మెయన్ ఫీచర్

నేతాజీ అదృశ్యం మిస్టరీ ఛేదించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్ర పోరాటంలో నిర్ణయాత్మక పాత్ర వహించడమే కాకుండా, ప్రపంచ చరిత్రలోనే మరెవ్వరూ చేయలేని విధంగా విదేశాలలో జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, వలస పాలకులపై యుద్ధం ప్రకటించడం ద్వారా భారత్‌ను వదిలి వెళ్లడం మినహా గత్యంతరం లేని పరిస్థితిని బ్రిటిష్ వారికి కలిగించారు. అంతేకాదు, ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సుమారు 60 దేశాలు వలస పాలకుల నుండి విముక్తి పొంది, స్వాతంత్య్రం సాధించడానికి కారకుడయ్యాడు.
అటువంటి అసమాన యోధుడు అదృశ్యమై 75 ఏళ్లు కావస్తున్నది. 1945, ఆగష్టు 18న తైవాన్ ప్రమాదంలో నేతాజీ అదృశ్యమయ్యారు. అప్పటి నుండి ఆయన గురించిన మిస్టరీ విడిపోవడం లేదు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎటువంటి విమాన ప్రమాదం జరగలేదని తైవాన్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా ఆ విషయంలో భారత ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకొనేందుకు నిజాయతీగా ప్రయత్నం చేయలేదని చెప్పవలసిందే.
2016, అక్టోబర్ 14న నేతాజీ కుటుంబ సభ్యులు నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా గత 60 ఏళ్లుగా నేతాజీ అదృశ్యంపై రహస్యంగా ఉంచిన ఫైల్స్‌ని నేతాజీ జన్మదినంనాడు అనగా 2017, జనవరి 23న బయట పెడతామని మోదీ నేతాజీ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. దానితో ఈ మిస్టరీ విడిపోతుందని చాలామంది ఆశించారు. మొదటిసారిగా ప్రధాన మంత్రి కార్యాలయం, హోమ్, విదేశీ మంత్రిత్వ శాఖలకు చెందిన 100 రహస్య ఫైళ్లను వెలుగులోకి తెచ్చారు. ఆ తర్వాత ప్రతి నెల 25 చొప్పున ఫైళ్లను బైట పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇవేవీ అదృశ్యం గురించిన మిస్టరీని ఛేదించలేక పోయాయి.
అయితే ఆయా ఫైళ్ళతో పాటు జపాన్, రష్యా ప్రభుత్వాల వద్ద గల సమాచారాన్ని కూడా సేకరించి లోతుగా అధ్యయనం చేస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రహస్య పత్రాలను బైట పెడితే దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, విదేశాల తో మన దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని అంటూ అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు వంక పెడుతూ వచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగా రహస్యాలు బైటపడకుండా చేస్తూ వచ్చినట్లు ప్రస్తుతం బైట పడిన పత్రాలు వెల్లడి చేస్తున్నాయి.
విమాన ప్రమాదం అనంతరం నేతాజీ సజీవంగా ఉన్నట్లు పలు ఆధారాలు లభ్యం అవుతున్నా వాటిని మన తొలి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నేతాజీ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన నిజాముద్దీన్ అనే వ్యక్తి చాలాకాలం జీవించి ఉన్నారు. నేతాజీ మృతి చెందారని చెబుతున్న విమాన ప్రమాదం అనంతరం కూడా తాను ఆయనతోనే ఉన్నట్లు చెబుతూ వచ్చారు. అయితే తన వాంగ్మూలం పట్ల విచారణ సంఘాలు, దర్యాప్తు సంస్థలు ఆసక్తి చూపలేదంటూ పెదవి విరిచారు. ఇప్పుడు బైటపడిన పత్రాలలో అతని అరణ్యరోదన వెల్లడైనది.
నేతాజీ విమాన ప్రమాదం తర్వాత కూడా సజీవంగానే ఉన్నారని చెప్పడం కోసం భారతదేశంలో రెండు కథనాలు విశేష ప్రచారంలోకి వచ్చాయి. మొదటిది.. ఫైజాబాద్ వద్ద భగవాన్‌జీగా పిలువబడే గుమ్మనిమి బాబా ఆయనే అని కాగా, మరొకటి సౌల్మరి ఆశ్రయంలో సాధు సరదానందగా ఉన్నారని చెప్పేవారు. అయితే ఈ రెండు కథనాల వాస్తవికత పట్ల ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు.
కానీ వెలుగులోకి వచ్చిన పాత్రలను బట్టి రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ ఓటమి తర్వాత నేతాజీ రష్యాకి వెళ్లేందుకు ప్రయత్నించి ఉండవచ్చని స్పష్టమైనది. లభిస్తున్న పత్రాల ప్రకారం టోక్యోలో గల రష్యా రాయబారి మాలిక్ యాకొవ్ అలెక్జోద్రౌజ్ ద్వారా రష్యా నాయకత్వంతో నేతాజీ ఎప్పటికప్పుడు అందు బాటులో ఉన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్, రష్యా స్నేహంగా ఉండడంతో ఆయనకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి రష్యా ఇష్టపడి ఉండకపోవచ్చని, అందుకనే విమాన ప్రమాదం కథనాన్ని సృష్టించి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. రష్యాలో నేతాజీ ఉండవచ్చనే అంశం నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం భారత దేశంలోనే మారు వేషాలలో ఉన్నారనే కథనాలను వ్యాప్తి చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవన్నీ పూర్తిగా తెలిసిన పండిట్ నెహ్రు నేతాజీ అదృశ్యం పై పూర్తి దర్యాప్తు కోసం పట్టుబడకుండా ఉండేందుకు నేతాజీ కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా ఉంచారని పలువురు భావిస్తున్నారు. నేతాజీ కుమార్తె అనిత బోస్‌ను మంచి చేసుకోవడం కోసం ఆమెకు ఆర్థిక సహకారం కూడా అందించారు.
అనేకమంది విప్లవకారులను అరెస్ట్ చేసి, జైళ్లలోనే జీవితం చల్లారేటట్లు చేసిన చరిత్ర గల సోవియట్ యూనియన్ నేతాజీ విషయంలో సహితం దొంగాట ఆడి ఉండవచ్చని, ఈ కారణంగానే నెహ్రూ పూర్తిగా రష్యా ప్రభావానికి గురై, అమెరికా స్నేహ హస్తం అందించినా ఆసక్తి చూపలేదని వాదనలు కూడా బయలుదేరాయి.
ఈ సందర్భంగా బైట పడిన నెహ్రూ బ్రిటిష్ ప్రధాని అట్లీకి వ్రాసిన లేఖ మాత్రం ఎవ్వరు దోషులో స్పష్టం చేస్తుంది. నేతాజీని -మీ యుద్ధ నేరస్థుడు... అని బ్రిటిష్ ప్రధానమంత్రికి డిసెంబర్ 27, 1945న వ్రాసిన లేఖలో నెహ్రు ప్రస్తావించడం గమనార్హం. ఆ లేఖలో నేతాజీ రష్యాలో ఆశ్రయం తీసుకొన్నట్లు ప్రస్తావించడం ద్వారా నేతాజీ ఆచూకీని బ్రిటిష్ వారికి తెలిపి, ఆచూకీ దొరికితే బ్రిటిష్ జైళ్లలో బంధించే విధంగా ప్రయత్నం చేశారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
70వ దశకంలో దర్యాప్తు జరిపిన ఖోస్లా
కమీషన్ ముందు హాజరైన నెహ్రూ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన మొహమ్మద్ యూనుస్ నేతాజీకి సంబంధిం చిన పలు ఫైల్స్ ధ్వంసం కావడమో, దగ్ధం కావడమో జరిగి ఉండవచ్చని చాలా నిర్లక్ష్యంగా చెప్పడం గమనార్హం. పైగా, నేతాజీకి సంబంధించిన పలు ఫైల్స్‌ను నెహ్రూ తన వద్దనే ఉంచుకొనేవారని తెలుస్తున్నది. స్వాతంత్య్రం లభించిన సమయంలో ఈ విషయమై పలు రహస్య ఫైల్స్‌ను బ్రిటిష్ ప్రభుత్వం నెహ్రూకు అప్పచెప్పినట్లు కూడా చెబుతున్నారు.
నెహ్రూ హయాంలోని నేతాజీ అదృశ్యానికి సంబంధించి విచారణ జరిపిన షానవాజ్ కమీషన్‌కు సైతం నెహ్రూ ఈ ఫైల్స్ గురించి తెలిపినట్లే లేదు. నెహ్రూ వద్ద స్టెనోగ్రాఫర్‌గా పనిచేసిన జైన్ ఖోస్లా కమీషన్ ముందు ఇచ్చిన సాక్ష్యం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింపచేసుకొంది. ఒకరోజు సాయంత్రం (డిసెంబర్ 26 లేదా 27, 1945) నన్ను చాలాసేపు పని ఉన్నదని, నెహ్రూ ఇంటికి ఒక టైపురైటర్ తో రమ్మనమని టెలిఫోన్‌లో అసఫ్ అలీ చెప్పారు. కొన్ని పత్రాలు టైపు చేసిన తర్వాత నెహ్రు తన జేబులో నుండి ఒక కాగితం తీసి దాని నుండి నాలుగు కాపీలు టైపు చేయమని చెప్పారు. నాకున్న గుర్తు మేరకు ఆ కాగితంలో ఉన్న సమాచారం:
...నేతాజీ విమానంలో సైగాన్ నుండి వెళ్ళాడు. ఈ రోజు ఆగష్టు 23, 1945న మధ్యాహ్నం 1.30 గంటలకు డైరెన్ (మంచూరి)కు చేరాడు. ఆ విమానం జపాన్ వారి ఛాంబర్ విమానం. దాని నిండా బంగారు ఆభరణాలు ఉన్నాయి. నేతాజీ కొన్ని సూట్‌కేసులను తీసుకు వెళ్ళాడు. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క సూట్ కేసు ఉంది. విమానం దిగేటప్పుడు నేతాజీ అరటి పండ్లతో టీ తీసుకున్నారు. టీ త్రాగడం పూర్తయిన తర్వాత మరో నలుగురితో కలసి దగ్గరలో ఆగి ఉన్న జీప్ ఎక్కారు. వారిలో ఒకరు జపాన్‌కు చెందిన జనరల్ షేడి. మిగిలిన వారి పేర్లు గుర్తు లేవు. ఆ జీప్ రష్యా భూభాగం వైపు వెళ్ళింది. మూడు గంటల తర్వాత జీప్ తిరిగి వచ్చి, విమానం పైలెట్‌కు విషయం తెలపడంతో, అది టోక్యోకు తిరిగి వెళ్ళింది -ఆ పత్రాన్ని నాకు టైపు చేయమని ఇచ్చిన తర్వాత నెహ్రూ అసఫ్ ఆలీ వద్దకు వెళ్లి 10-15 నిముషాల సేపు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉత్తరంపై పేరు స్పష్టంగా లేకపోవడంతో నేను టైపు పూర్తి చేయలేక పోయాను. నెహ్రూ తిరిగి వచ్చి పేరు చెబుతారని వేచి ఉన్నాను. ఈ లోగా ఆ ఉత్తరాన్ని పలుసార్లు చదవడంతో ఇప్పటికి గుర్తు పెట్టుకోగలిగాను. అయితే నెహ్రు ఆ పేరు చెప్పనే లేదు. ఎట్లా ఉందో అట్లాగే ఆ పేపర్లు ఇవ్వమని చెప్పారు...ఇలా ఉండగా, నేతాజీ పట్ల నెహ్రూ అనుసరించిన ధోరణి పట్ల సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్ అసహనంగా ఉండేవారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. మాస్కోలోని పురావస్తు భండాగారంలో లభించిన ఒక ఫైల్ ప్రకారం సిపిఐ ప్రతినిధి వర్గం ఒకటి వచ్చి కలసినప్పుడు నెహ్రూ గురించి స్టాలిన్ అడిగారు. నెహ్రూ పెట్టుబడిదారుల మద్దతు దారుడని ఆ ప్రతినిధి వర్గం చెప్పింది. రష్యాలో మొదటి భారత్ రాయబారిగా నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఉండేవారు. అయితే ఆమెను ఒక్కసారి కూడా స్టాలిన్ కలుసుకోలేదు. నేతాజీ అదృశ్యానికి, స్టాలిన్ - నెహ్రూల మధ్య సరైన సంబంధాలు లేకపోవడానికి మధ్య సంబంధం ఉందా?
నెహ్రూ హయాంలో విదేశాంగ శాఖలో కీలకమైన పదవి లో ఉన్న మొహమ్మద్ యూనస్‌కు నెహ్రూ తర్వాత ఆయన వద్ద గల నేతాజీకి సంబంధించిన రహస్య ఫైల్స్ అన్నింటిని బదిలీ చేశారు. వాటిని దాచి ఉంచే బాధ్యతను అప్పచెప్పినట్లు ఇప్పుడు బైట పడిన ఫైల్స్ వెల్లడి స్తున్నాయి. అయితే ఆ ఫైల్స్ ఆచూకీ ఇంకా వెల్లడికాలేదు.
నేతాజీ అదృశ్యం... ను ఛేదించాలని జీవితం అంతా ఏంతో పోరాటం జరిపిన సమర్ గుహా ఈ ఫైల్స్ కోసం పలువురు ప్రధానులు, రాష్టప్రతులు లేఖలు వ్రాసారు. ఆ ఫైల్స్ ఆచూకీ కనుగోవడంలో ఖోస్లార్ కమీషన్ సహితం విఫలమైనది. ప్రదీప్ బోస్ వ్రాసిన గ్రంథంలో ఈ ఫైల్స్‌ను యూనస్ దాచి, ధ్వంసం చేసారని ఆరోపించారు.
ఇప్పుడు బైటపడిన ఫైల్స్ ప్రకారం నేతాజీ అదృశ్యం... గురించి జపాన్ - భారత్ సంయుక్త దర్యాప్తు జరపాలని జపాన్ సైన్య అధిపతి లెఫ్టనెంట్ జనరల్ ఇవైచి పుజివర 1967లో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనని నాటి ప్రధాని ఇందిరా గాంధీ తిరస్కరిం చారు. నేతాజీ అస్థికలను జపాన్ నుండి తీసుకు వస్తే పలు సందేహాలు నివృత్తి కాగలవని సూచిస్తూ ఐబి డైరెక్టర్ రాజేశ్వర్ ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ వ్రాసారు. అయితే అందుకు ఆమె సుముఖత చూపలేదు.
నేతాజీ అదృశ్యం... గురించి 1999 నుండి 2005 వరకు వాజపేయి ప్రభుత్వం నియమించిన జస్టిస్ ముఖేర్జీ కమీషన్ సమగ్ర దర్యాప్తు జరిపింది. తనకు అందుబాటు లో ఉన్న పత్రాల ఆధారంగా నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయి ఉండక పోవచ్చని ఆ కమీషన్ స్పష్టం చేసింది. ఈ మిస్టరీని ఛేదించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మరొ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంది.
మొదటగా, జపాన్‌లో ఉన్న అస్థికలను తెప్పించి, డీఎన్‌ఏ పరీక్ష జరిపించాలి. నేతాజీకి సంబంధించి నిఘా సంస్థల వద్ద ఉన్న ఫైల్స్‌ను కూడా బైట పెట్టాలి. మరో వంక, రష్యా, జపాన్, చైనా, వియత్నాంల వద్ద గల రహస్య ఫైల్స్‌ను తెప్పించడం కోసం ప్రధాని స్వయంగా ప్రయత్నించాలి. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

- చలసాని నరేంద్ర