మెయిన్ ఫీచర్

ఈ బామ్మ ప్రజాసేవ ఆదర్శనీయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటికి దీపం ఇల్లాలు అన్నది ఎంత నిజమో, నేటి సమాజ శ్రేయస్సులో మహిళల పాత్ర అంతే కీలకం. ‘స్వంత లాభం కొంత మానుకుని, పొరుగు వానికి తోడుపడవోయ్’ అన్న గురుజాడ రచించిన దేశమును ప్రేమించుమన్నా గేయంలోని చివరి చరణాన్ని అక్షరాల ఆచరిస్తూ.. ఆరుపదుల వయస్సు దాటి, ముదిమిలోకి అడుగిడిన ఈ అవ్వ అతివలకు ఆదర్శంగా నిలుస్తోంది. వ్యక్తిగత సేవలకన్నా రాజకీయంగా ప్రజాసేవ చేయడంలో లభించే పరమానందం అమోగమని సంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
1950వ సంవత్సరంలో మారుమూల గ్రామంలో జన్మించిన పిల్లోడి జయమ్మ అప్పట్లో ఐదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసింది. చిన్నతనంలోనే వివాహం కావడంతో పుట్టింటి నుండి మెట్టింట సదాశివపేట మున్సిపల్ పట్టణంలో కాలు మోపింది. గృహిణిగా కుటుంబ పోషణ, మహిళా రైతుగా వ్యవసాయ పనుల్లో భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఇంటికే పరిమితమైంది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాల్లో ప్రత్యేకతను చాటుకున్న సదాశివపేట పట్టణంలో చోటుచేసుకునే విషయాలు ఏ మాత్రమూ తెలియవు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొంది బల్దియాలో తొలి అడుగు పెట్టింది జయమ్మ. తన వార్డు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ప్రధానంగా మహిళలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జయమ్మ. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో సదాశివపేట పురపాలక సంఘం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో జయమ్మను అదృష్ట లక్ష్మి వరించింది. పరిపాలన పగ్గాలు చేపట్టిన కొద్దిరోజులకే పట్టణ ప్రగతి కార్యక్రమం మరో సువర్ణావకాశంగా ముందుకు వచ్చింది. ఇంకేముందు ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు పట్టణంలోని వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. ఇంటింటికీ తిరిగి.. మహిళలను తనదైన శైలిలో జాగృత పరుస్తోంది జయమ్మ. పారిశుద్ధ్యంతో పాటు పర్యావరణ సమతుల్యతకు విఘాతం కల్గిస్తున్న పాలిథిన్ కవర్లను ఎంత మాత్రం వాడవద్దని, వారికి విడమరిచి విరిస్తూ చైతన్య పరుస్తోంది. పరిసరాల పరిశుభ్రంగా ఉంటే కలిగే ప్రయోజనాలు, అపరిశుభ్రంగా ఉంటే తలెత్తే దుష్పరిణామాలను వివరిస్తూ తనకు తానే సాటిగా నిలుస్తోంది. ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న కృషి మాదిరిగానే పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు వృథాపోనీయకుండా చైతన్యం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. తన ఐదేళ్ల పదవి కాలంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి పేటకు రైల్వే లైన్ తీసుకువచ్చేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి ద్వారా కృషి చేస్తాను. అవినీతి రహిత పాలనను ప్రజలకు అందించడమే తనముందున్న లక్ష్యం అంటూ దూసుకుపోతోంది జయమ్మ. అలాంటి జయమ్మ తన మదిలోని మాటలను మాతృభూమితో పంచుకుంది.
ప్ర: రాజకీయ అనుభవం అంతంత మాత్రమే అయిన మీకు చైర్ పర్సన్ పదవి చేపట్టడానికి భయం వెయ్య లేదా?
జ: నిజమే.. మొదట్లో భయం వేసేది.. కానీ ఇప్పుడు లేదు. మొదటినుంచీ సమాజానికి ఏదో చేయాలనే ఆశ. దానితోనే 60 సంవత్సరాల వయస్సులో కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం కలిసి వచ్చింది. నిర్భయంగా బాధ్యతలు చేపట్టి అన్ని వర్గాల వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాను. చిన్నప్పటి నుండి క్రమ శిక్షణతో కుటుంబ పోషణ, వ్యవసాయ పనులు చేసిన అనుభవం ఇక్కడ పనికొచ్చింది.
ప్ర: మనవలు, మనవరాళ్లతో ఆడుకునే వయస్సులో ప్రజాసేవకు ఉపక్రమించడంలో తృప్తి లభిస్తోందా?
జ: అవును నూటికి వెయ్యి రెట్లు సంతోషం కలుగుతుంది. చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవడం, పాడుకోవడం వల్ల ఆ క్షణానికి కాలక్షేపం అవుతుంది. అదే సమాజానికి ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టి పనిచేస్తే ఆ రోజంతా పట్టరాని ఆనందం, అనుభూతి కలుగుతుంది. మరి మీరే చెప్పండి.. ఆ పనులు ఎంత ఉత్తమమో.. అందుకే మనసుకు ఎనలేని తృప్తి.
ప్ర: పదవి బాధ్యతలు నిర్వర్తించడంలో నిరక్షరాస్యత అడ్డుగోడ కాదా?
జ: కొన్ని సందర్భాల్లో నిరక్షరాస్యత అసంతృప్తికి గురి చేసినా విద్యాధికుల ద్వారా విషయాలను తెలుసుకుని, అందుకు అనుగుణంగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నా.. నా కొడుకు కూడా కౌన్సిలర్ అతని సహకారం ఎప్పుడూ ఉంటుంది.
ప్ర: ప్రధాన సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని ఎలా పరిష్కరిస్తారు?
జ: ఇప్పుడు సంగారెడ్డి జిల్లా పూర్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీగా అవతరించిన సదాశివపేటలో నాటి నుండి నేటి వరకు త్రాగునీటి సమస్య, అస్తవ్యస్థమైన పారిశుద్ధ్యం. రాష్ట్ర ప్రజల దాహర్తిని తీర్చడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చింది. దీంతో తాగునీటి సమస్య తీరుతుంది. పట్టణ ప్రగతి ద్వారా పడకేసి పారిశుద్ధ్య సమస్యను మెరుగు పర్చేలా కృషి చేస్తా.. విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించి వైర్లు బిగించిపిస్తా.
ప్ర: ప్రజలకు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటారు?
జ: ఇప్పుడు, అప్పుడు అనే నిబంధనలు ఏమీ లేవు. ప్రజలు నావద్దకు రావాల్సిన అవసరం లేదు.. ఫోన్ చేస్తే చాలు.. నేనే వెళ్లి వారిని కలుస్తా.. వారి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తా..
ప్ర: ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం ఎలా ఉంది?
జ: నన్ను ఒక అవ్వలా, అమ్మలా ఆదరిస్తూ అన్ని విషయాల్లో సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. వారి సహకారమే నాకు శ్రీరామ రక్ష..
ప్ర: నూతన పురపాలక చట్టం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో విఫలమైతే.. పదవి నుంచి తొలగించి అధికారాన్ని కలెక్టర్‌కు కట్టబెట్టారు. దీన్ని సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా?
జ: చేతకానివారు వ్యతిరేకిస్తారు. పనిచేయలేనప్పుడు అందుకు కలుగుతున్న అడ్డంకులు ఏమిటి? అందుకు పరిష్కార మార్గం ఏమిటీ అన్నది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలి. సమస్యలు లేకపోయినా పనిచేయలేకపోతే అందుకు నైతిక బాధ్యత వహించి స్వచ్చంధంగా తప్పకుంటే గౌరవం దక్కుతుంది.
ప్ర: అవినీతి రహిత పాలన సాధ్యమా?
జ: కంప్యూటర్ యుగంలో కూడా అవినీతి జాఢ్యం పెరిగిపోవడానికి మనమే కారకులం. తప్పుడు పనిచేయించడానికి లంచం ఎరవేయడం మొదటి తప్పు, తీసుకోవడం అంతకన్నా నేరం. బల్దియాలో ఎవరు అవినీతికి పాల్పడినా ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటాం.
ప్ర: నగరానికి చేరువలో ఉన్న పేటకు రైల్వే లైను అవసరమా?
జ: ఎప్పుడో రావాల్సిన రైలు మార్గం అనివార్య కారణాల వల్ల ఇతర మార్గం గుండా వెళ్లింది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పేటకు రైల్వే లైను తప్పని సరి. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తా.
ప్ర: పట్టణంలో పచ్చదనం మాటేమిటీ?
జ: నాలుగు దశాబ్దాల క్రితం పట్టణంలో ఉన్న చెట్లపై కోకిల రావాలు, కాకుల గోల, పిచ్చుకుల చప్పుళ్లు మనసును పులకరింపచేసేవి. ఇప్పుడు వృక్ష సంపద తరిగిపోయి, పర్యావరణ కాలుష్యం పెరగడంతో అనేక రోగాలు ప్రబలుతున్నాయి. వాటన్నింటికి విరుగు ఒక్కటే చెట్లను విస్తృతంగా నాటి సంరక్షించడమే.
ప్ర: చివరగా పట్టణ ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటీ?
జ: ఆరోగ్యమే మహాభాగ్యం, పట్టణ ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇళ్లలోని వ్యర్థాలైన తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించాలి. పాలిథిన్ కవర్లను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లలను తప్పనిసరిగా చదివించి ప్రయోజకులను చెయ్యాలి. అన్ని కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను సద్వినియోగ పర్చుకోవాలి. శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా కలసిమెలసి జీవించాలి.

- తమ్మలి మురళీధర్ 99895 07333