మెయిన్ ఫీచర్

‘పేరు’లో నేముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శుభం’ కార్డు పడింది. గ్రూప్ ఫొటో వచ్చేసింది. థియేటర్‌లో అప్పటివరకూ సినీ కథని వీక్షించిన
ప్రేక్షకుడు కూడా -రౌద్ర వీర బీభత్స కరుణ శృంగార -ఇత్యాది రసాలన్నింటినీ తనివితీరా
ఆస్వాదించినా- తన మొదటి సూత్రం సినిమాలో ‘ఇంప్లిమెంట్’ అయ్యిందా? లేదా? అని తరచి చూట్టం సహజం. ఆ మొదటి సూత్రం ఏమిటంటారా? టైటిల్‌తో కథ సరిపోలిందా?
లేదా? అన్నది.

కొన్ని దశాబ్దాలుగా.. ఏడాదికి నూట పాతిక సినిమాల చొప్పున రిలీజ్ అయ్యాయనుకుందాం. టైటిల్స్ ఎక్కణ్నించీ వస్తాయి? అక్కడికీ పాపం.. చెప్పినచోట చెప్పిన కథ విప్పిచెప్పకుండా చెప్పుకొస్తున్నా.. ‘టైటిల్స్’ విషయంలో నో కాంప్రమైజ్. కథకి అదే జీవం. ఏ సినిమా అంటే ఫలానా అంటూ కథ చెప్పకండా.. టైటిల్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి -కచ్చితంగా ఆ టైటిల్ ప్రేక్షకుడి మదిలో ఏదో రూపేణా ముద్ర పడిపోవాలి. సినీ ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో చాలా కసరత్తులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. నోరు తిరగని పేర్లు కాకుండా.. సరళంగా అతి సున్నితంగా మృదు మధురంగా- క్యాచీగా ఉండేట్టు చూడాల్సిన గురుతర బాధ్యతని రచయిత లేదా దర్శకుడు తీసుకొని -టైటిల్‌ని నిర్ణయించటం.. ఆపైన పబ్లిసిటీతో జనావళికి అందించటం -ఇదంతా ఓ ప్రక్రియ. దశాబ్దాలు గడిచాయి. టైటిల్స్‌కి కొరత ఏర్పడింది. టైటిల్స్ ఎక్కడని వెతుకుతారు? కాబట్టి- ‘తను మొన్ననే వెళ్లిపోయింది’లాంటి వెరైటీతో ఆకట్టుకొనే ప్రయత్నాలూ జరిగాయి. ఇక్కడ మళ్లీ మొదటి సూత్రాన్ని ఆపాదించుకొనే ముందు.. టైటిల్ జనంతో మమేకం కాకపోతే.. ఎటువంటి ఫలితాలు ఎదురుచూస్తుంటాయో తెలిసిందే కనుక.. ఆచితూచి అడుగులు వేయాల్సిందే.

సినిమా మధ్యయుగాన్ని దాటింత్తర్వాత.. పాతతరం సినీ పాటలు టైటిల్స్‌గా రావటం ప్రారంభమైంది. ‘చూపులు కలిసిన శుభవేళ..’ అంటూనో.. ‘వివాహ భోజనంబు..’ అనో.. ఇలా అప్పటివరకూ జనం ఎంతో తీయగా పాడుకొనే పాటలు టైటిల్స్‌గా రూపాంతరం చెంది.. పోస్టర్లని అలరించాయి. ఎంచక్కా ఆ పోస్టర్‌పై ఆ పాటని చూసి.. మధురానుభూతిని చెంది... ఆయా చిత్రాల తాలూకు సన్నివేశాల్ని మదిలో తలచుకొని మేను పులకరించి.. ఈ చిత్రాల్ని సైతం ఆస్వాదించేందుకు ఉత్సుకత చూపాడు ప్రేక్షకుడు. అయితే- టైటిల్ చూసి సినిమాకి వెళ్తే.. ఆ అనుభూతిని అందించకపోతే తిప్పికొట్టిన సందర్భాలూ లేకపోలేదు. సినిమాకి రప్పించటానికి ఇది తొలి మెట్టు. ఆపైన కథ ప్రేక్షకుడిని నడిపిస్తుంది.
కథకి టైటిల్ ప్రాణం అని చెప్పుకొన్నాం. ‘గండికోట రహస్యం’ అంటూ.. ‘చిక్కడు దొరకడు’ అంటూనో.. ‘గండర గండడు’ అనో.. కథని చెప్పకనే చెప్పిన టైటిల్స్ ఉన్నాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకొనేట్టు చేసిన టైటిల్స్.. ‘ఏం మాయ చేశావె’ అని సింపుల్‌గా ఒక రొమాంటిక్ లుక్‌ని అందించిన టైటిల్స్.. -ఇలా చెప్పుకొంటూ పోతే దశాబ్దాల వెనక్కి.. ఆపైన ముందుకి వెళ్ళాలి.
కొన్ని దశాబ్దాల మాట. సినీ కథలో ఎంత సెంటిమెంట్ పండించినా.. ఎన్ని ఫైటింగ్స్ గట్రా పెట్టినా.. ఫ్యామిలీ డ్రామాని నడిపించినా.. కామెడీని వొలికించినా.. ఎంతగా చిలిపితనాన్ని గుప్పించినా- ఆఖరికి ఆ కథకీ టైటిల్‌కీ ఏదైనా పొంతన ఉందా? లేదా? అని చూట్టంతో ప్రేక్షకుడి ఆలోచన మొదలయ్యేది. ఇది కొనే్నళ్లుగా సాగుతూనే ఉంది. ‘కలసిఉంటే కలదు సుఖం’ ‘ఇల్లరికం’ ‘గుండమ్మ కథ’ - ‘మిస్సమ్మ’ ఏ కథనైనా తీసుకోండి. చివరాఖరికి -ఆ టైటిల్ తాలూకు డైలాగ్‌తో శుభం పడాల్సిందే. దాంతో హండ్రెడ్ పర్సెంట్ లవ్‌స్టోరీలా సంతృప్తి చెందేవాడు ప్రేక్షకుడు.
‘కులగోత్రాలు’ -టైటిల్‌కి న్యాయం జరిగిందిరా.. అనుకునే ప్రేక్షకుడు ఒకరైతే.. కులగోత్రాలేవిటిరా? మలమూత్రాల్లా? అంటూ వ్యాఖ్యానించిన వారూ ఉన్నారు. ఇదంతా తెరముందు బాగోతం. అలా టైటిల్స్‌తోపాటు కథల్తోపాటు దశాబ్దాలుగా ముందుకి వస్తే.. తాజాగా -అలనాటి సినిమా పాటలన్నీ మళ్లీ మళ్లీ ‘టైటిల్స్’ రూపేణా వచ్చేస్తున్నాయి. రావటంలో తప్పు లేదు. కానీ- జనం నోళ్లల్లో నానుతూన్నాయి కాబట్టి.. ఆ టైటిల్స్‌తో మార్కులు కొట్టేసి.. కమర్షియల్ హిట్ కొట్టేద్దామనుకొంటూన్న ‘తెలివిమీరినతనం’ అనర్థాలకు దారితీస్తోంది.
ఒక్కో సందర్భంలో కథకీ.. టైటిల్‌కీ ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. చెప్పిన కథ ఒకటి.. పెట్టిన టైటిల్ మరొకటి అన్న చందాన మారుతోంది. కథలో పాటలు సందర్భోచితంగా వస్తే ఎంత బావుంటుందో?! ప్రత్యేకించి కామెడీ ట్రాక్ లేకండా.. సిట్యుయేషనల్ కామెడీ అయినప్పుడు ఎంత రక్తి కడుతుందో? కథ చిక్కగా సన్నగా.. మూడు కప్పులు ఎక్కువగా వచ్చేట్టు ఉంటే.. ఏమాత్రం సాగతీత లేని కథల్ని ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో?! అలానే ‘టైటిల్’ని బట్టి కథ.. కథని బట్టి టైటిల్ ఉంటే అంతగా ఆడేస్తుంది.
కొన్ని ఉదాహరణలు చూద్దాం. అయితే- ఇది విమర్శ కాదు. వ్యాపారరీత్యా ఎవరి ఆలోచనలు వారికుంటాయి. కమర్షియల్ పంథాలుంటాయి. ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోవటానికీ.. అనేకానేక జిమ్మిక్కులూ ఉంటాయి. వ్యాపార ధోరణి కాబట్టి.. ఇవి కేవలం మామూలుగా అనుకొనే మాటలు. అంతే.
* * *
‘ప్రియతమా.. నీవచట కుశలమా’- ‘గుణ’ చిత్రంలోని పాట ఇది. ‘ప్రియతమా.. నీవచట కుశలమా.. నేనిచట కుశలమే.. ఊహలన్ని పాటలె కనుల తోటలో..’ అంటూ భావగర్భితంగా సాగుతుందీ పాట. అదే టైటిల్‌తో వరుణ్ సందేశ్ సినిమా వచ్చింది. ఓ మధ్యతరగతి అమ్మాయి -ఆమెలో సాగే సాదాసీదా ఆలోచనలు.. ఓ గొప్పింటి అబ్బాయి.. అతడి హైమైండెడ్ ఆలోచనలు.. ప్రేమలూ ఎలా సాగాయన్నది కథ. రొమాన్స్ -యాక్షన్ -డ్రామాతో ఉన్న ఈ కథలో ‘ప్రియతమా.. నీవచట కుశలమా’ అని ఎన్నిసార్లు ప్రేక్షకుడు అనుకొన్నాడో తెలీదు మరి.
* * *
‘ఎంత అందంగా ఉన్నావె..’ - ‘డాన్’ చిత్రంలో ‘ఎవరే నువ్వు..’ అంటూ వచ్చిన పాట. అలజడి రేపిన చిరునవ్వు లాంటి అమ్మాయిని అనేకానేక ప్రశ్నలు వేస్తూ.. ప్రశంసిస్తూ.. ఆ ప్రేమలేఖలో ఎనె్నన్నో ఊసులు చెప్తాడు హీరో. ఆ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా కథలో బోలెడన్ని మలుపులు. సినిమా -ఓ క్రైం గ్యాంగ్‌తో మొదలవుతుంది. తాగిన మైకంలో తనని ముద్దు పెట్టుకొన్న అబ్బాయితో ప్రేమలో పడిన అమ్మాయి కథ ఇది. ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ‘మోసాల’ కథ. తాగిన మైకంలో ‘ఎంత అందంగా ఉన్నావె..’ అని అమ్మాయి గురించి తలపోశాడా అబ్బాయి? ఏమో?!
* * *
‘రోజా’ చిత్రంలో ‘చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ..’ పాట ఎంతలా జనంలోకి వెళ్లిందో చెప్పలేం. ఏ జలపాతం దగ్గరికి వెళ్లినా.. ఏ సెలయేటిలో మునిగినా.. ఆ పాట తాలూకు ‘చల్లదనం’ మనసుని వెంటాడుతుంది. జాబిలిని తాకి.. ముద్దులిడు ఆశ.. అని అనిపిస్తుంది. నిజానికి ఆ టైటిల్‌కి కచ్చితమైన న్యాయం జరిగింది సినిమాలో. ఇదొక రొమాంటిక్ సినిమా.
2012లో రిలీజైన ‘గోపీ గోపికా గోదావరి’ సినిమాలోని పాట ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా.. ప్రాణం విలవిల’. ప్రాణ ప్రియుడి కోసం ప్రేయసి ‘మనసు’ ఎంతగా విలవిలలాడిందో తెలియజెప్తుందీ పాట. ఇక సినిమా కథ చూద్దాం. ‘నువ్వెక్కడుంటె నేనక్కడుంటా’ -కలలకి సంబంధించింది. హీరోకి వచ్చే కలలన్నీ నిజమవుతూంటాయి. గ్యాంగ్‌స్టర్ అయిన హీరో.. లవ్ అట్ ఫస్ట్ సైట్‌లా.. నాయికని ప్రేమిస్తాడు. ఆ తర్వాత -అతనికి వచ్చిన కలలన్నీ నిజమయ్యాయా? ఏం జరిగిందన్నది క్లైమాక్స్. మరి -నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా..’కి ఏ విధంగా జడ్జిమెంట్ జరిగిందో సందిగ్ధం.
* * *
‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘తూనీగా.. తూనీగా.. ఎందాక పరిగెడతావె..’ అంటూ ప్రేక్షకుణ్ణి సైతం అరకు తోవల్లో పరుగెత్తించిన పాట - ‘తూనీగా.. తూనీగా..’గా రూపాంతరం చెందింది. ఇదొక లవ్‌స్టోరీ. చిన్నతనంలో -కత్తులు దూసుకొని.. మాటామాటా అనుకొన్న ఓ అమ్మాయి అబ్బాయి ఆ తర్వాత కలుసుకొంటే ఏం జరిగిందన్నది కథ. ‘తూనీగా.. తూనీగా’తో వీరికి ఎటువంటి సంబంధం లేదు. సైకిల్ టైరు దొర్లించుకుంటూనో.. పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూనో ఉండదీ కథ.
* * *
జనంలో ఏ మాటైనా.. పాపులర్ అయ్యిందో -దాన్ని సినిమా టైటిల్‌గా పెట్టేసి.. మార్కులు కొట్టేద్దామనుకొంటారు. ‘ఏం బాబూ లడ్డూ కావాలా’ అన్న అడ్వర్టయిజ్‌మెంట్ మాట తెలిసిందే. టైటిల్ క్యాచీగా ఉందని సినిమా తీసేశారు. లడ్డూలాంటి భామలతో శివాజీ నటించాడు. ఐతే- లడ్డూ లాంటి తీపి కబురుని మిగల్చకుండానే వెళ్లిపోయాడు.
* * *
‘మిస్సమ్మ’ చిత్రంలో ‘ఏమిటో ఈ మాయ’ ఎంతగా కలవరపెట్టిందో.. వెనె్నలలాంటి కబురు తెచ్చిందో -ఇప్పటికీ ఆ వెనె్నల మైకం నుంచీ బయటకి రాని ప్రేక్షకుల్ని అడిగితే- తెలుస్తుంది. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి చేరన్ దర్శకత్వం వహించారు. ఇదొక బయోగ్రాఫికల్ ఎంటర్‌టైనర్. ఆ వెనె్నల మైకాన్ని మళ్లీ తెప్పించిన కథ.
* * *
‘పాండవులు పాండవులు తుమ్మెదా...’ అన్న జానపద పాట ఆ రోజుల్లో ప్రతీ వివాహ వేడుకల్లోనూ వినిపించేది. ఆ టైటిల్‌తో వచ్చిన సినిమా గురించి తెలిసిందే. టైటిల్‌కీ.. కథకీ ఏ మాత్రం పొంతన లేదన్నది తెలిసిందే. బ్యాంకాక్‌లో తన పుత్రరత్నాల్తో ఉంటూన్న నడి వయసు హీరో.. అతని కాలేజ్‌మేట్ స్వీట్‌హార్ట్ ప్రౌఢ మధ్య జరిగిన ప్రేమాయణం ఇది. ఆఖరికి రెండు కుటుంబాలు కలవటంతో ముగుస్తుంది. ఎక్కడా పోలిక లేదని మాత్రం అడక్కండి.
* * *
‘ఊహలు గుసగుసలాడె...’ - ఓ సాయంసంధ్య వేళ మంద్రంగా ఈ పాట వింటూంటే - ‘ఊహలు గుసగుసలాడటం’ ఖాయం. అలాంటి టైటిల్‌తో ఓ రొమాంటిక్ కామెడీని తీర్చిదిద్దారు శ్రీనివాస్ అవసరాల. ప్రేక్షకులు పాజిటివ్‌గా రిసీవ్ చేసుకొన్నారు. కాబట్టి టైటిల్‌కి న్యాయం జరిగినట్టే.
* * *
‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ - కమర్షియల్ హిట్ కొట్టిన పాట. ఏ వీధిలో చూసినా అదే పాట. ఏ కార్యక్రమంలో చూసినా అదే పాట. ఆ పాటకి మరింత అందాన్ని తెచ్చిన చిత్రం ఇది. ఎంతో సున్నితంగా, హృదయాన్ని కదిపి.. మనసు లోలోతుల్లోకి జొరబడి.. అందంగా సెల్యులాయిడ్‌పై వొలికిందీ కథ. ఇంతకు మించి చెప్పకూడదు. మళ్లీ మళ్లీ చెప్పుకొనేట్టు టైటిల్‌తో కథ కథతో టైటిల్ మమేకమై పోయాయి.
* * *
‘సోగ్గాడే చిన్ని నాయనా’ - ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ ‘వెనె్నల్లో హాయ్‌హాయ్’ ‘వీరివీరి గుమ్మడిపండు’ ‘రాజా చెయ్యి వేస్తే..’ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా..’ కథలు అటుగానో ఇటుగానో ప్రేక్షకుల్ని ఆయా టైటిల్స్ వైపు మొగ్గు చూపేలా ఉన్నాయి.
ఇక్కడ ప్రస్తావించని చిత్రాలు మరెన్నో. కొన్ని సందర్భాల్లో ‘టైటిల్’నీ ఆయా పాటల్నీ గుర్తు చేసిన చిత్రాలు కథతో సంబంధం లేకపోయినా.. నిలిచిపోయాయి.

-బిఎనే్క