మెయన్ ఫీచర్

‘కేజ్రీ’పై మరింత బాధ్యత పడిందా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల భారీ మెజారిటీతో మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్‌పై గతంలోకంటే బాధ్యతలు పెరిగాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని పది రోజులు కాకముందే రాజధాని నగరంలో పలు హింసాత్మక సంఘటనలు జరగడం బాధాకరం. గత కొన్ని రోజులుగా ఈశాన్య ఢిల్లీలో సంభవిస్తున్న పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ.) అనుకూల మరియు వ్యతిరేక వర్గాల సంఘర్షణలలో పదుల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవల్సి వచ్చింది. ఇంకా వందల మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో రోజుల తరబడి గడపాల్సి వస్తున్నది. ప్రాణాలు కోల్పోయిన వారిలో పోలీసువారు కూడా ఉండటం గమనార్హం. చాలామంది అమాయకపు ప్రజలు కొంతమంది స్వార్థశక్తుల మాయలోపడి అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి జనం వారి భావజాలానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, వారి పిలుపుమేరకు వివిధ నిరసన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం జరుగుతున్నది. దేశంలో విచ్ఛిన్నకర శక్తుల ప్రేరణతో పలువురు అల్లర్లను సృష్టిస్తూ, పబ్బం గడుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అంటే మతం, కులం మరియు ప్రాంతం ప్రాతిపదికన ప్రజలను రెండువర్గాలుగా విభజన చేసే కుట్ర జరుగుతున్నది. ఆయా కుట్రలను ప్రజలే తెలుసుకొని ఛేదించాలి. ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వైరుధ్యాలకు తావులేదు.
మన దేశం లౌకిక రాజ్యం. ఈ దేశంలో అన్ని మతాల మరియు కులాలవారు నిర్భయంగా, స్వేచ్ఛగా జీవనాన్ని సాగించగలగాలి. అంతేకాని మతాల, కులాల, ప్రాంతాలవారీగా విబేధాలు పెచ్చరిల్లడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఈ దిశలో దేశ సార్వభౌమత్వానికి మరియు ప్రజాస్వామిక విలువలను ఎల్లవేళలా కాపాడుకోవడానికి ప్రజలే కంకణం కట్టుకొని తదనుగుణంగా అల్లర్లను సృష్టిస్తున్న అరాచక శక్తుల పీచమణచాలి. ఇలాంటి సమయంలో కొన్ని ప్రాంతాల్లోని నివాసముంటున్న రెండువర్గాల ప్రజలు ఒకరికొకరు రక్షణగా నిలబడడం అపూర్వం. వారివారి ప్రాణాలను, ఆస్తులను కాపాడుకునేందుకు వారంతా తీసుకున్న నిర్ణయాలు అద్వితీయం. వీరు దేశవ్యాప్తంగా ఉన్న మిగతా ప్రజాసమూహాలకు తప్పకుండా ఆదర్శం కాగలరు. గత కొంతకాలంగా ప్రత్యేకించి నగరంలో కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్న సామాన్య ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎన్నికల ముందు కూడా రాజధాని ఢిల్లీలో నిరసనలు వెల్లువ కొనసాగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలకు వ్యతిరేకంగా విద్యార్థులు మరియు యువత రహదారులపైకి వచ్చి నిరసనలు చేపట్టడం గమనార్హం.
అధికారంలో ఎవరున్నప్పటికీ వీరికి తోడుగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడం షరామామూలే. అయితే గడిచిన వారంలో రెండు రోజులుగా పౌరసత్వ చట్టంనకు అనుకూలంగా మరియు అననుకూలంగా జరిగిన నిరసనలలో హింసాయుత వాతావరణం నెలకొంది. ఈ వారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేజ్రీవాల్ రాజధానిలో మరల ఎటువంటి హింస చెలరేగకుండా ఉండడానికి తన శక్తియుక్తులు ప్రదర్శించాలి. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సహకారాన్ని ఆయన తప్పకుండా తీసుకోవాల్సిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలో శాంతిభద్రతలు నిర్వహణ ఉంటుంది గనుక, నగరంలో శాంతిని నెలకొల్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం మీదనే ఎక్కువగా ఉంటుంది. దీనిలో భాగంగానే గత మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో రాజధానిలో జరుగుతున్న హింసను ఆపే లక్ష్యంతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు మరికొంతమంది ఉన్నతాధికారులు ఢిల్లీ పరిస్థితులను సమీక్షించారు. అలాగే రాజధాని అల్లర్లపై ప్రధాని మాట్లాడుతూ, ప్రజలు సోదరభావంతో మెలగాలని, శాంతిభద్రతలు కాపాడేందుకు అందరూ తమవంతుగా కృషిచేయాలని కోరడం విశేషమే. అలాగే ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లను పోలీసులు నియంత్రించలేకపోయారనీ, తక్షణమే సైన్యాన్ని రంగంలోకి దించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేయడం జరిగింది కూడా. శాంతి, సామరస్యాలే మన దేశ సంస్కృతికి వెనె్నముకగా నిలుస్తాయనీ, వాటిని కాపాడడంలో ప్రభుత్వలు మీనమేషాలు లెక్కించడం భావ్యంకాదని పలువురు మేధావులు అనడం విడ్డూరమేమీకాదు. సాధ్యమైనంత త్వరగా రాజధానిలో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని ఇరుప్రభుత్వాలను బుద్ధిజీవులు కోరడంలో అర్థం ఉంది.
ఇటీవల అనగా 2020 సంవత్సరంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 53.57 ఓట్ల శాతంతో మొత్తం 70 శాసనసభ స్థానాలకు గాను 62 స్థానాలను మరోసారి సాధించి తనకు తిరుగులేదని కేజ్రీవాల్ ప్రపంచానికే చాటిచెప్పడం జరిగింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటునూ గెలవలేని ఆప్ సంవత్సరం గడవక ముందే ఇంత భారీ మెజారిటీతో గెలవడం సర్వసాధారణమేమీ కాదు. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ పార్టీల కంటే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించి ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పైచేయి సాధించారనే చెప్పవచ్చు. గత పాలన సమయంలో రాజధాని నగరంలో చెలరేగిన కొన్ని నిరసనలను జాగ్రత్తగా గమనించి, ఏ ఒక్క వర్గంవైపు మొగ్గు చూపకుండా ఉండడం కేజ్రీవాల్‌కు కలిసొచ్చిన విషయంగా పలువురు రాజకీయ విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. దీనిని బట్టి కేజ్రీ ఎన్నికల వ్యూహాన్ని అంచనా వేయవచ్చు. అనేక జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టిన కేజ్రీ అనతి కాలంలోనే ప్రజల మద్దతును కూడగట్టుకోవడం అభినందనీయమే. గతంలో ఢిల్లీలో నివసించే ప్రజలకు అభద్రతాభావం ఉండేది. ముఖ్యంగా నిర్భయలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఢిల్లీ ప్రజలు మరీ ముఖ్యంగా స్ర్తిలు, బాలికలు కొంతవరకు భయాందోళనకు గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఢిల్లీ నగరాన్ని శాంతికాముక పట్టణంగా మార్చగలనని గతంలో తెలపడం, దానిలో భాగంగానే పట్టణమంతటా సి.సి. టీవీ కెమెరాలు ఏర్పాటుచేయడం, తద్వారా తమ ప్రభుత్వం ‘స్ర్తిల భద్రతకు భరోసా’ ఇస్తుందనే విషయాన్ని కేజ్రీ తేటతెల్లం చేశారు. అన్నది అన్నట్లుగానే నేర నియంత్రణకు కేజ్రీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకున్నది. దీనిలో భాగంగానే మహిళల రక్షణకోసం ఢిల్లీ రవాణా సంస్థ నడిపే బస్సులలో భద్రతా బలగాలను అందుబాటులో ఉంచడం జరిగింది.
మనీష్ సిసోడియాలాంటి మేధోసంపత్తిగల మరియు నిర్మాణాత్మకమైన ఆలోచనలు కలిగిన విద్యాశాఖ మంత్రిని కేజ్రీ తన మంత్రివర్గంలో నియమించారు. ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలపై దృష్టి సారించి, అత్యాధునిక వసతులతో కూడిన పాఠశాల భవనాలను నిర్మించి, బోధనానుభవం, నైపుణ్యంగల ఉపాధ్యాయులను నియమించి, యావత్తు ఢిల్లీ పట్టణంలోగల పాఠశాలలను బలోపేతం చేయడం జరిగింది. ఆ పాఠశాలలు నేడు యావత్తు దేశానికి ఆదర్శమయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా గల ఇతర రాష్ట్రాల నుండి పలువురు ప్రతినిధులు బృందాలుగా ఏర్పడి ఢిల్లీ ప్రభుత్వ విద్యావ్యవస్థను పరిశీలిస్తూ, తమతమ రాష్ట్రాలలో అలాంటి ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆసుపత్రులకు కనీస వసతులు రూపకల్పన చేస్తూ, వైద్యులను మరియు పారామెడికల్ సిబ్బందిని పెద్దయెత్తున నియమించుట ద్వారా ఢిల్లీ ప్రభుత్వం వైద్యరంగాన్ని కూడా అభివృద్ధి పరిచింది. దీనిలో భాగంగానే 12వేల మందికి ఒక్కొక్కటి చొప్పున 400 ‘ముహల్లా క్లినిక్‌లు’ విజయవంతంగా నడుస్తున్నాయి. వీటి ద్వారా సురక్షితమైన సంపన్న వైద్యాన్ని సామాన్య ప్రజలకు ఉచితంగా అందించడం కేజ్రీ పరిపాలనా పాటవానికి నిదర్శనం. ప్రజలకు త్రాగునీరు, ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్, ఉచిత నాణ్యమైన విద్య మొదలగు ప్రాథమిక అవసరాలను అందించడం ద్వారా కేజ్రీ కృతకృత్యులయ్యారు. అందువల్లనే ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌పై ఓ నమ్మకం, భరోసా కలిగాయి. దానిలో భాగంగానే ఇంతటి ఘన విజయాన్ని నేడు కేజ్రీవాల్ మూటగట్టుకున్నారని పేర్కొనవచ్చు.
ఫిబ్రవరి 16న జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి కేజ్రీ ప్రమాణం చేయడం విశేషం. గత ఐదేళ్లలో ఢిల్లీ నగరాన్ని వేగవంతంగా అభివృద్ధిచేశానని, ఈ ఐదేళ్లలో కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలకు సభాముఖంగా హామీ ఇచ్చారు. ‘ప్రజలు ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స చేసుకునేందుకు మరియు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు సొమ్ము వసూలు చేస్తే నాకు సిగ్గుగా ఉంటుందని’ తన అంతరంగాన్ని మరియు అంతర్మథనాన్ని ఈ సందర్భంగా బహిర్గతం చేశారు. అంటే ఉత్కృష్టమైన భారత రాజ్యాంగం కల్పించిన సేవల రంగంలో ఉన్న విద్య మరియు వైద్యాన్ని ప్రజలకు నేరుగా, ఉచితంగా కేజ్రీవాల్ అందించేందుకు సిద్ధం కావడం అభినందనీయమే. ఢిల్లీ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని, ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులు కూడా తనకుకావాలని ఒక కార్యసాధకుడిగా అభిలషించారు. ఎన్నికల ప్రచారంలో పార్టీలపరంగా చాలా వైరుధ్యాలతో మాట్లాడటం జరిగిందని, వాటన్నింటినీ మరచిపోయి ఢిల్లీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా కేజ్రీ ఉటంకించారు. గత ఐదేళ్లకాలంలో ఢిల్లీ అభివృద్ధిలో భాగస్వామ్యమైన 50 మంది సామాన్య వృత్తుల వారిని ‘నగర నిర్మాతల’ పేరుతో ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించి, తనతోపాటు వేదికపై కూర్చుండబెట్టడం కేజ్రీవాల్ సంస్కారానికి నిలువుటద్దంగా చరిత్రలో నిలుస్తుంది. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో ఇలాంటి పనిచేసి ఉండదని చెప్పడంలో సంశయం లేదు. ‘ఇది మీ అందరి విజయం. మీ కుమారుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాడని’ సభలో చెప్పడం ద్వారా కేజ్రీవాల్ నిరాడంబరత, ఢిల్లీ ప్రజలపై అతనికున్న ఉదారత మరియు ప్రేమానురాగాలు స్పష్టమవుతున్నాయి.
గత కొనే్నళ్లుగా ఢిల్లీ నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకున్నది. కాలుష్యం బారిన పడిన నగరాన్ని రక్షించే బాధ్యత సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా! అని ఢిల్లీ ప్రజలు తరచూ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ నగర కాలుష్యాన్ని అరికట్టడంలో మాత్రం గత ఐదేళ్లు పాలనా కాలంలో కేజ్రీ వెనుకబడి యున్నారనే చెప్పాలి. గత సంవత్సరం అయితే తీవ్ర కాలుష్య పడగలో ఢిల్లీ నగరం కొట్టుమిట్టాడింది. విడతలు విడతలుగా కొన్ని రోజులపాటు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగర ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్‌ను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇప్పటి నుండైనా నూతన ప్రభుత్వం మాత్రం నగర కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీనిలో భాగంగా ఢిల్లీ శివార్లలో తరచూ పంటపొలాల వ్యర్థాలను తగులబెట్టే రైతులకు, ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తూ, సంబంధిత పక్క రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడగలగాలి. అవసరమైతే విదేశీ సాంకేతికతను అందిపుచ్చుకుని, అత్యాధునిక పద్ధతుల్లో కాలుష్య భూతానికి పాతరేయాల్సిన అవసరం అధికార ప్రభుత్వంపై ఎంతైనాఉంది. జీవన నాణ్యత ప్రమాణాలనుబట్టి చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 నగరాల్లో ఢిల్లీ నగరం 118వ స్థానంలో ఉంది. అలాంటి ఢిల్లీ నగరాన్ని ప్రపంచంలోనే గొప్ప నగరంగా ఉన్నతీకరించాలని సదాశయంతో కేజ్రీ ఉండడం గొప్ప విషయమే. ఆ దిశగా ముందుచూపుతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం పయనమవ్వాలి. కాలుష్యరహిత మరియు ప్రశాంత జీవన నగరంగా రాజధానిని చూడాలనుకుంటున్న ఢిల్లీ ప్రజల కోరికను తీర్చాల్సిన అవసరం ఈ ఐదేళ్లకాలంలో కేజ్రీవాల్‌పై తప్పకుండా ఉంది. అలాగే ఢిల్లీ నగర అభివృద్ధి దృష్ట్యా కేంద్రంలోనున్న అధికార ప్రభుత్వం పొరపొచ్చాలు వీడి కేజ్రీవాల్‌కు తప్పకుండా సహకరించాల్సిందే. రాజధాని నగరంలో శాంతిస్థాపనకు రాజకీయాలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఐకమత్యంతో ముందుకుపోవాలి. ఈ విషయంలో మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరింత బాధ్యత పడిందని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.

- పిల్లా తిరుపతిరావు 70951 84846