మెయన్ ఫీచర్

మేధావులలో హిందూ ఫోబియా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ గాంధీని పార్లమెంట్’కు పంపి
కేరళ ఘోరమైన నేరం చేసింది...
ఈ మాటలు అన్నది ఏ బీజేపీ నాయకుడో అనుకునేరు, కాదు, బీజేపీ విశ్వసించే హిందుత్వ, జాతీయ వాదాలను సైద్ధాంతికంగా వ్యతిరేకించే, సంఘ్ పరివార్ ఆగర్భ శత్రువు, కమ్యూనిస్ట్ భావజాల దృక్కోణంలో దేశ చరిత్రను చూసి, ఎర్ర జెండాను ఇంటి పేరుగా చేసుకున్న చరిత్రకారుడు రామచంద్ర గుహ. ఆయన అంతోటి మాటన్నది కూడా ఇంకెక్కడో కాదు, కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న కేరళలో.. అక్కడ జరిగిన సాహిత్య ఉత్సవంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అసలు ఆయన ఇలాంటి మాట ఎందుకన్నారు? ఆయనకు రాహుల్ గాంధీ పట్ల ఏదైనా వ్యక్తిగతద్వేషం, సైద్ధాంతిక తగవు లాంటింది ఏమైనా ఉందా అంటే లేదు, నిజానికి ఇద్దరూ హిందూ వ్యతిరేక లౌకికవాదమనే భావజాలానికి బొమ్మ బొరుసు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు తరచూ ప్రవచించే బీజేపీని అడ్డుకునేందుకు ఎలాంటి అడ్డమైన పనులు చేసినా తప్పులేదనే సిద్ధాంతం విషయంలో ఇద్దరి మధ్య చాలా గొప్ప బావసారుప్యత ఉంది. నిజం, కాదనలేము.ఇతరేత వ్యవహారాలు ఎలా ఉన్నా, హిందూ వ్యతిరేకత విషయంలో మాత్రం ఇద్దరిదీ ఒకటే కులం.. ఒకటే గోత్రం.. ఒకటే భావజాలం..
నిజానికి, ఆ విషయం కూడా స్వయంగా గుహ చాలా చక్కగా, ఏమాత్రం దాపరికం లేకుండా చెప్పుకొచ్చారు. ‘‘నాకు రాహుల్ గాంధీ పట్ల వ్యక్తిగత వ్యతిరేకత ఏమీ లేదు.ఆయన మంచి వాడు, సభ్యత, సంస్కారం ఉన్నవాడు’’ అంటూ రాహుల్ సుగుణాలను మెచ్చు కున్నారు. అయితే, యువ భారత్ ఐదో తరం (నెహ్రూ) వారసుని కోరుకోవడం లేదు, అలాంటి ఐదో తరం వారసుని ఎన్నుకుని కేరళ ప్రజలు ఘోర తప్పిదం చేశారు, అని గుహ అసలు గుట్టు విప్పారు. 2024 ఎన్నికల్లో మలయాళీలు మళ్ళీ అదే తప్పు చేస్తే, మరో సారి మోదీకి పట్టం కట్టినట్లేనని తమ అంతరంగ ఆందోళనను చాలా చక్కగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామచంద్ర గుహ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఆశాజ్యోతి రాహుల్ గాంధీల మధ్య పోలిక కూడా తెచ్చారు. ‘‘మోదీ రాహుల్ కాదు. అదే ఆయన విజయ రహస్యం’’ అంటూ మోదీతో పోటీకి రాహుల్ గాంధీ పనికిరారని, సరిపోరని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, ‘‘మోదీ, స్వయంభూ.. స్వశక్తితో ఎదిగొచ్చారు. ఒక రాష్ట్రాన్ని 15 సంవత్సరాలపాటు పాలించిన అనుభవం ఉంది. కష్టపడే పనిచేసేతత్తం మోడీ సొంతం. ఆయన ఎప్పుడూ యూరప్ వెళ్లి విశ్రాంతి తీసుకోరు’’ అంటూ, రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలు అంటించారు. అయిష్టంగానే అయినా మోదీని కీర్తించారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను అనివార్యంగానే అయినా గుర్తించారు. మోదీని ఎదుర్కొనే సామర్ధం రాహుల్ గాంధీకి లేదని ‘చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత ఒక నేషనల్ చానల్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల విషయంలో అదే విధమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
నిజానికి, సదస్సులో రామచంద్ర గుహ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు ఉహించని శ్రోతలు, విస్తుపోయారో లేదో గానీ, ఆయన మాత్రం తమ మాటలకు తానే వివరణ ఇచ్చుకున్నారు. ‘‘నన్ను నమ్మండి. నేను ఎదో ఆషామాషీగా, నవవులాటగా లేదా వ్యగ్యంగా మోడీని మెచ్చుకోవడం లేదు. చాలా గంభీరంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను’’ అంటూ తమ మనసును విప్పిచెప్పారు. అదే క్రమంలో గుహ, కాంగ్రెస్ కలలరేడు రాహుల్ గాంధీ ఎప్పటికీ, మోదీకి సమ ఉజ్జీ కాలేరని కుండబద్దలు కొట్టారు. ముందు ముందు రాహుల్ గాంధీ పగలు రాత్రి కష్టపడి తెలివితేటలు తెగ పెంచేసుకున్నా, యూరప్ ‘విశ్రాంతి’ యాత్రలు తగ్గించుకుని ‘నిగ్రహం’ అలవరచుకున్నా, ఇంకా ఇంకా కష్టపడినా, ఏమి చేసినా రాహుల్ గాంధీ, మోడీ ముందు నిలవలేరని అన్నారు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే, మోడీ ముందు మోదీకి రాహుల్ సమ ఉజ్జీకాదు’ అని కొంచెం చాలా స్పష్టంగానే చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన వదలలేదు. ఆమె మీద కూడా విమర్శలు కుమ్మరించారు. సోనియా గాంధీ మొఘల్ చరిత్ర చివరి అధ్యాయాన్ని గుర్తు చేస్తున్నారు. సోనియా గాంధీ వాస్తవాలకు దూరంగా, ఒంటరి ఊహల్లో విహరిస్తున్నారనే అర్థం వచ్చే విధంగా చరిత్రకారుడు గుహ నడుస్తున్న చరిత్రకు భాష్యం చెప్పారు. ‘్భరతదేశంలో ఫ్యూడల్ ఆలోచనలు అంత రించిపోతున్నాయి. ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతోంది. కానీ, గాంధీలు ఈ నిజాన్ని గుర్తించడం లేదు’ అంటూ అయన నేరుగా సోనియా గాంధీనే,ఆమె సామ్రాజ్యం కుదించుకు పోతోందని హెచ్చరించారు. అయినా, ఆమె చుట్టూ చేరిన భట్రాజులు ఇంకా ఆమెను ‘బాద్షా’ అనే భ్రమల్లో ఉంచుతున్నారని హెచ్చరించారు. ఒకవిధంగా కాంగ్రెస్ చరిత్ర కూడా ఆఖరి అధ్యాయానికి చేరిందని చెప్పకనే చెప్పారు.
అయితే. మోదీని, బీజేపీని విమర్శించడంలో ముందుండే రామచంద్ర గుహ, ఇలా గాంధీలను, కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతో పాటుగా మరో వంక మోడీ కొంచెంగా అయినా పొగిడారు అంటే, ఆయన మారిపోయారనో, ఆయనకు ‘జ్ఞానోదయం’ లాంటింది కలిగిందనో అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఆయన మారలేదు. మారరు కూడా, కానీ, గుండెల్లో మోదీ, షాల భయం, వెన్నులో చలి, ఆపాదమస్తకం వణుకు పుట్టిస్తున్న హిందుత్వ ఫోబియా ఆయన చేత అలాంటి మాటలు మాట్లాడించింది. నిజానికి ఆయన తమ మనసులోని బాధను, భయాన్ని, ఆందోళన,ఆగ్రహాలను ఏమాత్రం దాచుకోలేదు. అదే సాహిత్య వేదిక నుంచి చేసిన ఉపన్యాసంలో కామ్రేడ్ గుహ, స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎంతో ఘనచరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘దయనీయ కుటుంబ సంస్థ’ స్థాయికి దిగజారి పోవడం వల్లనే దేశంలో.. హిందుత్వ ప్రాధాన్యత, ఆధిపత్యం పెరుగుతోందని అగ్రహపూరిత ఆవేదనను వ్యక్త పరిచారు.
నిజానికి, ఇది ఒక్క రామచంద్ర గుహ భయం,బాధ మాత్రమే కాదు. జాతీయ వాద భావజాలాన్ని, ఏమాత్రం సహించలేని చరిత్రకారులు, మేధావులు, కాంగ్రెస్, కమ్యూనిస్టు ఆదిగాగల నానాజాతి రాజకీయ పార్టీలు, నాయకులు, బురఖాలు కప్పుకున్న మీడియా సంస్థలు, జర్నలిస్టులు ఇలా చాలా మంది ఇదే విధమైన హిందూ ఫోబియాతో బాధపడుతున్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో జాతీయ వాదం ప్రధాన జెండా, అజెండాగా 2014 జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ) ప్రభుత్వం ఏర్పడడంతోనే జాతీయవాద వ్యతిరేక శక్తులకు భయం పట్టుకుంది. అప్పటినుంచే, కుల గోత్రాలు మరిచిన హిందూ వ్యతిరేక లౌకికవాద శక్తులు రకరకాల వికృతులు, వికారాలు ప్రదర్శిస్తూ వచ్చాయి. అవార్డు వాపసి గ్యాంగ్ మొదలు తుకడే తుకడే గ్యాంగ్ వరకు, మూకదాడుల వ్యతిరేకత పేరిట సమాజంలో అరాచకం, అలజడి సృష్టించే ప్రయత్నం చేసిన ముఠాల నుంచి ‘జై శ్రీరామ్’ నినాదం మూకా దాడులకు ప్రేరణ అవుతోందంటూ, గత సంవత్సరం జులైలో ప్రధానికి బహిరంగ లేఖ రాసిన మేధావుల వరకు (ఈ లేఖపై సంతకం చేసిన 49 మంది మేధావులలో రామచంద్ర గుహ కూడా ఉన్నారు) ఎందరికో, మోదీ రెండవసారి, మరింత స్పష్టమైన మెజారిటీ విజయం సాధించడం అసలు మింగుడు పడడం లేదు. ఇది సహజం.
ముఖ్యంగా, మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారం లోకి వచ్చింది మొదలు, 70 ఏళలుగా కాంగ్రెస్, కమీ ఇతర మధ్యేవాద లౌకికవాద పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పావులుగా ఉపయోగించుకుంటున్న వివాదాల చిక్కుముళ్ళను విప్పుకుంటూ పోతోంది. ఇది, జాతీయవాదాన్ని జీర్ణం చేసుకోలేని రాజకీయ పార్టీలకే కాదు, ఆ కోవకే చెందిన మేథావులకు, కూడా రుచించడం లేదు. అసలుకే మింగుడు పడడం లేదు. ఆర్టికల్ 370 రద్దుతో మొదలు పెట్టి ట్రిపుల్ తలాక్ రద్ద్డు, రామ జన్మ భూమి వివాదం మరో మాటకు తావు లేని విధంగా న్యాయస్థానాల ద్వారా పరిష్కారం చూపడం, బంగ్లాదేశ్’ తో ఆదేశం ఏర్పడిన నాటి నుంచి ముడిపడని సరిహద్దు సమస్య పరిష్కారం, ఇప్పుడు బోడో ఒప్పందంతో ఈశాన్య భారతంలో శాంతి స్థాపన ఇలా వరస పెట్టి ఇంతవరకు కుహనా లౌకికవాద రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా ఉపకరించిన అస్త్రాలను నిర్వీర్యం చేయడం సహజంగానే జీర్ణం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే, దశాబ్దాలుగా కాంగ్రెస్ అండన జాతీయ భావజాలం, జాతీయ విలువలు, విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎదుగుతూ వచ్చిన మేధావులు, మోదీని ఎదుర్కోవడం రాహుల్‌గాంధీతో కాని పనని గుర్తించారు. అందుకే, ఇలా కడుపులో దాగున్న బాధను భయాన్ని బయటకు కక్కేస్తున్నారు.
అయితే అందరినీ, అన్నివేళలా మోసం చేయడం ఎంతటివారికీ అయినా అయ్యే పనికాదు. అది అసాధ్యం. ఇది చారిత్రక సత్యం. కాదు, మోసం చేయవచ్చును అనుకోవడం, చారిత్రక తప్పిదం. అయితే, చారిత్రక తప్పిదాలకు పెట్టింది పేరుగా నిలిచిన కమ్యూనిస్టు మేథావులు, ఈ వాస్తవాన్ని కూడా గుర్తించినా గుర్తించక పోయినా, చరిత్ర మాత్రం గుర్తిస్తుంది.
నిజానికి, రాజకీయ పార్టీలు కూడా ఇష్టం ఉన్నా లేకున్నా లౌకిక వాదం ముసుగులో ఇంతకాలం సాగిన ‘ఓటు బ్యాంకు’ రాజకీయాలకు, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు కాలం చెల్లిందనే సత్యాన్ని గుర్తిస్తున్నాయి. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్ ఓ వంక పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 50 రోజులుగా ముస్లింలు ఆందోళన చేస్తునా ఆ దిశగా వెళ్ళలేదు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ముస్లిం మైనారిటీలను బుజ్జగించే ప్రత్యేక తాయిలాలు ప్రకటించ లేదు. అన్నిటినీ, మించి హిందువులను ఆకట్టుకునేందుకు ఎక్కడికి వెళితే అక్కడ హనుమాన్ దేవాలయాలు వెతుక్కుని మరీ దర్శనం చేసుకుంటున్నారు. అంటే, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లిందనే సత్యాన్ని అందరూ గ్రహిస్తున్నారు.

- రాజనాల బాలకృష్ణ, 9985229722