మెయిన్ ఫీచర్

కవిత్వంలో కథా ప్రక్రియ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్య రంగం విభిన్న ప్రక్రియల సమాహారం. కవిత్వాన్ని తీసుకున్నట్లయితే- జనరంజకమై, నిరంతర ప్రవాహంలో సాగిపోయే ప్రక్రియ వచన కవిత్వం. వర్తమానంలో కవుల కలాల ద్వారా కాంతులు వెదజల్లుతున్న మినీ కవిత, నానీ, నానో, వ్యంజకాలు వంటి ప్రక్రియలన్నింటికి పెద్ద దిక్కు వచన కవిత్వం. ఈ కవితా ప్రక్రియలన్నీ గోదావరి నుండి విడివిడి ప్రవహిస్తున్న పాయలు వంటివి. ఈవిధంగా ప్రవహిస్తున్న పాయలలో దీర్ఘకవిత, వచన కవితా కథలు కూడా వున్నాయి. అన్నింటిని ప్రక్కన పెట్టి, తెలుగు కవిత్వంలో వచనకథ ఎలా ప్రారంభమైంది,ఎంతవరకు ఎదిగింది వంటి అంశాలను గురించి చూద్దాం.
వచన కవిత్వం బలపడి, ఈ రోజున మహావృక్షం అయిందంటే శిష్ట్లా, పఠాభి, నారాయణబాబు, పురిపండా, శ్రీశ్రీ, కుందుర్తి, తిలక్, దాశరథి, సినారె, ఆరుద్ర, శేషేంద్ర, అద్దేపల్లి, శివారెడ్డి వంటివారు చెట్టుకి వేరుల్లాగా నిలబడ్డారని నా అభిప్రాయం. వచన కవిత్వాన్ని మిక్కిలిగా ప్రేమించి, దాని అభ్యున్నతికోసం అహర్నిశలు శ్రమించిన వారు కుందుర్తిగార.
1953 నుంచి వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా భావించి, ముందుకు తీసుకువెళ్ళడంలో ఈయన పాత్ర ప్రధానమైనదిగా చెప్తారు. పాత రీతుల మీద తిరుగుబాటునీ, సామాజికమైన మార్పుని, కవితలో వస్తున్న కొత్త పోకడల్ని, నిరంతర స్పృహగా మలుచుకుని కవిత్వం వ్రాసిన వారు కుందుర్తి. అందుకే ఈయన్ని వచన కవితా పితామహుడు అంది సాహితీ లోకం. వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా, జీవిత ధ్యేయంగా స్వీకరించింది కుందర్తిగారే అని డా. ద్వా.నా.శాస్ర్తిగారు అభిప్రాయపడ్డారు. వచనకవిత్వం కుందుర్తికి ఒక తపస్సు అంటారు అద్దేపల్లి రామమోహనరావుగారు.
వచన కవిత్వంలోకి ఒక కొత్త ప్రక్రియ ప్రవేశించింది. ఒక నూతనాధ్యాయం ప్రారంభమైంది. దీని జీవన శైలిని పరిశీలిస్తే- ప్రాచీన సాహిత్యాన్ని ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. ప్రాచీన తెలుగు కావ్యాలలో కథలు కోకొల్లలు. కేతన, మంచన, జక్కన, అనంతామాత్యుడు వంటి పలువురు కవులు విశేషంగా కథా కావ్యాలను సృష్టించి, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన విషయం మనకి తెలుసు.
ప్రాచీన సాహిత్యానంతర గేయ సాహిత్యం వెలుగు చూసింది. గేయ సాహిత్యంలో కూడా లవణ రాజు కథ, కన్యక, డామస్ పిథియస్, పూర్ణమ్మ వంటి కథా కావ్యాలలు వెలువడటం జరిగింది.
ఆ తర్వాత ఈ సాహిత్య ప్రక్రియ వచన కవిత్వంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కుందుర్తిగారు, వచన కవితాకథా కావ్యాల రచనకి శ్రీకారం చుట్టారు. కథా కావ్యాలు ప్రజల్లోకి వెళ్లి, పాఠకులను రక్తి కట్టిస్తాయని ఆయన గట్టిగా నమ్మారు. నమ్మి, ఊరుకోలేదు. తన నమ్మకాన్ని నిజం చేసుకునే దిశగా, నూతన మార్గాన్ని నిర్మించుకుంటూ పయనించారు. కథా ప్రాధాన్యం కలిగివున్న రచనలు ఎక్కువగా తెలుగు సాహిత్యంలోకి రావాలని ఆశించారు. ప్రణాళికాబద్ధంగా కథను కవిత్వంలో చెప్పినట్లయితే, కవి ఇవ్వదలచిన సందేశం ప్రజల్లోకి బాగా వెళ్తుందని, తద్వారా ప్రజాదరణ లభిస్తుందని ఆయన విశ్వసించారు. నిజమే. వాస్తవికమైన అంశాన్ని వస్తువుగా చేసుకుని, శిల్పనైపుణ్యంతో, వర్ణనా వైశిష్ఠ్యంతో, కావ్యాన్ని సృష్టిస్తే అది పాఠకుడి మనసుమీద చరగని ముద్ర వేయటంతో పాటు ప్రజా ప్రయోజనానికి దోహదకారి అవుతుందని చెప్పవచ్చు.
కథా కావ్యాల రచనకి కుందుర్తిగారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతానికి కొన్ని లక్షణాలున్నాయి. సంపతి బాల్‌రెడ్డిగారి ఎం.్ఫల్ సిద్ధాంత గ్రంథంలో ఆ లక్షణాలు కనిపిస్తాయి, చూడండి-
- ఇతివృత్తం, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి.
- కథా కావ్య రచనలో కథకు మాత్రమే ప్రాధాన్యత ఉండాలి. ఇతివృత్తానికి కాదు.
- కరుణ, వీరరస ప్రధానంగా కథా కావ్యాలుండాలి. సమయానుకూలంగా మిగిలిన రసాల పరిపోషణ కూడా ఉండవచ్చును.
- పాత్ర పోషణ, మనస్తత్వ చిత్రణ, సన్నివేశ కల్పనలకు కొంత ప్రాముఖ్యత ఇవ్వాలి.
- కథా కావ్యంలో సందేశం కొంతలో కొంతైనా స్పష్టంగా ఉండాలి.
కుదుర్తిగారిలో మరో గొప్పతనం ఉంది. కథా కావ్యాల గురించి చెప్పడం మాత్రమే కాదు, కొన్నింటిని వ్రాసి, మార్గదర్శకులయ్యారు, మరికొందరికి స్ఫూర్తినిస్తారు. వీరి కథా కావ్యాలను గనుక పరిశీలిస్తే, సమాజ హితాన్ని కోరేవే. వాటి గురించి క్లుప్తంగానైనా చెప్పాలి.
వచన కవిత్వంలో వెలువడిన మొట్టమొదటి కథాకావ్యం ‘తెలంగాణ’. 1956లో వెలువడిన కావ్యమిది. నైజాం పాలనలో జమీందార్లు, రజాకార్లు సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయటం, ప్రజలు సమైక్యతతో ఎదురొడ్డి, విజయాన్ని సాధించిన తీరు ఈ కథలో వివరిస్తారు కవి. ప్రజలు అనుభవించిన కష్టాల గురించి వర్ణిస్తారొక చోట.
‘‘కాలాన్ని కొలిచేందుకు గడియారాలెందుకు?
కేలండర్లు, పంచాంగాలు కేవలం వృధా కదా?
ఆ కాల ప్రజలు చదివిన కష్ట కవ్యా సంపుటాలు
సామాన్యుల బాధలు, జీవితాల గాథలు చాలు’’
కుందుర్తిగారు 1967లో మరొక కథాకావ్యాన్ని ప్రకటించారు. దానిపేరు ‘సాహసయాత్ర’. ఈ కథలో, ఆసుపత్రిలో ఒకామెకి బిడ్డ పుట్టడం, మరణించడం జరుగుతుంది. కాని, ఆ బిడ్డ పెరిగి పెద్దవడం, వివాహం జరగడం, ముసలితనం అనుభవించడం- ఈ ప్రయాణంలో బాధలు; ఇలా ఒక ఊహాజగత్తును సృష్టించుకొంటుంది ఆ తల్లి. ఒక వ్యాసంలో దీనినికథ అనేకంటే, కథారేఖలు గల్గిన కావ్యం అంటే బాగుంటుందని అద్దేపల్లి రామమోహనరావుగారు అభిప్రాయపడ్డారు.
ఈ రెండు కావ్యాలకే నడుమ మరొక కథా కావ్యం కూడా వెలువడింది. దాని పేరు ‘దండియాత్ర’. ఇదీ కుందుర్తిగారు వ్రాసిందే. ఇందులో గాంధీజీ తలపెట్టిన ‘ఉప్పు సత్యాగ్రహం’ కథావస్తువు. గాంధీజీ కొంతమంది స్వాతంత్య్రోద్యమ కార్యకర్తలతో ‘దండి’ గ్రామం వెళ్లటం, అక్కడ ఉప్పు తయారుచేయటం ఈ కథలో కనిపిస్తుంది. ఈ కావ్యంలో ప్రాచీన శిల్పరీతులు దండిగా ఆవిష్కరించబడటం గమనిస్తాం.
పై మూడు కావ్యాలలో వచన కవితలో వస్తువుకి, శిల్పానికి గల అవకాశాల పరిధిని ఎంతో విశాలం చేసి, కుందుర్తిగారు వినియోగించారని అద్దేపల్లి రామమోహనరావుగారంటారు. సంప్రదాయకమైన శిల్పాన్ని ప్రజాపరం చెయ్యడం, కొన్ని కొత్త శిల్పావకాశాల్ని సృష్టించుకోవడం కూడా కనిపిస్తాయని అంటారాయన.
కుందుర్తిగారు కథాకావ్య రచనకి దారివేస్తే, ఆ దారిన నడిచిన తొలి కవి శీలా వీర్రాజుగారు. కథా కావ్యరచనలో కవికి ఒక వెసులుబాటు ఉంటుంది. కథలోని సన్నివేశాన్ని బట్టి, అవకాశమున్నంత వైవిధ్యాన్ని కవికి ప్రదర్శించే దారుంటుంది. కల్పనలు చేసేటప్పుడు, సందర్భానుసారంగా సొగసుల్ని నింపొచ్చు. పాత్రల మనస్తత్వాలను విపులంగా పరిశీలించవచ్చు. అలాగే నాటకీయతను ప్రదర్శించవచ్చు. ఇలా ప్రతి అంశంలోను తనకున్న ప్రతిభను చాటుకోవడానికి కథా కావ్య రంగం గొప్ప వేదిక అని చెప్పవచ్చును.
కథా కావ్య ప్రక్రియను గమనిస్తే, కుందుర్తి ప్రారంభించిన దానిని శీలా వీర్రాజుగారు మరో అడుగు ముందుకు తీసుకెళ్లారని చెప్పొచ్చు. 1965లో ‘కొడిగట్టిన సూర్యుడు’ అనే వచన కవితలో కథాకావ్యం వెలువరించారీయన. ఇందులో మూడు కథలను చేర్చారు. అవి 1. ముళ్ళరెమ్మ 2. కొడిగట్టిన సూర్యుడు 3. విశ్వాసం నీడ కింద.. వీటి గురించి క్లుప్తంగానైనా చెప్పుకోవాలి.
‘ముళ్ళరెమ్మ’ సంభాషణ ప్రాధాన్యత గల్గిన కథా కావ్యం. శ్రీనివాసు, పావని అను రెండుపాత్రల నడుమ ఆసక్తికరంగా సాగే సంభాషణలతో సాగుతుందీ కథ. సంభాషణలతో కథ నడుపవచ్చు అనేందుకు ఇది మంచి ఉదాహరణ.
రెండవది ‘కొడిగట్టిన సూర్యుడు’. ఈ కథలో కృష్ణవేణి ఆసుపత్రిలో నర్సు. పార్వతీశం పేషెంటు. యాక్సిడెంట్‌లో దెబ్బతగిలి, ఆసుపత్రికి తరలించబడతాడు. ఆసుపత్రిలో కృష్ణవేణికి పార్వతీశంతో పరిచయం పెరుగుతుంది. మాటలను బట్టి, పార్వతీశం జీవితంలో దెబ్బతిన్న వాడని గ్రహిస్తుంది. తిరిగి జీవితం పట్ల ఆశను చిగుర్తింది. ఒక రాత్రి వార్డు బాయి వచ్చి, పార్వతీశం గాయాల మూలంగా ఎక్కువగా బాధపడుతున్నాడని, నిద్ర కోసం మందు అడిగినప్పుడు, పొరపాటున మోతాదుకు మిచి మందు ఇస్తుంది. ఉదయానికి పార్వతీశం ఈ లోకానే్న విడిచిపోతాడు.
మూడవ కథ ‘విశ్వాసం నీడ కింద’.. ఇందులో మూడు పాత్రలుంటాయి. దమయంతి, బాలకృష్ణ, కుక్కపిల్ల. ఒక జంతువుని పాత్రగా మలిచి, విశ్వాసం గురించి ఆ జంతువు చేత స్ఫురింపజేయటం ఈ కథలోని గొప్పతనం.
శీలా వీర్రాజుగారే మరో కథా కావ్య సంపుటిని వెలువరించటం జరిగింది. ఇందులోనూ అద్దాల గుహ, హృదయం దొరికింది, అద్దెగది అను మూడు కథలు చేర్చబడ్డాయి. కథకి, కవిత్వాన్ని జోడించి రసరమ్యంగా చిత్రించిన కథలివి.
మంత్రుల ఇళ్ళలో రాత్రివేళ పోలీసులు సెంట్రీ డ్యూటీ చేస్తుంటారు. అలా ఓ మంత్రిగారింటికి గార్డు డ్యూటీకి వెళ్లిన ఒక పోలీసుకు ఎదురైన అనుభవాన్ని ‘అద్దాల గుహ’ కథలో చిత్రిస్తారు కవి.
మరొక కథ ‘హృదయం దొరికింది’. ముగ్గురు మిత్రులు కలిసి అజంతా, ఎల్లోరాలకి విహారయాత్రకి వెళతారు. ఆ యాత్రలో ఒకడికి ఒక గులాబి పువ్వు దొరుకుతుంది. ఆ పువ్వు నేపథ్యంగా అందమైన కల్పనలతో రూపుదిద్దుకున్న కథ యిది.
ఇక మూడవది ‘అద్దె గది’. ఈ కథలో రవి అనేవాడు ఎలిఫెంటా గుహలకు వెళ్తాడు. అక్కడ ఒకామె పరిచయవౌతుంది. అక్కడున్నంతసేపు, వాళ్ళిరువురు కలిసి మెలిసి తిరుగుతారు. వెళ్లిపోయే ముందు రవి జ్ఞాపకాన్ని తుడిచి పారేసినట్లుగా, రవి రాసిచ్చిన చిరునామాను చించిపారేస్తుంది. ఈ నేపథ్యాన్ని, అద్దె గదితో పోల్చి చెప్పటంలోనే కవిలోని గొప్పతనం బయట పడుతుంది.
శీలా వీర్రాజుగారి తర్వాత, కుందుర్తి గారు ప్రవేశపెట్టిన ఈ కథా కావ్య వికాసానికి కాకినాడ వేదికగా కొంత ప్రయత్నం జరిగింది. అప్పట్లో శ్రీ శిష్ట్లా నాగేశ్వరరావుగారి కృషి ప్రశంసించతగింది. 1988లో రాష్ట్ర స్థాయి వచన కవితా కథల పోటీని ప్రకటించి, నిర్వహించారట. ఈ పోటీ మూలంగా కొందరిచేతనైనా కవితా కథల్ని వ్రాయించి, కుందుర్తిగారి ఆశయానికి ఊపిరి పోసినట్లయింది. ఆ పోటీలో బోయ జంగయ్యగారి కథ ఉత్తమ కథగా ఎంపికైంది.
ఆ సందర్భంలో ‘సంస్కరణ’ అనే కథ నా కలం నండి వెలుగుచూసింది. అప్పట్లో ‘సతీసహగమనం’ సంచలనం సృష్టించడం వలన ఆ నేపథ్యాన్ని తీసుకుని ‘సంస్కరణ’ అనే కథను వ్రాయటం జరిగింది.
శ్రీ శిష్ట్లా వారు అక్కడితో ఆగిపోకుండా, మరో అడుగు ముందుకువేసి వచన కవితా కథల సమ్మేళనం కాకినాడలో ఏర్పాటుచేశారు. 1989లో జిల్లా గ్రంథాలయం వేదికమీద జరిగిన ఆ కవితా కథల సమ్మేళనంలో డా. ఆవంత్స సోమసుందర్, డా. అద్దేపల్లి, డా. పి. చిరంజీవినీ కుమారి, ఎస్.ఆర్. పృథ్వి, జోశ్యభట్ల, సతీష్‌చందర్, సత్యసావిత్రిగార్లు పాల్గొన్నారు. జోశ్యభట్ల, సతీష్ చందర్ గార్ల కథలలో హాస్యం పండితే, అద్దేపల్లి బుద్ధుడి జీవితాంశాలలో ఒకదానిని కథగా మలిచి వినిపించారు. తర్వాతికాలంలో అది పుస్తక రూపం సంతరించుకొంది.
ఎస్.ఆర్. పృథ్వి వినిపించిన కథ ‘కోర్కెలే గుర్రాలైతే’, ఐపీసీ 497 సెక్షన్‌ను తీసుకుని, పరిధి దాటకుండా కేవలం ఆ సెక్షన్ ఏమి చెప్పిందో ఈ కథలో వివరించారు. అక్రమ, లైంగిక సంబంధం గురించి వర్ణనాత్మకంగా చెప్పిన ఈ కథకి మంచి స్పందన వచ్చింది. డెక్కన్ క్రానికల్ పత్రికలో ఈ కథనే ప్రధానంగా పేర్కొంటూ వార్త వెలువడింది.
1993లో ఈ కథ పుస్తకంగా వెలువరించారు కవి. అప్పుడు కూడా మంచి స్పందన లభించింది. అప్పటి తొలి లోకాయుక్త జస్టిస్ ఆవుల సాంబశివరావుగారు ముందుమాట వ్రాసారీ పుస్తకానికి.
ఒకవిధంగా చెప్పాలంటే వచన కవితా కథలు వెలువడిన జాడలు చాలావరకు కనుమరుగైనాయని చెప్పొచ్చు. అటువంటి తరుణంలో ఎస్.ఆర్. పృథ్వి 2012లో మరొక కవితా కావ్యం వెలువరించారు. అందు లో రెండు కథలున్నాయి. ఒకటి - ఎన్నికల సమయంలో నగదు రవాణా అయ్యే సందర్భం మీద, రెండవది భర్త కర్కశానికి బలైన మగువ వస్తువుగా వుంది.
కవిత్వంలో కథారచన మృగ్యవౌతున్న తరుణంలో శ్రీమతి వి.కె.ప్రభగారు, కథా కావ్యాలను సేకరించి, పరిశోధన చేసి 2013లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందటం అభినందించ తగినది. ‘‘తెలుగులో వచన కవితా కథలు అనుశీలన’’ అనే అంశంమీద పరిశోధన చేసారామె.
కుందుర్తిగారు ఆశించి, ప్రారంభించిన ఈ పక్రియ, వారు ఆశించినంత విజయాన్ని సాధించలేదు గాని, నేటికీ సాహిత్య ప్రక్రియగా చెప్పుకునే స్థాయిలో వుందని చెప్పక తప్పదు. అందుకు ముఖ్యంగా కథాకావ్యాలు వ్రాసే కవులకు తగినంత ప్రోత్సాహం లభించకపోవడమే అని గమనించాలి. ఎవరైనా 20-30 పంక్తులు వ్రాసే కవిత్వానే్న ప్రోత్సహిస్తున్నారు. కథాకావ్యాలు వ్రాసి, ముద్రించాలంటే ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లేదు. చదివే ఓపిక పాఠకులలోను సన్నగిల్లింది. కథాకావ్యం వ్రాయడానికి కొన్ని లక్షణాలున్నాయి. వాటని అనుసరిస్తూ వ్రాయడమంటే అందరికీ సాధ్యం కాదు.
ఈ ప్రక్రియ, ఈ అలసత్వం నుండి బయటపడాలంటే ప్రధానంగా వ్రాసింది చదివి, వినిపించేందుకు లేదా పుస్తకంగా వెలువరించేందుకు ఒక వేదిక వున్నట్లయితే, తప్పనిసరిగా కుందుర్తిగారు ఆశించిన విధంగా వికాశం పొందగలదు. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ వంటి సంస్థలు వచన కవితా కథలను ఆహ్వానించి, కనీసం ఏడాదికోసారి వాటిని ఒక సంపుటిగా వెలువరిస్తే, ఈ సాహితీ ప్రక్రియకి పునర్జన్మ లభిస్తుంది. కుందుర్తిగారి ఆశ, తిరిగి పుష్పించి, తెలుగు సాహితీ వనంలో పరిమళాన్ని వెదజల్లాలని ఆశిద్దాం.

-ఎస్.ఆర్. పృథ్వి 9989223245