మెయిన్ ఫీచర్

ఆ పండగెప్పుడు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాదులు వస్తున్నాయి. తెలుగుదనం పరిమళాలు వెదజల్లి వెళ్తున్నాయి. సినిమాలూ వస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ గుభాళింపు వెదజల్లడంలో
ఆడియన్స్ చేత హిట్టనో, ఫట్టనో అనిపించుకుని
వెళ్తున్నాయి. మరి.. ఆ పండగల్లేవా? అంటే ‘ఏ’ పండగ? అన్న ప్రశ్న మాత్రం తెలుగు
వాకిళ్లలో నాలుగేళ్లుగా
వినిపిస్తోంది. అదే -సినిమా అవార్డుల పండుగ.
**
ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఊపందుకున్నది మొదలు అవార్డుల పండుగకు బ్రేక్ పడింది. తెలంగాణ ఆవిర్భావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువుదీరినా -ప్రాధాన్యత కలిగిన సినిమా అవార్డుల సంబరం మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. నా సినిమా నాకు గొప్ప అని చెప్పుకోవడమే తప్ప, నాలుగేళ్లుగా -ఇది గొప్ప సినిమా అని చెప్పుకోవడానికి అధికారిక గుర్తింపునిచ్చే అవకాశాలు ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ఎప్పటికైనా తప్పని వ్యవహారం కనుక, అనివార్య కారణాలతో ఆగిన సంస్కృతిని ఎక్కడో ఒకచోట మొదలు పెట్టాలి కనుక -కాస్త తీరిగ్గానైనా తెలుగు ప్రభుత్వాలు -అవార్డులపై దృష్టిపెట్టినట్టు ఇటీవల వినిపిస్తున్న కథనాలు ఒకింత సంతోషాన్నిచ్చేవే.
**
ఏటా ఉగాది ఆగమనానికి కాస్త ముందుగానే -చిత్రసీమలో నందుల హడావుడి ఉండేది. అభిమాన హీరోకో.. బావున్న చిత్రానికో.. గొప్ప దర్శకుడికో నందులు అందాలని అభిమానులు ఆరాటపడేవారు. నిజానికి ఏడాది కాలంలో తెలుగు తెరకొచ్చే సినిమాల సంఖ్య తక్కువేమీ కాదు. నేరుగాను, అనువాదాలుగా విడుదలయ్యే చిత్రాల సంఖ్య దక్షిణాది రాష్ట్రాల్లో టాలీవుడ్ తెరమీదే ఎక్కువ. అయితే -స్ట్రయిట్ చిత్రాలకే నంది పురస్కారార్హత కనుక -రికార్డులు బద్దలుకొట్టే డబ్బింగ్ బొమ్మల గురించి ప్రస్తావనే అనవసరం.
ఇక ఉగాదికి కొద్దిరోజుల ముందునుంచే -ఎంట్రీలు మొదలయ్యేవి. జ్యూరీ సభ్యుల పరిశీలనల హడావుడి కనిపించేది. మరోపక్క -పరిశ్రమ వర్గాలు, ఫ్యాన్స్ సంఘాలు, సినీ అభిమానుల నుంచి అంచనాలూ వినిపిస్తుండేవి. తీర్పుల తంతు ముగిసి, ఉగాది ముందురోజు నంది అవార్డుల ప్రకటనలు వెలువడుతుంటే -పరిశ్రమలో ఒకరకమైన వాతావరణం కనిపించేది. అటు పిమ్మట కామెంట్లు, విమర్శలు, ప్రశంసలలాంటివన్నీ మామూలే. అవార్డు దక్కించుకున్న వారికి మహదానందం. నిజానికి ఈ వాతావరణం 2012 నుంచీ -మాయమైంది. ఉమ్మడి ఆంధ్రను ‘విభజన’ వాతావరణం పూర్తిగా ఆవరించటం, తెలెత్తిన సాంకేతిక ఇబ్బందులు తదితరాల మధ్య అవార్డుల వేడుకకు అవకాశమే లేకుండాపోయింది. విభజన సమస్య కాకున్నా గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనపుడు -ఎనే్నళ్లు ఆగిపోతే అనే్నళ్ల అవార్డుల సంబరాలు కలిసొచ్చిన ఏడాదిలో జరిపే ఆనవాయితీ ఉంది. అయితే ఇప్పుడు విభజన నేపథ్యంలో జరగబోయే నందుల పండుగ ఎలా ఉంటుందనేదే పెద్ద ప్రశ్న.
***
ఎన్నాళ్లో వేచిన ఉదయం/ ఈనాడే ఎదురవుతుంటే -అన్నట్టుగా ‘వేడుక’పై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయన్న కథనాలతో సినీ పరిశ్రమలో మళ్లీ కొత్త వెలుగు కనిపిస్తోంది. ఎవరి మానాన వాళ్లు సినిమాలు చేసుకుంటూ పోతున్న పరిస్థితుల్లో -సార్వజనీన సినిమాకు గౌరవం లభించే టైం వచ్చిందన్న భావన పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ ఉత్సుకత పెంచుతోంది. ఎలాగూ అధికారికంగా -తెలుగు సినిమా విడిపోయింది. అలాంటి వ్యవహారాలు చూసుకునేందుకు రెండు రాష్ట్రాలకూ సచివులున్నారు. పరిశ్రమకు సంబంధించి ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకుంటున్నారు. కాకపోతే -పరిశ్రమలోనే.. విడిపోయామంటే విడిపోయాం, కలిసున్నామంటే కలిసున్నాం.. అన్న పరిస్థితి. ఉమ్మడిలో ఉన్నపుడు తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌లోనే బలంగా వేళ్లూనుకుంది. మూలాల నుంచీ ఏళ్ల తరబడి వేళ్లూనుకున్న ప్రాంతం -ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఉన్న ఫళాన ఆంధ్రలో పరిశ్రమ ప్రవర్థమానంగా విస్తరించే అవకాశం లేదు కనుక, తెలుగు పరిశ్రమ అంతా హైదరాబాద్‌లో ఉన్నట్టే. సైద్ధాంతికంగా హైదరాబాద్ రెండు రాష్ట్రాలకూ పదేళ్ల ‘ఉమ్మడి’ కనుక -సినీ పరిశ్రమ విషయంలో సాంకేతిక సమస్యలూ ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులున్నా -తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను అక్కున చేర్చుకుంటామనే అంటున్నాయి. అంటూనే, చలనచిత్ర పరిశ్రమకు చెందిన లోగోలను మార్చుకున్నాయి. -అవార్డుల విషయంలోనూ కొత్త ఆలోచనలు మొదలెట్టాయి.
**
తెలుగు సినీ పరిశ్రమ దాదాపు నూరుశాతం హైదరాబాద్‌లోనే ఉంది కనుక -తెలంగాణ ప్రభుత్వం అవార్డుల విషయంలో ఒకడుగు ముందుకేసింది. అవార్డుల విషయంలో పరిశ్రమ, ప్రజలనుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో దీనిపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి చైర్మన్‌గా, ఐ అండ్ పిఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ కన్వీనర్‌గా ఏర్పాటైన ఎనిమిది మంది సభ్యుల సంఘంలో రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రాధాన్యత కల్పించటం శుభపరిణామం. పి రామ్మోహన్‌రావు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె మురళీమోహన్, దర్శకుడు ఎన్ శంకర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి, సురేష్ కొండేటి కమిటీలో సభ్యులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో గత ఏప్రిల్‌లో ఏర్పాటైన కమిటీ ఇప్పటికి రెండుసార్లు సమావేశమై -సినీ అవార్డుల అంశాన్ని ఒకింత ముందుకు తీసుకెళ్లాయి.
2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది కనుక -అప్పటి నుంచి 2015 డిసెంబర్ 31 వరకూ ఏడాదిన్నర కాలంలో వచ్చిన తెలుగు సినిమాలకు అవార్డులు ప్రకటించే ఆలోచనలో ఉంది. 2012, 2013 సంవత్సరాలకు సంబంధించి ఆగిపోయిన ‘నంది’ అవార్డులను ఆంధ్ర ప్రభుత్వంతో కలిసి ప్రకటించే ప్రతిపాదన తెలంగాణ వద్ద ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో ఆంధ్ర సర్కారుతో జరుపుతున్న సంప్రదింపులు ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదని అంటున్నారు. ఆంధ్ర నుంచి ఇతమిద్ధమైన అంగీకారం వస్తే తప్ప -ఆ రెండేళ్ల అవార్డులపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇక 2016 నుంచీ ప్రాంతాలు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా ‘తెలుగు సినిమా’కు తామే అవార్డులు ఇస్తామని తెలంగాణ దాదాపుగా ప్రకటించింది. ఆంధ్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించుకున్నా తమకేం అభ్యంతరం లేదని తెలంగాణ స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే సినీ అవార్డుల అంశంపై అధ్యయనాలు జరిపి సమర్పించిన నివేదికపై సర్కారు పరిశీలన జరుపుతోంది. జాతీయ సినీ అవార్డుల మాదిరిగానే ‘తెలంగాణ సినీ అవార్డులు’ వేడుక నిర్వహించాలన్నది కమిటీ సిఫార్సుల్లో ఒకటి. అలాగే చలన చిత్ర ప్రముఖుడికి నటుడు కాంతారావు పేరిట, ఉత్తమ కుటుంబ చిత్రానికి నటుడు ప్రభాకర్ రెడ్డి పేరిట, జాతీయస్థాయి సినీ ప్రముఖునికి పైడి జయరాజు పేరిట, ఉత్తమ గేయ రచయితకు దాశరథి పేరిట, ఉత్తమ సంగీత దర్శకునికి చక్రి పేరిట అవార్డులు ఇస్తూ, పురస్కారాల పారితోషికం పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఇదిలావుంటే, ఆంధ్ర ప్రభుత్వం అవార్డుల విషయంమై అడుగు ముందుకుపడిన దాఖలా కనిపించటం లేదు. సినిమాటోగ్రఫీ శాఖను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఎవరికీ అంతుచిక్కని విషయం. ఆంధ్రలో చలన చిత్ర పరిశ్రమ బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తానని ఇప్పటికే పరిశ్రమ పెద్దలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. స్టూడియోల నిర్మాణం, షూటింగుల కోసం సింగిల్‌విండో అనుమతులకు హామీలిచ్చారు. కాకపోతే -సినిమా అవార్డుల విషయంలో సర్కారు ఆలోచన ఏమిటి? ఎవరెవరి పేరిట అవార్డులు ఇవ్వనున్నారు, పాత విధానానే్న అనుసరిస్తారా? అన్న ప్రశ్నలు ప్రశ్నలుగా ఉండిపోయాయి. సినిమాకు, నాటక రంగానికి ‘నంది’నే కొనసాగించాలన్న యోచన ఉన్నా -ఉమ్మడిలో ఆగిపోయిన రెండేళ్లతో కలిపి నాలుగేళ్ల అవార్డులు ప్రకటిస్తారా? లేక మరేదైనా ప్రతిపాదన ఉందా? అన్నదీ అస్పష్టమే. సహజంగానే రాష్ట్ర విభజన తరువాత -పాలనాపరంగా రెండు రాష్ట్రాల మధ్య పోలికలు తీయడం సహజం కనుక.. ఇప్పుడు ఆంధ్ర సర్కారు నిర్ణయాలు ఎలా ఉంటాయన్న అంశంపై పరిశ్రమ వర్గాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఏదేమైనా పరిశ్రమలో ప్రతి విభాగం పడే కష్టానికి గుర్తింపునిచ్చే అవార్డులను నిర్లక్ష్యం చేయడం నిన్నటివరకూ నీరసాన్ని కలిగించినా -తాజా కదలికతో పరిశ్రమలో ఒకింత ఉత్సాహం కనిపిస్తోంది.
***
అవార్డులంటేనే పైరవీలు అనే భావం చాన్నాళ్లుగా బలపడిపోయిన తరుణంలో.. సినిమా అందరిదీ అయినా అవార్డు ఎవరిది అనే ప్రశ్న కూడా మారాలి? లేదంటే -సాధారణ ప్రేక్షకుడు సైతం ఉత్తమ నంది తెలంగాణలో రుద్రమదేవికి, ఆంధ్రలో బాహుబలికి అని లెక్కలేసి మరీ చేప్పేస్తాడు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తెలంగాణలో పూర్తిగా నిర్మితమైపోయింది. విభజిత ఆంధ్రలో ఎంత ప్రోత్సహించినా ముప్పైయేళ్ల వరకు స్థిరపడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను ఎలా ప్రోత్సాహం ఇవ్వనున్నాయి అన్నది అవార్డుల కార్యక్రమాలను బట్టే అంచనా వేసుకోవచ్చనడంలో సందేహం లేదు.
***
ఉత్తమ జాతీయ చిత్రంగా బాహుబలి.. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కంచె ఒకే ఏడాదిలో ఎంపికకావడం టాలీవుడ్‌లో శుభ పరిణామం. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాల అవార్డుల పండుగను కూడా త్వరగా నిర్వహించగలిగితే మరింత ప్రోత్సాహకంగా ఉంటుందనేది సినీ జనాల మాట. సినిమాల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతూ, క్వాలిటీపరంగానూ ఎవ్వరికీ తీసిపోని స్థాయికి టాలీవుడ్ చేరుతోంది. అవార్డు సినిమా అంటే జనాలు చూడనిది.. కాసులు రాల్చనిది అనే భావనకు ఫుల్‌స్టాప్ పెట్టి వైవిధ్యమైన చిత్రాలకు అవార్డులు వస్తున్నాయి. కమర్షియల్ చిత్రాలు సైతం అవార్డుల రేస్‌లో పరిగెడుతుండటంతో -చిన్న, పెద్ద నిర్మాతలు సైతం అవార్డులు కైవశం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అవార్డుల రూపురేఖలు ఎలామారినా తెలుగు సినిమా లోగిలిలో అతి త్వరలో అవార్డుల వేడుకలు మొదలైతే- అటు చిత్ర పరిశ్రమలోనూ.. ఇటు ప్రేక్షక లోకంలోనూ మళ్ళీ సినిమాలపట్ల అభిరుచి పెరుగుతుందనేది వాస్తవం. ఆ రోజెప్పుడో -రెండు తెలుగు ప్రభుత్వాలు చెప్పాలి.

-ప్రవవి, పోలిశెట్టి