మెయన్ ఫీచర్

శ్రీనివాసుడు ముంచుతాడా? తేలుస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదమూడో తారీఖు సాయంత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సస్ (సీబీడీటీ) వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద అల్లకల్లోలం రేపింది. వాస్తవానికి ఫిబ్రవరి 6వ తారీఖున చంద్రబాబునాయుడు మాజీ ప్రైవేట్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరిపై ఇన్‌కం టాక్స్ దాడులు 6 రోజులపాటు జరిగినప్పుడే రాజకీయ చర్చలు, పలు ఊహాగానాలు మొదలయ్యాయి. దీని పరిణామంపై సిబీడీటీ ఎప్పుడు ప్రెస్ బ్రీఫ్ ఇస్తారో అని యావత్ ప్రజానీకం ఆతృతతో ఎదురు చూడసాగారు. ఈలోగా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని టీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలు కూడా ఆరంభమయ్యాయి. అంత రచ్చ జరుగుతున్నా తెలుగుదేశం వర్గాలు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా గుంభనంగా వున్నారు. మరి సీబీడీటీ పేల్చిన బాంబు తెలుగుదేశం పార్టీలో, నాయకుల్లో ప్రకంపనాలు మొదలయ్యాయి. రాత్రంతా కొన్ని ఛానల్స్ ఈ అంశానే్న చర్చించాయ. చంద్రబాబుగారు కూడా ఉన్న పళంగా హైదరాబాద్‌కు బయల్దేరి రావడం కూడా చర్చనీయాంశం. మరి ఈ వార్త మూలాలకెళ్ళి చిలికి చిలికి గాలివానగా మారి చంద్రబాబు మెడకు చుట్టుకొంటుందా? చంద్రబాబు జైలుకెళ్ళడం ఖాయమా? ఈ అవినీతి విష వలయంలో ఇంకెంతమంది నాయకులు దాగివున్నారు అన్న విషయం మరి కొన్ని రోజుల్లోనే బయటపడే అవకాశం కన్పిస్తున్నది.
సిబీడీటీ, ప్రెస్‌నోట్ ఏం చెపుతుందో ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 6వ తారీఖు నుండి ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ మరియు పూణె పట్టణాల్లోని 40 ఆఫీసులపైగా ఆవరణలలో రైడ్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రాలుగా పనిచేస్తున్న 3 ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్లో ఈ సోదాలు జరిగాయి. 2వేల కోట్ల రూపాయల పైబడి అనధికారపు నల్లధనం వీటిలో బైటపడింది. విదేశాలనుండి ఎఫ్‌డిఐ పేరుతో ఈ నల్లధనం ఆంధ్రప్రదేశ్ చేరింది. బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా బోగస్ బిల్లుల రూపంలో ఇది చెల్లింపబడింది. ఈమెయిల్స్, వాట్సప్ మెసేజ్‌లు, కీలక పత్రాలు కూడా లభించాయి. ఈ సంస్థలపై సోదాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖుని పిఎస్ ఇంటిపై కూడా సోదాలు నిర్వహించి అనేక కీలకపత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సోదాలలో 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షలు చేసే బంగారు ఆభరణాలు కూడా లభించాయి. ఇది సిబీడీటీ కమీషనర్ సురభి ఆహ్లూవాలియ ఇచ్చిన ప్రెస్ నోట్‌లోని ప్రధాన సారాంశం. దీని ద్వారా మనకు తెలిసేదేమంటే మూడు ప్రధాన కంపెనీల నుంచి బోగస్ సబ్ కాంట్రాక్టర్ల సంస్థల ద్వారా 2వేల కోట్ల రూపాయలు పైగా నగదును అక్రమంగా తరలించినట్లు తెలుస్తుంది. ఇవన్నీ అడ్రస్ లేని షెల్ కంపెనీలే. వీటి ఐ.టి. రిటర్న్స్ అన్నీ కూడా ఒకే ఐపీ నుంచి సబ్మిట్‌చేశారు. విదేశీ పెట్టుబడుల రూపంలో ఒక ప్రధాన కాంట్రాక్టర్ వచ్చిన నిధులు బోగస్ సంస్థలకు మళ్ళించారు. అందరికీ అర్థ్ధమయ్యేలా చెప్పాలంటే వీళ్ళ నల్ల డబ్బును ఎలాగో విదేశానికి చేరవేయడం, ఆ డబ్బు ఎఫ్‌డిఐ రూపంలో వైట్ మనీగామార్చి రాష్ట్రంలో పెట్టుబడి రూపంలో పెట్టడం. 2వేల కోట్ల అవినీతి సొమ్ము దొంగ తెలివితేటల్తో వైట్‌గా మార్చుకొనే వ్యవహారం ఈ జాదూల పని. మరి పెద్ద జాదూ ఎవరో?
ఫిబ్రవరి 6వ తారీకున సంచలనం రేపిన ఈ దాడులకు అందిన క్లూ కాస్త తెలుసుకొందాం. నవంబర్ 2019న దేశంలోని 42 ప్రదేశాలలో ఐ.టి. దాడులు విస్తృతంగా జరిగాయి. ఆ సందర్భంలో ముంబైలోని ఓ ప్రముఖ సంస్థపై జరిపిన దాడిలో ఆ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు అందజేసినట్లు పేర్కొనడం ఐటి సంస్థను పరిశోధన వైపు నడిపించింది. ఆ పరిశోధన లింకే 6వ తారీఖున చంద్రబాబు పిఎస్‌పై జరిగిన దాడులు.
ఎవరీ పి.ఎస్. శ్రీనివాస్? ఈయన సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంటులో క్లర్క్‌గా జీవితాన్ని ఆరంభించాడు. 1995న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన దగ్గర చంద్రబాబుతోపాటు తిరుపతి కళాశాలలో చదువుకొన్న, ప్లానింగ్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఓఎస్‌డిగా చేరారు. ఆయన దగ్గర పి.ఎ.గా సదరు శ్రీనివాస్ అనే వ్యక్తి చేరారు. అప్పట్లోనే ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు చేసేవారు. ముడుపులు ముట్టేవరకు, చంద్రబాబు సంతకం చేసిన ఫైల్స్ జి.ఓ.లుగా బయటకొచ్చేవి కావని అందరూ చెపుతుండేవారు. ముఖ్యంగా మెడికల్, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బి శాఖల్లోని వ్యక్తులు బహిరంగంగానే చెప్పుకొనేవారు. 2004 ఎన్నికల్లో పరాజయం అనంతరం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించింది. కొన్ని రోజులు గడిచాక చంద్రబాబు దగ్గర పి.ఎ.గా శ్రీనివాస్ చేరాడు. అప్పట్లో లక్ష్మీనారాయణగారే బలవంతం చేసి శ్రీనివాస్‌ను చంద్రబాబు దగ్గర చేర్పించారు. ఆనాటి నుండి శ్రీనివాస్ చంద్రబాబుకు సర్వస్వం, ఆత్మ అయిపోయాడు. వాళ్ళిద్దరి బంధం బలమైంది. ఎన్నికల ఫండ్స్, అభ్యర్థులకు పంపడం, ఇత్యాది అన్ని విషయాలు శ్రీనివాసే చూసుకొనేవాడు. 2004నుండి 2014 వరకు ఈయన బండి కాస్తా ‘స్లో’ అయినా 2014లో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఇతని గ్రహాలు పూర్తిగా మారిపోయి అత్యున్నత స్థితికి చేరుకొన్నాడు. చంద్రబాబు ప్రిన్సిపల్ సెక్రటరీకూడా ఇతని ముందర ‘డమీ’నే. ఇంతై, అంతై అంతింతై శ్రీనివాస్ ఈరోజు 2వేల కోట్ల స్కాంకు మూల పురుషుడు. చంద్రబాబును చీమ కలవాలన్నా, దోమ కుట్టాలన్నా శ్రీనివాస్ అనుమతి కావాల్సిందే.. ఎంత పెద్ద ఆఫీసర్లయినా ఈయనను ‘సార్’ అనాల్సిందే. ఇంత సర్వీసులోకూడా తనపై ఎలాంటి చిన్న ఆరోపణలు, ఎలాంటి పత్రికలో కూడా రానీయకపోవడం ఈయన ‘మేధస్సు’కు అద్దం పడుతుంది. ఈ 2వేల కోట్ల లావాదేవీలు వెనుక ఖచ్చితంగా చంద్రబాబే సూత్రధారని చెప్పచ్చు. జగన్‌గారు సీఎం అయ్యాక ఈ శ్రీనివాస్ చంద్రబాబుకు దూరంగా వుంటూ, కాదు నటిస్తూ ‘షో’నడపాలనుకొన్నాడు. ఎవర్ని పట్టుకొన్నాడో, ఏ తాయిలం ఎరవేశాడో కానీ ఈయన తన మాతృసంస్థ కాకుండా ప్లానింగ్ డిపార్ట్‌మెంటులో చేరిపోయాడు. అప్పట్లో డెక్కన్ క్రానికల్‌లో ఓ ఐటం ఇతనిపై వచ్చింది. ‘ ఘోజజూఖ’ఒ ఘౄశ జశ చ్ఘ్ఘశఒ ఆళ్ఘౄ’ అన్న వార్త. ఇధి విమర్శ కాదు. అధికారం కోల్పోయినా ఇతని చాకచక్యం గూర్చే.
ఇంతటి సంచలన వార్తపై ఎవరేమన్నారో పరిశీలిద్దాం.
బొత్స.. ‘‘వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మరి ఎందుకని ఇందులో ఇరుక్కున్నాడో?’’. లోకేష్ బాబు.. ‘‘పచ్చ కళ్ళవారికి లోకమంతా పచ్చగానే కన్పిస్తుంది. జగన్‌కి అవినీతి కనపడడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. శ్రీనివాస్ ఇంట్లో 2వేల కోట్లు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు వెసీపీ నేతలు’’. మంత్రి పేర్నినాని.. ‘‘నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు దొరికినట్లు ఇన్నాళ్ళకు చంద్రబాబు పాపం పండింది’’. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ‘‘ఐ.టి. దాడుల్లో చంద్రబాబు బినామీల అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియాకు ఐ.టి. దాడులు కన్పించలేదా’’. మాజీ ఎంపీ రవీంద్రబాబు.. ‘‘2వేల కోట్లు కేవలం అవినీతిలో పొర మాత్రమే. 3 లక్షల కోట్లుపైచిలుకు బయటకొస్తుంది’’. సోము వీర్రాజు, బీజేపీ ఎమ్మెల్సీ.. ‘‘చంద్రబాబు అవినీతి త్రవ్వేందుకు బుల్‌డోజర్లు కావాలి’’. సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్.. ‘‘చిన్న అపార్ట్‌మెంటులో వుండే శ్రీనివాస్ ఇంట్లో 2వేల కోట్లు దొరికితే చంద్రబాబు దగ్గర ఎంతుండాలి?’’.
రాత్రంతా టీవీలలో ఈ వార్త గూర్చి విన్నాను. మరి ప్రతికల్లో కూడా చూద్దాం అని చూశాను. ఒక ప్రతికలో సీబీడీటీ ప్రెస్‌నోట్ గూర్చి రాలేదు. ఆశ్చర్యం అన్పించింది. తెలుగుదేశం జెండా కప్పుకొన్నా, కనీసం చిన్న వార్త అయినా ప్రెస్‌నోట్ ప్రచురించి వుండాల్సింది. మన ఖర్మ పత్రికా స్వేచ్ఛ ఇలా తగలపడింది.. ప్రభుత్వ వార్తను కూడా ప్రచురించాలన్న కనీస ధర్మం కూడా ఆ పత్రిక విస్మరించింది. దీని గురించి అటుంచితే.. ఇప్పుడేం జరుగుతుంది? అన్నదే ఈరోజు సర్వత్రా జరుగుతున్న చర్చ. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ కలసి వున్న కాలంలో చంద్రబాబు మోడీగారిని ‘దేవుడి’లాగా పొగిడేవాడు. అమరావతి శంఖుస్థాపనకు మోడీగారిని ఆహ్వానించి కోట్లు వెచ్చించి పంక్షన్ చేశాడు. 2018లో రెండు పార్టీల మధ్య బెడిసింది. వేరు కుంపట్లు పెట్టుకొన్నారు. ఎన్నికలు సమీపించే సమయంలో చంద్రబాబు బీజేపీని ప్రధాని మోడీని, ఆ పార్టీ అధ్యక్షులు అమిత్‌షాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. తిరుమలకు దేవుడి దర్శనానికి వచ్చిన అమిత్‌షా కార్లపై రాళ్ళు వేశారు. సీబీఐని, ఐ.టి. రైడ్స్‌ను తానే ఆంధ్రప్రదేశ్ నుండి బ్యాన్ చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. రాహుల్‌గాంధీ, సోనియా, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, దేవెగౌడ, మాయావతి తదితర నేతలతో కోరస్ పాడాడు. అదంతా గతమే.. కానీ 2019లో తిరిగి బీజేపీ విజయభేరి మ్రోగించగా చంద్రబాబు తిరిగి బీజేపీ రాగం ఎత్తుకున్నాడు. ఏ చిన్న విమర్శకూడా బీజేపీని చేయకుండా జాగ్రత్తపడుతూ వచ్చాడు. బీజేపీ స్నేహంకోసం అర్రులు చాచి తన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో చేర్పించడం అందరికీ తెలిసిందే. కానీ ఎందుకనో బీజేపీ చంద్రబాబును మన్నించిన దాఖలాలు కన్పడలేదు. చంద్రబాబు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాడు. క్రొత్తగా వచ్చిన కాంగ్రెస్ స్నేహాన్ని పూర్తిగా విస్మరించాడు. ఇటు వీళ్ళేమో రానీయడం లేదు. చంద్రబాబు జీవితంలో ఇంతటి క్రైసిస్ ఎప్పుడూ రాలేదు. ఆందోళనలో క్రాస్‌రోడ్లపై నిలుచున్నాడు. ఆయన వెంట ఆయన నమ్ముకొన్న పచ్చమీడియా మాత్రం అడుగులు వేస్తూంది. అది కొంతవరకు ఆయనకు సాంత్వన కల్గించే విషయమే..
బీజేపీపై చంద్రబాబు ఆశలు వమ్మయ్యాయి. స్నేహం చిగురిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వేళ ఆయన మాజీ పి.ఎస్. శ్రీనివాస్‌పై ఐ.టి. దాడులు వున్నపళంగా జరగడం చంద్రబాబుకు నిజంగా షాకే.
ఆయనకిప్పుడు గతం తిరిగి గుర్తుకొచ్చి వుంటుంది. ఒకవేళ గవర్నర్‌తో భేటీ అనంతరం గవర్నర్‌ని, గవర్నర్ వ్యవస్థను కూడా తీవ్రంగా విమర్శించాడు. మరోసారి మీటింగ్‌లో ‘నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు. నాకు మీరంతా అండగా వలయంలా నిలబడాలి’ అని రాష్ట్ర ప్రజానీకాన్ని అర్థించాడు. అంటే దాని అర్థం ఎన్నికలముందు పోలవరం ఇష్యూలో తనను అరెస్ట్ చేస్తారన్న భయం ఆయన్ని అలా మాట్లాడించింది. మరి ఇప్పుడు అది నిజం కాబోతుందా? శ్రీనివాస్ చిచ్చు తనకు ముప్పుకాబోతుందా? తాను దోషిగా నిలబడితే కేంద్రం అరెస్ట్ చేస్తుందా? తనకిప్పుడు మార్గం ఏమిటి? కోర్టులయినా ఆదుకొంటాయా లాంటి ఎన్నో విశే్లషణలు నేడు చంద్రబాబు మెదడులో ఉద్భవించాయి. ఎలాంటి సిట్యుయేషన్‌నైనా తట్టుకోగల, మేనేజ్ చేయగల వ్యక్తిత్వం తనది. అదృష్టమేంటోగాని ఇప్పటివరకు అన్ని కోర్టులూ ఆయనకు అనుకూలంగానే అండగా నిలబడుతూ వచ్చాయి. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అడ్డంగా దొరికిపోయినట్లుంది.
ఐ.టి. డిపార్ట్‌మెంటు ప్రభుత్వానికి తెలియకుండా చేయదన్నది మనందరికీ తెలిసిందే. శ్రీనివాస్‌పై దాడులు బీజేపీ ప్రభుత్వానికి తెలియవని ఎవరూ అనుకోరు. మరి బీజేపీ ఎందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది? కారణాలేమిటి? నిజంగా చంద్రబాబును దెబ్బతీయాలన్న లక్ష్యంతో వుందా? లేక కేవలం చంద్రబాబుకు ఒక జలక్ ఇచ్చి తన గుప్పెట్లోనే వుంచుకొనేందుకు వేసిన ఎత్తుగడా? ఏమై వుంటుంది? ఏం చేయబోతూంది? అన్నదే అందరిలోనూ జరుగుతున్న చర్చ. మరి ఎన్నికల ముందు మోడీగారు ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ పోలవరం చంద్రబాబు, లోకేష్‌లకు ఎటిఎమ్ అని తీవ్ర విమర్శ చేశారు. మరి ఎన్నికలయ్యాక ఎటిఎమ్‌లపై ఎందుకు సీబీఐని పురమాయించలేకపోయింది. ఔను ఇంతకాలం అంత పెద్ద అవినీతి ఆరోపణను చంద్రబాబుపై చేసిన ప్రధానిగారు ఎందుకు ఆ విషయాన్ని విస్మరించారు? ఇంత పక్కాగా చంద్రబాబు దొరికాక బీజేపీవాళ్ళు వదిలేస్తే ప్రజల్లో చులకన అయిపోరా? మోడీ ఇమేజ్‌కు దెబ్బకాదా? ఈ ఇష్యూ చాలా జటిలమైంది. యావత్ భారతదేశం తీర్పుకోసం ఎదురుచూస్తుంది. పిఎస్‌పై దాడి చేస్తేనే 2వేల కోట్ల నల్లధనం దొరికితే, నిర్భయంగా, నిష్పాక్షికంగా చంద్రబాబుపై సీబీఐవంటి సంస్థలు దర్యాప్తుచేస్తే కొందరు విమర్శిస్తున్నట్లు ఎన్ని లక్షల కోట్ల అవినీతి వెలుగు చూస్తుందో?
శుక్రవారం సాయంత్రం జగన్ అమిత్‌షా మధ్య కీలక భేటీ జరిగింది. వీరి మధ్య ఖచ్చితంగా రాజకీయ చర్చ జరిగే వుంటుంది. కేవలం రాష్ట్ర సమస్యలపైనే చర్చలు జరిగినట్లు ఏ పార్టీ వ్యక్తులైనా చెబితే ప్రజలు నవ్వుకొంటారు. చంద్రబాబు దోస్తీ అనంతరం పవన్‌కళ్యాణ్‌గారు కూడా కాషాయ కండువా కప్పుకొన్నాడు. మరి ఇంతటి ప్రధాన ఇష్యూపై పవన్‌కళ్యాణ్‌గారు ఏ ప్రకటన చేస్తారో చూడాలి. తాను గనుక చంద్రబాబును రక్షించే ప్రయత్నం బీజేపీ ద్వారా చేస్తే చాలా చెడ్డపేరు వచ్చే అవకాశం వుంది. ఏది ఏమైనా సీబీడీటీ ప్రకటన తెలుగుదేశం వారి గుండెల్లో బాంబునే పేల్చింది. హవాలా డబ్బు 2వేల కోట్లు విదేశాలకు ఎలా తీసుకెళ్ళారు. దానిని ఎలా ఎఫ్‌ఐటిల క్రింద తీసుకొచ్చారో! ఆ డబ్బునే తమ ఇన్‌వెస్ట్‌మెంటు క్రింద మన రాష్ట్రంలో అడుగిడిన ఆ సంస్థల పేర్లేంటి? అమరావతిలో ఆ నల్లధనంతో ఎన్ని వేల ఎకరాలు దోచుకొన్నారో లాంటి చాలావిషయాలు ఇక సమగ్రంగా దర్యాప్తుచేయాల్సిన అవసరం, నివేదిక ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. సీబీఐ దాడులు చేసిన రాజకీయ నాయకుల జాబితాలో చంద్రబాబు కూడా చేరుతాడా? ఏమో చూడాలి. 2017లో మొదటి 6 నెలల కాలంలో సీబీఐ దేశంలోని టాప్ పొలిటీషియన్స్ 14 మందిపై కేసులు పెట్టింది. వారిలో హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 82 సం. వీరభద్రసింగ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్‌రావత్, ఆర్‌జేడీ లీడర్ లాలూప్రసాద్‌యాదవ్, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకుమార్ జైన్, చిదంబరం, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుధీప్ బంధోపాధ్యాయ్ తదితరులు వున్నారు. వీరంతా అవినీతిలో ఇరుక్కొన్నవారే. మరి శ్రీనివాస్ 2వేల కోట్ల స్కాం గనుక నిష్పాక్షికంగా జరిగితే, ఆ నివేదిక చంద్రబాబును ఆ టాప్ పొలిటీషియన్స్ లిస్టులో చేరుస్తుందా? భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబుకంటూ ఓ స్థానం వుంది. పేరున్న రాజకీయ వేత్తల్లో ఆయన కూడా ఒక్కరన్నది అందరూ అంగీకరించేదే.. ఆ ట్రాక్ రికార్డుతోనే చంద్రబాబు ఇంతకాలం నెట్టుకొచ్చాడు. ఇంతకాలం తాను నిప్పు అని, తనను ఎవరూ వేలెత్తి చూపలేరని, తనను ఎవరూ ఏం చేయలేకపోయారని, తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని చెప్తూ వచ్చిన చంద్రబాబు మాటలు వాస్తవాలా? ప్రగల్భాలా? అన్నది ఈ దర్యాప్తులో తేలుతుంది. నిజంగా చంద్రబాబుకు ఇదొక శీల పరీక్షగానే చెప్పచ్చు. ఈ శ్రీనివాసుడు ఈయనని నీట ముంచుతాడో, పాల ముంచుతాడో ఎదురుచూద్దాం.. అవినీతి అంతం మాత్రం జరగాలని మనందరం కోరుకొందాం..

- డా. విజయకుమార్ 93907 45775