మెయిన్ ఫీచర్

కుటుంబ కథలకు అక్షయ పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర దర్శకుల్లో ఆదుర్తి సుబ్బారావు ప్రత్యేకత కలిగిన అగ్రశ్రేణి దర్శకుడు. చక్కటి కుటుంబ కథా చిత్రాలను మానవీయ విలువలతో హృదయానికి హత్తుకొనేలా రూపొందించటంలో సిద్ధహస్తుడు. నవరసాలు మేళవించి అందరికీ నచ్చి మెచ్చే సినిమాలను అందించారు. హిందీ, తమిళ భాషల్లోనే కాకుండా తెలుగులో 26 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిల్లో మూడొంతులకు పైగా సినిమాలు కుటుంబ కథా చిత్రాలకు పెద్ద బాలశిక్షలా మారాయి. తొలిచిత్రం ‘అమరసందేశం’ అపజయమైనా ఆదుర్తి పనితనం నచ్చి మెచ్చి దుక్కిపాటి మధుసూధనరావు ‘అన్నపూర్ణ’ బ్యానర్‌మీద వరుస చిత్ర నిర్మాణాలకు అవకాశమిచ్చారు.
కెవి రెడ్డి దర్శకత్వంలో ఏయన్నార్, సావిత్రిలతో ‘దొంగరాముడు’ హిట్ చిత్రాన్ని నిర్మించిన దుక్కిపాటి, తర్వాతి సినిమాకు దర్శకుడిని వెతుక్కునే క్రమంలో ఆదుర్తి సుబ్బారావు దొరికారు. ఒక సినిమాతో మొదలైన వారి ప్రయాణం -వరుస చిత్ర నిర్మాణాలకు దారితీసింది. బెంగాలీ ‘నిష్కృతి’ ఆధారంగా ‘తోడికోడళ్లు’ (1957) చిత్రాన్ని తెరకెక్కించి ఘన విజయం సాధించటంతో.. వరుసగా మాంగల్యబలం (1959), మంజిల్ మహిమై (తమిళం, 1959), వెలుగునీడలు (1961), తాంకుఉళ్లం (తమిళం, 1961), ఇద్దరు మిత్రులు (1961, ఏయన్నాఆర్ తొలి ద్విపాత్రాభినయం), చదువుకున్న అమ్మాయిలు, (తమిళంలో పెణ్‌మనమ్, 1963), డాక్టర్ చక్రవర్తి (1964), పూలరంగడు (1967), విచిత్రబంధం (1972), బంగారు కలలు (1974).. ఇలా ఒక సంస్థ ఒకే దర్శకుడితో వరుసగా తొమ్మిది ఘన విజయాలు సాధించిన చిత్రాలు నిర్మించటం టాలీవుడ్‌లో ఓ రికార్డుగా మిగిలింది. అలాంటి రికార్డులు సాధించిన అతికొద్ది దర్శకుల్లో ఆదుర్తికే అగ్రతాంబూలం అందుతుంది. వీటిల్లోనూ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా హిట్‌కొట్టిన సినిమాలే ఎక్కువ. ఒక చిత్రానికి మరో చిత్రానికీ కథలలో మూసలేకుండా చూస్తూ, విభిన్న కథాంశాలతో తెరకెక్కించటం ఆదుర్తికే చెల్లిందేమో. ముఖ్యంగా ఆదుర్తికి -అక్కినేని, ఆత్రేయ, కెవి మహాదేవన్‌లతో విడదీయరాని ఆత్మీయానుబంధం. తుదివరకు ఈ బంధం కొనసాగింది. ఆదుర్తి అన్నపూర్ణ సంస్థలోనేకాక, బాబు మూవీస్ బ్యానర్‌మీదా అక్కినేని, సావిత్రి జంటగా మంచి మనసులు (1962), మూగ మనసులు (1964), సుమంగళి (1965), తేనె మనసులు (1965), కనె్న మనసులు (1966) నిర్మించారు. ఈ చిత్రాలూ సూపర్‌హిట్ సాధించాయి. వీటిలో తేనెమనసులు, కనె్నమనసులు చిత్రాలు ఆనాటి నూతన తారాగణమైన కృష్ణ, రామ్‌మోహన్, సుకన్య, సంధ్యారాణిలతో సాహసోపేతంగా నిర్మించారు. నటులకు తొలి చిత్రమైన తేనెమనసులు తొలి సాంఘిక రంగుల చిత్రంగా, విజయవంతమైన భారీ చిత్రంగా నిర్మించటం ఆదుర్తి చేసిన సాహసం. కనె్నమనసులు పరాజయమైనా చక్కనైన బిగివున్న కథాంశంతో హాస్యప్రధాన చిత్రంగా నిర్మించింది. ఈ చిత్రాలు హీరో కృష్ణకు తొలి చిత్రాలైనా సుస్థిర సినీ జీవితానికి పునాదిగా నిలిచాయి. ఇవన్నీ ఒక ఎతె్తైతే ఆదుర్తి తన అభిరుచికి అనుగుణంగా అక్కినేని భాగస్వామిగా తన సొంత నిర్మాణంలో అక్కినేని హీరోగా సుడిగుండాలు (1968) మరో ప్రపంచం (1970) లోబడ్జెట్‌లో ఆఫ్ బీట్ చిత్రాలుగా నిర్మించారు. ఇవి ఆర్థిక విజయాలు సాధించక చేతులు కాల్చుకున్నా మేధావుల, విమర్శకుల ప్రశంసలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బంగారు నంది (సుడిగుండాలు), రజిత నంది (మరోప్రపంచం) అవార్డులు సాధించాయి. యన్టీ రామారావుతోనూ దాగుడుమూతలు (1964), తోడు-నీడ (1965) రెండు హిట్ చిత్రాలు నిర్మించారు. బాలయ్య హీరోగా కృష్ణప్రేమ (1961), శోభన్‌బాబు హీరోగా గుణవంతుడు (1975) తీశారు. ఇవి విజయవంతం కాలేదు. 1963లో శివాజీగణేషన్ హీరోగా మమకారం అనే డబ్బింగ్ చిత్రం వచ్చింది. ఆదుర్తి మొదట్లో తెలుగుతోపాటు తమిళంలోనూ ద్విభాషా చిత్రాలుగా కొన్ని వచ్చాయి. అలాగే తన తెలుగు చిత్రాలను హిందీలోనూ కొన్ని (రెండు, మూడు) రీమేక్ చేశారు. పూలరంగడు చిత్రాన్ని తెలుగులో అంతగా ఇష్టం లేకుండా తీసినా విజయవంతమైతే, హిందీలో ఇష్టంతో సొంతంగా తీసినా హిట్ కాలేదని ఒక సందర్భంలో ఆదుర్తి చెప్పుకున్నారు. ఆయనకు బెంగాలీ కథలన్నా మక్కువే. వాటి ప్రభావంతో తొలినాళ్లలో తోడికోడళ్ళు, మాంగల్యబలం, ఇద్దరు మిత్రులు.. అలాగే తమిళంనుంచి కుముదంను మంచి మసులుగా, శారదను సుమంగళిగా ఎంతో ఇష్టంగా రూపొందించారు.
ఆదుర్తి తీర్చిదిద్దిన చిత్రాలకు ఘన విజయాలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, రాష్టప్రతి ప్రశంసలు, ఫిలిం ఫ్యాన్స్, పత్రికల బ్యాలట్ అవార్డులు లభించాయి. అవి -తోడికోడళ్లు (1957 రాష్టప్రతి ప్రశంస, మద్రాసు ఫిలిం ఫాన్స్), మాంగల్యబలం (1959 రాష్టప్రతి ప్రశంస), నమ్మినబంటు (1960 రాష్టప్రతి రజిత పతకం, అంతర్జాతీయ చిత్రోత్సవానికి, స్పెయిన్, చైనాలలో ప్రదర్శనకు), మూగమనసులు (1964 రాష్టప్రతి ప్రశంస, ఆంధ్రపత్రిక బ్యాలట్ అవార్డు), సుడిగుండాలు (1968 రాష్టప్రతి రజితం, ఆంధ్రప్రదేశ్ బంగారు నంది), మరో ప్రపంచం (1970 ఏపీ ప్రభుత్వ ద్వితీయ ఉత్తమ కథ), ఇద్దరు మిత్రులు (1961), సుమంగళి (1965) (ఆంధ్రపత్రిక బ్యాలట్, మద్రాసు ఫిలింఫాన్స్ అవార్డు) చిత్రాలను చెప్పుకోవచ్చు. ఆయన చివరి దశలో రవికళామందిర్ బ్యానర్‌పై హీరో కృష్ణ, మంజులతో మాయదారి మల్లిగాడు (1973), కృష్ణతోనే ఖరీనావహబ్ హీరోయిన్‌గా గాజుల కిష్టయ్య (1975) నిర్మించారు. ఆదుర్తి చివరి శ్వాస వరకూ సినిమాలను తీస్తూనే ఉండటం విశేషం. అంజలి పిక్చర్స్‌కి ‘మహాకవి క్షేత్రయ్య’ నిర్మాణం చేస్తున్న సమయంలోనే ఆదుర్తి తనువు చాలించారు. తర్వాత ఈ చిత్రాన్ని దర్శకులు సియస్ రావు పూర్తి చేశారు. చివరివరకు సినిమాలే ఊపిరిగా బ్రతికారు ఆదుర్తి. 1922 డిసెంబర్ 16న జన్మించిన ఆదుర్తి... ఆయన 53 ఏళ్ల వయస్సులో వ్యాధిగ్రస్తులై 1975 డిసెంబర్ 22న తుది శ్వాస విడిచారు. ఆదుర్తి గురించి ఎంతరాసినా, చెప్పుకున్నా తక్కువే. సముద్రంలో నీటి బిందువే. *
ఈమధ్య టాలీవుడ్‌లో కుటుంబ కథా చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో అలాంటి చిత్రాలను తెరకెక్కించేందుకు మేకర్స్ సైతం ఉత్సాహం చూపుతున్నారు. కథలో ఏమాత్రం మెరుపున్నా -చూడ్డానికీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడానికి ఇటీవల హిట్టయిన కొన్ని చిత్రాలను ఉదహరించొచ్చు. ఒకప్పుడూ టాలీవుడ్‌లో -కుటుంబ కథా చిత్రాలు రాజ్యమేలాయి. ఉద్దండులైన దర్శకులు తమ పనితనంతో సాంఘిక కుటుంబ జీవితాన్ని తెరపై చూపించి -టాలీవుడ్‌ను స్వర్ణయుగం స్థాయికి తీసుకెళ్లారు. మళ్లీ అలాంటి రోజులు వస్తాయన్నది అత్యాశే అయినా -కనీసం ఆనాటి కుటుంబ కథా విలువలను ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చూపించినా సినిమా అద్భుతం అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కుటుంబ కథా చిత్రాలకు ఎంతోమంది టాలీవుడ్ దర్శకులు ప్రాణం పోసినా, ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ దర్శకుడు -ఆదుర్తి సుబ్బారావు. తెరకెక్కించింది తక్కువ చిత్రాలే అయినా.. అధికశాతం సినిమాలను ఆడియన్స్ గుండెల్లో నిలిపిన ఆదుర్తి సినిమాలని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

-పీవీఎస్ ప్రసాదరావు