మెయన్ ఫీచర్

పౌరసత్వ చట్టంపై రాజ్యాంగ ప్రతిష్టంభన తప్పదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు రాష్టప్రతి ఆమోదముద్ర వేసేవరకు దేశంలో అంతా ప్రశాంతత నెలకొంది. అయితే ఆ తర్వాత అకస్మాత్తుగా పలుచోట్ల, ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో హింసాయుత ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. వాటితోపాటు దేశ రాజధాని ఢిల్లీలో రెండు యూనివర్సిటీలలో హింస పరాకాష్టకు చేరుకొంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో మొదటి రెండు రోజులు అంతా ప్రశాంతత నెలకొనగా, ఆ తర్వాత కేవలం ఒక వర్గం ప్రాబల్యంగల ప్రదేశాలలో హింసాయుత ఆందోళనలు చెలరేగాయి. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం, వ్యూహాత్మకంగా ప్రారంభమైనట్లు భావించవలసి వస్తున్నది.
ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించడానికి ముందు ఉభయ సభలలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. అంతకుముందు పార్లమెంటరీ కమిటీలో కూడా చర్చించారు. అయినా అప్పుడు దేశంలో ఎక్కడా కనిపించని ఆందోళనలు ఆ తర్వాత చెలరేగడం విస్మయం కలిగిస్తుంది. పైగా, అసలు ఈ చట్టం గురించిన సరైన అవగాహన లేకుండానే ఇటువంటి ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నట్లు కూడా స్పష్టం అవుతున్నది. దేశ విభజన కాలంనుండి ఇటువంటి చట్టం అవసరమని చెబుతూ వచ్చిన కాంగ్రెస్, వామపక్షాలు ఈ నిరసనలతో ముందంజలో ఉండటం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా భావించవచ్చు.
ఈ చట్టం భారత పౌరులు ఎవ్వరికీ సంబంధించినది కాకపోయినా, ఎవ్వరి పౌరసత్వం ఈ చట్టం కారణంగా ప్రశ్నార్థకం అయ్యే అవకాశం లేకపోయినా, ఉద్దేశ్యపూర్వకంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేసి చట్టంగా ప్రచారం చేస్తుండటం, వారందరిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరించే ప్రయత్నం జరుగుతూ ఉండడంతో ఇదంతా ఒక రాజకీయ ప్రక్రియ అని స్పష్టం అవుతున్నది.
మరోవంక, పార్లమెంట్ చేసిన ఈ చట్టాన్ని అమలు జరుపబోమని అంటూ ఐదు రాష్ట్రాల మఖ్యమంత్రులు (పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్) ఉత్సాహంగా ప్రకటించారు. కేరళ అసెంబ్లీ అయితే ఆ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. మరోవంక, కొత్తగా కొలువుతీరిన జార్ఖండ్ ముఖ్యమంత్రి సహితం అటువంటి ప్రకటన చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోయినా, మిత్రపక్షాలను కాదని ముందడుగు వేసే సాహసం చేయలేరు. లోక్‌సభలో ఈ బిల్లుకు మద్దతు తెలిపి, రాజ్యసభలో ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో శివసేన అధినేతల రాజకీయ బలహీనతలు వెల్లడయ్యాయి. తెలుగు రాష్ట్రాలు సహితం అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయి.
అయితే వారి వాదన న్యాయపరంగా ఏ మేరకు సాధ్యం కాగలదు? రాజ్యాంగపర సంక్షోభాన్ని వారు ఆహ్వానిస్తున్నారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి. రాజ్యాంగంలోని 9వ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినది. సమాఖ్య వ్యవస్థ భావనకు సంబంధించి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు చట్టాలను చేసే అధికారాల విభజనకు సంబంధించి ఇందులో వివరించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ 7లో పేర్కొన్న కేంద్ర జాబితాలో చట్టాలను చేయడంలో గల ప్రత్యేక అధికారాలను వివరించారు.
రాష్ట్రాలకు తమ సొంత చట్టాలను చేసుకొనే కొన్ని అధికారాలను రాజ్యాంగం దాఖలు చేసింది. వాటిని రాష్ట్ర జాబితాలో పేర్కొన్నారు. ఇక ఉమ్మడి జాబితాలో కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడిగా గల బాధ్యతలను తెలిపారు. రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చు కానీ కేంద్రం చట్టం చేస్తే మొత్తం దేశానికి అదే వర్తిస్తుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13లో చట్టంకు సంబంధించిన కలుపుకుపోగల నిర్వచనం ఉంది. ప్రధాన న్యాయపర వనరులలో ఒకటి చట్టం చేయడం. 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న జాబితాలోని ఏ అంశంపై అయినా చట్టం చేసే ప్రత్యేక అధికారాన్ని ఆర్టికల్ 246 కలిగిస్తుంది. అందులో మొదటి (కేంద్ర) జాబితాలోని 17వ షెడ్యూల్‌లో పౌరసత్వం సహజత్వం, విదేశీయులకు సంబంధించి ఉంది.
ఆర్టికల్ 246(3)లో రాష్ట్రాలకు సంబంధించి చట్టాలు చేసే అంశాలకు సంబంధించి తెలిపారు. 17వ షెడ్యూల్‌లోని రెండో జాబితా ఇది. అంటే మొదటి జాబితాకు సంబంధించి ఏ అంశంపై కూడా రాష్ట్రాలు చట్టం చేయలేవు. పౌరసత్వ సవరణ చట్టం, 2019 పార్లమెంట్ ఆమోదించిన బిల్ కావడంతో ‘అమలులో వున్న చట్టం’గానే భావించాలి. ఒక్కొక్క రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వివిధ అంశాలపై ఈ చట్టంపై దాడి చేస్తున్నారు.
ప్రధానంగా పేర్కొంటున్న రెండు ఆధారాలు- (1) న్యాయపరమైన ఆధారం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ధిక్కరించడం. (2) ప్రవేశాలు, ఉద్యోగం, స్థానికంగా అందించే ప్రయోజనాల విషయంలో ఈ చట్టం ద్వారా లబ్దిపొందినవారు ప్రస్తుత పౌరులతో పోటీపడతారు. మొదటి అంశాన్ని సుప్రీంకోర్టు ముందు పరిశీలించారు. స్థానిక కారణాలవల్లన ఈ చట్టాన్ని తాము అమలుచేయలేమని ఇప్పటివరకు ఐదు రాష్ట్రాలు - పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్ ప్రకటించాయి. అసలు అటువంటి అధికారం ఆయా రాష్ట్రాలకు లేదా? దానిని రాజకీయంగా పరిష్కరించుకోవాలా? అన్నది ఇప్పటి ప్రశ్న.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246(1) కింద సంక్రమించిన అధికారాల మేరకు పార్లమెంట్ పౌరసత్వ సవరణ చట్టం, 2019ని ఆమోదించింది. ‘‘పౌరసత్వం’’కు సంబంధించి చట్టం చేయడానికి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎటువంటి అధికారాలు లేవు. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుంది అనే కారణంతో సుప్రీంకోర్టు దానిని చెల్లదని ప్రకటిస్తే తప్ప, రాష్ట్రాలు ఈ చట్టానికి బద్ధులై ఉండవలసిందే.
రాష్ట్రాలు ఈ చట్టం అమలును తిరస్కరింపలేవు. మొత్తం దేశానికి లేదా భారత భూభాగాలలోని కొన్ని ప్రాంతాలకు చట్టాలుచేసే అధికారాన్ని ఆర్టికల్ 245(1) పార్లమెంట్‌కు దాఖలు చేసింది. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలుచేయడానికి తిరస్కరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే కాగలదు. అప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 356(1)ని ప్రయోగించవలసి వస్తుంది.
ఈ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నడచుకోవడం లేదని రాష్టప్రతి సంతృప్తి చెందితే, రాష్టప్రతి తన అన్ని లేదా ఏదైనా విధులను ప్రకటించడం ద్వారా రాష్ట్ర శాసనసభ యొక్క అధికారాలు పార్లమెంటు అధికారం ద్వారా లేదా కింద ఉపయోగించవచ్చని ప్రకటించవచ్చు. అంటే రాష్టప్రతి పాలన విధింపునకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఈ చట్టం అమలుకు ఐదు రాష్ట్రాలు తిరస్కరిస్తే అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ని ప్రయోగించడానికి లేదా దానిద్వారా ఆంక్షలు విధించడానికి దారితీయవచ్చు.
ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకొని ముస్లింలలో అనుమానాలు కలిగించే ప్రయత్నాలు దేశద్రోహంగా భావించవలసి ఉంటుంది. భారత పౌరసత్వ చట్టం, 1955లో సెక్షన్ 5 క్రింద ముస్లింలతో సహా విదేశీ పౌరులు ఎవరైనా దరఖాస్తుచేసి, భారతీయ పౌరసత్వం పొందవచ్చు. గత ఐదేళ్లలో, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇతర దేశాలకు చెందిన 500 మందికి పైగా ముస్లింలకు భారత పౌరసత్వం కల్పించింది.
ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టానికి చారిత్రక పూర్వరంగం ఉందని గమనించాలి. భారత హోంమంత్రి పండిట్ గోవింద్ వల్లభ్‌పంత్, పాకిస్థాన్ హోంమంత్రి మేజర్ జనరల్ ఇస్కాండెర్ మీర్జాలు 1955లో పంత్-మీర్జా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్‌లోని ముస్లిమేతర ప్రార్థన స్థలాలను రక్షించడం, కాపాడటం భారత ప్రభుత్వ బాధ్యత. పాకిస్థాన్‌లోని ముస్లిమేతరుల ధార్మిక, సామాజిక ఆందోళనలు, సమస్యలను పట్టించుకొనే బాధ్యత కూడా భారత ప్రభుత్వానిదే.
దేశ విభజన జరిగిన సమయంలో మొత్తం పాకిస్థాన్ జనాభాలో 24 శాతంగా ఉండే మైనార్టీ ప్రజలు ఆ దేశంలో జరిపిన అత్యాచారాలు, మారణకాండ ఫలితంగా ఇప్పుడు 2శాతానికి తగ్గిపోయారు. అయితే ఈ విషయమై ముందుటి భారత ప్రభుత్వాలు ఈ దేశంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్నవారు ఉగ్రవాదం ముప్పును ఎదుర్కోవడంతోపాటు భారతీయ చట్టాలవల్లన ఇబ్బందులకు కూడా గురవుతున్నారు.
పాకిస్థాన్‌లో ‘అమానుష అవమానాలు’ ఎదుర్కొంటున్న వారికి మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ‘మానవతా గౌరవం’ పొందేటట్లు చేయాలని అనుకొంటున్నది. ఈ చట్టంతో భారతీయ ముస్లింలు ఎవ్వరికీ ఎటువంటి సంబంధం లేదు. పాకిస్థాన్‌లో మైనారిటీలు అన్యాయంగా మారణకాండను ఎదుర్కొంటుంటే, భారతదేశంలో అభివృద్ధి ప్రక్రియలో వారు సమాన భాగస్వాములుగా ఉన్నారని ఈ సందర్భంగా గమనించాలి.
పైగా, గతంలో పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ల నుండి దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఇటువంటి చట్టంకోసం ప్రయత్నం చేసినవే. డిసెంబర్ 18, 2003న రాజ్యసభలో ప్రతిపక్షనేతగా మన్మోహన్‌సింగ్ ఇలా చెప్పారు. ‘నేను ఈ అంశంపై కొంత చెప్పాలి అనుకొంటున్నాను. మన దేశ విభజన తర్వాత, బాంగ్లాదేశ్ వంటి దేశాలలో మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారు. పరిస్థితులు వత్తిడి తెచ్చి, ఆ అభాగ్యులు మన దేశంలో ఆశ్రయం కోరితే, వారికి మరింత ఉదారంగా పౌరసత్వం మంజూరుచేయడం మన నైతిక బాధ్యత. గౌరవనీయ డిప్యూటీ ప్రధానమంత్రి పౌరసత్వ చట్టం గురించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారని నేను ఆశిస్తున్నాను.
మే 2012లో, కోజికోడ్‌లో జరిగిన సిపిఎం అత్యున్నత విధాన నిర్ణాయక సమితి అయిన 20వ పార్టీ కాంగ్రెస్‌లో ఆమోదించిన తీర్మానంలో ఈ విధంగా పేర్కొన్నారు. ‘తమను భారత పౌరులుగా గుర్తించమని భారీ సంఖ్యలో ఉన్న బెంగాలీ శరణార్థుల చట్టబద్ధ డిమాండ్‌ను సానుభూతితో పరిశీలిస్తామని ప్రధానమంత్రి ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని ఈ పార్టీ కాంగ్రెస్ కోరుతున్నది. వారు తమ స్వదేశమైన గతంలోని తూర్పు పాకిస్థాన్, ప్రస్తుత బాంగ్లాదేశ్ నుండి వలస వచ్చారు. ఈ శరణార్థులలో అత్యధికులు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, ముఖ్యంగా నామశూద్ర వర్గాలకు చెందిన, దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. బాంగ్లాదేశ్ మైనారిటీ శరణార్థులకు సంబంధించి పౌరసత్వ చట్టంలోని క్లాజ్ 2(ఐ)(బి)ని సవరించమని ఈ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది.
మే 22, 2012న సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్ ప్రధానమంత్రికి వ్రాసిన లేఖను ప్యూపిల్స్ డెమోక్రసీలో జూన్ 3న ప్రచురించారు. ఆ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. పూర్వపు తూర్పు పాకిస్థాన్ నుండి, తర్వాత బాంగ్లాదేశ్ ఏర్పాటుచేసిన తర్వాత కూడా వచ్చిన భారీగాఉన్న శరణార్థుల పౌరసత్వ సమస్యలు తమకు అదుపులో లేని చారిత్రక పరిస్థితుల కారణంగా రావడంతో తలెత్తాయి. వారి పరిస్థితి ఆర్థిక కారణాల చేత భారత్‌కు వచ్చిన వారికన్నా భిన్నమైనది. అయితే, ఈ సభలో ఈ విషయమై ఏకాభిప్రాయం ఏర్పడినా ఏమీచేయడంలేదు. సుమారు దశాబ్దకాలంగా ఈ అంశం అపరిష్కృతంగా ఉండిపోయింది.
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతాబెనర్జీ పరిస్థితి మరింత స్పష్టంగా ఉంది. 2005లో లోక్‌సభ ఎంపీగా ఆమె స్పీకర్‌ను కలిసి, ఆగ్రహంతో భౌగోళిక స్వరూపానే్న మార్చివేస్తున్న బంగ్లాదేశీ చొరబాటుదారుల గురించి నిరసన వ్యక్తంచేశారు. నిరసన వ్యక్తంచేసిన తర్వాత ఆమె స్పీకర్‌పై కొన్ని కాగితాలను గిరాటువేసి, వాక్‌అవుట్ జరిపారు. ఈ రాజకీయ నాయకుల కపటత్వం నేడు వీధులకు చేరడాన్ని ప్రతివారు చూడవలసిందే. వారికి నెలకొన్న రాజకీయ నిస్పృహలే ఇటువంటి పరిస్థితులకు దారితీస్తున్నట్లు చెప్పక తప్పదు.

- చలసాని నరేంద్ర