మెయిన్ ఫీచర్

అంతా మనదే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ ది, మీది, మనది.. చాలా తేలిగ్గా నిత్య జివితంలో మనం అందరం వాడే పదాలు. కానీ అవి వాడుతున్న సందర్భంవలన మనం చెప్పదలుచుకున్నదాని అర్థం, స్పందన, పరిణామం ఎంతగానో మారుతాయి. అట్లాగే ఈ తారతమ్యం వున్న పదాలు మన భావనలలోనూ, ప్రవర్తనలోనూ మార్పులు తెస్తాయి అన్నది కూడా యధార్థమే.
కొత్తగా పెళ్లి అయిన జంటల మధ్య ఇది నీది, ఇది నాది- అది సంపాదనే కావచ్చు, సంసార బాధ్యతే కావచ్చు, ఆఖరికి వాడుకునే టూత్‌పేస్టు, టవలు అయినా కావచ్చు- అన్న గీత, లేక గోడ ఏర్పడినా ఆ దాంపత్యంలో నేడు కాకున్నా రేపు స్పర్థలు రాక మానవు.
ఒక ఉదాహరణ- ఇద్దరిలో ఒకరికి ఒళ్ళు తడుచుకున్న టవలు ఆరేయకుండా ఎక్కడో వదిలివేసే అలవాటు ఉందనుకోండి. ఇంకొకరికి అది ఇష్టం ఉండదు అనుకోండి. ఎప్పుడూ ఆ టవలు అలా పడేస్తావు అని రుసరుసలాడినా లాభం తక్కువే ఉంటుంది. మరి చిన్నప్పటినుండి వచ్చిన అలవాటు ఆయే. అప్పుడంటే, విసుక్కున్నా అమ్మ వెనుకనుంచీ సర్దుకుంటూ వచ్చేది. ఆ విసుగునూ మనం పట్టించుకోం. కానీ ఇపుడు వచ్చిన కొత్త బంధం, బాంధవ్యం విసుక్కుంటే కోపం రావటం సహజం. కొండకచో వాదనా పుట్టవచ్చు. అదే తెలివిగలవారు చేయవలసిన పని ఏమిటీ అంటే, అవతలివారు చూస్తుండగా ఏమీ మాట్లాడక, ఆ టవల్‌ను ఆరేయటం. అపుడు వుండే స్పందన ఎలా వుంటుందో ఆలోచించండి. ‘అబ్బ, కొద్దిసేపట్లో నేనే ఆరేసుకుంటాను కదా, మీకు ఆ శ్రమ ఎందుకూ’ అని. కొద్దిరోజుల్లో ఈ మాట వంటబట్టి మార్పువస్తుంది. ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.
నిత్య జీవితంలో నీ సంపాదన, నా సంపాదన అన్న మాట వచ్చినా, లేక ఇంటి ఖర్చులో నీ వంతు ఇంత, నా వంతు ఇంత అని అనుకుని ముందుకు సాగినా, ఏదో ఒక రోజు ఇద్దరిలో ఒకరికి అవసరం కలగక మానదు. అవతలివారిలో కోపం కలగకా మానదు. ఎందుకూ అంటే, అలవాటు అయిపోయిందిగా, నా డబ్బు అంటూ విడిగా. అదే మొదటినుంచి ఇది మన ఇల్లు, మన సంసారం, సంపాదన, ఖర్చు, పొదుపు అన్న అలవాటు కలిగితే పంచుకోవటం అలవాటు అయిపోతుంది. ప్రతిదీనూ.. ఇహ ఆ జంట కాపురానికి ఢోకాలేదు, ప్రళయం వచ్చినా, భూకంపం వచ్చినా. ఇది భార్యాభర్తలమధ్య తారతమ్యపు మాట అయితే, వేరే కోణంలో చూద్దాం.
కోడలు అత్తగారితో, ‘చూడండి అత్తయ్యా, మీ కొడుకు నా కోసం ఈ నగ తెచ్చారు’ అనటంలో, ‘చూడండి అత్తయ్యా, మా ఆయన నాకోసం ఈ నగ తెచ్చారు’ అనటంలో- భావం ఒకటే అయినా, భాషా ప్రయోగం కలిగించే స్పందనలోని తేడాలు- మొదటి దానితో, ఆ తల్లిలో గర్వం పొడసూపుతుంది, నా కొడుకు కాబట్టి ఇంత మంచి పని చేశాడు అని. ఆ గర్వంలో తనకు తేలేదు అన్న విషయం అసలు స్ఫురణకు రాదు. పైగా, ‘నా కొడుకు అంటే ఏమనుకున్నావ్, మేలిమి బంగారం వాడు’ అని మెచ్చుకున్నా మెచ్చుకోవచ్చు. అదే రెండవ పద ప్రయోగంతో, కలిగేది మంట కడుపులో. ‘ఎంత పొగరు కాకపోతే నా ముందు నా కొడుకుని పట్టుకుని మా ఆయన అంటుందా’ అని. నిజానికి ఆ తల్లే ఆ కోడల్ని ఏరి కోరి తెచ్చుకుని ఉండవచ్చు కూడా. అపుడు సాధారణంగా, తన మాట మీద నియంత్రణ ఉన్న అత్తగారు అయితే, ‘బాగుంది’ అని ముక్తసరిగా అని అక్కడనుంచి తప్పుకోవచ్చు. కొద్ది గడుసు అత్తగారు అయితే, ‘తెస్తాడమ్మా, తెస్తాడు, ఎందుకు తేడూ, ఇపుడు మీ ఆయన అయ్యాడుగా వాడు’ అంటూ గుంజుకోవచ్చు. అందరూ ఇలాగే మాట్లాడతారు, చేస్తారు, స్పందిస్తారు అని కాదు. కొందరు పట్టించుకోకపోవచ్చు, మరికొందరు ఇంకా తీవ్రంగానూ స్పందించవచ్చు. అదే కోడలు అసలు తెలివైంది అయితే, ఎట్లాగూ అది తనకే వస్తుంది, ఇవాళగాకపోతే రేపు అన్న నిజం తెలిసింది కాబట్టి, ‘చూడండి అత్తయ్యా, మీ కొడుకు మన కోసం ఈ నగ తెచ్చారు’ అందే అనుకోండి, వెంటనే ఆ ఆ అత్తగారు ‘నాకెందుకమ్మా ఈ వయసులో, నీకే బాగుంటుంది, నువ్వే వేసుకో’ అనేస్తుంది కోడలి మంచితనానికి మురిసిపోతూ.
అసలు ఈ ఇద్దరిమధ్య వున్న మన పురుష పుంగవుడికి తెలివిగనుక వుంటే, అమ్మ చేతికి రహస్యంగా ఈ నగ ఇచ్చి, ‘అమ్మా, నువ్వే ఇవ్వు ఇది నీ కోడలికి అంటే’, కోడలి ముందు తన పెద్దతనం నిలిపినందుకు కొడుకుని చూసి మురిసిపోతూ కోడలిని పిలిచి ముద్దుగా ఆ నగను తానే అలంకరిస్తుంది. ‘నాకేది’ అని అనదు కొడుకుతో. తన పెద్దతనం, మంచితనం దెబ్బతింటాయి అన్న ఉద్దేశంతో..
కొద్దిగా తర్కించుకుంటే మనలో మనమే, ప్రపంచంలో ఇంకెక్కడా లేని సమిష్టి కుటుంబ వ్యవస్థ మన దేశంలోంచి నేడు చాలామటుకు తొలగిపోయింది అంటే, ఈ నాది, మీది, మనది అన్న భావనా వ్యత్యాసంతోనే. తక్కువ సంపాదించేవాడు ఇంటి ఖర్చులో తక్కువ భాగం పంచుకుంటున్నాడు, నా మీద భారం ఎక్కువ పడుతోంది అని ఒకరి ఆలోచన. అవతలివాడు, నేను తక్కువ భాగం పంచుకుంటున్నాను అని నా భార్యతో ఎక్కువ పని చేయిస్తున్నారు, లేక నన్ను చిన్న చూపు చూసి, భారమైన పనులన్నీ నాకే చెప్తున్నారు అని అనుకుంటాడు.
అది నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనస్సులో ఈ భావన బీజం నాటుకుంటుందో అక్కడినుంచే ఆ కుటుంబం విడిపోవడానికి నాంది అవుతుంది.
నిజానికి, తరచి చూస్తే, రెండు కుంపటులు పెట్టేటప్పటికీ ఇద్దరికీ ఖర్చుపెరుగుతుందే కానీ తరగదు గాక తరగదు. అట్లాగే ఇంటిపని బాధ్యతా పెరుగుతుంది.
అక్కడితో ఆగదు, వీరి మీద ఆధారపడ్డ ఆర్థిక సత్తా లేని తల్లీ తండ్రీ వుంటే, వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఇక్కడ అందరూ కలసి ఉన్నపుడు అది తల్లిదండ్రుల ఇల్లు, మా ఇల్లు అయింది. ఇపుడు విడిపోయినాక నా ఇల్లు, నా రాజ్యం, నా ఇష్టానుసారంగా నడుస్తుంది అన్న అహం పెంచిన కాంక్ష. నిజానికి అక్కడ అందరూ నష్టపోయేవారే. అది గ్రహించే తీరిక, మనస్తత్వంలో ఆ క్షణంలో ఉండవు. ముందుగా పిల్లలు, తాత నాయనమ్మ దగ్గర ఉండి పెరిగిన పిల్లలు పరిమళించినంతగా, కేవలం తల్లిదండ్రుల సంరక్షంలో పెరిగిన పిల్లలు, మానసిక వికాసం కలిగి, మంచి మన్నన సౌభాతృత్వం కలిగి ఉండదు. అంటే ఒక రైలు డబ్బా అంత జీవితం, కేవలం ఒక క్యూబికల్‌కే పరిమితమవుతుంది. దానితో ఈ ఎనిమిది, పది సీట్ల భాగం బాగుంటే చాలు. మొత్తం డబ్బా సంగతి తరువాత, మొత్తం రైలు క్షేమం గురించి అటు తరువాత అన్న స్వార్థపూరిత, సంకుచిత స్వభావం, ముఖ్యంగా పిల్లల్లో, భావి భారత పౌరులలో మొక్కలుగా ఉన్నపుడే నాటుకుంటోంది. ఇహ వీరు సమాజం గురించి, దేశం గురించి ఆలోచిస్తారు అనుకోవడానికి ఆస్కారం లేదు. ప్రస్తుత మన సామాజిక పరిస్థితి ఇలా ఉండటానికి ఇది ముఖ్యకారణం.

- నండూరి రామచంద్రరావు