మెయన్ ఫీచర్

ట్రంప్, మోదీ ఎజెండాలో ఆక్రమిత కాశ్మీర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వదేశంలో ఎన్నికల సమయంలో సొంత పార్టీ నుండే విమర్శలు ఎదురవుతున్నా లెక్క చేయకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో వ్యవహరించిన తీరు గమనిస్తే ఆయన నిగూఢమైన రాజకీయ అజెండాతో వచ్చిన్నట్లు స్ఫష్టం అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు కూడా చూస్తే వారిద్దరూ కలసి మొత్తం ఆసియాలో తీవ్ర పరిణామాలకు దారితీయగల అంశంపై దృష్టి సారించినట్లు భావించవలసి వస్తున్నది.
కేవలం ఐదు నెలల ముందే అమెరికాలో ఈ నేతలిద్దరు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గత ఎనిమిది నెలల్లో తామిద్దరం ఐదుసార్లు కలిశామని మోదీ చెప్పడం గమనార్హం. సాధారణంగా అమెరికా అధ్యక్షులు భారత్ పర్యటనకు వస్తే 18 గంటల పాటు ఏకబిగిన ప్రయాణం చేయకుండా దారిలో మరో ఒకటి, రెండు దేశాలను కూడా చుట్టి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ కేవలం 35 గంటల సేపు భారత్ లో గడపటం కోసం ఆయన 36 గంటల సేపు ప్రయాణం చేశారు.
ఢిల్లీలో ఇరువురు నేతలు ఐదు గంటల సేపు ద్వైపాక్షిక చర్చలు జరిపినా చెప్పుకోదగిన ఒక్క ఒప్పదం కూడా నిర్దిష్టంగా జరగలేదు. కేవలం రూ 21,000 కోట్ల విలువ గల యుద్ధ విమానాల సరఫరా అంశం మాత్రమే వచ్చింది. అంత చిన్న ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ఇంత దూరం రానవసరం లేదు. పైగా, వాటిని సరఫరా చేసే మూడు కంపెనీలు ట్రంప్ కు పెద్ద ఎత్తున ఎన్నికల నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కీలకమైన ఒక రాజకీయ అవగాహన కోసమే ట్రంప్ వచ్చిన్నట్లు స్పష్టం అవుతుంది.
అమెరికా అంటేనే వ్యాపారం. భారీ వాణిజ్య ప్రతినిధివర్గం లేకుండా అమెరికా అధ్యక్షులు ఎక్కడకు వెళ్లరు. కానీ మొదటిసారిగా, ట్రంప్ ఎటువంటి వాణిజ్య పరమైన ఎజెండా లేకుండా భారత్ వచ్చారు అంటే కీలకమైన రాజకీయ ఎజెండాతో వచ్ఛిన్నట్లు స్పష్టం అవుతుంది. ఇక్కడకు రావడానికి ముందే భారత్‌తో ఎటువంటి వాణిజ్య ఒప్పందం ఈ సారి చేసుకోబోవడం లేదని కూడా ట్రంప్ ప్రకటించారు. దానితో ఆయన దృష్టి అంతా ఇతరత్రా ఆందోళన కలిగిస్తున్న అంశాలపై ఉన్నట్లు వెల్లడి అవుతుంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు నేతల ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొంటే, వారు ఒక పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
అమెరికాను చాలాకాలంగా వేధిస్తున్నది ఆఫ్గనిస్తాన్ సమస్య. అక్కడ 19 ఏళ్లుగా స్థావరం ఏర్పాటు చేసుకున్నా, ఆల్ ఖైదా స్థావరాలను ధ్వసం చేయడం తప్పా చెప్పుకోదగిన ఎటువంటి ఫలితం సాధించలేక పోతు న్నారు. పైగా 1800 మందికి పైగా సొంత సైనికులను కోల్పోవడం, బిలియన్ల డాలర్ల నిధులు గంగపాలు కావడంతో అమెరికా ప్రజలు హర్షించడం లేదు. 2012లోనే ఆఫ్గనిస్తాన్ లో అమెరికా సైనికులు ఉండటం వృద్దా ప్రయాస అని ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఇప్పుడు ప్రాబల్యం వహిస్తున్న తీవ్రవాద బృందమైన తాలిబన్లతో శనివారం రాజీ చేసుకోవడానికి ట్రంప్ రంగం సిద్ధం చేసుకున్నారు. అందుకు నాలుగు రోజుల ముందే ఆయన భారత్ లో గడపడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకొన్నది. తాలిబన్లతో చేసుకోబోయే ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న 18,000 మంది అమెరికా సైనికులలో మూడోవంతు మందిని వచ్చే వేసవి నాటికి, మిగిలిన వారిని వంతుల వారీగా డిసెంబర్ చివరి నాటికి ఖాళీ చేయవలసి ఉంటుంది. ఒకసారి అమెరికా సైనికులు వైదొలిగితే ఐ.ఎస్.ఐ. కనుసన్నలలో పనిచేస్తున్న తాలిబన్ ల పాలన ప్రారంభమైనా అక్కడ పాకిస్తాన్, చైనాల ఆధిపత్యం ఏర్పడుతుంది. అదే జరిగితే ఉగ్రవాద శిబిరాలకు నెలవుగా మారుతుంది.
అటువంటి పరిస్థితిని ట్రంప్ కోరుకోవడం లేదు. అందుకనే అక్కడ భారత్ సేనలు ప్రవేశించాలని చాలాకాలంగా అమెరికా వత్తిడి తెస్తున్నది. అయితే శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ. దళాలను మట్టుబెట్టడం కోసం మన సేనలను పంపి తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి రావడంతో భారత్ వెనకడుగు వేస్తున్నది. అందుకనే భారత్ ను ఒప్పించడంకోసం ట్రంప్ ఆక్రమిత కాశ్మీర్ ను ఎరగా చూపుతున్నట్లు పలువురు రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఆక్రమిత కాశ్మీర్ ను ‘విముక్తి’చేసి భారత్ స్వాధీనంలోకి రాగలిగితే నేరుగా ఆఫ్ఘానిస్తాన్ కు భూభాగం ఏర్పడి, ఆ దేశం వ్యవహారాలపై భారత్ ఆసక్తి చూపించడానికి వీలు ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
పార్లమెంట్‌లో ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదనను ప్రకటిస్తూ హోమ్ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఈ సందర్భంగా ప్రాధాన్యతను సంతరింప చేసుకొంటుంది. ‘మా తదుపరి లక్ష్యం ఆక్రమిత కాశ్మీర్’ అని స్పష్టం చేశారు. అదేవిధంగా కాశ్మీర్ విషయంలో భారత్ ధోరణి కూడా ఆ తర్వాత కీలక మలుపు తీసుకోంది. అప్పటి వరకు కాశ్మీర్ భారత్ - పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక అంశమని, రెండు దేశాలు చర్చించి పరిష్కరించు కోవాలని, మూడో దేశ ప్రమేయం ఉండకూడదని అంటూ వచ్చింది. కానీ ఇప్పుడు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. చర్చలు అంటూ జరిగితే ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం గురించే అని కూడా పేర్కొనడం గమనార్హం.
ఆక్రమిత కాశ్మీర్ భారత్ స్వాధీనంలోకి వస్తే పాకిస్తాన్ లో ఉగ్ర శిబిరాలకు తాళం వేసిన్నట్లు కాగలదు. పైగా, అక్కడ పెద్ద ఎత్తున ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్న చైనా ఎత్తుగడలు చిత్తు కాగలవు. బెలూచిస్తాన్‌ను కాపాడుకోవడం సహితం పాకిస్తాన్‌కు ప్రశ్నార్థ్ధకరంగా మారే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా దక్షిణ ఆసియాలో ఇది ఒక పెద్ద ఎత్తుగడ కాగలదు.
పాకిస్తాన్‌కు మద్దతుకు ఇప్పుడు చైనా సహితం రంగ ప్రవేశం చేసే అవకాశం లేదు. కరోనా వైరస్ కారణంగా చైనా వారెవ్వరిని రానీయని పరిస్థితులు ప్రపంచంలో వేగంగా నెలకొంటున్నాయి. ఇప్పుడు చైనా నుండి విదేశీ కంపెనీలు వలస ప్రారంభమైనది. ఆర్థికంగా ఆ దేశం వృద్ధి రేటు పడిపోతున్నది. ఇటువంటి పరిస్థితులలో యుద్దానికి దిగే సాహసం చైనా చేయదు.
అసలు ఆఫ్ఘానిస్తాన్ ప్రజలకు అమెరికా అంటే తొలి నుండి అనుమానాలే. వారెక్కువగా విశ్వసించెడిది భారతీయులనే. 2001లో కూడా భారత్ మధ్యవర్తిత్వం చేస్తే గాని అమెరికా సేనలను తమ దేశంలో అడుగు పెట్టనీయలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో భారత్ చొరవ తీసుకొని, అమెరికా వారికి పరిస్థితులను సానుకూలం కావించింది. అటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి సత్వరమే బైటపడాలని అనుకొంటున్నా 19 ఏళలుగా అమెరికాకు సాధ్యపడటం లేదు. అయితే ఒకసారి ఆఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా సేనలు వైదొలిగితే అక్కడ ఏమి జరుగుతుంది? ఇప్పుటు తాలిబన్లతో ‘రాజీ’ విషయంలో సహితం పాకిస్తాన్ కీలక పాత్ర వహిస్తున్నది. అమెరికా సేనలు వైదొలగితే, ప్రస్తుతం అమెరికా మద్దతుతో అక్కడున్న ప్రభుత్వం బలహీనమై, తాలిబన్లు అధికారంలోకి రావడం ఖాయం. ఆఫ్గనిస్తాన్ వంటి కీలక ప్రాంతంలో పాకిస్తాన్, చైనా ఆధిపత్యం వహిస్తే, ఉగ్రవాద శిబిరాలు ఇక బహిరంగంగా కొనసాగితే అమెరికాకు సహితం తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తగలవు. అందుకనే ఆఫ్గనిస్తాన్‌లో శాంతి నెలకొనడం భారత్ కు కూడా చాలా మేలు చేకూరుస్తుందని ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
ఇటువంటి పరిస్థితులలో ఆక్రమిత కాశ్మీర్ ‘విముక్తి’ కోసం అమెరికా భారత్‌కు అండగా నిలబడితే చైనా రంగంలోకి దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అమెరికా ప్రమేయం ఉంటే పాకిస్థాన్ సహితం ప్రతిఘటన ఇవ్వలేకపోవచ్చు. ఒక వంక ఆక్రమిత కాశ్మీర్ ‘విముక్త్తి’, మరో వంక ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం రాకుండా కట్టడి చేయడం గురించే ట్రంప్ - మోదీలు సమాలోచనలు జరుపుతున్నారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి.
ఏదిఏమైనా అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగాలి అంటే ట్రంప్ అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ అవకాశాన్ని ఒక అదనుగా భారత్ ఉపయోగించుకోవడం వ్యూహాత్మకంగా కీలక పరిణామం కాగలదు. గత మూడేళళుగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ దౌత్యరంగంలో చెప్పుకోదగిన విజయాలు సాధించలేదు. ఇరాన్‌తో అణు ఒప్పందం రద్దు, వాతావరణ మార్పు చర్చల నుండి వైదొలగండం, ఉత్తర కొరియాతో చర్చలు అసంపూర్తిగానే ఉండటం వంటి పలు ప్రతిఘటనలు ఎదురయ్యాయి. ఒకవిధంగా అంతర్జాతీయ వ్యవహారా ల్లో అమెరికాను ఆయన ఏకాకిగా చేస్తున్నారు.
అందుకనే వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల లోపుగా ఆఫ్ఘనిస్తాన్‌లో చెప్పుకోదగిన మార్పు చూపాలని పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆక్రమిత కాశీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి వాజపేయి హయాంలో కనీసం మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయని, చివరి క్షణంలో ఆగిపోయాయని కథనాలు వెలువడటం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పుడు మరోసారి అటువంటి అవకాశం అందుబాటులోకి వస్తున్నట్లు కనిపిస్తున్నది.

- చలసాని నరేంద్ర