మెయన్ ఫీచర్

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోలుకుంటుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టలేదు. గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో ఒక్క సీటు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం దేశంలో పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, పాండిచ్ఛేరి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. మహారాష్టలో తన రాజకీయ సిద్ధాంతాలకు గాలికి వదిలేసి హిందూత్వ జాతీయవాదం పునాదిగా ఉన్న శివసేన, మరో పార్టీ ఎన్సీపీతో, జార్కండ్‌తో జేఎంఎంతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో జూనియర్ భాగస్వామిగా చేరి అధికారంలో ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 73 సంవత్సరాల్లో ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సంపాదించుకుంటుందా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘనమైన గత చరిత్ర ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ పార్టీ కోలుకుంటుందా?
దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో బలంగా ఉండేది. ఆ పార్టీ కేరళలో వామపక్ష కూటమికి ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటోంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లక్రితమే తుడిచిపెట్టుకుపోయి ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్టనర్‌గా కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, తెలంగాణలో నామమాత్రంగా తన ఉనికిని చాటుకుంటోంది. 2014, 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తన సత్తాను చాటలేకపోయింది. హిమశిఖర సమానులైన నేతలతో కళకళలాడే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బోసిపోయింది. దేశమంతా కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయిన రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏపీ నేతలు, ఇండస్ట్రియలిస్టులు, ప్రజలు ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆంధ్రప్రజలు అక్కున చేర్చుకుని ఆశ్రయం ఇచ్చారు. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ శైలజానాథ్‌ను ఎఐసీసీ నియమించింది. అంతకు ముందు రఘువీరారెడ్డి ఆ పదవిలో రాణించారు. ఇద్దరూ కూడా అనంతపురం జిల్లా వాసులే కావడం విశేషం. ఈ ఇద్దరు నేతలు కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి కోటరీలో ఉండేవారు. వైఎస్‌ఆర్ మంత్రివర్గంలో ఈ ఇద్దరు నేతలు మంత్రులుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం అమలుతో కాంగ్రెస్ పార్టీ తన మరణానికి తానే శాసనం రాసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను విశే్లషిస్తే విపక్ష పార్టీగా టీడీపీ విఫలమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ రాణిస్తుందా? కాంగ్రెస్ పార్టీ తన శక్తియుక్తులతో ఎదిగేందుకు అవకాశాలు లేకపోలేదు. కుల వైషమ్యాలతో, వర్గపోరుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఏ మేరకు నెగ్గుకొస్తుందో చూడాలి.. రెండు సామాజిక వర్గాల ఆధిపత్య తీరుతో జనంలో విసుగు కనపడుతోంది. ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడు, మృదుభాషి అయిన డాక్టర్ శైలజానాథ్ చిక్కి శల్యమై అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు ఎటువంటి ప్రణాళికలు, ఆయుధాలు సిద్ధం చేసుకుంటారో చూడాలి.
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు టీడీపీతో చేరితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుప్పెడు కార్యకర్తలు కూడా జారుకోవడం ఖాయం.
1983 నుంచి 2014 వరకు టీడీపీపై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబాలు ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీతో కాంగ్రెస్ స్నేహం చేస్తే క్షమించరు. ఇటువంటి ప్రయోగాలు బీజేపీకి పనిచేస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ తప్ప మరెవరితోనైనా బీజేపీ సులభంగా కలిసి పోగలదు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర నేతలు ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేశారు. ఆ పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఇప్పుడున్న దుస్థితికి దిగజారలేదు. ఏపీలో వామపక్ష పార్టీలు కూడా గాడి తప్పి ప్రయాణం చేస్తున్నాయి. బీజేపీతో పోల్చితే కాంగ్రెస్‌కు గట్టి పునాదులున్నాయి. కాలక్రమంలో విభజన ఉప్పెనకు శిథిలమైన కాంగ్రెస్ బతకాలంటే ఆంధ్ర రాష్ట్రంలో అధికారం అనుభవించని సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి సరికొత్త ప్రయోగం చేస్తే బాగుంటుంది. ఓటు బ్యాంకుగా మారిన కులాలను సమీకరించాలంటే పెద్ద ఎత్తున శ్రమించాల్సి ఉంటుంది. ఈ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి ఒక ప్రయోగం చేసేందుకు సరైన సమయమిదే. మిగతా పార్టీలకు లేని సైద్ధాంతిక బలం, జనంతో ఉన్న సంబంధాలు కాంగ్రెస్‌కు ఉన్నాయి.
బీజేపీని ఏకాకి చేసేందుకు పౌరసత్వసవరణ వ్యతిరేక ఉద్యమం లాంటివి ఆంధ్ర, తెలంగాణలో పనిచేయవు. బీజేపీ మతతత్వ అజెండాపై దుమ్మెత్తిపోయడం వల్ల మిగిలేదీ నీరసమే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేవలం రెండు వర్గాలకే పరిమితమైన అధికారాన్ని గుంజుకునేందుకు ఆంధ్రకాంగ్రెస్ కొత్త పంథాలో పయనిస్తే కొంత మేరకు మంచి ఫలితాలు రావచ్చు. పాత పద్ధతిలో పార్టీని నడిపితే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నాలుగు ప్రెస్‌మీట్లు, రక్తదాన శిబిరాలు, కార్యకర్తల సదస్సుల వల్ల కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను సాధించలేదు.
ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌పార్టీ తన స్థానాన్ని వెతుక్కునేందుకు మంచి సమయమిదే. దురదృష్టవశాత్తు ఆ పార్టీలో కొంత మంది నేతలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు పరిమితం కావడం వల్ల అభాసుపాలవుతున్నారు. రాజధాని అంశాలు, కర్నూలు హైకోర్టు లాంటి గంభీరమైన అంశాలపై టీడీపీకి వత్తాసు పలికే ప్రకటనలు చేయడం వల్ల కాంగ్రెస్‌కు ఇసుమంత కూడా లాభంలేదు. వైకాపా, టీడీపీని రెండింటినీ లక్ష్యంగా చేసుకుంటూనే, ఆంధ్ర రాజకీయాల్లో సామాజిక ప్రయోగం చేసేందుకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టడం మంచిది. టీడీపీ, వామపక్ష పార్టీలతో కలిసి పోరాడే ఎత్తుగడలను కాంగ్రెస్ ఆహ్వానిస్తే భవిష్యత్తు శూన్యం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2014లోనే అధికారంలోకి వస్తుందనుకుంటే, 2018లో కూడా భంగపాటు ఎదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఐదారుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో రాణించలేకపోయింది. త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎఐసీసీ నియమించనుంది. కొత్త అధ్యక్షుడిని నియమించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అధికారానికి చేరువవుతుందని, 2023 ఎన్నికల్లో గెలుస్తుందనే భ్రమలకు లోను కావడం మంచిది కాదు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా శక్తిమేరకు పార్టీని నడిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరున్నా, విమర్శలు చేయడం కాంగ్రెస్ సంస్కృతిలో భాగం. ఉత్తమ్‌ను మార్చితే కొత్తగా వచ్చే నేత అద్భుతాలు సృష్టించలేరు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని గట్టి దెబ్బతింది. ఇదే సూత్రం ఆంధ్రాలో కాంగ్రెస్‌కు వర్తిస్తుంది. కేంద్రంలో సంకీర్ణ రాజకీయాల్లో పరస్పర వైరుధ్యం ఉన్న పార్టీల పొత్తు కుదురుతుందేమో కాని, నాలుగు దశాబ్థాల పాటు రాజకీయాల్లో బద్ధవైరంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఆచరణ సాధ్యం కాదు. 2018లో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు వికటించింది.
తెలంగాణలో ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చితే అన్ని వర్గాలను కలుపుకునిపోయే నేతను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సంఖ్యాపరంగా బీసీ కులాల జనాభా ఎక్కువ. తమకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఈ వర్గాలు కోరుతున్నాయి. కాంగ్రెస్‌లో గతంలో గట్టి నేతలుగా ఉన్న కేకే, డీఎస్ లాంటి నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. డీఎస్ సాంకేతికంగా టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేందుకు తగిన పరిస్థితులు ఉన్నాయి. కాని వాటిని పార్టీ విస్తరణకు, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సద్వినియోగం చేసుకునే బలమైన నేతలు టీపీసీసీకి అవసరం. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు. ఇప్పటికే ఎఐసీసీ పలు పర్యాయాలు టీపీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించే విషయమై నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. మరోమూడున్నరేళ్లలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలంటే, రాజకీయ చతురుడు, ప్రజానాయకుడు కేసీఆర్‌ను తట్టుకుని నిలబడాలి. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. మరో వైపు బీజేపీ కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దురదృష్టమేమిటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నేతలు కేవలం మీడియాకే పరిమితమవుతున్నారు. జనంతోకి వెళ్లకుండా నగరాలకే పరిమితమవుతున్నారనే అపవాదు ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దళితులు, బీసీలు, అణగారిన వర్గాలు, అగ్రకుల పేదలను కలుపుకుని ప్రజా సమస్యలపై రాజీలేకుండా పోరాడితే అధికారానికి చేరువయ్యే అవకాశాలు మెరుగవుతాయి.

- కె. విజయశైలేంద్ర, 9849998097