మెయిన్ ఫీచర్

కేంద్ర రిజర్వు పోలీసు బలగంలో వీర నారీమణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో శాంతి భద్రతలకు భరోసా ఇస్తూ 81 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న కేంద్ర రిజర్వు పోలీసు బలగం- సిఆర్‌పిఎఫ్ కీర్తికిరీటంలో అనేక కలికితురాయిలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో నాటి సంస్థానాల శాంతిభద్రతలు లక్ష్యంగా 1939లో ఓ చిన్న పోలీసు బలగం రూపేణా సీర్పీఎఫ్ ఏర్పాటైంది. అయితే, తదనంతర కాలంలో దేశ అంతర్గత భద్రతలో ప్రధాన కర్తవ్యం నిర్వర్తించే అతి పెద్ద ఏకైక బలగంగా రూపొందింది. ప్రస్తుతం 246 పటాలాలతో నేడు ప్రపంచంలోనే అతి పెద్ద అర్థ సైనిక బలగంగా పరిగణించబడుతోంది. కర్తవ్య నిర్వహణలో మొక్కవోని సాహసం, త్యాగాలకు వెనుదీయని అపూర్వ బలగంగా నిరూపించుకుంది. దేశంలోని కేంద్ర సాయుధ బలగాలకు ప్రకటించిన సాహస పతకాల్లో ఏకంగా 1976 సీఆర్పీఎఫ్ కైవసం కావడమే ఇందుకు నిదర్శనం. సీఆర్పీఎఫ్‌లో అంతర్భాగమైన అటవీ పోరాట నైపుణ్య బలగం ‘కోబ్రా’, అల్లర్లను నియంత్రించే సత్వర కార్యాచరణ బలగం- ఆర్‌ఎఎఫ్‌తోపాటు పుణెలోని నవీకృత పేలుడు పరికరాల నిర్వహణ సంస్థ- ఐఐఎం దేశంలోనే ప్రప్రథమ, విశిష్టస్థానంలో ఉన్నాయి. ఇవన్నీ సీఆర్పీఎఫ్‌ను అగ్రగామి నిఘా, సమగ్ర పోలీసు బలగంగా రూపుదిద్దాయి.
న్యూఢిల్లీలోని ఝరోడా కలాంలో 1986 ఫిబ్రవరి 6న మహిళా పటాలం ప్రారంభంతో సీఆర్పీఎఫ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇది కేంద్ర పోలీసు రిజర్వు బలగాలలో మాత్రమేగాక మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా పటాలం కావడం విశేషం. అంతేగాక అంతర్యుద్ధంతో అట్టుడికిన శ్రీలంకలో శాంతి నిమిత్తం నియమించిన భారత శాంతి పరిరక్షక దళం-ఐపికెఎఫ్‌లో ఈ మహిళా పటాలం ఒక కీలక భాగంగా విధులు నిర్వర్తించింది. అలాగే ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యక్రమం కింద 2007 జనవరి 20న మొత్తం మహిళలతో కూడిన సీఆర్పీఎఫ్ బలగాన్ని లైబీరియాకు పంపడంతో ఈ బలగంలో లైంగిక సమానత్వానికి మరింత వనె్నచేకూరింది. కాగా, 1989 తొలినాళ్లలో మొదటిసారిగా ఏడుగురు మహిళా పటాలాలతోపాటు 15 సీఆర్పీఎఫ్ పటాలాల్లోనూ మహిళలకు స్థానం లభించడం గమనార్హం. కాగా, 2017లో ‘బస్తరియా బెటాలియన్’ పేరిట 241వ పటాలం ఏర్పాటు సందర్భంగా ఆ నియామకాల్లో మహిళలకు 33 శాతం కేటాయిస్తూ నిబంధన రూపొందింది. అప్పటినుంచీ వారు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ తమ పోరాట సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు.
పోరాట పాత్ర: ఉగ్రవాదాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని నిలువరించడంలో సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది తమ పోరాట స్ఫూర్తిని ఇప్పటికే రుజువు చేసుకున్నారు. ఈశాన్య భారత ప్రాంతంలో తిరుగుబాటుదారులతో 1990 నాటి పోరులో పురుష సిబ్బందితో దీటుగా మహిళా జవాన్లు వారితో భుజం కలిపి పనిచేశారు. అప్పటినుంచీ ఘర్షణాత్మక ప్రాంతాలైన జమ్ముకశ్మీర్ సహా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోనూ సీఆర్పీఎఫ్ బలగంలోని మహిళా సిబ్బంది చురుగ్గా ఏరివేత కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగా పలువురు వీర నారీమణులు ప్రాణత్యాగం చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. పార్లమెంటుపై 2001నాటి ఉగ్రవాద దాడి సందర్భంగా వారికి ఎదురొడ్డి నిలిచి, ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కమలేష్‌కుమారి సాహస ఉదంతం ఇందుకు తిరుగులేని నిదర్శనం. ఆనాడు ఆమె ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలకు గాను మరణానంతరం ఆమెకు ‘అశోకచక్ర’ పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇది శాంతి కాలంలో దేశంకోసం ప్రాణాలర్పించిన సాహసులకు ప్రకటించే అత్యున్నత సాహస పురస్కారం. ఇదే కోవలో వీర యోధులైన మహిళా కానిస్టేబుళ్లు రేఖా కుష్వాహా, బిందా కుమారి విధినిర్వహణలో అమరులయ్యారు. కాగా, కమలేష్ కుమారితోపాటు సాహస పురస్కారాలు పొందిన సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బందిలో 1990లో శ్రీలంక ఐపీకేఎఫ్‌లో పనిచేసిన బిల్లాదేవికి సేవాపతకం, బిందాకుమారికి మరణానంతరం పోలీసు సాహస పతకం లభించాయి. అలాగే ఆనాటి అసిస్టెంట్ కమాండెంట్ కుమారి శాంతాదేవికి ప్రతిష్ఠాత్మక రాష్టప్రతి పోలీసు పతకం లభించింది.
మహిళా సాహసులు: ఇటీవల 2020 జనవరి 26న గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా సీఆర్పీఎఫ్ మహిళా ‘డేర్ డెవిల్స్’ బృందం మోటారు సైకిళ్లపై ప్రదర్శించిన విన్యాసాలను ప్రపంచమంతా అబ్బురంగా వీక్షించింది. చూపరులకు శరీరం గగొర్పొడిచేలా మోటారు సైకిళ్లపై సుజాత నాయకత్వంలోని బృందం ప్రదర్శించిన విన్యాసాలు అందర్నీ అప్రతిభులను చేశాయి. కాగా, బైక్ నడపడం తన స్వప్నమే అయినా, ఈ బైకర్ల బృందంలో తనను చేర్చినదాకా మోటార్ సైకిల్ ఎలా నడపాలో కూడా తనకు తెలియదని సుజాత ప్రకటించడం గమనార్హం. సీఆర్పీఎఫ్‌లో చేరిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ నేర్చుకున్నానని ఆమె తెలిపారు. కదులుతున్న ద్విచక్ర వాహనాలమీద విన్యాసాలు చేయడంలో సీఆర్పీఎఫ్ ఇచ్చిన శిక్షణ తనలోని భయాలను పోగొట్టిందన్నారు. ఈ డేర్ డేవిల్స్ బృందం సభ్యులైన సంగీత, దీపాలీ అవారే, కట్కే లత, మీనాచౌదరి 2014లోనే తమ విన్యాసాలతో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు.
ఆటలు- క్రీడలు: క్రీడాంగణంలోనూ తామెవరికీ తీసిపోమని సీఆర్పీఎఫ్ వీరాంగనలు నిరూపించారు. ఆమేరకు రకరకాల ఆటలు, క్రీడలలో మహిళా సిబ్బంది తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు. వీరిలో కమాండెంట్ కుమారి కుంజురాణిదేవి వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో అనేక జాతీయ, అంతర్జాతీయ పతకాలు కైవసం చేసుకున్నారు. ఆమేరకు 1989నుంచి 2005 మధ్య ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె 2 స్వర్ణ, 18 రజత, ఒక కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. క్రీడారంగంలో ప్రతిభకు గుర్తింపుగా 1990లో ‘అర్జున’, 1996లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’, 2004లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు ఆమెకు లభించాయి. మొత్తం 16 అర్జున అవార్డులు కైవసం చేసుకున్న సీఆర్పీఎఫ్ క్రీడాకారులలో ఆరుగురు మహిళలు- కుంజురాణిదేవి, డబ్ల్యు.సంధ్యారాణి, శిల్పిసింగ్, గీతారాణి, ఎ.అనితాచాను, సనమచ చాను ఉండటం మరింత విశేషం. సీఆర్పీఎఫ్‌కు వనె్నతెచ్చిన మహిళా క్రీడాకారులలో-2018నాటి సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్, 2019నాటి దక్షిణాసియా సమాఖ్య క్రీడలలో నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన రిచాశర్మ ఉన్నారు. అలాగే 2006 కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆషిఖీ బీబీ రజత పతకం సాధించగా, 2006నాటి ప్రపంచ పోలీసు క్రీడల సందర్భంగా 800 మీటర్ల పరుగు, 400 మీటర్ల రిలే పరుగు పందాల్లో ఎం.సి.సల్మా 2వ, 3వ స్థానాల్లో నిలిచింది. ఇక 2006నాటి జాతీయ షూటింగ్ పోటీల్లో పుష్పాంజలి రాణా స్వర్ణం సాధించగా, 2007నాటి జాతీయ పోటీల్లో సర్వేష్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది క్రీడా పటిమకు వారు సాధించిన పతకాలే నిదర్శనం.
మహిళా వీరుల అద్భుత ప్రతిభకు దీటుగా సీఆర్పీఎఫ్ కూడా లైంగిక వివక్షకు తావులేని అనేక వినూత్న చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇతర ప్రదేశాల్లో విధుల్లోగల మహిళా సిబ్బంది పిల్లల బాగోగులు చూడటంకోసం శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. అలాగే మహిళా సిబ్బంది ప్రయాణించే వాహనాల్లో మరుగుదొడ్డి సదుపాయం కల్పించింది. ఘర్షణల సమయంలో ఆందోళనకారులను నిలువరించడంలో, దాడులను ఎదుర్కొనడంలో వారికి పూర్తి శరీర రక్షణ కల్పించే సామగ్రిని అందించింది. తన మహిళాయోధుల పాత్ర సహకారం దిశగా సీఆర్పీఎఫ్ సదా సన్నద్ధంగా ఉండటమేగాక లింగ సున్నితత్వంపై తన నిబద్ధతను నిరంతరం నిరూపించుకుంటూనే ఉంది.

- ఎ.పి.మహేశ్వరి, ఐపీఎస్, డైరెక్టర్ జనరల్, సీఆర్పీఎఫ్