మెయిన్ ఫీచర్

50 ఏళ్లు నిండిన ‘విరసం’ దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విప్లవ రచయితల సంఘం (విరసం) యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని ప్రస్తావించుకునేందుకుగాను జనవరి 11, 12 తేదీల్లో 27వ మహాసభల్ని జరుపుకోనున్నది. విచిత్రమేమిటంటే.. రెండవ ప్రపంచ యుద్ధ కాలాన్ని దాటి తన దృక్పథాన్ని విరసం చాటుకోలేకపోతోంది. మారిన ప్రపంచాన్ని, సాంకేతిక రంగంలో చోటుచేసు కున్న మార్పులను, ఆ మార్పులు మానవ మస్తిష్కంపై, జీవన విధానంపై వేసిన ‘ముద్ర’ను సుతరాము పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలపు ఆలోచనల్ని.. భావజాలాన్ని భద్రపరిచేందుకు ఎక్కువ ప్రాధాన్యత కనబరుస్తోంది.
గత ఏడువందల సంవత్సరాల్లో జరగని పురోభివృద్ధి, సరికొత్త ఆలోచనల విస్ఫోటనం గత ఏడు దశాబ్దాల్లో చోటుచేసుకుంది. అనేకానేక ఆవిష్కరణలవల్ల, ఆలోచనలవల్ల మానవ సమాజం రూపాంతరం చెందిం ది. ‘రీ డిజైన్’ చోటుచేసుకుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలు-పరికరాలు, పద్ధతులు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా ‘‘కృత్రిమ మేధ’’ ఆవిర్భావ అనంతరం ఈ ప్రపంచం పూర్వపు ప్రపంచం కాదనే ‘ఎరుక’ అందరికి ఉండాలి. ప్రపంచాన్ని దర్శించే.. విశే్లషించే.. విమర్శించే విధానం మారిందని గమనించాలి. సమాజాన్ని తూచే ‘తూకంరాళ్లు’ కొత్తవి కావాలి. కొత్త దృక్కోణం అలవరచుకోవాలి. అభివృద్ధి చెందిన ఈ సమాజపు ‘ఆత్మ’ను పట్టుకోగలగాలి.
విషాదమేమిటంటే ‘విరసం’ దగ్గర ఆ తూకంరాళ్లు లేవు.. ఆ దృక్కోణం కరవైంది. ఆ ‘‘లోతు’’ అసలే లేదు. సమాజపు ‘‘డైనమిక్స్’’ను జీర్ణించుకునే ‘శక్తి’సైతం వారిలో కనిపించదు. మారిన.. సంపూర్ణంగా మారిన వస్తుఉత్పత్తి పద్ధతులు, విధానాలు, సంబంధాలు, డైనమిక్స్‌ను పట్టించుకోకుండానే సమాజాన్ని మిగతా వారందరికన్నా ఎంతో గొప్పగా, శాస్ర్తియంగా విశే్లషించి, సరైన పరిష్కారం తాము మాత్రమే చూపుతున్నామన్న ఓ ‘‘ఆధిపత్య భావన’’ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
వారి శాస్ర్తియ విశే్లషణ, ఆలోచన, అభిప్రాయం, పరిష్కారం పూర్తిగా ‘‘నాన్ సింక్’’లో ఉందని, వర్తమానానికి ఏమాత్రం పొసగనిదని ఎవరెన్నిమార్లు చెప్పినా పాడిందే పాటగా... దాసరి మాటగా.. పాటగా ఉల్లేఖిస్తే నష్టపోయేది ప్రజలే, కొత్త తరమేనన్న ‘‘స్పృహ’’ కూడా లేకుండా చర్విత చరణంగా వచనాల ను వల్లిస్తే ఒరిగేది ఏమిటి? ఈ వౌలిక ప్రశ్నను వారు వేసుకున్న పాపాన పోవడం లేదు. ఒకవేళ వేసుకున్నా వారి ‘‘రాజకీయ బాసులు’’ ఆమోదించడం లేదు. జీ హుజూర్ పద్ధతిలో సాహిత్య సృజనకు పూనుకోవడం, విమర్శ చేయడం విషాదం గాక ఏమవుతుంది? వారి రాజకీయ బాసుల్లో విభేదాలు వచ్చినప్పుడల్లా ‘విరసం’లో చీలికలొచ్చిన సంగతి మరువరాదు.
‘విరసం’ తన 27వ మహాసభల్ని 2020 సంవత్సరం లో జరుపుకుంటున్నది. ఈ వర్తమాన కాలమాన పరిస్థితుల కనుగుణంగానే విశే్లషణ, వింగడింపు, విమర్శ, విద్వత్తు ఉండాలి. ఇది ప్రాథమిక అంశం... సారాంశం. కానీ ‘విరసం’ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
మహాసభల సందర్భంగా ప్రచురించిన కరపత్రంలో.. ‘‘ఇవాళ దేశవ్యాప్తంగా ప్రగతిశీల బుద్ధిజీవులు, రచయితలు హింసను అనుభవిస్తున్నారు. ఎందరో ఆలోచనాపరులను ఫాసిజం బలితీసుకున్నది. అపూర్వమైన మేధావులను ఫాసిస్టురాజ్యం ఖైదు చేస్తున్నది..’’ ఇట్లా విరసం ‘‘్ఫసిజం’’ బూచితో భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. హిందూ ఫాసిజం దేశానికి ప్రమాదకారిగా మారుతోందన్న ధ్వని ఆ కరపత్రంలో వినిపిస్తోంది.
ఫాసిజం అనేది రెండవ ప్రపంచ యుద్ధానికి ముందునాటి మాట. ఆ మాటకు-పదానికి ఇప్పుడు ప్రాసంగికత లేదు, అదో పారిభాషిక పదం. ప్రజాస్వామ్యం ప్రపంచమంతటా పరిఢవిల్లకముందు ఆ పదానికి.. అర్థం ఉండేది. ఆ యుద్ధం ముగిసాక ఎన్నో దేశాల్లో స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం ఉషస్సులు ఉదయించాక, ప్రజల భాగస్వామ్యం ‘అధికారం’లో పెరిగాక, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుం టామని ప్రపంచ ప్రజలందరూ ఉవ్వెత్తున ఉద్యమించి అందుకనుగుణమైన రాజకీయాలు నడుపుతున్న సందర్భంలో, అమెరికా-్భరత్‌లోని ప్రజాస్వామ్యం మరింత చిక్కబడేలా తగు చర్యలు చేపడుతున్న తరుణంలో హాంకాంగ్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నియంతృత్వానికి వ్యతిరేకంగా సరికొత్త పంథాలో పోరాటాలుచేస్తున్న వేళ 70 ఏళ్ళ క్రితం వాడి పారేసిన పదం ఫాసిజాన్ని ‘విరసం’ ఇప్పుడు తలపై పెట్టుకుని ప్రచారం చేయడం విడ్డూరం.
ఒకప్పటి ఇటలీలోని ఫాసిజం ఇంకా సజీవంగా ఉందనుకోవడం పూర్తిగా అమాయకత్వం, అజ్ఞానం. ఇంత జవాబుదారీ రహితంగా విరసం ఫాసిజంపై సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోందని చెప్పుకోవడం చూస్తే జాలి కలుగుతోంది.
ఇప్పుడు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో, వైజ్ఞానిక రంగంలో దూసుకుపోతోంది. అభివృద్ధికి ఇదే ఇరుసుగా మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అద్భుత అంతర్జాతీయ సంస్థలకు మన దేశ నిపుణులు నాయకత్వం వహిస్తున్నారు. కృత్రిమ మేధను సరికొత్త పుంతలు తొక్కిస్తున్నది. మన తెలుగువాడు రాజారెడ్డి. మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ళ మన తెలుగువాడేనన్న సంగతి విరసం వారికి సైతం తెలుసు.
సత్య నాదెళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్ ఈ ప్రపంచాన్ని ఒకటికి రెండుమార్లు సంపూర్ణంగా మార్చేసింది. అనంతరం వచ్చిన అనేక సంస్థలు మొత్తం మానవాళి జీవన విధానాన్ని, శైలిని, ఆలోచనల్ని మార్చేశాయి. కృత్రిమమేధ ఆధారంగా రోబోలు, డ్రోన్లు వాహనాలు పనిచేస్తున్నాయి. పరిశ్రమలు-వ్యవసాయం, విద్యా, వైద్యం, వినోదం... ఇట్లా అన్ని రంగాల్లోకి కృత్రిమమేధ శరవేగంగా దూసుకుపోతున్నది. ఈ విషయం మన అరచేతిలో ఉన్న 4జి, 5జి స్మార్ట్ ఫోన్ (త్వరలో రానున్నది) సజీవంగా చూపుతోంది. ఈ స్మార్ట్ఫోన్లు విరసం మేధావుల దగ్గరకూడా కనిపిస్తాయి.. కాని అటువైపు దృష్టిసారించారు.
ఎంతసేపు తాము పాక్షిక దృష్టితో విశే్లషించి, వింగడించి ఎంతో ‘‘పవిత్రం’’గా కాపాడుకుంటూ వస్తున్న పద్ధతి- విధానం ఆధారంగా పదాలను అల్లి ప్రజలముందు పరుస్తారు తప్ప వాస్తవికత ఏమిటి? వైజ్ఞానిక ప్రగతి తీసుకొచ్చిన విప్లవాల సంగతేమిటి? ముఖ్యంగా నాల్గవ పారిశ్రామిక విప్లవం ఆవిష్కరించిన, ఆవిష్కరిస్తున్న అత్యద్భుత పరిణామాలేమిటి? మానవా ళిని అవి ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ‘జ్ఞానం’ ఏ రకమైన పాత్ర పోషిస్తోంది? అన్న అంశాన్ని పట్టించు కోకుండా ఇంకా తొలి పారిశ్రామిక విప్లవం రోజులనాటి ‘‘శారీరక శ్రమ’’ దగ్గర ఆగిపోయి, ఆ దృష్టికోణం నుంచే ప్రపంచాన్ని వీక్షిస్తే ఫలితమేముంటుంది?
సమాజం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు స్టార్టప్ సంస్థలు, సాంకేతిక నిపుణులు నిరంతరం కృషి చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు, కొత్తతరాల ఆకాంక్షలకు, వారి అభిరుచులకు తగ్గట్టుగా పరిష్కార మార్గాలు వెలుగు చూస్తున్నాయి. అవి అలాగే ఘనీభవించకుండా ప్రతి ఐదు, పది సంవత్సరాలకు సరికొత్త ఆలోచనలతో, పరిష్కారాలతో ముందుకొస్తున్నారు. ఇదికాదని 1967లో నక్సల్‌బరిలో ప్రారంభమైన కష్టజీవుల తిరుగుబాటు మాత్రమే సర్వ సమస్యలకు ‘‘పరిష్కారం’’ చూపుతుందనుకోవడం ఎంతటి అజ్ఞానం? అనాలోచితం? గత 50 ఏళ్ళలో మానవ జీవనం సంపూర్ణంగా మారిందన్న ‘సోయి’ లేకపోతేనే సాయుధ పోరాటం గుర్తుకొస్తుంది. ఫాసిజం, నాజీయిజం.. వీటిని ఎదుర్కొనేందుకు పోరాడిన కమ్యూనిజం ఇప్పుడు ప్రాసంగికతను కోల్పోయింది. ఫాసిజం పత్తాలేకుండా పోయింది కాబట్టే కమ్యూనిజం కూలిపోయింది. అంటే ఫాసిజం తిరిగి తలెత్తే అవకాశమే లేదు. ఆ వాతావరణమే కనిపించదు. ప్రజాస్వామ్యం అంతటా విస్తరిస్తున్న, చిక్కబడుతున్న సమయం, సందర్భంలో ‘‘మనం’’ జీవిస్తున్నాం. ఇందుకనుగుణమైన ఆలోచనాధోరణినే కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు వ్యాపింప చేస్తేనే ప్రజలు సులువుగా అర్థం చేసుకుని అభివృద్ధి బాటపడతారు. అలాగాక అటు రష్యా, తూర్పుయూరప్, చైనాలో చతికిలబడి, నామరూపా ల్లేకుండా పోయిన కమ్యూనిజం వెలుగులోనే విరసాన్ని నడుపుదామనుకోవడం పూర్తిగా చారిత్రక తప్పిదమే, ప్రజలను ఓ రకంగా ‘‘దగా’’కు గురిచేయడమే అవుతుంది. ప్రజల శక్తియుక్తులు ఎక్కడ వెచ్చించాలో చెప్పకుండా తప్పుదారి పట్టిస్తూ దండకారణ్యంలో కొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడని అతిశయోక్తులతో, అవాస్తవాలతో ఆకర్షించబూనుకోవడం ప్రజావ్యతిరేక వైఖరి అవుతుందే తప్ప, ప్రజల్ని ముందుకు నడిపించే విధానం ఏమాత్రం కాదు. ‘బెర్లిన్ గోడ’ కూలిన రోజునే కమ్యూనిజం కుప్పకూలింది. దండకారణ్యం తన ప్రాసంగికతను కోల్పోయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం గొప్ప ‘దిక్సూచి’గా నిలుస్తోంది. ఆ దిక్సూచిని గమనించకుండా దశాబ్దాల క్రితంనాటి దివాళాకోరు విధానాలకు ‘విరసం’ మేధావులు పెద్దపీట వేయడం దురదృష్టకరం.
యాభై ఏళ్ళక్రితం శ్రీశ్రీ షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా ‘‘రచయితలారా మీరెటువైపు?’’అన్న ప్రశ్నలోంచి విరసం ఆవిర్భవించింది. ఇప్పుడు కృత్రిమ మేధ, 4జి- 5జి టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ, రోబోలు, డ్రోన్లు, మారిన విద్య-వైద్యం, చంద్రగ్రహం- అంగారక గ్రహంపైకి జరుగుతున్న యాత్రలు ‘‘ఇస్రో’’ సాధించిన విజయాలు, విస్తృత ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం, సాధికారత, జ్ఞాన విప్లవం.. విరసాన్ని నీ దారెటు? అని ప్రశ్నిస్తున్నాయి. విరసం ప్రజలకు సరైన సమాధానం చెప్పగలదా?

- వుప్పల నరసింహం, 9985781799