మెయన్ ఫీచర్

ఆర్థిక సవాళ్ల మధ్య కొత్త బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక మాంద్యం, ఆశాజనకంగా లేని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, అనేక సవాళ్ల మధ్య మరో 48 గంటల్లో ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక కాలంలో 5 శాతం ఉన్న జీడీపీ, రెండవ త్రైమాసిక కాలానికి వచ్చేసరికి 4.5 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితి కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం కూడా 7.5 శాతానికి పెరిగింది. ఆరు శాతం వరకు ద్రవ్యోల్బణం ఉంటుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్న అంచనాలు తలకిందులయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ నాటికి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 4.5 శాతానికి తగ్గింది. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు ఈ ఏడాది రెండవ త్రైమాసిక కాలంలో 2.1 శాతం, అంతకు ముందు ఏడాది 4.9శాతం నమోదైంది. ఈ ఏడాది సేవా రంగం మొదటి త్రైమాసికంలో 7శాతం పెరిగితే, రెండవ త్రైమాసిక కాలానికి వచ్చే సరికి 6.7 శాతానికి తగ్గింది.
2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈ ఏడాదితో కలుపుకుని నాలుగు పూర్తి స్థాయి బడ్జెట్‌లను కేంద్రం ప్రవేశపెడుతుంది. సంస్కరణల అమలులో దూకుడు పెంచుతారా, వ్యవసాయ, గ్రామీణ రంగం అభివృద్ధికి ఊతం ఇచ్చే చర్యలు తీసుకుంటారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదాయం పన్ను రాయితీలపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పనలో బిజీబిజీగా ఉన్నారు. ఆమె ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. ఈ బడ్జెట్ రూపకల్పనలో ఐదుగురు ఉన్నతాధికారులు క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, ఆర్థ్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఏ చక్రవర్తి, వ్యయ విభాగం కార్యదర్శి టీవీ సోమనాథన్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, పెట్టుబడుల ఉపసంహరణ విభాగం కార్యదర్శి టీకే పాండే తలమునకలై ఉన్నారు. ఈ దేశ బడ్జెట్‌కు దిశ, దశ మార్గనిర్దేశనం చేయనున్నారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ సీనియర్ ఐఎఎస్ అధికారి. బ్యాంకింగ్ సంస్కరణలను వేగంగా అమలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులను విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా పటిష్టమైన చర్యలను ఈ బడ్జెట్ సిఫార్సు చేయనుంది. దేశంలో వినిమయం పెరిగే విధంగా పరపతి విధానాన్ని సులభతరం చేసే చర్యలను కేంద్రం అమలు చేయవచ్చును. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఏ చక్రవర్తి గత ఏడాది జూలైలో ఈ శాఖ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకంలో నిపుణులు. వౌలిక సదుపాయాల రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక ట్రిలియన్ డాలరర్లు అవసరమవుతుంది. సార్వత్రిక బడ్జెట్ విధానాలకు మార్గదర్శిగా ఈ నిపుణుడి సూచనలు ఉపయోగపడుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వ్యయ విభాగం కార్యదర్శి టీవీ సోమనాథన్ ఇటీవలనే ఆర్థిక శాఖలో చేరారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించడంలో దిట్ట. గతంలో ఆయన పీఎంవో కార్యాలయంలో పనిచేశారు. ప్రధాని మోదీ మనోగతం తెలిసిన నిపుణుడిగా పేరుంది. రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సీనియర్ ఐఎఎస్ అధికారి. గత ఏడాది 20 బిలియన్ డాలర్ల విలువైన కార్పోరేట్ పన్నులను రద్దు చేశారు. దీని వల్ల పెట్టుబడులు ఏ మేరకు వచ్చాయో చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యక్ష పన్నుల కోడ్ ప్రతిపాదనలను కేంద్రం ఈ బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి టీకే పాండే ఎయిర్ ఇండియా వ్యూహాత్మక విక్రయాలలో పాండే కీలకపాత్ర వహించారు. ఐరావతంలా తయారైన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, వాటిని సరైన దారిలో పెట్టేందుకు చర్యలు, నిధుల సేకరణలో పాండే నిపుణులు. ఈ ఏడాది 1.05 ట్రిలియన్ రూపాయల నిధులను సేకరించాలన్న లక్ష్యం నెరవేరలేదు.
వచ్చే బడ్జెట్‌లో గ్రామీణ రంగం వికాసానికి పలు చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక రంగం అభివృద్ధి చెందకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. దేశంలో 70 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీముకు చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతోందనే అపవాదు ఉంది. వచ్చే బడ్జెట్‌లో ఈ స్కీంకు ఇతోధికంగా నిధులు కేటాయించాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే, పాడి పరిశ్రమాభివృద్ధికి కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి లబ్ధిదారుడికి ఫలాలు అందే విధంగా చూడాలి. గ్రామీణ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి చేపట్టని పక్షంలో నగరాలకు వలసలు పెరుగుతాయి. గత నాలుగు దశాబ్దాల్లో మునుపెన్నడూ లేనివిధంగా పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం నిరుద్యోగం 6.1 శాతానికి చేరుకుంది. 2019 ఎన్నికలకు ముందే ఆర్థిక మాంద్యం తలెత్తింది. కానీ ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీని పెద్ద మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రాజకీయాలకు అతీతంగా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది ప్రజల ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరచాలి.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన తీరులో సత్ఫలితాలను పొందలేకపోయింది. 2024 నాటికి భారత్ ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల వల్ల ఉపయోగం లేదు. వాణిజ్య, పారిశ్రామిక రంగంలోకి పెట్టుబడుల ప్రవాహించే విధంగా బడ్జెట్ ఉండాలి. నిధుల లేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఆదాయం పన్ను రాయితీలను భారీగా ప్రకటించాలి. నిజాయితీగా ఉండే వేతన జీవుల నుంచి ఆదాయం పన్ను ద్వారా ఆదాయాన్ని రాబట్టి, ఈ వర్గాల అభ్యున్నతికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. పన్ను చెల్లింపుదారుల సొమ్మంతా సబ్సిడీల రూపేణా ఖర్చుపెడుతున్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టే విధానాన్ని ప్రోత్సహించాలి. గృహ నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాలి. ఈ రంగంపై ఆధారపడే కార్మికులు ఎక్కువ. ప్రధానమంత్రి అవాస్ యోజన స్కీం పరిధిని విస్తరించాలి. 2022 నాటికి అందరికి ఇండ్లు అనే లక్ష్యాన్ని నెరవేర్చాలంటే తప్పనిసరిగా భవన నిర్మాణ రంగంపై కేంద్రం దృష్టిని సారించాలి. వ్యవసాయ రంగంలో పేద రైతుకు ఉపయోగపడే విధంగా సంస్కరణలు తేవాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, పంటల బీమా పథకం, బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు ఇచ్చే విధానాన్ని తీసుకురావాలి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగుపడాలంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడేస్‌ను ప్రకటించాలి. వస్తు సేవా పన్నును సరళీకరించాలి.
రెండవసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక శాఖమంత్రి సీతారామన్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆరు శాతం జీడీపీ ఉంటుందనుకుంటే, గత 11 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తగ్గింది. ఇది ఆర్థికశాఖమంత్రికి చేదుసమాచారమే. బడ్జెట్ వస్తుందంటే ప్రతి నిపుణులు ఏవో ఒక సలహాలు ఇస్తుంటారు. పారిశ్రామిక, వౌలిక సదుపాయాలు, కార్పోరేట్ రంగాల నిపుణులు తమ డిమాండ్లను వినిపిస్తుంటారు. కాని ఈ దేశంలో సామాన్యుడు, పేద రైతు, వేతన జీవులు, చిన్న ఉద్యోగులు, శ్రామికుల డిమాండ్లను పార్లమెంటు వేదికగా వినిపించే ప్రజా ప్రతినిధులు లేరు. బడ్జెట్ ప్రవేశపెట్టకముందు, ప్రవేశపెట్టిన తర్వాత కొంత మంది మేధావులు రాసి ఇచ్చిన డిమాండ్లను చదివి స్పందిస్తారు. బడ్జెట్ ప్రసంగంలో ఏముందో తెలియకుండానే అధికార పక్షం సభ్యులు, ఆ పార్టీ కూటమిలో ఉండేసభ్యులు ఏదో బాగా అర్థమైనట్లు బల్లలు చరుస్తుంటారు. తమకేదో గొప్పగా అర్థమైనట్లు విపక్ష పార్టీలు పెదవి విరుస్తూ బడ్జెట్ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తుంటారు. ఇటీవల కాలంలో బడ్జెట్ రోజైనా కనీసం తమ సీట్లలో కూర్చుని కేంద్రం ఏమి చెబుతుందో వినే ఓపిక ప్రతిపక్షాలకు లేదు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే లోక్‌సభ వెలుపల ఉన్న టీవీ చానళ్ల వద్దకు పరుగెత్తి వచ్చి బడ్జెట్ మహాద్భుతమని అధికార పక్ష సభ్యులు, పేదవాడి నడ్డివిరిచే బడ్జెట్, పాత సీసాలో కొత్త సారా అంటూ విపక్ష సభ్యులు విమర్శిస్తారు. రైల్వే బడ్జెట్‌ను కూడా ఆర్థిక బడ్జెట్‌లో కలిపేశారు. దీని వల్ల వారం పదిరోజులకు గాని మన రాష్ట్రాలకు వచ్చే కొత్త రైళ్లు, స్టేషన్ల అభివృద్ధికి వౌలిక సదుపాయాలపై వివరాలు తెలియడం లేదు.
పన్నుల భారం తగ్గిస్తే, వినిమయం పెరుగుతుంది. కాని ప్రభుత్వ రెవెన్యూలపై భారం పడుతుంది. ప్రభుత్వమే ప్రాజెక్టుల నిర్వహణకు ఎక్కువ నిధులు కేటాయిస్తే ఆర్థికలోటుతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ప్రైవేట్ సెక్టార్‌ను ఎవరూ సంతృప్తిపరచలేరు. ఎన్ని రాయితీలు ఇచ్చినా తమకేమీ ప్రోత్సాహకరంగా లేరంటారు. వీరికి ప్రతికూల దృక్పథం ఎక్కువ. ఆర్థిక రంగం ఎప్పుడూ రుణాలు, సెంటిమెంట్లతో సతమతమవుతుంటుంది. దేశంలో బ్యాంకింగ్ రంగం బ్యాలెన్స్ షీట్లు నిరాశాజనకంగా ఉన్నాయి. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం బడ్జెట్‌లో అన్ని వర్గాలను సంతృప్తిపరచలేదు. ఎన్నికల కోణంలో బడ్జెట్‌ను రూపొందించడం వల్ల మధ్యతరగతి వర్గం తీవ్రంగా నష్టపోతోంది. ఎన్నికల కంటే ముందు సంవత్సరం మాత్రమే రైతులకు ఊరట కలిగిస్తున్నామంటూ ప్యాకేజీలను ఇస్తారు. అడ్డదిడ్డమైన నగరీకరణకు, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలకు అడ్డుకట్టవేసి గ్రామీణ రంగంలోవౌలిక సదుపాయాలు, వ్యవసాయరంగానికి పెద్ద పీట, చిన్న, మధ్య పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యం. తెలుగు రాష్ట్రాల వరకు వస్తే పోలవరం ప్రాజెక్టుకు ఇతోధికంగా నిధులు కేటాయించి, ఆంధ్రాకు ప్రత్యేక హోదాను కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, ఒక భారీ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయాలి. రెండు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పినట్లు నదుల అనుసంధానాన్ని జాతీయ స్థాయిలో కేంద్రం చేపట్టినప్పుడే జలసిరి పెరిగి వ్యవసాయ రంగం కళకళలాడుతుంటుంది. ఈ దిశగా కేంద్రం అడుగులు వేయాలి.

- కె. విజయశైలేంద్ర, 9849998097