2016లో కొన్ని వచ్చాయి. కానె్సప్టుపరంగా, కథాపరంగా, పిక్చరైజేషన్, మ్యూజిక్, నటీనటుల నటన, పాత్రల చిత్రణ, సంభాషణలు, కెమెరా, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే... ఇలా అన్ని రకాలుగా కొత్తదనాన్ని అందించిన సినిమాలో మొదట చెప్పుకోదగింది పెళ్లిచూపులు. ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్‌స్టోరీ, మోడరన్ లైఫ్‌స్టైల్‌ని యూత్ సెంట్రిక్ ఐడియాలజీతో చక్కని భావోద్వేగాలను అందించడంలో సినిమా సక్సెస్ అయింది. పెళ్లిచూపులు అనే ఏజ్-ఓల్డ్ ట్రెడిషన్‌ను బేస్ చేసుకుని ఆధునిక కథను చెప్పడంలో సినిమా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. తెలంగాణ సినిమాని కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పడానికి కావలసిన కొత్త సిలబస్‌ని చూపించి, ఈ తరహా సినిమాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాక నిర్మాతలందరూ ఇపుడు యువ దర్శకులకు అపాయింట్‌మెంట్ ఇస్తూ వారి కథలు వినేలా, ఇండస్ట్రీ దృక్కోణాన్ని మార్చడంలో ఈ సినిమా సక్సెస్ అయింది.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘మనమంతా’ కూడా రియాలిటీకి దగ్గరగావుండే కథాంశంతో, సామాన్య వ్యక్తుల జీవితాల్లోని సంఘటనల సమాహారంగా మొదట్లో నాలుగు భిన్న కథలుగా అనిపిస్తూ చివరికి ఒక కుటుంబానికి చెందిన నలుగురి జర్నీగా చక్కని స్క్రీన్‌ప్లేతో వచ్చిన సినిమాగా టాలీవుడ్ సినీ సూత్రాలకు కొత్తదనాన్ని అందించింది.
అలాగే ప్రకాష్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘మనవూరి రామాయణం’ సినిమా సున్నితమైన భావోద్వేగాలతో తక్కువ పాత్రలతో, తక్కువ లొకేషన్లతో, మానవ సంబంధాల్లోని ఔన్నత్యాన్ని చక్కగా తెరకెక్కించింది. ‘ఏ కళ అయినా, అది సినిమా అయినా, నాటకమైనా.. దాని అంతిమ లక్ష్యం మనిషిలో సానుకూల అంశాలవైపు మార్పును తీసుకురావడమే కావాలి. అది కారెక్టరైజేషన్‌లో ఎలా వుండాలంటే గొంగళిపురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందినంత సహజంగా వుండాలి. ఈ పరిణామానికి సన్నివేశాల బలమైన కారణాలు కావాలి’ అని సత్యిజిత్‌రే వంటి మహాదర్శకులు చెప్పిన మాటలకు తెరెత్తు నిదర్శనంగా ఈ సినిమా నిలిచింది.
డబ్బింగ్, రీమేక్, మల్టీ లింగ్వల్
2016లో దాదాపు 30వరకు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. వాటిలో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ కనీ వినీ ఎరుగని విజయాన్ని సాధించి ఇటీవలి కాలంలో వంద రోజులు ప్రదర్శితమైన సినిమాగా సంచలనం సృష్టించింది. అలాగే ‘మన్యంపులి’ అందరినీ ఆకట్టుకోగా, హాలీవుడ్ సినిమా ‘జంగిల్ బుక్’ తెలుగు డబ్బింగ్ కూడా చక్కని సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం వున్న పరిస్థితులలో సినిమా నిర్మాణం అనేది ప్రయాసలతో కాక, భారీ ఖర్చుతో కూడుకున్నది కావడంవల్ల దాన్ని అధిమించడానికి నిర్మాతలు ఒక సినిమాను బహు భాషల్లో విడుదల చేయడం ద్వారా నిర్మాణ వ్యయాలకు ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చినవే మల్టీలింగ్వల్ చిత్రాలు. ఈ ఏడాది అలా, నాగాభరణం, మన ఊరి రామాయణం, అభినేత్రి, కిల్లింగ్ వీరప్పన్, జనతా గ్యారేజ్, జాగ్వార్, నాయకి వంటి సినిమాలు బహు భాషలలో ఏకకాలంలో నిర్మాణమయ్యాయి.
ఇక సినిమాల హిట్ల విషయంలో విశిష్టమైన ఫార్ముల అనేదేదీ లేదనేది తెలిసిందే. అందుకే ‘రిస్క్’ తీసుకోవడానికన్నా ముందు ఇతర భాషా చిత్రాల్లో హిట్ అయిన సినిమాని రీమేక్ చేయడం అనే ట్రెండ్‌ని టాలీవుడ్ దశాబ్దకాలం నుండి పాటిస్తూ వస్తోంది. ఆ సంప్రదయానే్న కొనసాగిస్తూ ఈ ఏడాదీ ఎన్నో రీమేక్‌లను తెలుగు తెరపై ఆవిష్కరించింది. వాటిలో ధృవ (తని ఒరువన్), ప్రేమమ్ (మలయాళ ప్రేమమ్), నరుడా డోనరుడా (విక్కీ డోనర్), ఊపిరి (ఫ్రెంఛ్ ఇన్‌టచ్‌బుల్స్), రైట్ రైట్ చిత్రాలు ప్రముఖంగా చెప్పుకోదగినవి. కాగా, 1973లో వచ్చిన ‘మీనా’ సినిమాకి ‘ఫ్రీమేక్’గా ‘అఆ’ సినిమా సినీ విమర్శకులు, చరిత్రకారుల దృష్టిని ఆకర్షించింది.
పాఠాలేంటి?
2016లో టాలీవుడ్‌లో విడుదలైన అన్ని రకాల సినిమాల ఫలితాలు సినిమా పరిశ్రమకు, హీరోలకు, కొత్త దర్శకులకు, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, ఆఖరికి ప్రేక్షకులకూ కొత్త పాఠాలు నేర్పింది. సాధారణంగా తెలుగు సినీరంగం స్టార్ పవర్‌తోనో, హీరోల ఇమేజ్‌తోనో నడుస్తున్నప్పటికీ, అంతటి గ్రేట్ స్టార్స్ భవిష్యత్తులో నిర్ణయించగలిగేది సామాన్య ప్రేక్షకుడే అనే విషయం సుస్పష్టమైంది. హీరోలు ఫ్యాన్స్‌ని నమ్ముకోవడంకన్నా ఆడియన్స్‌ను నమ్ముకోవడం మంచిదనే విషయాన్ని ఈయేడు సినిమా ఫలితాలు వెల్లడిస్తున్న సత్యం. భారీ ప్రచారం, హైప్, ఆర్ట్ఫిషియల్ బిల్డప్ అన్నీ కొంతవరకు మాత్రమే ప్రేక్షకులను, మొత్తంగా ఆయా హీరోల ఫ్యాన్స్‌ని మభ్యపెట్టగలవు. కానీ అందరినీ మాయచేయలేవని నిరూపణ అయింది.
రొటీన్‌కు భిన్నంగావుండే కథలు, కథనంలో నవ్యత, ప్రెష్ ఫీల్‌తో కూడిన సినిమాలకు ప్రేక్షకులు పట్టం కడతారని, అలాంటి కథలకి స్టార్‌డమ్‌కూడా తోడైతే అవి సూపర్‌డూపర్ హిట్ అవుతాయని వెల్లడవుతోంది. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, రివేంజ్, థ్రిల్లర్, రొమాన్స్, సెంటిమెంట్.. జోనర్ ఏదైనా తెరపై ఎంత చక్కగా ప్రెజెంట్ చేయగలిగారనేదే కొలమానమని తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ చిత్రాన్ని 2016 సాక్షిగా మళ్లీ రుజువుచేశారు. సినీ ఫార్ములాలు, డిమానిటైజేషన్ వంటి ఆర్థిక సూత్రాలకు అతీతంగా తెలుగు ప్రేక్షకుడి మనసుకు నచ్చితే ఆ సినిమాకు సింహాసనం వేస్తాడని, టాలీవుడ్ రథాన్ని నడిపే పగ్గాలు ఎప్పడూ ప్రేక్షకుడి చేతిలోనే ఉంటాయని 2016 చెప్పకనే చెప్పింది.

- మామిడి హరికృష్ణ