మెయిన్ ఫీచర్

నారీ‘మణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం చేసే ఒక చిన్న మంచిపని కోట్లాదిమందికి సాయం అవ్వొచ్చు. అదే అందరినీ కదిలించొచ్చు. ఆ చిన్నపనే మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టొచ్చు. అలా వివిధ రంగాల్లో సేవలందించిన మహిళల దీక్షా దక్షతలకు ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది.. అదే నారీశక్తి పురస్కారం. ఎన్నో కోట్లమందికి ప్రేరణగా నిలిచిన మహిళలకు నారీ శక్తి పురస్కారం లభిస్తుంది.
నారీశక్తి పురస్కారం మన తెలుగుమహిళ అయిన శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవికి వచ్చింది. ఈమె శ్రీకాకుళం జిల్లా హిరా మండలం, సీతంపేట ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన ప్రాంతానికి చెందిన మహిళ. ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ చూసిన కొండపోడు భూములు ఉండేవి. వాటిలో అక్కడి ఆదివాసీలు పోడు వ్యవసాయం ద్వారా చిరుధాన్యాల పంటలను పండించేవారు. ఇతర సామాగ్రిని కొనాలి అనుకున్నప్పుడు చిరుధాన్యాలను ఇచ్చి వాటిని తీసుకునేవారు. అలాగే వీరు చిరుధాన్యాలనే ఆహారంగా కూడా తీసుకునేవారు. పోనుపోను ఇక్కడ కూడా వాణిజ్య రంగం ఊపందుకుంది. చిరుధాన్యాల పంటల స్థానంలో వాణిజ్య పంటలు వచ్చి చేరాయి. కారణం ఆరోగ్యం కంటే ఆదాయమే ప్రధానం అని ఆ ఆదివాసీలు కూడా అనుకుంటున్నారు. అందుకే వారు పంటలను మార్చారు. పోడుతో పాటు ఇతర సాగు భూముల్లో జీడిమామిడి, ఉద్యాన పంటలు వచ్చి చేరాయి. అలాగే వీరి ఆహార్యంలోనూ, ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేరాయి. ఫలితంగా వీరి ఆరోగ్యంలో తేడాలొచ్చాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఆడవారు రక్తహీనతకు గురయ్యేవారు. గర్భిణులు, బాలింతలు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కోవడం మొదలైంది. ఈ సమస్యే పడాల భూదేవిని ఆలోచనలో పడేసింది. కష్టజీవులైన గిరిపుత్రులకు మంచి ఆహారం అవసరం. అత్యధిక పోషకాలున్న చిరుధాన్యాలను వదిలి, వాణిజ్య పంటల వైపు వెళితే.. వీరికి చిరుధాన్యాలు ఎక్కడ నుంచి వస్తాయి? పనిచేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే గిరిజన ప్రాంతాల్లో తిరిగి చిరుధాన్యాలను ప్రోత్సహించాలి అనుకుంది భూదేవి. కానీ అక్కడున్న గిరిజనులు ఇందుకు ఒప్పుకోలేదు. ఇలా చేస్తే వాణిజ్య పంటలతో వచ్చే నాలుగు రూపాయలు కూడా రావు అనేశారు. అంతేకాక వాణిజ్య పంటలైతే దళారులే వచ్చి పంటను తీసుకెళతారు. ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది అన్నారు గిరిజనులు. అందుకే భూదేవి ఉభయతారకంగా ఒక ఆలోచన చేసింది. 2016లో చిన్నయ్య ఆదివాసీ వికాస సంఘం పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టింది భూదేవి. ఇందులోనే చిరుధాన్యాల పునరుజ్జీవం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. గిరిజనులకు నచ్చజెప్పి వారి భూముల్లో చిరుధాన్యాలు వేసేలా ప్రోత్సహించింది. ప్రభుత్వ సహకారంతో తన ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఐటీడీఏ ద్వారా వందశాతం రాయితీతో విత్తనాలను ఆదివాసీలకు అందేట్లు చేసింది. ఆదివాసీ వికాస సంఘం ఆధ్వర్యంలో పండిన పంటను ఆవిడే కొనుగోలు చేసి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుచేయించి మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ ఆహార పదార్థాల తయారీకి కూడా స్థానిక గిరిజన మహిళల చేతుల మీదుగానే జరిగేది. రైతులకు కూడా గిట్టుబాటు ధర లభించేది. ఈ సంస్థలో ఆహార పదార్థాలను తయారుచేసే మహిళలు కూడా మంచి ఆదాయాన్ని పొందగలిగారు. దీంతో వారి ఆర్థిక స్థాయి క్రమంగా మారడం మొదలైంది. ప్రస్తుతం భూదేవి సీతంపేట, కొత్తూరు, హిరమండలం, వీరఘట్టం మండలాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో, దాదాపు మూడు వేల మంది గిరిజన రైతుల ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగు సాగుతోంది. అంతేకాదు ఇక్కడి పంటలతో తయారయ్యే ఆహారపదార్థాలు కూడా మంచి పేరును తెచ్చుకున్నాయి. ఫలితంగా ఇవి ఎగుమతులు కూడా నోచుకున్నాయి. ఇలా భూదేవి తన చుట్టూ ఉన్న గిరిజన మహిళలకు పోషకాహారాన్ని అందిస్తూ, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు, మిగిలిన ఆదివాసీలకు కూడా లాభాలు వచ్చేలా చేస్తోంది. మరి కొండపోడులో కొత్త విధానాలను ఉపయోగించి అద్భుతాలను చేస్తున్నందుకే ఈమె 2020 నారీ శక్తి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డును అందుకుంది పడాల భూదేవి. *