మెయిన్ ఫీచర్

ఆడపిల్లలను అక్కున చేర్చుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో ఏ పేపర్ తిరగేసినా బాలికపై అత్యాచారం, మైనర్ బాలికలపై రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోవడం కలిచివేస్తోంది. అసలు మైనర్ బాలికలపై అత్యాచారం జరగడానికి గల కారణాలు ఏమిటి అని చూస్తే నాగరికత పేరుతో వెర్రితలలు వేస్తోన్న పోకడలనే చెప్పవచ్చు. ఇంటర్నెట్ వచ్చాక పోర్న్ సైట్స్ విపరీతంగా వాడటంవలన కావచ్చు, లైంగిక వాంఛలని తీర్చుకోవడం కోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు.
ఇటీవల ఢిల్లీలో మొగల్‌పూరిలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్లబాలికపై పాఠశాలల ఆవరణలోనే అత్యాచారం జరిపారు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అలాగే తమిళనాడులో సభ్య సమాజం తలదించుకునేలా, మానవత్వం మంటగలిసేలా కన్న కూతురుపై తండ్రి, అన్న, వారి స్నేహితులు కలిసి అత్యాచారం చేశారు. బాలిక ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులుకూడా ఆ పాపపై అత్యాచారం చేశారు. మొత్తం ముప్ఫైమంది కలిసి ఆ పాపపై అత్యాచారం చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది. చిన్నపిల్లలపై ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.
చిన్నపిల్లలపై దారుణాలు జరగడానికి మూఢనమ్మకాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎంతకీ తగ్గని మొండి రోగాలు కూడా చిన్నారులతో కలిస్తే పోతాయని, ఆరోగ్యవంతులుగా మారుతారనే పిచ్చి నమ్మకంతో పిల్లలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో అంగవైకల్యం కలిగిన పిల్లలపట్ల తల్లిదండ్రులు, స్థానికులు అమానుషంగా ప్రవర్తించారు. చిన్నారులను మెడవరకూ భూమిలో పాతిపెట్టి దారుణంగా ప్రవర్తించారు. సూర్యగ్రహణం రోజు ఇలా చేస్తే వైకల్యం నయం అవుతుందని నమ్మకం.
పదినుండి పదిహేను ఏండ్ల వయసున్న అమ్మాయిలు, తెలిసీ తెలియని వయసు.. ఎవరేం చెప్పినా నమ్మాలా వద్దా అని అయోమయంలో పడేసే అమాయకమైన మనసు. ఈ వయసు పిల్లల్ని మాయచేయడం, బుజ్జగించడం చాలా తేలిక.
ఒకసారి ఆడపిల్లకి వెలకట్టాక ఆమె ఈ వ్యాపారంలో ఓ వస్తువుగా మారిపోతోంది. వందలమంది ఏజెంట్లు, వేలమంది ట్రాపికర్ సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పైగా బావలు, మామయ్యలు, బాబాయిలు.. లాంటి కుటుంబ సభ్యులే రాబందుల్లా చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్నారు. నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్ష విధించినా.. దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా మృగాళ్ళు పట్టించుకోవడంలేదు.
ఇటీవల తెలంగాణలో బహిర్భూమికి బయటకువెళ్లిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. గ్రామ పెద్దలు ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా అక్కడికక్కడే సెటిల్ చేశారు. అలాగే ఇంకొక సంఘటన- పదమూడేళ్ల బాలిక అప్పుడే అమ్మయింది. తనకు ఏం జరుగుతుందో తెలిసేలోపే ఓ బిడ్డకు తల్లిగా మారింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. వరుసకు సోదరుడైన దుండగుడే ఆమెను గర్భవతి చేశాడు. ఇలా రోజూ ఎక్కడో ఒక చోట బాలికలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టకపోతే అందమైన బాల్యం ఇలాగే తగలబడిపోతుంది. అసలు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే శిక్ష ఏమిటో తెలుసుకుందాం..
12 ఏళ్ళలోపు వయసున్న చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణదండన విధించే ఆర్డినెన్స్‌ను కేంద్ర కాబినేట్ ఆమోదించింది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్ 2018కి కేంద్ర కాబినేట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం భారతీయ శిక్షాస్మృతి, సాక్ష్యాధారాల చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్- ఫోక్సో చట్టాలకు పలు సవరణలు ప్రతిపాదించారు. ఫోక్సో చట్టం ప్రకారం అత్యాచార దోషులకు కనిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష, గరిష్టంగా జీవితఖైదు విధించే అవకాశం వుంది. 16 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేస్తే ఇప్పటివరకు వున్న కనిష్ట జైలుశిక్షను 10 ఏళ్ళ నుంచి తాజాగా 20 ఏళ్ళకు పెంచారు. అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, దర్యాప్తు పూర్తిచేసేందుకు స్పష్టమైన గడువు వంటి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.
అత్యాచారాలు ఆగలేదు!
నిందితులకు మరణశిక్ష విధించాక ఈ దారుణాలు ఆగాయా అంటే లేదు. ఇంకా పెరిగిపోతున్నాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం 2015లో 36,651 అత్యాచార కేసులు, 2016లో 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయి. రెండు అత్యంత తీవ్రమైన అత్యాచార ఘటనల్లో దోషులకు మరణశిక్ష విధించిన తర్వాత కూడా అత్యాచారాల సంఖ్య పెరిగిందే కాని తగ్గలేదు. అంతేకాక చాలా కేసుల్లో నేరం రుజువు కాదు. అలాంటప్పుడు శిక్షించడం కూడా కష్టమే.
పసిపిల్లలపై అత్యాచారాలు చేసేవారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పనితీరు మార్చుకోవాలి. ఎంతటి పెద్దవారు అయినా నేరం చేస్తే శిక్షించబడేలా చట్టాలని మార్చాలి.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి అన్నీ వివరంగా తెలిసే విధంగా చెప్పాలి. లైంగిక దాడులు కుటుంబ సభ్యులనుంచి, తెలిసినవారినుంచి ఎదురవ్వడం గమనించాలి. ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శని చూపించి చెప్పాలి. అలాగే పాఠశాలల్లో కూడా టీచర్లు, సహచరులు బాలికలు ఎదుర్కొనే అసహజ పరిస్థితుల గురించి అవగాహన కల్పించాలి. నేటి బాలికలే రేపటి భవిష్యత్తు. మన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన బాధ్యత. ఆడపిల్లల్ని ఉన్నత స్థితిలో చూడాలనుకుంటే తప్పకుండా వారి బాధ్యతని తీసుకొని ఇలాంటి దారుణాలనుంచి రక్షించాలి. అప్పుడే రేపటి భవిష్యత్తును కాపాడుకున్నవాళ్ళం అవుతాం. ఆ దిశగా అడుగులు వేద్దాం!

-పుష్యమీ సాగర్