మెయన్ ఫీచర్

ఎన్నికల కోసమేనా అమెరికా నాటకాలు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు యుద్ధ బూచి కొన్ని దేశాలకు కలిసొస్తోంది. యుద్ధ బూచి చూపించి గెలవాలనే తపన వివిధ దేశాల్లోని అధినేతల్లో పెరిగిపోతోంది. అమెరికాలో రానున్న ఎన్నికల్లో తన విజయానికి అనేక పాచికలు వేస్తున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ నుండి మేధోవలసను అడ్డుకట్ట వేసి స్థానిక యువతను ఆకట్టుకున్నారు. ఇపుడు రెండో పాచిక వేస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. కేవలం విజయం కోసం యుద్ధవాతావరణాన్ని వాడుకుంటే పర్వాలేదు, నిజంగానే అది యుద్ధానికి దారితీస్తే పరిస్థితి ఏమిటనేది మిగిలిన ఆసియా దేశాల ఆందోళన. అ అదిగోపులి చందంగా నిజంగా పులివస్తే అందర్నీ మింగేసినట్టు యుద్ధం వస్తే అమెరికా ఎన్నికల మాట అటుంచి, మధ్య ప్రాచ్యదేశాలకూ, పశ్చిమాసియా దేశాలకు పెను ముప్పు తప్పదు.
గతసారి ఎన్నికల సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోమారు అధికారంలోకి రావడానికి ఇరాన్‌తో యుద్ధానికి తెగపడే ప్రమాదం ఉందని 2011లో ట్విట్టర్ వేదికగా డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇపుడు తేలికగా తీసుకోలేం. 1998లోనూ అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభిశంసన దర్యాప్తు కీలక సమయంలో ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడిన అంశాన్నీ మరిచిపోలేం. యుద్ధ కాంక్షను ప్రకటించిన తర్వాత కొన్ని ఆసియా దేశాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలనూ ప్రజలు అంతాచూశారు.
ఇంట్లో శాంతి యుత వాతావరణం కోరుకున్నట్టే దేశంలోనూ, ఖండాల మధ్య, ప్రపంచంలోనూ యుద్ధ్భీతి లేని వాతావరణాన్ని సృష్టించాలని, అంతర్జాతీయ శాంతిని కాపాడాలనే లక్ష్యానికి కట్టుబడి గత ఏడున్నర దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి అన్ని రంగాల్లో ఎనలేని కృషి చేస్తోంది. అయితే గతకాలపు కక్షలూ, కార్పణ్యాలను మరచిపోని దేశాలు పక్కదేశాలపై ఎపుడూ కయ్యానికి కాలుదువ్వుతునే ఉన్నాయి. భారత్ సరిహద్దు దేశాలు కవ్వింపులకు పోతున్నట్టే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధానికి సిద్ధం అంటూ రెచ్చగొడుతున్నాయి. సాధారణ దేశాల మధ్య ఇవి మాటలకే పరిమితం అవుతుండగా, అగ్రదేశాలతో వాదనలు కార్యరూపాన్ని దాలుస్తున్నాయి. తాజాగా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏ ప్రస్థానానికి దారితీస్తుందో అని ప్రపంచంలోని మిగిలిన దేశాలు వణికి చస్తున్నాయి. ఉరిమి ఉరిమి మంగళంమీద పడ్డట్టు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం పశ్చిమ ఆసియాకు, మధ్య ప్రాచ్య ప్రాంతాలకే పరిమితం కాబోదు, ఆసియా ఖండంలోని 47దేశాలపైనా దాని ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థనూ, సామాజిక వ్యవస్థను సైతం చిత్తడి చేస్తుంది.
పశ్చిమాసియాపై యుద్ధమేఘాల ప్రభావం అపుడే మార్కెట్లను కుదిపేస్తోంది. చమురు ధరలతో పాటు బంగారం , వెండి ధరల్లో పెరుగుదల సూచిస్తోంది. ఇరాన్ ఉన్నత సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులైమానీని అమెరికా లేజర్ క్షిపణి డ్రోన్ దాడితో హతమార్చింది. దానికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించడంతో ఈ ప్రాంతం అంతా చిగురుటాకులా వణుకుతోంది. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి జనరల్ ఖాసిం సేవలను పరోక్షంగా పొందిన అమెరికా ఇపుడు తమ వరకూ వచ్చేసరికి ఆయననే మట్టుబెట్టింది. సులేమానీ మృతదేహానికి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వేలాది మంది కన్నీళ్లతో నివాళులు అర్పించారు. ఆ దేశ అగ్రనాయకుడు అయతుల్లా అలీ ఖుమైనీ , అధ్యక్షుడు హసన్ రౌహానీ ఇతర నేతలు, సులేమానీ కుమారుడు పాల్గొన్నారు. సులేమానీని హతమార్చినందున అమెరికా బలగాలు తమ భూభాగం నుండి వైదొలగాలని ఇరాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. దానిపై డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాక్‌పై పెట్టిన సైనిక ఖర్చులను తిరిగి తమకు చెల్లించాలని లేకుంటే భారీగా ఆంక్షలు విధిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. ఇరాక్‌లో వైమానిక స్థావరాన్ని నిర్మించడానికి వందల కోట్లు డాలర్లు ఖర్చయ్యాయని, ఆ సొమ్మును ఇవ్వకుంటే తాము ఇరాక్‌ను వీడేది లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ నిబంధనలు ఉన్నా ఇరాన్ వారసత్వ ప్రదేశాలపై అమెరికా దాడులు కొనసాగిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలకు వెలకట్టింది. ట్రంప్ తల తెస్తే 575 కోట్లు ఇస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖుమైనీ పేర్కొన్నారు. ఇరాన్‌లో ప్రతి పౌరుడి నుండి ఒక డాలర్ సేకరించి ఈ నిధిని ట్రంప్ తలతెచ్చిన వారికి ఇస్తామని ఆయన ప్రకటించారు.
ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను ఒబామా ప్రభుత్వం, ఐఎస్ పెద్ద దిక్కు అబు బకర్ అల్ బగ్దాదీని ట్రంప్ ప్రభుత్వం మట్టుబెట్టాయి. వీరిద్దరూ ఉగ్రవాద సంస్థల అధినేతలు. కానీ మేజర్ జనరల్ సులేమానీ ఇరాన్ సర్వోన్నత నేత ఖుమైనీకి అత్యంత సన్నిహితుడు.
వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని కట్టడి చేయడానికి ఉద్ధేశించిన పారిస్ ఒడంబడిక, రెండోది ఇరాన్ అణుకార్యక్రమాన్ని నిలిపేసేలా చేసిన కీలక ఒప్పందాల నుండి ముందుగా వైదొలగింది అమెరికానే. మరో పక్క జరూసలేమ్‌ను అధికారికంగా ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తించాలని నిర్ణయం తీసుకుని పశ్చిమాసియా సంక్షోభానికి పరిష్కారం చూపిస్తున్నట్టు చెబుతోంది. ఇవన్నీ ఉద్రిక్తతలకు కీలకమైన కారణాలే.
2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పాటించేది లేదని ఇరాన్ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తృతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారుచేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని తమ సైనిక స్థావరం, దౌత్య కార్యాలయాలపై కతయిబ్ హెజ్‌బొల్లా తీవ్రవాద సంస్థ చేసిన దాడికి ప్రతీకారంగానే తీవ్రంగా స్పందించినట్టు అమెరికా చెబుతున్నా, ఈ యుద్ధ భావన వెనుక ఏడు దశాబ్దాల నేపథ్యం ఉందనేది నిర్వివాదాంశం. కతయిబ్ ఇస్లామిక్ స్టేట్‌తో ఇరాక్ సైన్యంతో, ఇంకోవైపు అమెరికా సంకీర్ణ సైన్యంతో తలపడుతునే ఉంది. ఇరాన్ మిత్రుడు, సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్ సైన్యానికి ఆయుధాలను చేరవేయడంలోనూ సహకరిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఈనాటివి కానేకావు.దాదాపు 67 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. 1953లో ఇరాన్ ప్రధాని మహ్మద్ ముసాదెక్‌ను పదవీచ్యుతుడ్ని చేసి తమ విశ్వాస పాత్రుడైన రాజు షా మహ్మద్ రెజా పహ్లావీని అధికార పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా ఇరాన్‌తో విబేధాలకు అమెరికా బీజం వేసింది. 1979లో అమెరికా అండతో కొనసాగుతున్న పాలకుడు మహ్మద్ రెజా పహ్లావికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. దాంతో ఆయన అమెరికాకు పారిపోయారు. ఆందోళన కారులు టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీని 1979 నుండి 1981 జనవరి వరకూ ముట్టడించారు. ఇస్లామిక్ రివల్యూషనిస్టులు తిరుగుబాటు చేసి షాను జనవరి 16వ తేదీన తరిమేయడంతో ఆ తర్వాత రెండు వారాలకు మత పెద్ద అయతల్లా అలీ ఖుమైనీ ఇరాన్‌కు తిరిగి వచ్చారు. అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనలు వ్యక్తం చేస్తూ దాడికి దిగడంతో పాటు 52 మంది అమెరికన్లును 444 రోజుల పాటు నిర్బంధించారు. ఈ చరిత్రను మరిచిపోని అమెరికా 1988లో ఇరాన్ ప్రయాణీకులున్న విమానాన్ని తమ యుద్ధనౌకతో అమెరికా కూల్చివేసింది. దాంతో 290 మంది ప్రయాణీకులు చనిపోయారు. అది యుద్ధవిమానం అని తాము పొరపాటుపడినట్టు అమెరికా చెప్పుకొచ్చింది. ఇరాన్‌తో పాటు ఇరాక్, ఉత్తరకొరియాలు దుష్టత్రయం అని 2002లోనే అమెరికా పేర్కొంది.
ఇరాన్ అణుకార్యక్రమాన్ని కొనసాగిస్తోందన్న దుగ్దతో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రాణాధారమైన చమురు రాబడులపై దెబ్బకొట్టడానికి అమెరికా మొదటి నుండి ప్రయత్నిస్తూనే ఉంది. ఇరాన్‌ను, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్సును తీవ్రవాద జాబితాలో చేర్చింది. అమెరికా , బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీలు ఇరాన్‌తో అణుఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పరోక్షంగా అణుపరిశోధనలు చేయకుండా ఇరాన్‌పై ఆంక్షలను విధించింది. వీటిని ఎత్తివేస్తే తమ అణుకార్యక్రమాన్ని పరిమితం చేసుకుంటామంటూ ఆయాదేశాలతో 2015లో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం నుండి 2018 మేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైదొలిగారు. ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలను విధించారు. ఇరాన్‌తో చమురు వ్యాపారం చేయవద్దంటూ భారత్‌తో సహా ఆసియా దేశాలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం హెచ్చుమీరింది. గత సెప్టెంబర్ 14న సౌదీలోని అరామ్‌కో చమురు క్షేత్రంపై ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారనేది అమెరికా ఆరోపణ. పర్షియన్ గల్ఫ్‌లో చమురు నౌకలపై దాడులకూ, గత ఏడాది జూన్‌లో ఆరు చమురు ట్యాంకర్లు దగ్ధం కావడానికి ఇరాన్ కారణమని అమెరికా ఆరోపిస్తోంది. జూన్ 20న హర్మౌజ్ జలసంధిపై ఎగురుతున్న అమెరికా డ్రోన్‌ను ఇరాన్ బలగాలు కూల్చేశాయి. ఇలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.
వీటి ప్రభావం భారత్‌పై తప్పకుండా ఉంటుంది. పశ్చిమాసియా దేశాల నుండి 40 బిలియన్ డాలర్ల విదేశీమారకద్రవ్యం దక్కుతోంది. అది ఆగిపోయే ముప్పు ఉంది. ఆ దేశాల్లో సుమారు 80 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారందరూ వెనక్కు రావడంతో దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. అక్కడి నుండి భారతీయులను వెనక్కు తరలించడం కూడా తలకుమించిన భారమే అవుతుంది. ఇంకో పక్క ఎగుమతులు, దిగుమతులు, చమురు ఉత్పత్తులపైనా సమస్యలు ఎదురవుతాయి. పెట్రోల్, డీజిల్‌కు గిరాకీ ఏర్పడి ధరలు పెరిగే ముప్పు ఉంది. వీటన్నింటితో సర్‌చార్జిల ముప్పు భారతీయులందరిపై పడుతుంది. ఇవన్నీ మనం గతంలోని గల్ఫ్‌యుద్ధ సమయంలో చూసివనే.

- బి.వి. ప్రసాద్ 99633 45056